Thursday, October 23, 2008 By: visalakshi

విలువైనదీ, వెలలేనిదీ మధురమైన మాట:

బి.సైదులు గారు రాసిన మాటే మంత్రము నుండి కొన్ని అంశాలు నా మాటల్లో:
మానవ సంబంధాలలో మాటల ప్రభావం మహత్తరమైనది .నాలుగు మంచి మాటలే మధుర ఫలితాలనిస్తాయి. పలికే ప్రతి పలుకూ పరులకు ఆనందాన్ని పంచాలి. మన మనసునూ ఆహ్లాదపరచాలి. ప్రకృతిలో ఏ ప్రాణికీ లేని "పలుకుల" వరాన్ని పరమాత్మ మనిషికే ప్రసాదించాడు. పరుష వాక్కులతో ,మాటల్ని తూటాలుగా ఎదుటి వారి మీద ప్రయోగించకూడదు. శారీరకమైన గాయాల కన్నా ,సున్నితమైన మనసుకయ్యే గాయం కలకాలం బాధిస్తుంది.వ్యాపార వ్యవహారాలకే కాదు. వ్యక్తిగత అనుబంధాలకూసుమధురంగా మాట్లాడటం అత్యంత ఆవశ్యకం .
కోపతాపాలు, కఠోర భాషణలు మనను అందరి నుంచీ దూరం చేస్తాయి. మృదువుగా సంభాషిస్తే ఎదుటివారి మనస్సులో శాశ్వతంగా చోటు సంపాదించుకోగలం. ఆలోచనలు పరిణతిని సాధిస్తున్న కొద్దీ పలుకుల ఒరవడి తగ్గిపోతుంది. వాక్కు విలువ తెలుస్తుంది. అందుకే మేధావులు, జ్ఞానులు వాక్సుద్ధి తెలిసి మితంగా మాట్లాడుతారు. మనసు ఎంత నిర్మలంగా ఉంటే మాటల్లో అంత పవిత్రత తొణికిసలాడుతుంది. మంచి శ్రోతగా ఉంటూ వినటం అలవాటు చేసుకోవాలి. ఎదుటివారి మాటల్ని ఆలకిస్తున్నంత వరకూ మనం న్యాయమూర్తుల స్థానంలో ఉన్నట్లు .ఎప్పుడైతే మనం మాట్లాడటం ప్రారంభిస్తామో ,అపుడు ఎదుటి వారికి మనను అంచనా వేసే అవకాశాన్నిస్తున్నట్టే!
మన మాటల్లో: "నేను" అన్న మాట ఎంత తక్కువ వినియోగిస్తే మన సంభాషణ పరులకు అంత ఆసక్తి కరంగా ఉంటుంది.
"ఎంతటి నిరుపేద ఐనా ఎదుటి వారికి ఇవ్వగలిగిన ఒకే ఒక బహుమతి "మంచిమాట" ".మన సాహచర్యం, సామీప్యం ఇతరులకు మంచి జ్ఞాపకంగా మిగిలిపోవడానికి సౌమ్యమైన సంభాషణను మించిన మార్గం లేదు. ఈరొజుల్లో అలంకరించే పువ్వులనుంచీ ఆహ్లాదపరిచే నవ్వుల వరకూ అన్నీ కృత్రిమమే కావడం దురదృష్టకరం. అలాంటి కపటత్వం నుంచి బయటపడదాం. వెల కట్టలేని విలువైన సరళ సంభాషణను ఆభరణంగా అలంకరించుకుందాం.

2 comments:

Ramani Rao said...

మాటే మంత్రం. చాలా బాగుంది వేద గారు. మాట మధురిమను చాలా సౌమ్యంగా మృదుమధురంగా చెప్పారు. చక్కగా సంభాషించడం ఒక కళ.

కాకపొతే, ఇంకొంచం సాంకేతిక పరంగా ఆలోచిస్తే, విలువైనదీ, చాలా వెల అయ్యేది కూడా మాటే, నిముషానికి ఇన్ని మాటల చొప్పున మన ప్రతి మాటకి వెలకట్టగలిగే శక్తి ఉన్నదీ ఒకే ఒక సాధనం "బూచాడమ్మా బూచాడు బుల్లిపెట్టెలో ఉన్నాడు, కళ్ళకెప్పుదు కనపడడు, డబ్బులు బాగా తీసుకొని కబుర్లెన్నో చెప్తాడు. అలాగే ఐ పాడ్లు, సెల్ ఫోన్లు."

చాలా చక్కటి టాపిక్. బాగా రాసారు.

కొత్త పాళీ said...

మంచి "మాటలు" చెప్పారు. :)