ఓం శ్రీ బ్రహ్మానంద స్వరూపాయ నమ:
న చైనం క్లేదయంత్యాప: న శోషయతి మారుత:!!
అచ్చేధ్యో2 యమదాహ్యో2 యం అక్లేద్యో2 శోష్య ఏవచ!
నిత్యస్సర్వగత: స్థాణు: అచలో2 యం సనాతన:!! (2-23,24)
భా:- "ఈ ఆత్మను శస్త్రాలు చేదింపజాలవు. అగ్ని దహింపజాలదు. నీరు తడుపజాలదు. వాయువు ఆర్పివేయజాలదు. ఈ ఆత్మ నిత్యము, సర్వవ్యాపి, చలింపనిది, స్థాణువు,స్థిరమైనది, సనాతనం, శాశ్వతమైనది."
ఒక చోట చేపలు పట్టువారు చేపలు పడుతున్నారు. దూరంగా ఎక్కడి నుంచో ఓ గద్ద వచ్చి ఓ చేపను నోట కరచుకొని వెళ్ళిపోయింది. అలా చేపను పట్టుకొని వెళ్ళిపోతున్న గద్దను కాకుల గుంపు చూసింది. వెంటనే వందలాది కాకులు ఆ చేపకోసం దానిని తరమసాగాయి.గద్ద వాటిని తప్పించుకుంటూ నాలుగు దిశలకూ వెళితే అవి కూడా వెంబడించడం మానలేదు. వాటిని తప్పించుకొనే ప్రయత్నంలో గరుడపక్షి నోటినుంచి చేపను జారవిడుచుకుంది. అంతే! ఒక్కసారిగా కాకులన్నీ చేప పడ్డ చోటుకేసి దూసుకుపోయాయి; గద్దను వదిలేసాయి. అప్పుడు ఆ పక్షి నిశ్చింతగా ఓ చెట్టుపై కూర్చొని తనలో తాను ' ఈ చేపే కదా, ఇంత గందరగోళానికి కారణం.ఇప్పుడు ఆ చేపా నా చెంత లేదు; చింతా నా చెంత లేదు ' అనుకుంది.
మనిషి జీవితమూ అంతే! భోగాలనే చేపను పట్టుకున్నంత కాలం, కష్టాలనే కాకులు, కర్మలనే కాకులు వెంబడిస్తూనే ఉంటాయి. వాటి వల్ల చింత, విచారం, అశాంతి కూడా వెన్నంటే వస్తాయి.
సురమందిర తరుమూల నివాస:, శయ్యా భూతల మజినం వాస:
సర్వపరిగ్రహ భోగత్యాగ:, కస్య సుఖం న కరోతి విరాగ:.... అంటున్నారు 'భజగోవిందం' పరంపరలో శంకర భగవత్పాదుల శిష్యప్రముఖులు నిత్యానందులు.దేవాలయాల్లో ఏదో చెట్టు కింద నివసిస్తూ, నేలమీద పడుకుంటూ, లేడి చర్మాన్నే ధరిస్తూ, అన్నీ వదలిపెట్టి, భోగాలను కోరని విరాగికి ఇక సుఖం ఎందుకు లభించదని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు మనిషి జీవితం అతి దుర్భరంగా మారడానికి ప్రధాన కారణం భోగలాలసే!
ఒకసారి భగవాన్ రమణ మహర్షుల వారు భౌతికంగా జీవించి ఉన్నకాలంలో ఆశ్రమంలో ఒక ఉత్సవం జరిగింది. భోజనవేళ కాగానే నిర్వాహకులు 'ప్రముఖులందరికీ ముందుగా వడ్డన జరుగుతుంది. బైరాగులు, బికారులు బయట కూర్చోండి; తరువాత పంక్తిలో పిలుస్తాం' అంటూ రమణుల కోసం వెతికారు. కానీ మహర్షి ఎక్కడా కనిపించలేదు.; బయట ఎక్కడో బైరాగుల మధ్య కూర్చున్నారు. 'ఇదేంటి మహాత్మా! మీ కోసం న్యాయమూర్తులు, పురప్రముఖులు వేచి చూస్తున్నారు ' అన్నారు నిర్వాహకులు. 'బైరాగులు, బికారులు తరువాత పంక్తిలో అన్నారుగా! అందుకే తరువాత పిలుస్తారనుకొని బయటకు వచ్చాను ' అన్నారు భగవాన్ రమణులు. భోగాలను త్యజించి,కౌపీనం ధరించినంత మాత్రాన వారి విలువ ఏమైనా తరిగిపోయిందా!అందుకే ఎందులో వెళుతున్నామా? అన్నది కాదు ప్రధానం; అంతరంగంలో ఎంత అకళంకంగా, ఆనందంగా ఉన్నామన్నదే ప్రమాణం.
శ్రీమద్భాగవతంలో అజగర మౌని ప్రహ్లాదుడితో తన ఆనంద రహస్యం చెబుతూ...
లేదని ఎవ్వరి నడుగను, రాదని చింతింప పరులు రప్పించినచో
కాదనియెద్దియ మానను, ఖేదము మోదమును లేక క్రీడింతు మదిన్..... అంటాడు.
" లేదని నేను ఎవరినీ యాచించను ; లభించలేదని చింతించను. పరులు ఏదైనా పంపితే దానిని కాదనను. ఏదీ మానను; ఏదీ కోరను.ద్వేషం లేదు, ప్రేమా లేదు; సుఖం లేదు, దు:ఖమూ లేదు. ఈ విధంగా జీవితాన్ని లీలా వినోదంగా గడుపుతున్నా"నని చెబుతాడు.లౌకికులైన వారు సుఖాలకూ, సౌకర్యాలకూ అలవాటు పడకుండా ఇలా వాటితో అంటీముట్టనట్టుగా వ్యవహరించాలి. ఆవగింజంత నిరాశ కూడా ఎదురు కాకూడదంటే అసలు భోగాలకే దూరంగా ఉండాలి.
భోగవాసన అంత సులువుగా మనస్సు నుంచి విడివడదు. భోగాలతో కాలం గడుపుతున్నంత కాలం భగవంతుడు మన వైపు చూడడు. బ్రహ్మజ్ఞానాన్ని,బ్రహ్మానందాన్నీ ఇవ్వజాలడు. వైరాగ్యం ఒక్కటే నిర్భయత్వాన్ని ప్రసాదిస్తుంది.ఎవరికైతే ప్రియాప్రియములు లేవో వారే బంధనాలు లేనివారై, భగవంతునికి దగ్గరవుతారు.
సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు
0 comments:
Post a Comment