Monday, August 15, 2016 By: visalakshi

భావోద్వేగం

 మనలో ఉద్రేకం ఎగసిపడేటప్పుడు, ఆవేశం ఉప్పొంగినప్పుడు తీసుకొన్న నిర్ణయాలను వెంటనే అమలుపరచకుండా ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే.. మనం ఆ విషమపరిస్థితుల నుండి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోగలం. 

ఈ సాంకేతికయుగంలో వాయువేగంతో దూసుకుపోతున్న నేటి తరానికి 'ఆలస్యం అమృతం విషం' అనే నానుడి కన్నా 'నిదానమే ప్రదానం ' అనే నానుడి ఎక్కువ వర్తిస్తుంది.ఈ నియమాన్ని పాటించడం వలన ఎన్నో అనర్ధాలను తప్పించుకోవచ్చు అనడానికి ఒక కధ....

  ఒకసారి మేధాతిధి అనే ముని ఓ సందర్భంలో తన భార్యపై ఆగ్రహోదగ్రుడయ్యాడు. వెంటనే ఆమెను వధించమని కొడుకు చిరకారిని ఆదేశించి నదీస్నానానికి వెళ్ళిపోయాడు. కానీ చేయబోయే ప్రతి పనిలోనూ మంచిచెడులను విపరీతంగా విశ్లేషించుకునే స్వభావం ఆ కుమారుడిది. అదే ధోరణిలో ఆ చిరకారి తండ్రి ఆదేశాన్ని కాసేపు పక్కన పెట్టి , అలా చేయడం ఎంతవరకు సబబు? అని ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఇంతలో మేధాతిధి నదీస్నానం  చేసి వస్తూ అయ్యో! క్షణికోద్రేకం వల్ల ఆ అమాయకురాలిని వధించమని చెప్పి తప్పు చేసాను..కానీ ఏం లాభం! ఇప్పటికి జరగాల్సిన ఘోరం జరిగిపోయే ఉంటుంది! అని పశ్చాత్తాపపడుతూ ఆశ్రమానికి చేరాడు. కానీ భార్య, పుత్రుడు యధావిధిగా ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు..కొడుకు నిదానం, ఎంత ప్రమాదాన్ని తప్పించిందో మేధాతిధికి అర్ధమై ఊపిరి పీల్చుకున్నాడు.

  మనం ఉద్రేకంలో తీసుకొన్న నిర్ణయాల వల్ల మనలో భావోద్వేగాలను నియంత్రించుకునే శక్తి లేకపోవడం వల్ల ఎన్నో ఘోరాలు జరుగుతుంటాయి. సెల్ ఫోన్ లు, ఫేస్ బుక్ లు, ట్విట్టర్ లు, వాట్సాప్ లు ఈ భావోద్వేగాల నియంత్రణకు మరింత విఘాతం కలిగిస్తున్నాయి.  తొందరపాటు నిర్ణయాల వల్ల జరిగే మేలు కన్నా కీడే అధికమని తెలిపే ఉదంతాలు కోకొల్లలు..ముఖ్యంగా విద్యార్ధులు, యువత క్షణికోద్రేకంలోనో, నిరాశకు గురైనప్పుడో తీసుకున్న నిర్ణయాలు ఎన్నో అఘాయిత్యాలకు దారితీస్తున్నాయి.. 
 అందుకే ఒక స్వామి ఇలా అంటారు ! "నీవు ఎప్పుడైనా ఉద్రేకంతో తీసుకున్న నిర్ణయాలను వెంటనే ఆచరణలో పెట్టవద్దు. ఒక కాగితంపై వాటిని రాసుకొని నీ తలగడ కింద పెట్టుకో! మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ కాగితాన్ని తీసి చదువు. అప్పుడు నీ సమస్యకు సరైన పరిష్కారం లభిస్తుంది" 

0 comments: