Saturday, January 7, 2017 By: visalakshi

వైకుంఠ ఏకాదశి

ఓం నమో నారాయణాయ 




 అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం !
లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదు:ఖాతిగోభవేత్ !!

ఆది మధ్యాంత రహితుడు, నిర్వికారుడు, బ్రహ్మాది దేవతలకు ప్రభువు, సర్వలోకాలకు నియామకుడు,సర్వవ్యాపకుడు అయిన శ్రీ మహావిష్ణువును నిరంతరం స్తుతించడంవల్ల సకల దు:ఖాలు తొలగి సంపదలు కలుగుతాయి. వైకుంఠ ఏకాదశినాడు గోపూజ చేయడం చాలా మంచిది. విష్ణుమూర్తి సన్నిధిలో ఆవునేతితో దీపం వెలిగిస్తే అజ్ఞానమనే చీకట్లు తొలగి ముక్తి లభిస్తుందని ప్రతీక. 





వైకుంఠ ఏకాదశి ఉత్తరాయణ ప్రారంభదినం  కావడం వలన ఇది అత్యంత విశిష్టమైన పండుగ. మన ఆరునెలలు దేవతలకు పగలు, మరో ఆరునెలలు రాత్రి. దీని ప్రకారం దేవతలందరూ దక్షిణాయనం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలానికి అంటే చీకటి రాత్రి నుంచి వెలుగులు చిమ్మే పగటిలోకి వచ్చారన్నమాట. స్వర్గద్వారాలను తెరవగానే ముందుగా ఈ కాంతి ఉత్తరద్వారం నుంచి ప్రవేశిస్తుంది. అందుకే విష్ణ్వాలయాలలో ఈ రోజు ఉత్తరం వైపున ఉన్న ద్వారాన్ని తెరచి ఉంచుతారు. ఈ ద్వారం నుంచి భక్తులు  స్వామివారిని దర్శించుకోవడం అత్యంత పుణ్యప్రదం.ఈ రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొంటాడు.ఉత్తర ద్వారం నుంచి దర్శనమిస్తాడు.ఉత్తర ద్వారం ద్వారా స్వామి ని దర్శిస్తే ఎంతో పుణ్యఫలం.

 ముక్కోటి అంటే ముప్పది మూడు కోట్ల దేవతలని ఉద్దేశించినది. ఈ ఏకాదశినాడు విష్ణుమూర్తి గరుడ వాహనారూఢుడై ఉత్తర ద్వారాన దర్శనమిస్తాడట. ఆ దివ్యసుందర రూపుని దర్శించుకోవడం కోసం దేవతలందరూ ఈ రోజున దివి నుండి భువికి దిగి వస్తారట. అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు. ఇదే వైకుంఠద్వారం. వైకుంఠద్వారమే సూర్యుని ఉత్తరాయణ ప్రవేశానికి సూచన. అందుకే ఉత్తరద్వారం నుంచి విష్ణుదేవుని దర్శించుకున్న వారికి మోక్షం లభిస్తుందని పురాణ వచనం. ఈ రోజు విష్ణు సహస్ర నామ పారాయణం బహు శ్రేష్ఠం. 

                          (జనవరి 13వ తేదీ గురువారం వైకుంఠ ఏకాదశి).....


సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు.

0 comments: