Saturday, May 6, 2017 By: visalakshi

భగవంతుడే జగత్తు



 "విశ్వం విష్ణు వషట్కార:" అంటూ భీష్ముడు యుధిష్టరునకు శ్రీ విష్ణుసహస్రనామాన్ని చెప్పడం ప్రారంభిస్తాడు. అంటే  సృష్టింపబడిన జగమంతా భగవంతునిరూపమే. జగత్తు ఉత్పత్తి-స్థితి-లయలకు ఎవరు కారణమవుతున్నాడో, అతడే బ్రహ్మం. ఈ బ్రహ్మమే అద్వితీయుడైన పరమపురుషుడు. జగత్తులో ఉద్భవించిన ప్రతి వస్తువు, మనకు తెలిసినా తెలియకపోయినా కూడా, బ్రహ్మం అనే పదంలో చేర్చబడిందని అర్ధం. ప్రతి కార్యానికీ ఒక కారణం ఎలా ఉంటుందో అదే విధంగా జగత్తులో ఉద్భవించిన ప్రతివస్తువుకూ బ్రహ్మమే మూలమై, కారణభూతుడై ఉన్నాడు. మరో విధంగా చెప్పాలంటే ఆయన ఉనికి లేకుండా, ఆయన నుండి వేరుగా ఈ జగత్తుకు ఉనికి లేదు.   
  
 విశ్వమంతా భగవంతుని స్వరూపమే. ఆయన విశ్వాత్మ. సర్వత్రా భగవంతుడు వ్యాపించి ఉన్నాడన్నప్పుడు మనలో కూడా ఉన్నట్లే కదా. శ్రీరమణులు "హృదయకుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం అహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి" అన్నారు. హృదయంలోని ఆ భగవంతుని ఉనికిని అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగితే ఏ తప్పునైనా చేయగలరా ఎవరైనా? భగవంతుడు అంతరంగంలో ఉండి మనని గమనిస్తుంటాడు. ఆయన సర్వసాక్షి. కబీర్ "అందర్ రాం, బాహర్ రాం, జహా జహా దేఖే రాం హి రాం" అంటే "లోపలా రాముడే, బయటా రాముడే, ఎక్కడ చూచినా రాముడే, రాముడొక్కడే"అని అంటాడు. భక్తరామదాసు "అంతా రామమయం, ఈ జగమంతా రామమయం" అంటాడు. త్యాగరాజస్వామి "చీమలో బ్రహ్మలో శివకేశవులలో ప్రేమ మీర చెలగి ఉండే రామ నన్ను బ్రోవరా"అంటాడు. గొప్ప భక్తులూ, యోగులూ భగవంతుడు విశ్వవ్యాపి అని ప్రత్యక్షంగా గ్రహించారు. శ్రీరమణులు "జగత ఈశధీయుక్త సేవనం" అన్నారు. భగవంతుడే జగత్తు అనుకొంటూ చేసే ఆరాధన పరమోత్తమమన్నారు. జగత్తునే భగవంతుని రూపంగా చూడగలిగితే ఎక్కువ తక్కువలుండవు. "సర్వం ఆత్మైవ భూతో విజనత: తస్యకోమోహ: కో శోక: ఏకత్వం అనుపశ్యత:"అంటుంది ఉపనిషత్తు. దీనిని అనుభవసిద్ధం చేసుకున్న మహనీయుని దృష్టిలో అందరూ సమానమే.


 అష్టమూర్తులూ భగవంతుని స్వరూపములు అనే ఎరుకతో చేసే పూజ సరైనది. ఆ ఎనిమిదీ : భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, ఈ లోకలోని జీవులు. 



  
 "ఆత్మన ఆకాశస్సమ భూత: ఆకాశాత్ వాయు:,
వాయోరగ్ని, అగ్నీరాప:, అద్భ్యయ పృధ్వి, పృధ్వివ్య
అషద్యాయ: ఆషధీ బో2న్నం అన్నాత్ పురుష:"(తైత్తరీయ ఉపనిషత్తు) 

  
 ఆదిలో ఆత్మ లేక పరమాత్మ ఒక్కటే ఉంది. అది నిర్గుణము, నిరాకారము. సూక్ష్మమైన నిర్గుణమైన ఆత్మ అనేకమవదలచుకొన్నప్పుడు వివిధ గుణాలను సంతరించుకొంటూ స్థూలమవుతూ వచ్చింది. శబ్దమనే లక్షణాన్ని తీసుకొని ఆత్మ ఆకాశమైంది. స్పర్శ అనే లక్షణాన్ని తీసుకొని వాయువైంది. ఈ రెండు లక్షణాలకీ తోడుగా రూపం సంతరించుకొని అగ్ని ఉంది. నీరు ఈ మూడు లక్షణాలతో తోడుగా రసమనే గుణం సంతరించుకుంది. ఇది దైవీకమైన లక్షణం. దీనివల్లనే నీరు పాలతో కలిపితే పాలైపోతుంది. మజ్జిగలో కలిపితే మజ్జిగవుతుంది. ప్రతిరోజు మనం నీటిని వాడుతున్నా నీటి దివ్యత్వాన్ని గుర్తించం. భగవంతుడు సర్వవ్యాపి. -నీటికి అదే లక్షణముంది.

  
  తరువాతిది పృధ్వి. పై నాలుగు గుణాలకి తోడు గంధం(వాసన) అనే లక్షణం కూడా కలది. బయట వర్షం పడటం ప్రారంభించగానే ఒక విధమైన సుగంధం తెలుస్తుంది. ఆ సువాసన పృధ్విది. అన్ని గంధాలకూ మూలం పృధ్వియే. మల్లె, గులాబీ మొదలైన సుమాలకి గల సువాసన నేల వల్లే కలుగుతుంది.ఓషధులు భూమి నుండే పుట్టాయి. ఓషదుల నుండి అన్నం - అన్నం నుండి మనిషి ఉద్భవించాడు. అన్నమే స్త్రీపురుషులలో శుక్లంగా, అండంగా మారుతుంది - వాటి  సంయోగము వల్ల శిశువు జన్మిస్తుంది. మనిషి అన్నం తింటాడు, దానివల్లే జీవిస్తాడు. దీనివల్ల తెలిసేదేమిటంటే పరమాత్మే(ఆత్మే) వాయువుగా, నీరుగా, భూమిగా ఇతర భూతాలుగా రూపం దాల్చినట్లు తెలుస్తోంది. ఈ పంచభూతముల వలన ప్రపంచంలోని అన్ని వస్తువులు ఏర్పడినవి. ఈ పంచభూతములను ఆరాధించడమంటే భగవంతుణ్ణి ఆరాధించడమే. ఈ ఐదూ కాక ఇంకో మూడున్నాయి.ఇవి కూడా భగవత్స్వరూపాలే. సూర్యుడు, చంద్రుడు, జీవులూను.సూర్యుడు లేకపోతే జీవులే లేవు. ఆయనని సూర్యనారాయణ అంటాం. చంద్రుడు రసాధిపతి, కాంతిప్రదాత, మనస్సుకి అధిపతి. దైవస్వరూపునిగా ఆరాధిస్తాం. జీవులు కూడా దైవస్వరూపులే.ఆదిశంకరులు "బ్రహ్మసత్యం జగత్మిధ్య జీవబ్రహ్మైవ న పర:" అన్నారు. జీవులన్నీ బ్రహ్మస్వరూపమే అని ఏకమేననీ గ్రహిస్తే అందరినీ సమానంగా భావింపవచ్చు. ఈ వివరణతో భగవంతుడే జగత్తు అని తేలింది. అష్టమూర్తులలోనూ భగవంతుణ్ణి దర్శిస్తూ ఆరాధించడమే పరమోత్తమమైన మార్గం. 


  


పంచభూతాలూ పూజలో ఉన్నాయి. పూజలోని ఉపచారాలన్నిటినీ ఈ విధంగా చుడవచ్చు.

ఆకాశము - శబ్దం - చెవి               - ఘంటానాదం
వాయువు - స్పర్శ - ముట్టుకోవటం - ధూపం
అగ్ని - రూపం - కళ్ళు                    - దీపం
అప:(నీరు) - రసం - నాలుక           - అమృతనైవేద్యం
పృధ్వి - గంధం - నాసిక                 - గంధం(చందనం)


ఈ పంచభూతాలే జగత్తులోని మూలపదార్ధాలు. వీటితో సంబంధం లేనిదేదీ ఈ ప్రపంచంలో లేదు. ఇవన్నీ భగవంతునికి ప్రత్యక్షరూపాలన్నమాట. భగవంతుడు అవతారమూర్తి అయినప్పుడు ఆయనకి నామరూపాలూ, లక్షణాలూ ఉంటాయి. భగవంతుడు తన సహజ స్థితిలో ఉన్నపుడు వీటిని ఆపాదించలేము. భగవంతుణ్ణి అపారశక్తిగా భావిస్తాం. ఈ శక్తే సృష్టి స్థితి లయల వంటి కార్యాలలో నిమగ్నమైనప్పుడే బ్రహ్మఅనీ (సృష్టి), విష్ణువనీ(సంరక్షణ), రుద్రుడనీ(సంహారం) అంటాం. ఆ శక్తిని "సృష్టి కర్త్రీ బ్రహ్మరూపా గోప్త్రీ గోవిందరూపిణీ సంహారిణీ రుద్రరూపా" అని లలితలో స్తుతిస్తాం. అంటే ఆ శక్తికి ఇవన్నీ కార్యరూపాలన్నమాట.


 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు 







  

0 comments: