Friday, January 6, 2017 By: visalakshi

శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం -2



5 వ శ్లో" దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధించ శూన్యం విదు:
            స్త్రీబాలాంధజడోపమాస్త్వహమితి బ్రాంథా భృశం వాదిన: !
            మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సం హారిణే
             తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే !!

భా:- "ఆత్మతత్వమును తెలియజాలని కొందరు, ఆత్మ దేహమనియు, ప్రాణమనియు తప్పుగా గ్రహిస్తారు. బుద్ధిపరంగా స్త్రీలవలె, చిన్నపిల్లలవలె, మూఢులవలె, విషయాలనర్ధం చేసుకునే శక్తిహీనులు,మాయా ప్రభావానికి లోనై, శరీరమే సత్యమనీ, ప్రాణమే సత్యమనీ, ఇంద్రియాలనే సత్యమనీ, మనస్సే సత్యమనీ, నిత్యమూ మార్పు చెందే బుద్ధే సత్యమనీ, శూన్యమే సత్యమనీ శాస్త్రం నుండి తప్పుగా గ్రహిస్తారు. అట్టివారి భ్రమలను తొలగించగలిగే పరమగురువుకు శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా ప్రణామాలు."

6 వ శ్లో"   రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్చాదనాత్
               సన్మాత్ర: కరణోప సం హరణో యోభూత్సుషుప్త: పుమాన్ !
               ప్రాస్వాప్సమితి ప్రబోధసమయే య: ప్రత్యభిజ్ఞాయతే
               తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే !!

భా:-" గ్రహణ సమయంలో సూర్యచంద్రులు రాహువుచే కప్పబడినట్లుగా, సర్వేంద్రియ వ్యవహారాలూ ఉపశమించిన  సుషుప్తి అవస్థలో ప్రవేశించి మాయావరణతో కూడిన సత్యం సన్నిధిలో విశ్రాంతినొంది మళ్ళీ మెలకువలో తాను నిద్రపోయినట్లుగా తెలుసుకునే పరమసత్యానికి శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా ప్రణామాలు."




7 వ శ్లో"     బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తధా సర్వాస్వవస్థాస్వపి
                వ్యావృత్తాస్వనువర్తమాన మహమిత్యంత: స్ఫురంతం సదా !
                స్వాత్మానాం ప్రకటికరోతి భజతాం యో భద్రయా ముద్రయా
                తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే !!

భా:-   " బాల్యకౌమార యౌవన వృద్ధాప్య దశలలోనూ, జాగృత్ స్వప్న సుషుప్తి మొదలైన అన్ని అవస్థలలోనూ భూత వర్తమాన భవిష్యత్ కాలాలలోను, సర్వదా అన్నిప్రాణులలోనూ "నేను"గా ఉంటూ తన భక్తులకు చిన్ముద్ర ద్వారా తన నిజ తత్వాన్ని వ్యక్తం చేసే సద్గురుమూర్తి శ్రీదక్షిణామూర్తికి ఇవే నా ప్రణామాలు."

8 వ శ్లో"      విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధత:
                  శిష్యాచార్యతయా తధైవ పితృపుత్రాద్యాత్మనా భేదత: !
                  స్వప్నే జాగృతి వా య ఏష పురుషో మాయా పరిభ్రామిత:
                  తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే !!


భా:-" ఏ పురుషుడు మాయా ప్రభావంతో తనలో.. కార్యకారణ సంబంధరూపమయిన విశ్వాన్నీ, శిష్యాచార విభేదాన్నీ, పితృపుత్ర మొదలయిన తేడాలనీ జాగృత్ స్వప్నావస్థలనీ చూస్తున్నాడో, ఆయనను, ఆ పరమగురువుకి, శ్రీదక్షిణామూర్తికి ఇవే నా ప్రణామాలు."




9 వ శ్లో"    భూరంభాస్య నలో2నిలో2ంబర మహర్నాధోహిమాంశు: పుమాన్
                ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం !
                నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్ విభో
                తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే !!


భా:- " ఎవని అష్టమూర్తులు భూమి జలము అగ్ని వాయువు ఆకాశం సూర్యుడు చంద్రుడు జీవుడు విరాజిల్లుతున్నారో, ఎవరు చరాచరమైన జగత్తుగా వ్యక్తమవుతున్నాడో, ఎవనిని ఆరాధించి సర్వవ్యాప్తమయిన ఆత్మతత్వంకంటే వేరుగా రెండవదేదీలేదని సాధకులు తెలుసుకుంటున్నారో .... అట్టి సద్గురువునకు శ్రీదక్షిణామూర్తికి ఇవే నా ప్రణామాలు."


10 వ శ్లో"     సర్వాత్మత్వమితి  స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే
                   తేనాస్య శ్రవణా త్తదర్ధ మననాద్ధ్యానాచ్చ సంకీర్తనాత్ !
                   సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వత:
                   సిద్ధ్యేత్ తత్పునరష్టధా పరిణతం చైశ్వర్యమవ్యాహతం !!

భా:-     "  సర్వాత్మత్వం ఈ దక్షిణామూర్తి స్తోత్రము నందు వివరించబడింది. ఈ ప్రపంచము సర్వమూ ఆత్మస్వరూపమే..అని స్పష్టము చేయబడినది. కాబట్టి దీనిని శ్రవణం మననం చేసి ధ్యానించి కీర్తించడంలో అష్టవిభూతి సహితమయిన సర్వాత్మత్వం, ఈశ్వరత్వం, స్వరూపానుభూతి సిద్ధిస్తాయి."



 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు





0 comments: