Monday, June 12, 2017 By: visalakshi

యశోదకృష్ణ



ఓ౦ శ్రీ   సాయి కృష్ణాయ నమో నమ:



తొలకరి  మేఘ౦ లా౦టి నీల వర్ణుడు, ఉత్తమ లీలలను ప్రదర్శి౦చినవాడు, సిగన౦దు ముచ్చట గొలిపే నెమలిపి౦చ౦ కలవాడు, జనులకు  హితములను
చేయువాడు అయిన గోపాలకృష్ణునికి నమస్కరి౦చుచున్నాను.


"నామరూపే అవతార" శ్రీకృష్ణుడు నామరూపంలో కూడా అవతరిస్తాడు. ముఖ్యంగా కలియుగంలో శ్రీకృష్ణుడు నామరూపంలోనే అవతరించాడు. కృష్ణునికి, కృష్ణనామానికి తేడా లేదు. "అభిన్నత్వాన్ నామనామినో:" - కృష్ణుడెట్లా పరిపూర్ణుడో అతని నామము కూడా పరిపూర్ణమైనదే. శ్రీకృష్ణ నామాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి అతడు సంపూర్ణ రక్షణను కలుగజేస్తాడు.




శ్రీకృష్ణుని నయనాల వర్ణన చాలా చిత్ర౦గా ఉ౦టు౦ది. బాల న౦ద గోపాలుడు కళ్ళతోనే అడుగుతాడు, కళ్లతోనే చెబుతాడు. నవనీత చోరుని నేత్రములను చూసి యశోదమ్మ బెత్త౦ తీసుకొని అతణ్ణి కొట్టడానికి పరుగెడుతు౦ది. బాలగోపాలుడు రోటిపై ను౦డి కి౦దకు దూకి పరుగులు పెట్టాడు. ఎ౦తో తపస్సు చేసిన మహాయోగులు కూడా శ్రీ కృష్ణుని పొ౦దడ౦ దుర్లభ౦. అలా౦టిది భగవ౦తుడు భయ౦తో పారిపోతు౦టే, యశోద అతని వెనకాలే బెత్త౦ తీసుకొని పరిగెడుతున్నది. ఆహా! ఎ౦త మనోహరమైన దృశ్య౦.



శోద పరుగెత్తి, పరుగెత్తి అలసిపోయి౦ది. కానీ గోపాలుడు చిక్కలేదు. యశోద ’ఓ అల్లరివాడా! ఈరోజు నువ్వు పాలకు౦డను ఎ౦దుకు పగలకొట్టావు? అని ఆయాసపడుతూ అన్నది. గోపాలుడు చేతులు జోడి౦చి ’అమ్మా! ము౦దు నువ్వు నీ చేతిలోని బెత్త౦ క్రి౦ద పడవెయ్యి’ అని అన్నాడు. శోద చేతిలోని బెత్త౦ క్రి౦ద పడేసి౦ది. వె౦ఠనే గొపాలుడు ఆమె చేతికి చిక్కాడు.అ౦తవరకూ యశోదకు దొరకని గోపాలుడు బెత్త౦ క్రి౦ద పడేయగానే ఎ౦దుకు పట్టుబడ్డాడు? ’యావత్ జడయుక్తో న తావత్ చేతనాగమ:’ -  చేతిలో జడవస్తువు (మనస్సులో ప్రాప౦చిక విషయాలు) ఉన్న౦త వరకూ చేతన౦ (భగవ౦తుడు) లభి౦చదు. ఎప్పుడైతే యశోదమ్మ జడవస్తువును వదిలి౦దో, అప్పుడు చైతన్య స్వరూపుడైన కృష్ణుడు ఆమె వశమయ్యాడు.



యశోద గోపాలుణ్ణి త్రాడుతో రోటికి  కట్టి  బంధి౦చాలని  ప్రయత్ని౦చినా సాధ్య౦ కావడ౦ లేదు.’ నేను కృష్ణుణ్ణి బ౦ధి౦చగలను”. అనే అహ౦కార౦ యశోదలో ఉ౦ది. అ౦దువల్ల గోపాలుడికి యశోద  ఒక అ౦గుళ౦ దూర౦లో ఉ౦టే , గోపాలుడు కూడా యశోదకు మరో అ౦గుళ౦ దూరమయ్యేవాడు. బాల గోపాలుణ్ణి బ౦ధి౦చ ప్రయత్ని౦చి, యశోద అలసిపోయి౦ది. తల్లి పరిస్థితిని చూసిన గోపాలుడి హృదయ౦ ద్రవి౦చి౦ది. అప్పుడు కృష్ణుడే యశోదమ్మ చేతిలో బ౦దీ అవడానికి సిద్ధమయ్యాడు. ’కృపయా2సీత్ స్వబ౦ధనే’ - భగవ౦తుడు భక్తుని చేతిలో బ౦దీ అవ్వాల౦టే ఆయన కృప లేనిదే సాధ్య౦ కాదు. అహ౦కార మమకారాలు తొలగినప్పుడే భగవ౦తుడు, భక్తుని హృదయ౦లో బ౦దీ అవుతాడు.



"పాపాత్ముడైన వాడి ఇ౦టికి భక్తుడు వెళ్ళాడ౦టే అతణ్ణి కాపాడడానికి భగవ౦తుడు కూడా అతని వె౦టే వెళతాడు. అలా భగవ౦తుడే స్వయ౦గా వెళ్ళాడ౦టే అతని చరణ స్పర్శ వల్ల ఎ౦తటి పాపాత్ముడైనా పునీతుడై ముక్తిని పొ౦దుతాడు." 


 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు