Tuesday, May 9, 2017 By: visalakshi

శ్రీ లక్ష్మీ నృసింహ స్మరణ...




శ్లో" నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం.
   దేవీం సరస్వతీం చైవ తతో జయ ముదీరయేత్

   తప్తహాటక కేశాంత ర్జ్వలత్పావక లోచన:
   వజ్రాధిక నఖస్పర్శ! దివ్యసింహ! నమోస్తుతే!

   పాంతు వో నరసింహస్య నఖలాంగల కోటయ:
   హిరణ్యకశిపోర్వక్ష: క్షేత్రాసృ క్కర్దమారుణా:

 హిరణ్యకశిపుని వక్షం అనే పొలంలోని నెత్తురు బురదతో ఎరుపెక్కిన నాగళ్ళవంటి నరసింహుని గోళ్ళు మిమ్ము కాపాడు గాక!


 హిరణ్యకశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదుని సంస్కరించాలని,చదువుకుంటే బాగుపడతాడని ఆశించి శుక్రాచార్యుని కొడుకులను పిలిపించి విద్యాబుద్ధులు నేర్పమని ఆదేశించాడు.  కొన్నాళ్ళకు ప్రహ్లాదుడు ఏమి నేర్చుకున్నాడో పరీక్షింపదలచి కొడుకును పిలిపించి వొళ్ళో కూర్చోబెట్టుకొని ఏమి నేర్చుకున్నావు కుమారా! అనగా.. ప్రహ్లాదుడు నాయనా! ప్రాణులు శరీరాలు ధరించి ఇల్లు అనే పంజరములో బంధింపబడక..నీవు,నేను అనే భిన్న భావంతో వర్తింపక, సర్వమూ విష్ణుమయమే అని తెలుసుకొని హరినామస్మరణలో ఉండుట మేలు. అని చెప్పగా హరి మనకు శత్రువు కదా..ఆతడి స్మరణ నీకు తగదు.. అని హితవు చెప్పాడు. అప్పుడు ప్రహ్లాదుడు నా చిత్తం హరి చింతనలో మైమరస్తుంది. హరినామం నన్ను ఆకట్టుకొంది ఇంకే విషయాలు నాకు పట్టవు అని తెలుపగా.. రాజపురోహితుడు గురువులతో మీరు ఈతనికి ఏకాంతాన విద్యలను నేర్పుమనగా.. గురువులు అర్ధం, ధర్మం, కామం గురించి వివరంగా బోధించి, సామదాన భేద దండోపాయాలన్నీ నేర్పించాడు. నీతికోవిదుదయ్యాడని నమ్మి..ప్రహ్లాదునితో మేము చెప్పిన పాఠాలు మర్చిపోకు. మీ  తండ్రి దగ్గర విష్ణునామం స్మరించకు. బుద్ధిగా మసలుకో అని జాగ్రత్తలు చెప్పి హిరణ్యకశిపుడి వద్దకు తీసుకొని వచ్చారు. మహారాజు పిల్లవాడిని ప్రేమతో కౌగలించుకొని ముద్దుగా దగ్గర కూర్చోబెట్టుకొని ఏమి నేర్చుకొన్నావు? అని అడిగాడు. ప్రహ్లాదుడు తండ్రితో నాయనా! నన్ను గురువులు చదివించారు. ధర్మ,అర్ధ,నీతి శాస్త్రాలు చెప్పారు. చదువులలో మర్మం అంతా తెలుసుకున్నాను. "నవవిధ భక్తిమార్గాల ద్వారా హరిని నమ్మి కొలిచి హరిని గురించి తెలియజేసేదే చదువు. ఇంద్రియాలన్నీ హరికే అంకితం కావాలి. హరిని స్మరించని జన్మ జన్మకాదు" అంటూండగా హిరణ్యుడు కోపంగా గురువులు చెప్పని ఈ విద్య నీకు ఎలా వచ్చింది ఎవరు చెప్పారు అని అడుగగా.. అజ్ఞానాంధకారంలో మునిగి, ఇంద్రియలోలురై సంసారచక్రంలో చిక్కుకొని తిరుగుతుండేవారికి ఒకళ్ళు చెప్పినా ఈ జ్ఞానం రాదు. తమంత తాము తెలుసుకోలేరు. కర్మలు చేస్తూ కర్మబద్ధులైనవారు విష్ణువుని చూడలేరు అని చెబుతున్న కొడుకును  వడిలో నుండి క్రిందకు త్రోసి అలవికాని కఠిన శిక్షలు విధించాడు. హరినామస్మరణతో అన్ని శిక్షలను భరించి క్షేమంగా బయటపడ్డాడు. తోటి విద్యార్ధులకు గురువులు లేని వేళల్లో భాగవత ధర్మం చెప్పేవాడు. హరి భజన వల్లనే మోక్షం సిద్ధిస్తుంది. విష్ణువు సర్వభూతాల్లోనూ ఆత్మరూపంలో ఉంటాడు . ఈ దేహం విడనాడే వరకు నారాయణుని పాదపద్మాలను సేవించడమే కర్తవ్యం అని ప్రహ్లాదుడు తోటి బాలకులకు బోధించాడు. ఇదంతా నీకెలా తెలుసు అని స్నేహితులు ఆశ్చర్యంగా అడుగగా నారదముని ద్వారా ఈ జ్ఞానాన్ని పొందానని చెప్పగా.. ఇచటకు ఎవరూ రాలేదుగా మరి ఆయన ఎలాచెప్పారు? అని అడుగగా ప్రహ్లాదుడు ఇలా వివరించాడు.


 మా నాన్న మందర పర్వతం మీద ఉగ్రతపం చేశాడు. బ్రహ్మ వద్ద తనకు ఎవరి చేతిలో భూమిపై ఎక్కడా మరణం సంభవించకూడదని వరం కోరుకున్నాడు. వరమిచ్చాడు బ్రహ్మ.  ఆ సమయంలో దేవతలు రాక్షసుల మీద యుద్ధం ప్రకటించారు. అసురులు తలా ఒక దిక్కుకు పారిపోయారు. అమరులు మా రాజమందిరాన్ని కొల్లగొట్టి ధనమంతా దోచుకున్నారు. దేవేంద్రుడు మా తల్లిని చెరపట్టాడు. తనలోకానికి తీసుకొని పోతూండగా దారిలో నారదుడు ఎదురొచ్చి, దేవేంద్రా! దేవతలలో శ్రేష్ఠుడువి, పుణ్యమూర్తివి ఇదేం పని నీకు, స్త్రీని చెరపట్టవచ్చునా అన్నాడు. పైగా ఈవిడ గర్భిణి, ఉత్తమల్లాలు . ఆవిడ మీద నీకు కోపం ఎందుకు? విడిచిపెట్టు అని హితబోధ చేయగా మహాత్మా ఈవిడ కడుపులో ఉన్న శిశువు వలన మాకు ప్రమాదము అనగా ..నారదుడు భయము వలదు. ఆమె గర్భములో ఉన్నా బాలుడు హరిభక్తుడు. అందువలన మీకు ప్రమాదములేదు. అనిచెప్పి, అమ్మా నీ భర్త తపస్సు ముగించి వచ్చువరకు నా ఆశ్రమంలో ఉండుమని చెప్పగా ఆమె అంగీకరించి, నారదుని సేవ చేస్తూ ఆశ్రమంలో ఉండిపోయింది. గర్భంలో ఉన్న నాకు నారదమహర్షి ధర్మతత్వాన్నీ, నిర్మల జ్ఞానాన్ని ఉపదేశించాడు. 


దేహానికి ఆరు వికారాలు ఉన్నాయి. పుట్టుక, స్థితి, పెరుగుదల, మార్పుచెందడం. క్షీణించడం, నశించడం దాని ధర్మాలు. ఆత్మకు ఈ లక్షణాలు లేవు. ఆత్మకున్న లక్షణాలు 12. ఆత్మ నిత్యం క్షీణించదు, మలినం అంటదు కాబట్టి శుద్ధం. పంచభూతాలకు ఆశ్రయం. దేహం క్షేత్రమైతే ఆత్మ క్షేత్రజ్ఞుడు. క్రియాశూన్యుడు. స్వయం ప్రకాశం కలవాడు. సృష్టికి కారణం. సర్వవ్యాపకుడు. దేనితోనూ సంబంధం పెట్టుకోడు కనుక నిస్సంగుడు. పరిపూర్ణుడు ఒక్కడు. ఆత్మకాక మరొకటి లేదు. ఈ విషయాలు గ్రహించి దేహాభిమానాన్ని, అహంకార మమకారాల్ని వదిలివేయాలి. దేహంలోనే ఆత్మను వెదకాలి. మెలకువలోనూ, స్వప్నంలోనూ గాఢనిద్రలోనూ కూడా తానున్నట్లు ఎరుక గలవాడే ఆత్మ. వాసనను బట్టి వాయువు ఉనికి తెలుసుకొంటున్నాం. త్రిగుణాత్మకమైన కర్మలు అజ్ఞానం నుంచి పుడుతున్నాయి. జ్ఞానం అనే అగ్ని చేత అజ్ఞానాన్ని కాల్చివేసి, కర్మరహితులై హరిని శరణు పొందాలి. ఆ విధంగా సంసార చక్రం నుండి ముక్తి లభిస్తుంది. హరిని మెప్పించాలంటే భక్తి కావాలి. భక్తికి మించింది లేదు. రండి హరిని భజిస్తూ ఆడుకుందాం. అని తోటి బాలకులకు వివరించాడు. గురువుగారు ఆగ్రహంగా హిరణ్యకశిపుడితో.. ఎలా కన్నావయ్యా.. పిల్లలందరికీ ఈ చదువులన్నీ కల్లలనీ వాళ్ళకు మోక్షమార్గం నూరిపోస్తున్నాడు. అందరినీ చెడగొడుతున్న వీడికి చదువు చెప్పడం మా వల్ల కాదని తెగేసి చెప్పారు. నా తమ్ముడిని పొట్టన బెట్టుకొన్న ఆ నారాయణుడి కోసం ఎన్నోమార్లు వెదికాను. ఎక్కడా కనిపించలేదు. ఈ విశ్వంలో ఎక్కడా లేడు.    ఎక్కడుంటాడో చూపించు. అప్పుడు నిన్నూ, వాడినీ కూడా హతమారుస్తాను. ఊరికే ఎందుకీ ప్రలాపాలు?  




ప్రహ్లాదుడు హరిని తలుచుకొని ఆనందంతో గంతులు వేస్తూ హరి అంతటా ఉన్నాడు. నీటిలో, గాలిలో, నేలపై, నింగిలో అగ్నిలో, దిక్కులలో, పగలురాత్ర్లలో, సూర్యచంద్రులలోనూ, ఓంకారంలోను, త్రిమూర్తులలోనూ, ప్రాణులందరిలోను ఉన్నాడు. ఎక్కడ చూస్తే అక్కడే ఉన్నాడు. వెదకవలసిన పనిలేదు అని చెప్పగా తండ్రి 'లేడు.' ఎక్కడాలేడని గద్దించుచుండగా,..శ్రీహరి నరసింహాకృతిలో జంగమ స్థావరాలన్నిటిలో ఉగ్రరూపంలో ఉన్నాడు. అప్పుడు దానవేంద్రుడు..బాలకా! అన్నిచోట్లా ఉన్నాడంటున్నావు కదా ఈ స్థంభములో చూపించగలవా? అని అడగగా విశ్వాత్ముడు గడ్డిపోచ నుంచి బ్రహ్మ వరకు వ్యాపించి ఉన్నవాడు స్థంభంలో మాత్రం ఎందుకుండడు? సందేహించకు. నేడు ప్రత్యక్షంగా కనబడుతాడు అని ప్రహ్లాదుడు సమాధానమిచ్చాడు.  హిరణ్యుడి కోపం తారాస్థాయికి చేరుకొంది.  సింహాసనం నుండి దిగి వచ్చి ఖడ్గం తీసి ఓరీ! మూర్ఖుడా అయితే చూపు అంటూ.. స్థంబానికేసి కొట్టాడు. ఆ వ్రేటుకు రవ్వలు లేచి, స్థంభం పగిలి శ్రీహరి నరసింహ రూపంలో ఆవిర్భవించాడు. హరి మాయా విరచితం ఆ మూర్తి. శ్రీహరి సర్వవ్యాపి అన్న బాలుని మాటను నిజం చేయటానికి వచ్చాడు. నరసిం హుడు సింహగర్జన చేసి లంఘించి, పాము ఎలుకను పట్టినట్లు పట్టుకొన్నాడు. తన తొడలపై చేర్చి గోళ్ళతో అతని వక్షస్థలాన్ని చీల్చాడు.అస్త్రశస్త్రాలు ఏవీ లేకుండా గోళ్ళతోనే హిరణ్యకశిపుని అంతమొందించాడు. రేయి,పగలు గాని, సంధ్యా సమయంలో, మనిషీ మృగము కాని నరసింహ రూపంలో లోనా బయటా కాని ద్వారంలో భూమీ ఆకాశమూ గాకుండా తన తొడలపైన ప్రాణం ఉన్నవీ, లేనివి కాని గోళ్ళతో దానవేంద్రుని ఆ దేవదేవుడు పరిమార్చాడు. రాక్షసులంతా యుద్ధానికి రాగా, అందరినీ అంతమొందించి, సభామధ్యంలో  సింహాసనంపై కూర్చున్నాడు. నరహరి రూపాన్ని చూసి లోకాలన్నీ భయపడ్డాయి. జరిగినది తెలుసుకొని దేవతలుపుష్పవర్షం కురిపించారు. బ్రహ్మ,మహేశ్వరులు,ఇంద్రుడు,మునులు, ప్రజాపతులు చూడవచ్చి, వారి ఉగ్రరూపం చూసి భయపడ్డారు. లక్ష్మీదేవిని పిలిచి అమ్మా! నీవు వెళ్ళి స్వామిని శాంతింపజేయి తల్లీ అని వేడుకున్నారు. ఆమె దగ్గరకు వెళ్ళి భయపడి నిలబడిపోగా బ్రహ్మ ప్రహ్లాదుని పిలిచి, అయ్యా మీ తండ్రిమీద కోపంతో ఉగ్రనరసింహావతారము దాల్చి తీవ్ర కోపావేశముతో ఉన్న స్వామిని నీవే శాంతింపజేయాలి.అని బ్రతిమాలగా.. ప్రహ్లాదుడు చేతులు జోడించి స్వామి సన్నిధికి వెళ్ళి సాష్టాంగ దండ ప్రణామాలు చేయగా నరసిం హుడు కరిగిపోయి అతని తల నిమిరాడు. ప్రహ్లాదుడు భక్తి పారవశ్యముతో పరమేశ్వరుడిని ప్రస్తుతించాడు. శ్రీహరి శాంతించి, వరం కోరుకోమన్నాడు. సంసారానికి బీజాలైన కోరికలను అణచి  విరక్తుడనై ముక్తికోసం నిన్ను సేవిస్తున్నాను. ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ నశించేవే అవి నన్ను ఆకర్షించకుండా, నాలో కోరికలు చెలరేగకుండా వరమివ్వు అన్నాడు. శ్రీహరి ప్రహ్లాదా! అయితే ఈ దానవ రాజ్యానికి ప్రభువై పాలించు, భోగాలన్నీ అనుభవించు. ఈశ్వరార్పణంగా పూజలు చేయి. మన్వంతరాన దేహాన్ని విడిచి నన్ను చేరుతావు అని ఆశీర్వదించాడు. నా తండ్రి అజ్ఞానం వలన నీతో వైరం పెట్టుకొన్నాడు. నీ భక్తుడనైన నన్ను హింసించాడు. దానికి ఫలితం పొందాడు .  అతని పాపాలన్నింటిని క్షమించు. అతని ఆత్మ శుద్ధమై శాంతిని పొందేటట్లు అనుగ్రహించు. అని వేడుకున్నాడు. నా భక్తుడవైన నిన్ను కనడం వలన నీ తండ్రి ,అతని పూర్వీకులు పవిత్రులై శుభాలను పొందుతారు. అని చెప్పి, నీ తండ్రికి అంత్యక్రియలు చేయి. నా స్పర్శ వలన అతడు పరిశుద్ధుడయ్యాడు. పాపాలు నశించి పుణ్యలోకాలకు వెళుతాడని హరి ఆనతిచ్చాడు.ప్రసన్నుడయిన నరసింహుని జూచి బ్రహ్మ "భాగవతశ్రేష్టుడైన ఈ బాలుడికి అభయమిచ్చి కాపాడావు. నీ నృసింహావతారాన్ని నిష్ఠతో ధ్యానించేవారు మృత్యువును జయిస్తారు. అప్పుడు నరసింహుడు బ్రహ్మనుద్దేశించి దేవ శత్రువులకు ఎప్పుడూ అలాంటి వరాలివ్వకు. పాపులకు వరాలివ్వడమంటే పాములకు పాలు పోయటమే అని చెప్పి అంతర్ధానమయ్యాడు.  ఈ రోజు శ్రీ లక్ష్మీ నృశింహ జయంతి సందర్భంగా ఈ రొజు ఈ ఆధ్యాత్మిక పురాణగాధ ద్వారా ఒక్కసారి నృసింహస్వామిని మనసారా స్మరించుకొనే అదృష్టం కలిగింది. స్వామికి ప్రణామములతో....

 సర్వం శ్రీ  సాయినాధార్పణ మస్తు.







0 comments: