ఓం శ్రీ సాయినాధాయ నమో నమ:
బంధం..కుటుంబం..పరివారం..బాధ్యతలు..స్నేహం..ప్రేమ..అంటూ పరితపిస్తాము..ఆరాటపడతాము..సంతోషం, దు:ఖం.. ఆనందం, విషాదం .. వినోదం, విచారం.. ఆశ, నిరాశ అన్నీ అనుభవిస్తాము.. అన్నింటికీ కారణం బాబాయే అని అంటాము..అన్నిటినీ మన బాధలను, బరువులను, కష్టసుఖాలను భగవంతుని..భుజాలపై వేద్దాం..మన రక్షణ భారాన్ని శ్రీ సాయికి అప్పగించి. జ్ఞాన మార్గాన్ని ప్రసాదింపమని మనసారా ప్రార్ధిద్దాం.
దు:ఖహేతువులైన వ్యక్తిత్వపు పరిమితులను దాటించి, అన్ని పరిమితులకు పరమైన ఆనందాన్నందించి, పరాయణత్వాన్ని కలిగించేదే పారాయణ!
"నన్ను ఆనందస్వరూపంగా ధ్యానించు" అన్నారు శ్రీ సాయి. అది సాధ్య పడకపోతే నా ఈ రూపాన్ని ధ్యానించు! అన్నది శ్రీసాయి ఉపదేశం. జగత్తులోని అన్ని రూపాలు ధరించిన తత్వం తానే అని అనుభవపూర్వకంగా భక్తులకు తెలియజేసిన ఆ రూపాతీతుని ' రూపం ' సాయి భక్తుల ధ్యానానికి ధ్యేయం; ఆనందానుభవానికి ఆలంబనం!
"నేను ఆనందంగా ఉండాలి" ఏ విధంగా? మాయచే విషయ వాంచలను కోరుతూ అల్పానందమా..లేక శాశ్వతమైన ఆత్మానందమా! " అనిత్యమైన దేహలాలసతో, కోరికలతో.. అర్ధంకాని, అర్ధంలేని ఆలోచనలతో కాలాన్ని వృధాచేస్తూ; అంతరంగాన్ని అలజడులకు గురిచేస్తూ; హృదయంలోని దు:ఖ కారకాలైన విషయవాసనలను మండించి మసి చేసే మార్గమే.... ఆధ్యాత్మిక మార్గం".
మనలో అవ్యక్తంగా అస్పష్టంగా ఉన్న ' సంపూర్ణత్వ ' భావనకు ఓ నిర్దిష్టమైన రూపునిచ్చి, దానిని అనుభవపూర్వకంగా ' వాస్తవం ' చేసుకోవడమే మన ఆధ్యాత్మిక ప్రాపంచిక లక్ష్యాలకు మూలం, సారం!
ఒకానొక మహత్తర అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి అపారమైన దాని తత్వాన్ని ఆకళింపు చేసుకొనే సాధనం పారాయణ.......శ్రీబాబూజీ.
" తత్వదర్శినులైన సత్పురుషుల జీవిత చరిత్రలు, బోధనలను శ్రద్ధతో అధ్యయనం చేసి ఆ అధ్యయసారాన్ని మననం చేసి దాన్ని హృదయగతం చేసుకో! నీ ఆలోచనలకు, లక్ష్యాలకు నన్నే కేంద్రంగా చేసుకో! పరమార్ధం లభిస్తుంది..అచంచల విశ్వాసంతో నన్ను ఎప్పుడూ అంటిపెట్టుకొని ఉండు! ధ్యానం,ధ్యేయం నేనే అయి ఉండు! సదా రక్షకుడను" అని నా మనమున నిలిచి బోధిస్తున్న నా సాయినాధునికి శిరస్సును పాదాలపై ఉంచి శరణు వేడుతున్నాను...
సద్గురు దివ్య పాదాలను హృదయంలో ప్రతిష్టించుకొని, భక్తిరాగరంజితమైన
మనస్సనే కుంకుమతో ఆ పాదాలకు పారాణి చేయడమే పారాయణ!........శ్రీబాబూజీ .
సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు
0 comments:
Post a Comment