Saturday, November 8, 2008 By: visalakshi

నా బాల్యం..........

తడబడే అడుగులతో తనివి తీరని ఆటలతో సాగిపోయే బాల్యం,భగవంతుని స్వరూపమే.అందుకే అన్నారు పిల్లలూ ,దేవుడూ చల్లని వారే కల్లకపటమెరుగని కరుణామయులే :
చిన్ననాటి ఆటలు ,పాటలు ,ఆహ్లాదం,పల్లెటూరు మధురమైన జ్ఞాపకాల్ని,మరల రాని మధుమాసం లాంటి పసితనాన్ని ,అందరితో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది .
హైదరాబాదు నగరంలో అమ్మా నాన్నల దగ్గర తెల్ల కాగితంలా ,స్వఛ్చంగా ,కల్లాకపటం తెలియని వయసులో 2వ తరగతి చదువుతుండగా మా అమ్మ ప్రోద్భలంతో మా నాన్నగారు నన్ను అమ్మమ్మ గారింటికి తీసుకెళ్ళారు . మా అమ్మమ్మకి 4గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. మా అమ్మ ,మామయ్య హైదరాబాదులో, మిగిలిన వారు తూ"గో"లో ఉన్నారు. మా ఊరు అమలాపురం దగ్గరలోని ఒక పల్లెటూరు. అక్కడ అమ్మమ్మ, పిన్ని ఉండేవారు. వారికి తోడుగా అలా పల్లెటూరు లో అడుగు పెట్టిన నా అనుభూతుల పరిమళాలు.
మా అమ్మమ్మగారిల్లు 13గదుల పెంకుటిల్లు. అంత పెద్ద ఇంట్లో ఉంటున్నది ముగ్గురం.ఒక్కో గదికి ఒక్కోపేరు . ప్రతీ గదీ నాదే అన్న హక్కుతో మొత్తం కలియతిరిగి ,అమ్మమ్మ అరుగుమీద కూర్చుని కబుర్లు చెబుతుంటే పక్కనే కూర్చుని పెద్ద ఆరిందాలా వినేదాన్ని. అక్కడ స్కూలు 7వ తరగతి వరకు ఉండేది .స్కూలికి వెళ్ళి వచ్చాక ,సాయంత్రం మా కొబ్బరి తోటల్లో తిరిగి వచ్చేదాన్ని. రాత్రి అంటే భయం .ఎందుకంటే వూళ్ళల్లో ఎక్కువగా కరెంటు తీసేవారు. హరికెన్ లాంతరు పెట్టుకుని అమ్మమ్మ దగ్గరే ఉండేదాన్ని. చీకట్లో ఏ గదిలోకి వెళ్ళాలన్నా భయపడేదాన్ని. స్టోరు రూము అంటే మరీ భయం. పెద్ద పెద్ద భోషాణాలూ అవీ ఉండేవి. పెద్ద పులిలా నేనుండగా భయం దేనికి ,భయం వేసినపుడు ఆంజనేయస్వామి దండకం చదువుకో అనేది. పండగలకి అందరూ వచ్చినపుడు మాత్రము మా ఇల్లు ఒక బృందావనమే. అప్పుడు మనవలు, మనవరాళ్ళను చుట్టూ చేర్చుకుని మా అమ్మమ్మ రకరకాల కధలు ,అష్టోకరపక్షి ,మానుబోకి, పేదరాసిపెద్దమ్మ లాంటి కధలు చాలా చాలా చెప్పేవారు.అదీ బయట ఆకాశం, నక్షత్రాలు చూసుకుంటూ అరుగుమీద అమ్మమ్మతో కూర్చోవడం చాలా ధీమాగా అనిపించేది. అక్కద పండగలొస్తే దేవుడ్ని ఊరేగించేవారు. నేను, పిన్ని పూవులన్ని గుచ్చి పెద్ద పెద్ద దండల్ని ఊరేగింపు ఇంటి ముందుకి రాగానేస్వామి మెడలో వేసి హారతులిచ్చేవాళ్ళం . పూజామందిరం అన్నిటికన్నా నాకిష్టమైనది. నాకు ఇష్టమైన రవ్వలడ్డు చేసి పూజామందిరంలో పెట్టి రోజుకొక్కటి ఇచ్చేవారు.ఇంకోటి అడిగితే దేవుడు రోజు ఒకటి నీకోసం ఇస్తున్నాడు అని మరునాడు మందిరం నుండి ఒక లడ్డు నా చేతిలొ పడేట్లు గా చూపించారు. నా అమాయకత్వానికి ఇప్పటికీ నవ్వు వస్తోంది. నా లేలేత బాల్యాన్ని తీయ తీయగా 4ఏళ్ళు గడిపిన నాకు తీరని విషాదం మా నాన్నగారి మరణం. వెనువెంటనే నెల తిరగకుండా ఆ భాదతో మా అమ్మమ్మగారి మరణం. ఈ విషాదాలతో నేను మరల హైదరాబాదు అమ్మగారింటికి చేరుకున్నాను. నేను అమితంగా ప్రేమించిన ఇద్దరు నాకు నా చిన్నతనంలోనే దూరమయ్యారు. మరల 25 సం:ల తరువాత అంటే 6నెలల క్రితం మా ఊరు మా అక్క,చెల్లెళ్ళు ,మరియు మాపాపతోవెళ్ళి చూసి వచ్చాము. మా ఇల్లు, మాఊరు చాలా మార్పుతో సర్వాంగసుందరంగా ఉన్నాయి. మా ఊర్లో అందరి ఆప్యాయతకి కళ్ళు చెమర్చాయి. అమ్మమ్మని గుర్తుతెచ్చుకుని అందరిని పేరు పేరునా అడిగి ఊరంతా చూపించిమళ్ళి అందరూ రావాలి అంటూఆతిధ్యమిచ్చిన మా ఊరి పెద్దలందరికి నా హృదయ పూర్వక నమస్కృతులు.

6 comments:

Anonymous said...

చాలాకాలం తరువాత సొంతవూరు వెళ్ళడం,బాల్యపు జ్ఞాపకాలను నెమరువేసుకోవడం నిజంగా గొప్ప అనుభూతి.
ఇక్కడ ఆడుకొనేదాన్ని, ఇక్కడ చదువుకొనేదాన్ని, ఇలా చేసాను, అలా చేసాను అని అన్నీ గుర్తుచేసుకోవడం భలేవుంటుంది. కాని వూర్లు చాలా మారిపోతున్నయి . అపటి జ్ఞాపకం ఒక్కటినా మిగులుంటే అదృష్ట వంతులమే.

Ramani Rao said...

బాల్యం ఎంత తవ్వినా తరగని గని లాంటిది వేద గారు. చక్కటి మధురానుభూతుల్ని పంచుకొన్నారు. అభిమానం, అనురాగం కవలపిల్లలూ.. ఆ పిల్లలకి తల్లితండ్రులు పల్లెటూళ్ళట. మీ బాల్యం, నా బాల్యాన్ని తట్టి లేపుతోంది. జ్ఞాపకాలన్నీ నన్ను పలకరిస్తున్నాయి.
హ..హ.. అష్టోకపక్షి, మానిబోగి, పేదరాసి పెద్దమ్మ కథలన్నీ నాకు కూడా తెలుసుగా. మా అమ్మమ్మ మమ్మల్నందరినీ కూర్చొబెట్టి చెప్పేది. రామాయణం అయితే, హనుమంతుడు సంజీవని పర్వతం తీసుకొచ్చేదాకా చెప్పి ఆపేసేది(పాపం ఆ తరువాత రాదేమో :) ). ప్చ్! కాకపోతే మాకు ప్రతి వేసవిసెలవలకే అమ్మమ్మ కథలు వినే అదృష్టం కలిగేది.

లలితగారు: పల్లెటూళ్ళు మారడం మంచిదేనండీ. మా వూరు కూడా మొన్నామధ్య వెళ్ళినప్పుడు చాలా మార్పులు గోచరించాయి. మనుషులు, ఆ ఆత్మీయతలు మారకూడదు. కొన్నేళ్ళ తరువాత వెళ్ళినా ఫలనావాళ్ళు అని అభిమానించి, అక్కున చేర్చుకోడం అనేది నిజానికి చాలా గ్రేట్.

Bolloju Baba said...

బాగుంది.

visalakshi said...

బాల్యం ,చిన్న నాటి తలపులు మనమందరం పంచుకున్నందుకు ధన్యవాదములు. లలిత, గారికి మరియు రమణిగారికి, .
కృతజ్ఞతలు బాబాగారు.

Anonymous said...

అమలాపురం అనగానే కాస్త ఆసక్తి. మా ఊరు విశ్వేశ్వర అగ్రహారం/పేరూరు.ఏటా ఆ ఊరు వెళ్ళటం అదొక అనుభూతి.

Unknown said...

వేద గారు, మీ బాల్యపు స్మృతులను సినిమాలా మా కళ్లెదుట నిలిపారు. మనసంతా తెలియని ఆనందంలో నిండిపోయింది.. "ప్రతీ గదీ నాదే అన్న హక్కుతో మొత్తం కలియతిరిగి" ఇలా కొన్ని వాక్యాలు నన్ను కట్టిపడేశాయి. చక్కటి పోస్ట్ అనడం కన్నా మనసుని ఆహ్లాదంలో ముంచెత్తిన పోస్ట్ అంటే కరెక్టేమో!