Saturday, April 18, 2015 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 76

 ఓం శ్రీ వేంకటేశ రమణాయ నమ:

 శ్లో" అనంతకోటి జన్మానాం బిజభూతం సత్ యత్ కర్మజాతం!

      తిష్తతి తత్ సంచితం జ్ఞేయం!!

 సంచిత కర్మ అంటే ....The collection of invisible karma phalam that  is acquired during many many previous births is known as 
   sanchita.

  సంచిత కర్మ  ఎలా నశిస్తుంది అంటే...
శ్లో" సంచితం కర్మ బ్రహ్మైవహం !
   ఇతి నిశ్చయాత్మిక జ్ఞానేన నష్యతి!!
Sanchita karma exhausted by the sheer knowledge that I am the same as the ultimate consciousness swaroopa athma.

 "ఒక లోభి సాయిబాబాను బ్రహ్మజ్ఞానం గురించి అడిగినప్పుడు సాయిభగవానుడు దాన్ని అతని జేబులోనించే తీసిచ్చారు." 

ఇంద్రియాలు దుర్భలమయ్యాక, జగత్తులోఎవరూ గౌరవించకపోయినప్పుడు వూరికే పనిలేకుండా కూచుని, కాలక్షేపంకోసం బ్రహ్మను తెలుసుకోవాలని ఆ లోభి ప్రయత్నం ...ఈ లోభి కధ ద్వారా సంచిత పాప కర్మ ఫలమును,అది నశించు విధమును సాయి తత్వభోద ద్వారా తెలుసుకుందాము. 

ఒక లోభి అయిన ధనవంతుడు సత్వర బ్రహ్మజ్ఞానమును ప్రసాదించమని అందుకే షిర్డీకి వచ్చానని బాబా పాదాలకు నమస్కరించి.. నాకు బ్రహ్మ లభిస్తే కృతకృత్యుడినౌతాను అని బాబాతో విన్నవించుకున్నాడు.
 బాబా ఇలా అన్నారు."చింతపడకు బ్రహ్మను వెంటనే చూపిస్తాను.అసలు నీలాగ బ్రహ్మను ఎవరూ అడగరు. నా వద్దకు వచ్చేవారు ధనమో,రాజ్యపదవి,కష్టనివారణ,రోగనివృత్తి,సుఖాన్నికోరుతారు.
నీలాంటివాళ్ళు దొరకరు.బ్రహ్మజిజ్ఞాసువుల కోసం నేను ఆకలిగొని ఉన్నాను.అలాంటి నాకు పర్వకాలం వచ్చింది."అని బాబా ఆ బ్రహ్మార్ధిని కూచోబెట్టి ..ఒక పిల్లవాణ్ణి పిలిచి అతనితో,వెంటనే వెళ్ళి బాబాకి అవసరం పడింది అని నందూ మార్వాడితోచెప్పి ఓ అయిదు రూపాయలు తీసుకురా! అన్నారు. పిల్లవాడు నందూ ఇంటికి వెళ్ళాడు. అతని తలుపు తాళం పెట్టి ఉంది.వెనక్కొచ్చి బాబాగారికీసంగతి చెప్పాడు. బాబా ఇలా అన్నారు,"మళ్ళీ వెళ్ళు.బాళా వ్యాపారి ఇంటికెళ్ళి డబ్బు తే" అన్నారు.అతను కూడా ఇంట్లో లేడని పిల్లవాడు తిరిగొచ్చి చెప్పాడు.తిరిగి,తిరిగి అలసిపోయినా ఆ పిల్లవాడికి చిల్లుగవ్వ కూడా దొరకలేదు. ఇది అంతయు బాబాలీల. ఆయనకు తెలుసు.ఆ వ్యాపారులు ఇం ట్లో లేరని. సర్వజ్ఞులైన సాయి నడుస్తూ మాట్లాడే దైవం. వారి పని 5 రూ"ల కోసం ఆగిపోతుందా? కానీ ఆ బ్రహ్మార్ధి కోసం ఈ చమత్కారం చూపారు.ఆ బ్రహ్మార్ధి జేబులో అప్పుడు రెండువందల యాభై రూపాయలున్నాయి.అది సాయినాధులకు తెలుసు. బ్రహ్మార్ధి జేబులో నోట్లకట్ట ఉండి కూడా ఇవ్వాలా,వద్దా? అవి తిరిగి తనవద్దకు వస్తాయా లేదా? అన్న సంధిగ్ధావస్థలో పడిపోయాడు.బాబాగారికి ఐదు రూపాయలు అప్పుగాకొద్దిసేపు ఇవ్వగల ధైర్యం అతనికి లేకపోయింది.బ్రహ్మసాక్షాత్కారం అడగటానికొచ్చాడు.అతను ధనమోహంలో చిక్కుకొన్నాడు. తిరిగి వెళ్ళిపోయే ఆతృతలో బాబాతో "బ్రహ్మని చూపండి" అన్నాడు.
బాబా ఇలా అన్నారు.."కూచున్నచోటునే బ్రహ్మను చూపించాలని ఇప్పటివరకు ప్రయత్నించాను. అది నీకు తెలీటం లేదా? బ్రహ్మకోసం పంచప్రాణాలు,పంచజ్ఞానేంద్రియాలు,పంచకర్మేంద్రియాలు,అహంకారం,బుద్ధీ,మనసు ఇవన్నీ సమర్పించవలసి వుంటుంది.దురాశా లోభభూయిష్టుడైన నువ్వు ముందు ఆ రెండింటినీ (దురాశ,లోభం) వదులుకో. ఎవరి మనస్సైతే ధనధారాపుత్రేషణత్రయంలో తగులుకోనివ్వకుండా తాను బద్ధుడనని గ్రహించి,తద్విముక్తిని మాత్రమే ఆశించి, బాహ్యాన్ని విస్మరించి తన లోపలి ఆత్మను చూడగలుగుతాడో వాడికే బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. అంతర్ముఖానుభవం నుంచే ఆత్మవిద్య అలవడుతుంది.
 'సత్యం,తపస్సు,ధ్యానం,బ్రహ్మచర్యం అనే నాలుగింటి సంయోగాన్ని పాటించనిదే త్యాగి కాలేడు.త్యాగి కాలేనివాడు యోగి కాలేడు.యోగి కాని వాడికి సమదృష్టి కలగదు. సమదృష్టి లేని వాడికి ఆత్మసాక్షాత్కారం కలగదు."అన్న సాయిబాబావారి బోధలో పరిపూర్ణజ్ఞానం అవగాహన చేసుకుంటే సంచిత కర్మలు నశిస్తాయి.  

   ఇలా  ..పెద్ద పెద్ద ఆధ్యాత్మిక ఉపన్యాసాలు,ప్రవచనాలు చేయకుండా ఉపదేశించిన సద్గురువు "శ్రీ సాయిబాబా". అందుకే అందరికీ ఉపాసన దైవమైనారు.


సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు  










Sunday, March 8, 2015 2 comments By: visalakshi

మాతృమూర్తి

మాతృదేవోభవ

 శ్లో: ఉపాధ్యాయాన్ దశాచార్యా ఆచార్యాణాం శతం పితా:!
      సహస్రం తు పితౄన్ మాతా గౌరవే నాతి రిచ్యతే!! (మనుస్మృతి)

 "గౌరవించదగిన వారిలో ఉపాధ్యాయుల కన్నా ఆచార్యులు పది రెట్లు ఎక్కువ ;అచార్యుల కన్నా తండ్రి వంద రెట్లు ఎక్కువ; కాగా తల్లి(మాతృమూర్తి) ఆ తండ్రి కన్నా వేయి రెట్లు ఎక్కువ". మాతృమూర్తికి అంతటి ఉన్నతస్థానం ఎలా సంప్రాప్తించింది అంటే ఆమె త్యాగనిరతి వల్ల!నిస్వార్ధ ప్రేమానురాగాలవల్ల!

  "మాతృత్వం అంటే చాలామంది అనుకున్నట్లు భౌతికంగా ఓ బిడ్డకు జన్మనివ్వడం కాదు. దురదృష్తవశాత్తూ బిడ్డలకు నోచుకోనంత మాత్రాన వారు మాతౄమూర్తులు కాకుండాపోరు! మాతృత్వభావన అనేది భౌతిక స్థాయిని మించినది! ఏ బిడ్డను చూసినా మనస్సు స్పందించడం, నిస్వార్ధంగా ప్రేమను పంచడం- ఇవే మాతృత్వ లక్షణాలు. అందుకే భారతీయ సంస్కృతిలో మాతృమూర్తిని మాతృదేవోభవ అని కీర్తిస్తారు."

  భారతీయ మహిళ తనను తాను మాతృమూర్తిగా అభివ్యక్తం చేసుకోవడాన్ని మన సనాతన ధర్మం అత్యున్నత ధర్మంగా అభివర్ణించింది. స్త్రీకి సంబంధించినంత వరకు భార్య స్థానం నుంచి తల్లిగా ఎదగడం కేవలం భౌతికపరమైన పరిణామం మాత్రమే కాదు! మాతృత్వభావనతో ఆధ్యాత్మికంగా పరిణతిని సాధించడానికి అరుదైన అవకాశం; భారతీయ వివాహ వ్యవస్థ స్త్రీకి కల్పించిన అదృష్టం!నిజానికి భార్యగా తన పాత్రను పోషించే సమయంలో కన్నా, తల్లిగా తన మాతృత్వ మధురిమలను పంచేటప్పుడే స్త్రీ ఎక్కువ ఉన్నతిని సాధించినట్లు సంతృప్తి పడుతుంది.అమ్మతనంలో అత్యున్నతమైన ఆత్మానందాన్ని పొందుతుంది.స్త్రీ తన సహజమైన సహనం,క్షమ,ప్రేమ తదితర సర్వోన్నత లక్షణాలతో విశ్వజనీనతను పొందికుటుంబం,జాతి,వంశం మొదలైన హద్దులను చెరిపివేసి ఆదర్శమాతృమూర్తిగా వెలుగుతుంది.ఈ ఆధ్యాత్మిక ఔన్నత్యమే మహిళ భార్యగా, పౌరురాలిగా కూడా సమర్ధంగా తన బాధ్యతలను నిర్వహించడానికి దోహదపడుతుంది.అందుకే స్వామివివేకానంద..
"The ideal of womanhood in India is motherhood;that marvellous,unselfish,all suffering,ever forgiving mother -  కష్టాలను,బాధలను సహిస్తూ,అనుక్షణం క్షమిస్తూ, నిస్వార్ధానికి మారుపేరైన మాతృత్వమే భారతీయ నారీమణుల ఆదర్శమ"ని ఉధ్ఘాటించారు.

 విసృతమైన అవకాశాలున్న ప్రపంచంలో అడుగుపెట్టిన ఆధునిక మహిళలకు ఈ ఆదర్శాలు అసమగ్రంగా,చాదస్తంగా తోస్తున్నాయి. కానీ దీర్ఘంగా ఆలోచిస్తే మన మునుపటి తరాల స్త్రీ అడుగుజాడలు నేటికీ అన్వయమవుతాయనీ, నేటి మహిళ ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారాలు వాటిలోనే లభిస్తాయనీ గుర్తించాలి.ఎవరు ఎన్ని చెప్పినా, భారతీయ స్త్రీలు సీత,దమయంతి సావిత్రి లాంటి సాధ్వీమణుల అడుగుజాడల్లోనే అభ్యుదయాన్ని సాధించాలి.భిన్నంగా మన స్త్రీలను ఆధునికీకరించే ప్రయత్నం చేస్తే మనకు పరాభవం తప్పదు అని వివేకానంద చెప్పారు.---- స్వామి రంగనాధానంద


మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
Tuesday, February 24, 2015 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 75 ఆగామి(క్రియమన)కర్మ తత్వబోధ

  ఓం శ్రీ పరమేష్ఠి గురుభ్యో నమ:


ఆగామి కర్మ అంటే...

శ్లో:  జ్ఞాన ఉత్పతి అనంతరం, జ్ఞాని దేహ కృతం !
పుణ్య పాప రూపం కర్మ ఎత్ అస్థి తత్ ఆగామి ఇతి అభిదియతే!!

"The invisible results of action --A person gets while doing actions after getting the self -knowledge is called agami."



ఆగామి కర్మ ఎలా నశిస్తుంది....

శ్లో:  ఆగామి కర్మ అపి జ్ఞానేన నష్యతి/కిం చ ఆగామి
 కర్మానాం నలిని దల గత జల వత్ జ్ఞానినాం సంబంధో నస్తి// 

"Agami karma ,also will get exhausted by the self knowledge.also, like the water on the lotus leaves, the agami karma will not effect the jnani."

"ఆత్మ స్వతహాగా నిర్వికారి. స్ఫటికంలాగా దోషరహితంగా ఉండికూడా సంసారంలో మాయతో, కర్మలతో బంధించబడినట్లు కనిపిస్తుంది.'నేను ఈ దేహాన్ని '     అన్న అభిమానం ముక్తస్థితిలో ఆత్మకి మిధ్యాబంధనాన్ని తీసుకొస్తుంది. దేహము, ఇంద్రియాలు, మనసు, ప్రాణము వీటిపై అభిమానం ఉన్నంతవరకు కర్తృత్వమూ,భోక్తృత్వమూ ఉంటాయి. వాటి జ్ఞానాన్ని కూడా ఆపలేము. అంతర్యామి ఆత్మే ఈశ్వరుడు. ఈశ్వరుడే గురువు. గురువు మనకు దివ్యనేత్రాలనిచ్చినప్పుడే జ్ఞాననిధి లభిస్తుంది.అవిద్య,కామము,కర్మ అనే బంధనాలనుండి సంపూర్ణంగా విడివడటానికి గురు స్వరూప జ్ఞానాన్ని యధాతధంగా తెలుసుకొని గురుధ్యానాన్ని  అనుష్ఠించడం, దర్శించడం అవుతుంది."   


 శ్లో" మన్నాధ: శ్రీ జగన్నాధ: మద్గురు: శ్రీ జగద్గురు:!
      మదాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవేనమ:!!


 "గురువు అంటే అజ్ఞానాంధకారమును తొలగించే ఒక శక్తి. శక్తి అంటే తత్వము, అని అర్ధం చేసుకోవాలి. మానవునిలోని అజ్ఞానాన్ని తొలగించే శక్తి కేవలము భగవంతునికి మాత్రమే ఉన్నది."

 శ్రీ షిర్డీ బాబాగారుచేసిన సహజ ఉపదేశం "ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వాక్కలహాన్ని వారి కర్మ నశించే వివరణను",మరియు బాబాగారి జ్ఞానబోధను తెలుసుకుందాము....

ఒకసారి ఒక శ్రేష్ట భక్తుడు, మరో భక్తుడి గురించి చెప్తూ స్వతహాగా చెడుమాటలు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఎంతగానో నిందించడం మొదలుపెట్తాడు. అతని చక్కటి గుణాలు పక్కనపెట్టి నోటితో ఎడాపెడా దూషించటం మొదలుపెట్టాడు. అసలు సంగతి పక్కనపడి, నిందే వరదలై పొంగిపొరలింది.
 'ఏదో కారణంతో ఎవరి ఆచరణైనా నింద్యంగా ఉంటే వారిపై జాలి పడి వారికి ఎదురుగానే ప్రబోధం చేయాలి. ఎప్పటికీ నిందించకూడదు.' 
 నిందించేవారు నిందింపబడేవారికి ఉపకారులు. వీరు అనేకరకాలుగా శుభం కలిగిస్తారు. నిందించేవారు తమ నాలుకతో ఇతరుల మాలిన్యాన్ని కడిగేస్తారు. నింద నిమిత్తంతో వారి దోషాలు వారికి తెలుపుతారు. భవిష్యత్తులో రాబోయే అనేక అనర్ధాలను వాళ్ళు తప్పిస్తారు.సరే! ఆ భక్తుని నోటినుంచి నింద ఎక్కువగా రావటం చూసి వినేవాళ్ళకి అసహ్యం కలిగింది. వారందరూ బాబా దర్శనం కోసం మశీదుకి బయలుదేరారు.నిందించే భక్తుడు శౌచం కోసం కాలువదగ్గరకెళ్ళాడు.
   సాయిబాబా సర్వజ్ఞులు. భక్తులతో కలిసి లెండీకి బయలుదేరినప్పుడు బాబా ఆ నిందించే భక్తుడి గురించి అడిగారు.దానితో భక్తులు ఇలా అన్నారు. "అతను కాలువ దగ్గ్రకు శౌచానికి వెళ్ళాడు." తమ కార్యక్రమం ముగిసిన తరువాత బాబా లెండీనుంచి తిరిగి వచ్చారు. కాలువ వద్దనుండి ఆ నిందించిన భక్తుడు కూడా ఇంటికెళ్ళేందుకు తిరుగుముఖం పట్టాడు. దార్లో అతను బాబాకి ఎదురయ్యాడు.  బాబాగారు  అక్కడకి దగ్గరలో ఓ పందిని జూపి ఇట్లనెను. "చూడుము! ఈ పంది అమేధ్యమును ఎంత రుచిగా తినుచున్నదో! నీ స్వభావము కూడా అట్టిదే! ఎంత ఆనందముగా నీ సాటి సోదరుని తిట్టుచున్నావు.ఎంతయో పుణ్యము చేయగా నీకీ మానవజన్మ లభించినది.ఇట్లు చేసినచో శిరిడీ దర్శనము నీకు తోడ్పడునా?"ఆ మాటలు నిందించిన  భక్తుని మనసుకు గుచ్చుకొని, అందులోని నీతిని,సారాన్ని గ్రహించాడు."నా భగవంతుడు నా వాడైతే నాకు మంచమ్మీదే నే కూచున్నచోటే అన్నీ ఇస్తాడు" ఈ సామెత నిజమే కానీ అబద్ధం కాదు. కానీ అన్న వస్త్రాలవరకే ఇది వర్తిస్తుంది.దాన్ని పరమార్ధానికి ఆపాదించేవారికి పరమార్ధం అన్నిరకాలుగా దూరమవుతుంది.
 ఈ విధంగా నిందాస్తుతి వల్ల జరిగే అనర్ధాన్ని బాబాగారు ఉపదేశంతో వివరించి.. అజ్ఞానవినాశనం చేసి జ్ఞానబోధతో ఆగామికర్మ  నశించేలా చేసారు. 


 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు






  








Saturday, December 6, 2014 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 74(శ్రీ దత్త గురువు - శ్రీ సాయి గురువు )

 ఓం శ్రీ అనంతరూపాయ నమో నమ:

 శ్లో" అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబర:!
     స్మర్తృగామీ స్వభాక్తానాముద్ధర్తా భవసంకటాత్ !!


 రేపు అనగా 06-12-2014 శనివారం శ్రీ దత్తజయంతి సందర్భంగా ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజగారి "శ్రీగురుచరిత్ర"నుండి దత్తగురువుకు,సాయిగురువుకుగల సన్నిహిత పోలికలు...సారాంశము.

   శిరిడీ సాయిబాబా భక్తులకు "శ్రీగురుచరిత్ర" పారాయణ యెంతో అవసరం. హరివినాయక్ సాఠె, అన్నాసాహెబ్ దభోల్కర్ వంటి వారికి శ్రీసాయిబాబా దర్శనము, అనుగ్రహము లభించడానికి "శ్రీగురుచరిత్ర" పారాయణమే కారణమైంది.కుశాభావు అనే భక్తుడి విషయంలో యీ సత్యం యింకెంతో స్పష్ఠంగా కనిపిస్తుంది. అతడిచేత యీ గ్రంధాన్ని 108 సార్లు పారాయణ చేయించడంలో సాయినాధుడు దీనికెంత ప్రాముఖ్యమిచ్చారో తెలుస్తుంది.ఆయన మహాత్ములందలోకి తలమానికము.తాను సద్గురువునని చెప్పక, అతి సామాన్యుడిలా జీవించారు. భక్తులు తమను గురువుగా ఎలా సేవించాలో యెన్నడూ చెప్పలేదు. భగవద్గీతా శ్లోకాన్ని వివరించినప్పుడు ఆ విషయమై రత్నాల్లాంటి మాటలు ఒకటి రెండు మాత్రమే చెప్పారు. అలాగాక గురుచరిత్రలో శ్రీగురుడు యెన్నో పురాణోపాఖ్యానాల సహాయంతో యీ విషయం వివరించారు. అంటే భక్తులు యెలా శ్రీసాయిని సేవించాలో "శ్రీగురుచరిత్ర" నుండి నేర్చుకోమని శ్రీసాయి సూచించారన్నమాట.

   అంతేగాక, శ్రీగురునికి-సాయిబాబాకు సన్నిహితమైన పోలికలు యెన్నో ఉన్నాయి. జన్మించిన క్షణమునుండే యీ యిద్దరికీ తాము ఎవరో తెలుసు. ఇద్దరూ లోకహితం కోసం అవతరించిన భగవత్స్వరూపులే.అయినప్పటికీ సత్సాంప్రదాయాన్ననుసరించి ఇద్దరూ బాహ్యంగా గూడ ఒకగురువును ఆశ్రయించారు.  శ్రీగురుడు శ్రీశైలములో అంతర్ధానమయినప్పుడు తమ శిష్యులకు పూలు ప్రసాదంగా అందజేసి వాటిని ప్రాణపదంగా ఉంచుకోమని చెప్పారు. సాయిబాబా తమ గురువు ప్రసాదించిన ఇటుక రాయిని అలానే పవిత్రంగా ఉంచుకున్నారు. అది విరిగిపోయిన కొద్దికాలానికే ఆయన గూడా శరీర త్యాగం చేసారు.  ఆయన తమను తమ గురువు ఒక బావిలోకి  తలక్రిందులుగా వ్రేలాడదీసినట్లు చెప్పారు. గురుచరిత్రలో దీపకుడు,ఉపమన్యువు మొ"న వారు చేసిన గురుసేవా విధానమంతా ఆ ఒక్క వాక్యానికి వివరణ అని తలచవచ్చు.   శ్రీగురుడు యెంతోకాలం సన్యాసాశ్రమ ధర్మాన్ననుసరించి దేశసంచారం చేస్తూ లోకుల దృష్టినుండి గుప్తంగా ఉండిపోయారు. ఒక్క నర్సోబావాడిలోనే 12 సం"లు తపోనిష్ఠలో ఉన్నారు.    శ్రీసాయి గూడా శిరిడీలో వేపచెట్టుక్రిందనున్న భూగృహంలో 12 సం"లు ఉన్నారు. అందుండి బయటకు వచ్చాక గూడ సుమారు 30 సం"లు గుప్తంగా పిచ్చి ఫకీరువలె జీవించారు.  శ్రీగురుడు తాము లోకానికి వెళ్ళడి కావలిసిన సమయమొచ్చాకనే గంధర్వపురం చేరి ప్రకటమయినట్లు, శ్రీ సాయి గూడ చివరి 23 సం"లలోనే వెల్లడి అయ్యారు. కాకుంటే సాయి నైష్ఠిక బ్రహ్మచారి గనుక, యావజ్జీవితమూ తమ గురుసన్నిధిలోనే ఉండిపోయారు. శ్రీగురుడు సంగమానికి వెళ్ళిరావడం నిత్యమూ మహోత్సవంగా జరిగినట్లే, శ్రీసాయి రోజూ లెండీకి రావడం,రోజు విడిచి రోజు చావడికి వెళ్ళడమూ గొప్ప ఊరేగింపుగా జరిగింది. కొద్దిలో చెప్పాలంటే ,సాయిచరిత్రలో గురుస్థానం (వేపచెట్టు మూలం) నర్సోబావాడి వంటిది.; లెండీవనమే సంగమం;ద్వారకామాయియే గంధర్వపురం. ఈ మహనీయులిద్దరూ తమ 16వ యేటనే బాహ్య ప్రపంచంలోనికి అడుగు పెట్టారు. ఇద్దరూ తమ భక్తులకు కవితాశక్తిననుగ్రహించి,వారికి బిరుదులు గూడా ఇచ్చారు. శ్రీగురుడు ఒకనికి 'యోగీశ్వర్ 'అని మరొకరికి 'కవీశ్వర్ ' అని బిరుదులిస్తే-శ్రీసాయి ఒకరికి 'దాసగణు ' అని, మరొకరికి 'హేమాడ్పంత్ 'అని బిరుదులివ్వడమే కాక, జోగేశ్వర్ భీష్మకు కవితాధారనిచ్చి 'సగుణోపాసన ' వ్రాయించుకున్నారు.  శ్రీగురుడు ఒక యవనరాజును అనుగ్రహించి అతనినుండి పూజలందుకున్నారు. సాయి యవనులందరిచేత సేవించ బడుతున్నారు.ఇద్దరిదీ భిక్షావృత్తియే. ఈ ఇద్దరూ కర్మఫలానికీ, జన్మ పరంపరలకూ యెంతో ప్రాముఖ్యమిచ్చారు. ఇలా ఆలోచించినకొద్దీ యింకెన్నో పోలికలు స్ఫురిస్తాయి. కనుకనే "శ్రీసాయిబాబా జీవితచరిత్ర","శ్రీగురుచరిత్ర" ..ఒకదానికొకటి వివరణమని చెప్పాలి. ఆ రెండూ ఒకే దత్తాత్రేయుని చరిత్రలో వేర్వేరు అధ్యాయాలు. కనుక సాయి భక్తులందరికీ, "శ్రీసాయిబాబా జీవిత చరిత్ర","శ్రీగురుచరిత్ర","శ్రీగురుగీత"లు కలిసి ప్రస్థానత్రయము అనవచ్చు. ప్రస్థానత్రయము అంటే సనాతనధర్మమంతటికీ మూలమైన ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు,భగవద్గీత.


  సర్వజీవులనూ ఉద్ధరించడమే తమ అవతారకార్యంగా గల దత్తాత్రేయుణ్ణి భక్తులందరూ గురుధ్యాన శ్లోకం చదువుకుంటూ,త్రిమూర్త్యాత్మకుడైన దత్తాత్రేయుణ్ణే మనసారా స్మరిస్తున్నారు.

ఓం దత్త... శ్రీ దత్త...జయగురుదత్త  

   సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు



Friday, November 14, 2014 1 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 73

ఓం శ్రీ పరబ్రహ్మస్వరూపాయ నమ:

" సాయి పారాయణగ్రంధము లో ప్రతీఘటనను పరిశీలిస్తే ఓ అద్భుతమైన ఆధ్యాత్మికబోధన అవగతమౌతుంది. మన శాస్త్రాలు స్మృతులు సంక్లిష్టంగా చెప్పేవే సరళంగా తెలియజేసిన ఘటనలే అవన్నీ. ఉదాహరణకు త్రివిధములైన సంచిత, ఆగామి, ప్రారబ్ధకర్మములలో ప్రారబ్ధం భోగముతో, జ్ఞానంచే సంచితము, మిత్రులు శత్రువుల పరుష మాటలచే ఆగామి నశించునని శాస్త్రం చెప్తున్దిలా -

ప్రారబ్ధం భోగతో నశ్యేత్తత్త్వజ్ఞానేన సంచితమ్ / 
ఆగామి ద్వివిధం ప్రోక్తం తద్ద్వేషి ప్రియవాదినో: //

దీనినే సామాన్యులకు సైతం అర్ధమయ్యే ఘటనలు పారాయణంలో చదివాను - అని  బాబాగారి సచ్చరిత్ర లోని ప్రతి సంఘటన ఒక జ్ఞానబోధ. ప్రతి ఘటనను వివరముగా రాయమని ప్రోత్సహించిన నా శ్రేయోభిలాషి, ప్రియస్నేహితురాలికి ధన్యవాదాలు తెలుపుతూ", బాబాగారు శ్యామాకు తెలిపిన ప్రారభ్దకర్మ గురించి ఇలా....

 ఒక భక్తుడు సాయిబాబాకి భక్తితో 2రూ"ల దక్షిణ ,సాయి పేరుమీద శిరిడీకి పంపాడు. ఆ సమయములో సాయి మశీదులో లేరు. ఆ రెండు రూపాయలను శ్యామా తీసుకొని సంతకం చేసాడు. శ్యామాకు బాబాగారిని పరీక్షించాలని వారి సర్వజ్ఞత, శక్తి స్వయంగా చూడాలని,వాటిని సాయికి ఇవ్వకుండా, మశీదులో ఒక మూలకు పాతిపెట్టాడు. సాయి మశీదుకు వచ్చి ఏమీ మాట్లాడలేదు. కొన్నాళ్ళకు ,శ్యామా ఇంట్లో దొంగలు పడి 200రూ"లు దొంగిలించారు. శ్యామా బాధపడి, తనకు జరిగిన దుస్థితిని సాయితో చెప్పుకున్నాడు.  అపుడు సాయి నవ్వుతూ,  "నీకు చెప్పుకోడానికి నేనైనా వున్నాను. నా రెండు రూపాయలు పోయి ఆరు నెలలు అయింది. మరి నేనెవరితో చెప్పుకోవాలి." అని శ్యామావైపు సాయి గంభీరంగా చూసాడు. 

శ్యామా రెండు రూపాయలు దాచిపెట్టిన సంగతి సాయి తెలుసుకున్నారని సాయి సర్వజ్ఞత్వానికి ఆశ్చర్యపోయి బాబా! ఏదో తమాషాకొద్దీ, నేను 2రూ"లు దాచిపెడితే, నాకు 200రూ"ల నష్టం కలిగిస్తావా? ఇదేమి న్యాయం అని శ్యామా అన్నాడు.

  "ఎందుకు దిగాలు పడతావు, ఎవరి తలరాత ఎలావుంటే అలా జరుగుతుంది. మనచేతనిబట్టే ప్రారబ్ధమనే తలవ్రాత వుంటుంది. కర్మఫలాన్ని అనుభవించక తప్పదు" అని   ఉద్యోగం చేసే నీకు 200రూ"లు ఎంతో, ఏ ఉద్యోగం లేని ఈ ఫకీరుకు 2రూ"లు అంతే. అని శ్రీసాయి చెప్పడముతో ధర్మ సూక్ష్మానికి శ్యామా అశ్చర్యపడ్దాడు. బాబా హితబోధ వలన ప్రారబ్ధం అన్నది అనుభవించక తప్పదని, అది అనుభవిస్తే పోతుందని,   తెలుసుకొని తిరుగులేని విశ్వాసాన్ని సాయి మీద నిలుపుకున్నాడు.

  శ్యామాద్వారా మనకు 3 విషయాలు బోధపడ్డాయి. అవి "1. గురువును పరీక్షించరాదు. 2. గురువు విషయంలో తప్పు చేస్తే, ఎప్పుడో ఒకనాడు శిక్ష అనుభవించక తప్పదు. 3. గురువుకు చేసే మంచైనా, చెడైనా శిష్యునికి 100 రెట్లు తిరిగి వస్తుంది " 

ఇక్కడ నా ప్రారబ్ధ ఘటన గురించి కూడా మీకు తెలియజేయాలి. దాదాపు ఐదు నెలల క్రితం నేను,మావారు మా వియ్యంకులవారి ఇంటికి వెళ్ళి వస్తుండగా, రాత్రి వర్షం పడి, చిన్న,చిన్న చినుకులు పడుతుండగా నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ పరధ్యానంగా ఉన్న సమయంలో,బైక్ మీద ఒకవ్యక్తి మమ్మల్ని కంఫ్యూజన్ చేస్తూ మా ముందుకు వచ్చి నామీద లైట్ ఫోకస్ చేస్తూ నాకు తెలియకుండా పక్కకు వచ్చి నా మంగళసూత్రాలు, నల్లపూసలగొలుసు ఒక్క క్షణంలో లాక్కుని వెళ్ళిపోయాడు. నేను లాగేస్తున్నాడు అని అరుస్తుంటే మావారు పరిగెత్తి పట్టుకోబోయి పడిపోయారు. వర్షం వల్ల రోడ్డుపైన జారి పడిపోయారు. వాడు అప్పటికే పారిపోయాడు.నా అరుపులకి చుట్టుపక్క జనాలు వచ్చి నన్ను ఓదారుస్తుండగా అప్పటి వరకు వెలగని స్ట్రీట్ లైట్స్ అప్పుడు వెలిగాయి. ఐదు ని"లలో  పోలీసులు వచ్చారు. జరిగినది తెలుసుకున్నారు. మా వియ్యంకులవారు,మేము పోలిస్ స్టేషన్లో ఎఫ్.ఐ.ఆర్ రాసి సంతకంచేసి ఇచ్చి వచ్చాము. జరిగిన దానికి నా అజాగ్రత్తే కారణమని తలచినా, మంగళవారం నాడు పోయాయి అని చాలా బాధపడ్డాను. ఈ సంఘటన తెలిసిన సత్సంగ సభ్యులు ఇద్దరుమరియు స్నేహితులు మమ్ములను ఇలా అడిగారు. "మీరు రోజూ బాబాకి పూజలు చేస్తారుకదా! మరి మీకెందుకిలా జరిగింది?"మేము చెప్పాము..."మీ కర్మలకు నన్ను కారణభూతుణ్ణి చేయకండి. నేను సాక్షీభూతుణ్ణి మాత్రమే!" అని బాబాగారు చాలా సంధర్భాలలో చెప్పారు.మరి నేను చేసిన ఏ కర్మఫలమో అని అనుకున్నాను. కానీ బాబాగారికి విన్నవించుకున్నాను. ఎందుకిలా జరిగిందో తెలియదు. పరిష్కారం నీకే తెలుసు. నీ చరణాలు పట్టుకున్న మేము ఈ విషయాన్ని నీ పాదాలవద్ద వుంచాము అని. ఒక వారంలో  స్టేషన్ నుండి ఫోన్ వచ్చింది. మీ గోల్డ్ దొరికింది. దొంగను పట్టుకున్నాము. కోర్టుకు వచ్చి మీ బంగారం తీసుకెళ్ళవచ్చు . అని చెప్పారు. మూడున్నర తులాలు పోతే, సగంకి కొంచం ఎక్కువ బంగారం ఇచ్చారు. అప్పుడు సత్సంగ సభ్యులు మీ భక్తి, పూజలవల్ల బాబాగారి అనుగ్రహం వల్ల మీకు పోయిన బంగారం దొరికింది అని అన్నారు.    ఎందుకు జరిగినా.. మమ్మల్ని సదా ఎరుకలో ఉండమని బాబాగారు హెచ్చరించినట్లు మాకు బోధపడింది.


  శివేరు ష్టే గురు: త్రాతా గురౌ రుష్టే న కశ్చ న !



శివుడు కోపించిన గురువు మనలను రక్షించును. గురువు కోపించిన రక్షించువాడు మరొకడు లేడని పరమేశ్వరుడు తెలిపెను.

  ఇద్దరువ్యక్తులవాక్కలహంతో ఆగామి నశించే విధం ...ఘటనలు సవివరముగా తదుపరి.....



సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు.




Wednesday, November 5, 2014 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 72

 ఓం  శ్రీ సాయికృష్ణాయ నమో నమ:


"నిరంతర సాధన వల్ల సాంసారిక చింతలు పూర్తిగా తొలగిపోయి భగవచ్చింతన మనస్సును ఆక్రమిస్తుంది. అప్పుడు అవసానకాలంలో సైతం మనస్సులో అదే మెదలుతూ ఉంటుంది."- శ్రీరామకృష్ణులు.



శ్రీ సాయికృష్ణుడు నానాకు చేసిన జ్ఞానబోధ :


శ్లో" తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా!


   ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన స్తత్వ దర్శిన:!!

 ఇది గీతలోని మూల శ్లోకం. మొదటి రెండు చరణాల్లోని అర్ధాన్ని నానా వివరించి చెప్పింది బాబాగారు అంగీకరించారు. మిగిలిన రెండు చరణాల గురించి బాబాగారు ఎలా వివరించారో వినండి. 

 "నానా! శ్లోకంలోని మూడవ చరణం మళ్ళీ పూర్తిగా గుర్తుకు తెచ్చుకో. జ్ఞానమనే శబ్దం వెనుక అవగ్రహం ('అ ' ని లోపించినట్లు చూపించే 2చిహ్నం )పెట్టు. అప్పుడు ఆ చరణానికి అర్ధం చెప్పు. జ్ఞానులు, తత్వదర్శులు జ్ఞానోపదేశాన్ని చేస్తారని అన్నచోట అజ్ఞానాన్ని ఉపదేశిస్తారన్న శబ్దం ఉపయోగించు. అప్పుడు నిజమైన అర్ధం నీకు తెలుస్తుంది. జ్ఞానం మాటలతో చెప్పబడేది కాదు. మరి దాన్నెలా ఉపదేశించగలం? కనుక జ్ఞానం అనే మాటకి వ్యతిరేక శబ్దాన్ని తీసుకో. అప్పుడు దాని అనుభవాన్ని చూడు. నీవు చెప్పిన జ్ఞానం అనే మాటకి అర్ధాన్ని విన్నాను. అక్కడ అజ్ఞానం అనే మాటకి అర్ధం తీసుకుంటే ఏమైనా నష్టమా? అజ్ఞానం అనేది వాక్కుకి విషయం అవగల్గితే అప్పుడు జ్ఞానం మాటలకి అతీతంగా ఉంటుంది. గర్భాన్ని చుట్టుకొని ఉండే పొరలాగా, అద్దానికి పట్టే దుమ్ములాగా,లేదా అగ్నిని కప్పేసే బూడిదలాగే అజ్ఞానం జ్ఞానాన్ని కప్పేసి ఉంటుంది. జ్ఞానం అజ్ఞానంతో ఆవరించబడి ఉంటుందని శ్రీకృష్ణుడు గీతలో అన్నారు.కనుక అజ్ఞానాన్ని పక్కకు నెడితే జ్ఞానం స్వాభావికంగానే ప్రకాశించబడ్తుంది. జ్ఞానం స్వయం ప్రకాశకం. కానీ నాచుతో ఆచ్చాదించబడిన శుద్ధజలంలా ఉంటుందది. ఈ నాచుని తెలివిగలవారు పక్కకు నెట్టుతారు. వారికే ఆ శుద్ధజలం లభిస్తుంది. చంద్రుడికీ, సూర్యుడికీ గ్రహణం పట్టినప్పుడు చంద్రుడు, సూర్యుడు సర్వదా ప్రకాశిస్తూనే ఉంటారు. కానీ రాహు,కేతువులు అడ్డుగా వచ్చి మన దృష్టిని అడ్డుకొంటారు. చంద్రుడిపై, సూర్యుడిపై వీరి ప్రభావముండదు. మన దృష్టికే అవరోధం కలుగుతుంది. అలాగే జ్ఞానం తన స్థానంలో స్వయంసిద్ధంగా సురక్షితంగా ఉంటుంది. కళ్ళకున్న చూడగల శక్తే జ్ఞానం. దానిపై నున్న తెర అజ్ఞానం. దాన్ని తప్పకుండా దూరం చేయాలి. ఆ తెర లేదా ఆచ్చాదనని చేతి కుశలతతో దూరంగా నెట్టేయాలి. అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి, చూడగల శక్తిని ప్రకటం చేయాలి.

ప్రణిపాతం, పరిప్రశ్న, సేవ ఇవి గురుకృపను పొందడానికి సాధనలు. జగత్తుని నిజమని అనుకోవటం పెద్ద అజ్ఞానం అజ్ఞానమే సంసారంలోని దు:ఖానికి మూలం. గురుకృప అనే కాటుక కళ్ళకి పెట్టుకుంటే మాయా ఆవరణ ఎగిరిపోతుంది. స్వాభావిక జ్ఞానం మిగిలిఉంటుంది. దేవుడు, భక్తుడు వేరు అనుకోవడమే విలక్షణమైన అజ్ఞానం. దాన్ని నిరసించగానే పూర్ణజ్ఞానం మిగులుతుంది.దేహం జన్మించడానికి కారణం మాయ. దేహచలన వలనాలు, వర్తన,విధిననుసరించి ఉంటాయి. సమస్త (సుఖదు:ఖాలు, జయాపజయాలు, లాభనష్టాలు ఇత్యాదులు) ద్వంద్వాలు కూడా విధి ననుసరించి ఉంటాయి. మన శరీరంపట్ల ఆసక్తి ఉండటమే అజ్ఞానం. నేను శరీరాన్ని అన్న గుర్తు చెరిగిపోతే అజ్ఞానం నశిస్తుంది. కనుక మాయను నిరశించటానికి ఈశ్వరభజన అనేది ఒక్కటే ఉపాయం. మాయను దాటి   వెళ్ళడానికి సద్గురు పాదాలు పట్టుకోవాలి. ఆయన్ని అనన్యంగా శరణనాలి. అప్పుడు ఈ సంసారభయం వెంఠనే నశించిపోతుంది. అనివార్యంగా వచ్చేమరణం వస్తే రానీ. కానీ హరి విస్మరణని మాత్రం రానీకు.మనసులో హరి చరణాలను ధ్యానం చేయాలి.జీవుడు స్వస్వరూప జ్ఞానాన్ని ప్రాప్తింప చేసుకోగల మార్గానికి వెళ్ళాలి. అప్పుడు శాశ్వత శ్రేష్ఠ సుఖం అనే లాభం మిగులుతుంది. అంత:కరణలో హరి,గురువుల చింతన కలగాలి.చెవులతో వారి చరిత్రను వినాలి. మనసులో నిరంతరం వారిని ధ్యానించాలి. నాలుకతో వారి నామస్మరణ చేయాలి. పాదాలతో నడిచి హరి,గురు గ్రామాలకు వెళ్ళాలి.నాసికతో వాళ్ళ నిర్మాల్యాలను వాసన చూడాలి. చేతులతో వారి పాదాలకు నమస్కరించాలి. కళ్ళతో వాళ్ళ దర్శనం చేసుకోవాలి.అలా ఈ సమస్త ఇంద్రియ వృత్తులను హరి,గురువుల వైపు ప్రేమతో మళ్ళించిన ఆ భక్తుల స్థితి ధన్యం.  ఇంతకుమించిన భగవద్భక్తి మరోటి ఏముంటుంది? 

సారాంశం - అజ్ఞానాన్ని సమూలంగా పెకలించివేయాలి. మిగిలినదే స్వయంసిద్ధజ్ఞానమని తెలుసుకోవాలి అని ఈ శ్లోకం యొక్క అంతరార్ధాన్ని శ్రీకృష్ణుడు అర్జునునికి సూచించారు. 

శ్రీసాయిబాబా ప్రేమ,కరుణలు కలబోసిన సాగరం. ఆయన నానాని నిమిత్తంగా చేసుకొని మనందరికోసం గీతార్ధాన్ని ప్రవచనం చేసారు. 

 బాబాగారి జ్ఞానబోధను వినగానే నానాసాహెబ్ వినయవిధేతలతో బాబాకి సాష్టాంగ నమస్కారం చేశాడు. రెండు చేతులతో ఆయన పాదాలకి నమస్కరించి ఎంతో శ్రద్ధతో "బాబా నా తీవ్రమైన  అజ్ఞానాన్ని దూరం చేయండి. నాకు సరైన శిక్షణనిచ్చి నా మొండి అహంకారాన్ని నశింపజేయండి.నాపై కృపాదృష్టి చూపండి.ఇదే నాకు సుఖసంతృప్తులనిస్తుంది" అని ప్రార్ధించాడు. బాబాగారు ప్రేమ,కరుణలతో నానాను ఆశీర్వదించారు.


 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు

      









Friday, October 10, 2014 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 71

శ్రీసాయినాధునితో నాలుగు జన్మల స౦బ౦ధాన్ని కలిగిఉన్న పుణ్యాత్ముడు నానా చ౦దోర్కర్.
శ్రీ సాయిని ఎన్నో ఆధ్యాత్మిక స౦దేహాలు ప్రశ్ని౦చి ,స౦దేహ నివృత్తి చేసుకున్న భక్త శిఖామణి నానా చ౦దోర్కర్.
శ్రీ సాయి ద్వారా రహస్య ఉపదేశాలు, బ్రహ్మోపదేశ౦ పొ౦దిన ధన్య శిష్యుడు నానా చ౦దోర్కర్.
1860 స౦”లో మకర స౦క్రా౦తి పర్వదినాన ము౦బయిలోని, కళ్యాణపురములో బ్రాహ్మణకుటు౦బమున గోవి౦ద్ చ౦దోర్కర్ కు ’నానా’ జన్మి౦చారు. నానా పూర్తి పేరు నారాయణ గోవి౦ద్ చ౦దోర్కర్.

నానా చ౦దోర్కర్ పట్టుదల గల వ్యక్తిత్వ౦ గలవాడు.స౦స్కృతమ౦టే ప్రీతి వలన నానా స౦స్కృతములో గొప్ప పా౦డిత్యాన్ని స౦పాది౦చాడు. శ్రీ సాయి కీర్తిని వ్యాపి౦పజేయుటలో నానా కీలకపాత్ర వహి౦చారు.

 నానాను సాయియే స్వయ౦గా పిలిపి౦చుకొని , ’గురువు శాశ్వత తోడు’ అని నిరూపి౦చారు.

  నానా, సాయిని కలిసిన కొన్ని నెలలకు , అహ్మద్ నగర్ లో ప్లేగు వ్యాధి వ్యాపి౦చి౦ది. ప్రజలకు టీకాలు వేయి౦చమని డిప్యూటీ కలెక్టరు అయిన నానాను, కలెక్టరు ఆదేశి౦చెను. టీకాలు వేయి౦చుకు౦టే జ్వర౦ తగిలి, చనిపోయే ప్రమాద౦ ఉన్నదని, ప్రజలు భావి౦చి, భయపడి ఎవ్వరూ ము౦దుకు  రాలేదు.
ఈ విషయ౦ తెలిసిన కలెక్టరు ప్రభుత్వ ఉద్యోగులైన మీర౦తా టీకాలు వేయి౦చుకో౦డి. మీకు ఏమీ కాలేదని ప్రజలు నమ్ముతారు. మిమ్ములను ఆదర్శ౦గా తీసుకుని వార౦తా భయపడకు౦డా ము౦దుకు వస్తారని సలహా ఇచ్చాడు.
నానా కూడా భయపడి, శ్రీ సాయి ఏ౦ చెబితే ,అది చేద్దామని షిర్డీకి వెళ్ళి, ఆవేదనతో సాయికి నమస్కరి౦చగానే,  
“నానా! ప్లేగు టీకాలు వేయి౦చుకో, నీకు జ్వర౦ రాదు. ప్రాణహాని జరుగదు అని  బాబా పలికెను.....

సాయి సిద్ధపురుషుడని, సమర్ధుడయిన యోగిఅని, గత జన్మల గురువని నానా పూర్ణ విశ్వాసముతో నమ్మాడు.                కానీ, సాయి ముస్లి౦ అని నానా భావి౦చాడు. ఒక ముస్లి౦ యోగిని గురువుగఆరాధిస్తున్నాడని,నియమానుసార౦ నడచుకొనే బ్రాహ్మణుడైన తన త౦డ్రి దీనిని ఖ౦డిస్తారని,అనుమతి౦చరని నానా భయపడ్డాడు. తన త౦డ్రిగారికి, శ్రీ సఖారా౦ మహారాజ్ అనే మహాత్ముడు గురువు. నా బాటలో నడవకు౦డా, హి౦దూ సా౦ప్రదాయానికి విరుద్ధ౦గా నడుస్తావాయని,నా త౦డ్రి కోప పడతారని నానా భయపడ్డాడు.

ఈ విషయాన్ని త౦డ్రితో ప్రస్తావిస్తే మహాత్ములలో సమర్ధతను,శక్తిని చూడాలే గాని వారి వేష-భాషలు, కులగోత్రాలు చూడరాదు. నీవు సమర్ధుడని విశ్వసిస్తే ,ముస్లీ౦ అని నీవు భావి౦చే సాయిని, నీవు కొలవడానికి –గురువుగా ఎన్నుకోవడానికి నాకు ఎలా౦టి అభ్య౦తర౦ లేదు.అని త౦డ్రి తెలిపెను.
 బాబాగారి తత్వబోధను తెలిసికొని,వారిని గురువుగా సేవిస్తూ, నానా ఒకరోజు  
బాబాగారి వద్ద కూర్చొని వారి కాళ్ళు వత్తుతూ నోటిలో ఏదో గొణుగుకొనుచుండెను. 
బాబా : నానా! ఏమి గొణుగుచున్నావు?
నానా : సంస్కృత శ్లోకమును వల్లించుచున్నాను.
బాబా : ఏ శ్లోకము?
నానా : భగవద్గీతలోనిది.
బాబా : గట్టిగా చదువుము.
నానా : (భగవద్గీత 4.వ అధ్యాయము,34వ శ్లోకము ఈ క్రింది విధముగా చదివెను.)

"తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా
       ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన స్తత్వదర్శిన:" 

బాబా : నానా! అది నీకు బోధపడినదా?
నానా : అవును.
బాబా : నీకు తెలిసినచో నాకు చెప్పుము.
 నానా : గురువుకు శుశ్రూషచేసి జ్ఞానవిచారణచేత, సాధనచేత జ్ఞాని అయినవాడు మాత్రమే ఇతరులకు జ్ఞానం ఉపదేశించగల సమర్ధుడని, గీతలో శ్రీ కృష్ణపరమాత్మ చెప్పాడు. 
బాబా : నానా! శ్లోకము యొక్క తాత్పర్యము అక్కరలేదు.ప్రతిపదార్ధము,అంతరుద్బోధ ఏమిటి?పరమార్ధం ఏది?  చెప్పుము.

అప్పుడు నానా ప్రతి పదమునకు అర్ధము చెప్పెను.

 బాబా : నానా! ఉత్త సాష్టాంగనమస్కారము చేసినచో చాలునా? 
నానా : ప్రణిపాత అను పదమున కింకొక అర్ధము నాకు తెలియదు.సాష్టాంగనమస్కారమని నాకు తెలియును.
బాబా : పరిప్రశ్న అనగా నేమి?
 నానా : ప్రశ్నలడుగుట.
బాబా : ప్రశ్న యనగా నేమి?
నానా : అదే, అనగా ప్రశ్నించుట.
బాబా : పరిప్రశ్న యన్నను ప్రశ్న యన్నను  ఒక్కటి అయినచో, వ్యాసుడు ' పరి 'యను ప్రత్యమును ప్రశ్నకు ముందేల యుపయోగించెను? వ్యాసుడు తెలివిహీనుడా?
నానా : పరిప్రశ్నయను మాటకు నాకితరయర్ధమేమియు తెలియదు.
బాబా : సేవ యనగా నెట్టిది?
నానా : ప్రతిరోజు మేము చేయుచున్నట్టిది.
బాబా : అట్టి సేవ చేసిన చాలునా?
నానా : సేవ అను పదమున కింకను వేరే యర్ధమేమి గలదో నాకు తోచుట లేదు.
బాబా : రెండవ పంక్తిలోని "ఉపదేక్ష్యంతి తే జ్ఞానం" అనుదానిలో జ్ఞానమను పదముపయోగించకుండ ఇంకొకపదము ఉపయోగించగలవా?
నానా : అవును.
బాబా : ఏ పదము?
నానా : అజ్ఞానము.
బాబా : జ్ఞానమునకు బదులు అజ్ఞానము ఉపయోగించినచో,ఈ శ్లోకములో నేమైనా  అర్ధము గలదా?
నానా : లేదు;శంకరభాష్య మావిధముగా చెప్పుట లేదు.
బాబా : వారు చెప్పనిచో పోనిమ్ము.అజ్ఞానము అనుపదము నుపయోగించిన యెడల తగిన యర్ధము వచ్చునప్పుడు దాని నుపయోగించుట కేమైనా ఆక్షేపణ కలదా?
నానా : అజ్ఞానమను పదమును చేర్చి దాని యర్ధమును విశదపరచుట నాకు తెలియదు.
 బాబా : కృష్ణుడు అర్జునుని జ్ఞానులకు తత్వదర్శులకు నమస్కారము, ప్రశ్నించుట, సేవ-చేయుమని చెప్పనేల? స్వయముగా కృష్ణుడు తత్వదర్శి కాడా? వారు నిజముగా జ్ఞానమూర్తియే కదా! 
నానా : అవును. అతడు తత్వదర్శియే, కాని అర్జునునితరజ్ఞానుల నేల సేవించుమనెనో నాకు తోచుటలేదు.
బాబా : నీకది బోధపడలేదా?
(నానా సిగ్గుపడెను. అతనిలో అహంకారము నశించింది.అప్పుడు బాబా ఇట్లు వ్యాఖ్యానించెను.)

తదుపరి బాబాగారు చేసిన జ్ఞానబోధ..సశేషం

 సర్వం శ్రీ సాయినధార్పణ మస్తు