Saturday, August 20, 2016 By: visalakshi

సమత - మమత

  ఓం శ్రీ సమర్ధ సద్గురు సాయినాధాయ నమో నమ:

 భక్తులకు కావలసినది సమతయే కానీ మమత కాదు. 



 ఒకానొక రామభక్తుడు- ప్రతిదినమును బాబా సన్నిధియందు కూర్చుని విష్ణు సహస్రనామమును పఠించెడివాడు. అంతా మిధ్యయని ఎరిగి, ఆధ్యాత్మమార్గమున ప్రవేశించి కూడా అతగాడు . ' తన ' 'పర ' భేదము విడువలేకుండెను. అట్టి ఆతని మమతలను త్రుంచి - సమతను బోధించుటకై బాబా ఈ విధముగా తెలిపినారు.


  ఒకనాడా రామభక్తుని పరోక్షమునందు బాబా, ఆతని విష్ణు సహస్రనామ గ్రంధమును తీసి శ్యామాకు బహుకరించినారు. ఆతనితో తగువవునని శ్యామా భయపడిననూ - బాబా వినలేదు.మరికొంతసేపటిలోనే వచ్చిన రామభక్తుడు   శ్యామా వద్ద తన గ్రంధమును చూసి యుద్ధమునకు దిగినాడు, నానాదుర్భాషలనాడినాడు.ఆతని ఆవేశమొక స్థాయికి వచ్చువరకును ఆగి, పిదప బాబా మెల్లగా ఇట్లు చెప్పినారు. - "ఓయీ రామభక్తుడా - కొంచెము ధనము వెచ్చించినచో ఇంకొక పుస్తకము వచ్చునుగాని, మాటలతో మనసు గాయమైనచో ఆ మనిషి మరల మనతో స్నేహం చేయడు సుమా! అయిననూ నీకా విష్ణు సహస్రము ఖంఠోపాఠముగా వచ్చును కదా! ఇక పుస్తకముతో పని ఏమి?దానిని మరియొకరు చదువుకొనుటకు నీకు ఆక్షేపణ ఏల? ఓ అమాయకుడా! భక్తులకు కావలిసినది ' అది నాది ' - 'ఇది నాది 'అను మమత కాదు..సాటి మానవుల పట్లనూ, సమస్త జీవరాసుల పట్లనూ సమత కావలెను.' అంతా రామమయం. జగమంతా రామమయం 'అని వినలేదా! నీ గ్రంధమును నేనే ఉద్దేశ్యపూర్వకంగా తీసి శ్యామాకి ఇచ్చాను.నీ ఆవేశమునణచుకొనుము." 



 బాబా బోధన వినికూడా ఆ భక్తుడు శాంతి లభింపక "బాబా ! మీరు నాకు చెప్పిన రీతిగా శ్యామాకు ఏల చెప్పరు? ఆతని వస్తువు నేనంటినచో ఆతడూరుకొనునా?" ఆతని వద్దనున్న గ్రంధములను నాకు యిచ్చునా?" అని అడిగినాడు. బాబా శిష్యుడగు శ్యామా - ఆ రామభక్తుని మాట పూర్తయినదే తడవుగా - "తప్పక ఇచ్చెదను. నీకే గ్రంధములు కావలెనో తీసుకొని పొమ్ము"అనెను. భక్తుడు ఖంగు తినినాడు. బాబా తమ సహజ సుందర మందస్మితముతో భక్తుని జూచుచు వింటివిగా శ్యామా చెప్పినది. నీవు కూడా శ్యామావలెనుండుటకు యత్నించుము.


 గుర్తుంచుకొనుము..."మమత"  ఇహమందు  బంధించును..."సమత" పరమునకు పైడి బాటలు వేయును..అని బోధించిరి.

వారి మాటలు మంత్రములు, భక్తి జ్ఞాన కర్మయోగములనూ- ద్వైతాద్వైత విశిష్టములను రంగరించి బాబాయొనరించిన అమృతబోధ...ఈ సచ్చరిత్ర.... 

 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు.

0 comments: