Saturday, December 10, 2016 By: visalakshi

ధ్యాన యోగము

శ్లో" సుహృన్మి త్రార్యుదాసీన  మధ్యస్థద్వేష్యబంధుషు
     సాధుష్యపి  చ  పాపేషు  సమబుద్ధి  ర్విశిష్యతే  ..( భగవద్గీత 6వ అ..9శ్లో )

రుజువర్తనులైన శ్రేయోభిలాషులను, ప్రేమయుక్తులైన మిత్రులను, తటస్థులను, మధ్యవర్తులను, ఈర్ష్యాపరులను, చుట్టములను, సాధువులను, పాపులను కూడా సమబుద్ధితో చూచు వ్యక్తి మిక్కిలి విశిష్టుడుగా పరిగణింపబడును. 



 శ్లో" యోగీ యుణ్జీత సతత మాత్మానాం రహసి స్థిత:
     ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీ రపరిగ్రహ:    ( 6వ అ-10వశ్లో )

దివ్యజ్ఞాని తన ఆత్మమనోదేహములను సర్వదా భగవత్సేవయందు వినియోగింపవలెను. అతడు ఏకాంతప్రదేశమున ఒంటరిగా నివసించుచు మనస్సును ఎప్పుడును శ్రద్ధతో నిగ్రహింపవలయును. అతడు కోరికలనుండియు, వస్తువులను కలిగియుండ వలెనను భావము నుండియు దూరముగా నుండవలయును. 


  

కృష్ణుడు బ్రహ్మముగను, పరమాత్మగను, దేవాదిదేవుడుగను వివిధ పరిమాణములలో గుర్తింపబడును. కృష్ణచైతన్యమనగా సంక్షేపముగా దివ్యమును ప్రేమయుక్తమును అయిన భగవంతుని సేవయందు ఆసక్తి కలిగి యుండుట. ప్రత్యక్షముగా కృష్ణచైతన్యము కలవాడు బ్రహ్మము అనినను, పరమాత్మ అనినను ఏమో తెలిసికొన్నవాడగుటచే దివ్యజ్ఞానముతో శ్రేష్ఠుడగును. అతనికి పరమసత్యమును గూర్చి కల జ్ఞానము సంపూర్ణమైనది. కృష్ణునియం దెల్లప్పుడు మనస్సును స్థిరముగా నుంచుట దివ్యజ్ఞాని యొక్క ప్రధమ ధర్మము. ఎల్లరూ కృష్ణునే ధ్యానించుచు ఆతని నొక్క క్షణమైనను విస్మరింపరాదు. భగవంతునియందు మనస్సు నేకాగ్రముగా నుంచుటయే సమాధి యనబడును.మనస్సును ఏకాగ్రముగా నుంచుటకు ఎవరైనను ఏకాంత స్థలమునుండి బాహ్యవిషయములవలన అంతరాయములను పరిహరింపవలయును. అతడు తన ఆత్మానుసంధానమునకు అనుకూల పరిస్థితులను గ్రహించి, అనుకూలములు కానివానిని త్యజించుట యందు మిక్కిలి శ్రద్ధ వహించవలెను. సంపూర్ణ నిశ్చయముతో వస్తువులను కలియుండవలెనను భావమునందు తన్ను బంధించు అనవసర భౌతిక విషయములకై అతడు ప్రాకులాడరాదు. ప్రత్యక్ష కృష్ణచైతన్యమనగా ఆత్మత్యాగమని అర్ధము. అందు భౌతికవస్తువులను కలిగియుండవలెనను భావమునకు అవకాశమే లేదు. 



20 - 23 శ్లోకాల భావార్ధం ను పరిశీలిస్తే...యోగాభ్యాసముచే మానవుడు భౌతిక భావముల నుండి క్రమముగా దూరుడగును. ఇదే యోగ సిద్ధాంతము యొక్క ప్రధాన లక్షణము. దీని తరువాత అతడు సమాధిలో నుండిపోవును. అనగా యోగి ఆత్మను పరమాత్మగా గుర్తించు భ్రాంతులేమియు లేకుండ దివ్యమైన మనస్సు చేతను బుద్ధి చేతను పరమాత్మను అనుభవించును. పతంజలిముని యోగసూత్రములో "పురుషార్ధశూన్యానాం గుణానాం ప్రతిప్రసవ: కైవల్యం స్వరూపప్రతిష్ఠా వా చితిశక్తిరితి" అని ప్రకటించారు. ఈ చిత్తిశక్తి లేక అంతరశక్తి దివ్యమైనది. పురుషార్ధములనగా భౌతిక, మత తత్పరత, ఆర్ధికాభివృద్ధి, ఇంద్రియ సంతృప్తి, చిట్టచివరికి భగవంతునితో ఏకమగుటకు చేయు ప్రయత్నము అని అర్ధము. ఈ భగవదైక్యమునే అద్వైతి "కైవల్య"మని చెప్పును. జీవిని తన నిజస్థితిని యెరుంగజేయు అంతరమైన లేక దివ్యమైన శక్తియే కైవల్యము.  

 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు. 

0 comments: