Wednesday, June 14, 2017 By: visalakshi

తండ్రి (పితృదేవోభవ)




శ్లో" పితాధర్మ: పితాస్వర్గ: పితా హి పరమం తప:!
     పితరి ప్రీతి మాపన్నే సర్వా ప్రీయంతి   దేవతా:!!   (మహాభారతం)

తండ్రిని సేవించడమే ధర్మం. తండ్రిని సర్వవిధముల సుఖింపజేయడమే స్వర్గం. ధర్మవర్తనుడైన తండ్రి ఆదేశాలను అనుసరించడమే సర్వశ్రేష్టమైన తపస్సు. తండ్రిని ప్రసన్నంగా ఉంచితే సమస్త దేవతలు ప్రసన్నులౌతారని ఈ శ్లోకము యొక్క అర్ధం. "సర్వ దేవ మయ: పితా"! తండ్రి సంపూర్ణంగా దేవతా స్వరూపము. అందుకే తల్లిదండ్రులను ఆదర సత్కారాలతో  సేవించాలి. తల్లిదండ్రులకు శ్రద్ధతో అభివాదం చేసే సంతానానికి అక్షయమైన సుఖసంతోషాలు  ప్రాప్తిస్తాయని  శాస్త్రాలు  తెలుపుతున్నాయి.


పాలించి పోషించి, రక్షించేవారిని పితా అంటారు. సంతతిని పాలించి పోషిస్తున్నాడు కనుక తండ్రిని ప్రజాపతి స్వరూపమంటారు. తండ్రి ఆకాశానికంటే ఎత్తైనవాడు. ఉన్నతుడు. తండ్రి హృదయాకాశంలో తన పుత్రుని యందున్న అనంతప్రేమ, వాత్సల్యం వర్ణింపలేనివి. ..పుత్రుడైన శ్రవణ కుమారుని వియోగంతో అంధులైన తల్లిదండ్రులు తమ ప్రాణాలనే త్యజించారు. దశరధమహారాజు తన ప్రియపుత్రుడైన శ్రీరామచంద్రుని యెడబాటును భరించ లేక ప్రాణాలు విడిచాడు.           



జన్మనిచ్చినవాడు, భయాన్నుండి రక్షించినవాడు, అన్నమిచ్చి ఆదరించినవాడు, జీవనాధారమైన వృత్తినిచ్చి ఆదుకొన్నవాడు, యజ్ఞోపవీతధారణ సంస్కారము చేసినవాడు ఈ ఐదుగురు పితరులని ఆచార్య చాణక్యుడన్నారు. తల్లిని సేవించినట్లే, తండ్రిని దేవుడుగా భావించి తప్పనిసరిగా సత్కరించాలి. తండ్రి వలన మానవ దేహోత్పత్తి, పాలన, సత్యశిక్షణ, విద్య, ధర్మోపదేశం లభిస్తాయి. పరమాత్ముని సాక్షాత్కారానికి తండ్రి సోపానము. తండ్రి కర్తవ్యపరాయణుడు, విద్వాంసుడయితే సంతానం సత్పురుషులౌతారు. తండ్రి పుత్రులకు వినయాన్ని నేర్పి, శుభకార్యాలలో వారికి శ్రద్ధను కలిగించాలి. పితృ శబ్ధానికి సర్వరక్షకుడు, శ్రేష్ట స్వభావం కలవాడనే అర్ధం ఉంది.


పుత్రుడు ఎప్పుడూ తండ్రి ఆధీనంలో ఉండాలి. తల్లి దండ్రులకు దుర్గతి కలుగకుండా పుత్రుడు చూడాలి. వంశ ప్రతిష్టను గౌరవించి రక్షించాలి. ధర్మ శాస్త్రాల ననుసరించిన ఆదర్శ పురుషుడు, పితృభక్తుడు, ఆజ్ఞాకారియైన సుపుత్రుడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలన కోసం సర్వస్వం త్యాగం చేసి సీతాదేవి, లక్ష్మణ సమేతంగా అరణ్యాలకు తరలి వెళ్ళాడు. కౌసల్యామాత శ్రీరాముడు వనాలకు వెళ్ళేందుకు అనుమతి నివ్వలేదు. శ్రీరాముడు తల్లితో " ఈ ప్రపంచంలో ధర్మమే చాలా శ్రేష్ఠమైంది. ధర్మంలోనే సత్యం స్థితంగా ఉంది. ఆ ధర్మాన్ని అనుసరించడమే నాకు పరమ కర్తవ్యం. ధర్మాన్ని పాలించడంలో నా ప్రాణాలు పోయినా నేను లెక్కచేయను. నిఖిల దేవతల కంటే పూజ్యుడు అధికుడు తండ్రి.వారి ఆజ్ఞను నేను ధిక్కరించలేను. నాకు సత్యం ధర్మం రెండూ అత్యంత ప్రియమైనవి. ధర్మబద్ధమైన తండ్రిగారి కోరిక పాలించడమే నా విధి. ఈ విధిని పాలించడంలో నేను మనోధైర్యాన్ని కలిగి ఉండేటట్లుగా ఆశీర్వదించమని" తల్లితో అంటాడు.  అది శ్రీరామచంద్రునిలోని సౌశీల్యం.

శంతన మహారాజు సత్యవతీదేవి సౌందర్యాన్ని చూచి మోహితుడై ఆమెను వివాహం చేసుకోవాలని ప్రయత్నించి, దాశరాజు కోరికను మన్నించలేక విఫలమై నిరాశతో హస్తినాపురం చేరుకుంటాడు. దేవపుత్రుడు దు:ఖంతో ఉన్న తండ్రి సుఖం కోసం అఖండ బ్రహ్మచర్యాన్ని పాటిస్తానని భీషణ ప్రతిజ్ఞ చేసి భీష్ముడయ్యాడు. చంద్ర దర్శనం వలన అంధకారం దూరమై రాత్రి శోభించునట్లుగా శీలసంపన్నుడు విద్యా ప్రియుడైన పుత్రుని వలన వంశం ఖ్యాతి గాంచుతుంది. 




తండ్రికి కష్టాలు, బాధలు,సమస్యలు ఎదురైనపుడు ఆ సమస్యల నుండి తండ్రిని సంతానం రక్షించాలి. తండ్రి ఆత్మశాంతిలో సంతానం యొక్క శాంతి ఉంది. ఒక్కొక్కసారి మన నిర్లక్ష్యం వలన అమూల్యమైన తల్లిదండ్రులను పోగొట్టుకుంటాం.తల్లిదండ్రుల సేవలో మనం తరించాలి. మనమలా వ్యవహరించినపుడే భగవంతుడు మనను ఆదరించి మరింత సద్బుద్ధి ప్రసాదిస్తాడు. పరమాత్ముని ఆజ్ఞలను పాలించిన గృహంలో ఎప్పుడూ సుఖశాంతులుంటాయి. 



పుత్రులను సన్మార్గంలో నడిపించే తండ్రి తనపేరు తనయుడు నిలబెట్టాలని ఆశిస్తాడు. పితృభక్తి కలవాడే పుత్రుడు. పూర్వకాలంలో తల్లిదండ్రులు లేక తాతయ్యలు పిల్లలకు పురాణ గ్రంధాలను వినిపించి వివరించేవారు. చదివించేవారు. వారివల్ల సదా గ్రంధపఠనం..తెలియని విషయాలను సేకరించి వారిని సందేహాలను అడిగి తెలుసుకుని ఆ విషయ జ్ఞానమును, ఆ ధర్మాలను మనం ఆచరిస్తున్నాము. ఆ పితామహులు సదా చిరస్మరణీయులు. వారిని ఇలా స్మరించుకోవటమే మనం వారికిచ్చే బహుమతి. ఆ విలువలను, సంస్కృతి సభ్యతలను మనం రక్షించుకోవాలి అంటే మన కుటుంబపరమైన మన పూర్వీకులను వారిచ్చిన సంస్కారాన్ని గౌరవించి ఆచరించాలి. "తండ్రి సర్వదా పూజ్యనీయుడు."....ఈ నెల 18న పితృ దినోత్సవ సంర్భంగా... మన భారతీయ సమాజంలో మనకు ధర్మవర్తనులైన  పితామహులందరికీ  వందనాలు. 











                                       

0 comments: