Tuesday, January 31, 2017 By: visalakshi

శరణం - స్మరణం

శ్లో"  కాయ వాంజ్మన:  కార్యముత్తమం 
       పూజనం జప  శ్చింతనం క్రమాత్.  (రమణ మహర్షి)


 భావం:- భగవంతుడు అనుగ్రహించిన దేహాన్ని పూజకీ, వాక్కుని జపానికీ, మనస్సుని ధ్యానానికీ వినియోగించాలి. ఇవన్నీ క్రమంగా ఒకదానికన్నా తరువాతది ఉత్తమం.




సిద్ధపురుషుల లక్షణాలు సాధకుల సాధనాలు అవుతాయి. అవి సంపాదించడానికి గొప్ప ప్రయత్నంతో అభ్యాసం చేయాలి. పాల కడుపులో నెయ్యి ఉంటుంది. కానీ దాన్ని తోడు పెట్టకపోతే మజ్జిగ ఉండదు. వెన్న కూడా ఉండదు. దానికి కొంత అవసరమైన ప్రక్రియ చేయవలసి ఉంటుంది. మజ్జిగ చిలకకపోతే వెన్న లభించదు. దాన్నైనా అగ్నిమీద కాచకపోతే రుచికరమైన నెయ్యి లభించదు. అలాగే సాధకులకు మొదట సంస్కారబలం కావాలి. తరువాత పూర్వాభ్యాసంతో లభించిన బుద్ధికుశలత కావాలి. అభ్యాసం లేకుండా చిత్తశుద్ధి కలుగదు. చిత్తశుద్ధి లేకుండా ఆత్మజ్ఞాన ప్రాప్తి కష్టమౌతుంది. కనుక స్వరూపస్థితి చేతికి చిక్కనంతవరకూ సాధకులు భగవద్భక్తిని వదలకూడదు. ఆత్మజ్ఞానమనే మందిరాన్ని నిర్మించటానికి, నాలుగు రకాల ముక్తులనే కలశాలు తళతళ మెరవటానికి, విరక్తి అనే పతాకం ఎగరటానికి భగవద్భక్తి అనే పునాది అవసరం.

స్వధర్మాచరణ అనే తపస్సు సాధనతో మానవదేహంలో చిత్తశుద్ధి కలుగుతుంది. అఖండ బ్రహ్మసిద్ధి కలుగుతుంది. సాధు సేవే ముక్తికి ఇల్లు. 

చక్కటి సద్వర్తనతో కేవలం శరీరపోషణకై భుజిస్తూ అన్య విషయాల్లో ఏ విధమైన ఆకాంక్ష లేకుండా భగవదనురక్తితో చరించు భగద్భక్తులు ధన్యులు. సాయిబాబా నామస్మరణను నిరంతరం ధ్యానించేవారి  అనుభవంలోని అపూర్వత, మహత్యం చూడండి.బాబా వారికి ఋణపడి వారిని గుర్తు పెట్టుకుంటారు.  స్వయంగా గురువు కూడా భక్తుల స్మరణ చేస్తారు. 

 సాయిబాబా నామం యొక్క అఖండ ఆవర్తనే మనకి నియమం, తపము, దానము. పదే పదే శిరిడీ వెళ్ళటమే మన తీర్ధాటన. ఆయనకి అనన్యంగా శరణు అనటం, "సాయి సాయి" అనే మంత్రాన్ని స్మరించటం, అనుష్టానం చేయటమే మన ధ్యానము, పురశ్చరణ. నిష్కపటంగా ప్రేమతో అనుసంధానాన్ని పెట్టుకొని ఆయన్ని పూజించి చూడండి. ఆయన అతర్క్యలీలలను హృదయంలో అనుభవించి చూడండి.

 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు



0 comments: