Tuesday, January 12, 2016 By: visalakshi

అవధూతోపాఖ్యానము -1

 ఓం శ్రీ గురుదేవ దత్త నమో నమ:


 మొదట పరబ్రహ్మమొక్కడే ఉంటాడు. 'నేననేక మౌదునుగాక! అని ఆయన సంకల్పించి త్రిగుణాలనాశ్రయించి బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఆవిర్భవించి సృష్టి స్థితిలయాలు చేస్తాడు. ఈ త్రిమూర్తుల ఐక్యతే పరబ్రహ్మతో చేరి గురుతత్వమయింది. కనుక ఈ విశ్వమే గురురూపమని 'గురుగీత ' చెబుతుంది. 

 విశ్వమంతా తమరూపమేనని భక్తులకు ప్రత్యక్షానుభవాన్ని ప్రసాదించగలవారే నిజమయిన తత్వద్రష్టలు,సద్గురువులు. విశ్వమంతా వ్యాపించిన సద్గురు తత్వాన్ని ఎలా గుర్తించవచ్చో సిద్ధుడు నామధారకుడికి అవధూతోపాఖ్యానంతో ఉదహరించాడు.శ్రీ షిర్డీ సాయిబాబా వంటి సద్గురువు ఈ నాటికీ తన భక్తులకట్టి అనుభవాలు ప్రసాదిస్తున్నారు.

  గురు తత్వాన్ని సిద్ధుడు ఇలా ఒక పురాణోపాఖ్యానంతో వివరించాడు:-

" యయాతి పుత్రుడైన యదుమహారాజు ఒకనాడు వేటకు వెళ్ళి ఆ నిర్జనారణ్యంలో కటిక నేలపై పడుకొని ఉన్న ఒక సర్వసంగపరిత్యాగి, సమర్ధుడూ అయిన ఒక అవధూతను చూచి, ఆశ్చర్యపడి ఇలా అడిగాడు: 'స్వామీ! ఆయుష్యము, సంపద, కీర్తి వీటిని కోరి మానవుడు ధర్మార్ధకామాలనే పురుషార్ధాలయందు ఆసక్తుడవుతాడు. మీరు మాత్రము ఆసక్తులు గాలేదు.మీరు శక్తిమంతులు,జ్ఞానులు అనే సంగతి తెలుస్తున్నది. మీరీ నిర్జనారణ్యంలో ఏ కోరికలు లేకుండానే పరమానందంగా ఎలా సంచరించగలుగుతున్నారు?' అపుడా అవధూత లోకశ్రేయస్సుకై ఇలా బోధించాడు: 'నేను 24 మంది గురువుల నుండి జ్ఞానాన్ని గ్రహించి, అనుష్ఠించి, ఆత్మజ్ఞానం పొందాను. దానివల్లనే నిర్హేతుకమూ, శాశ్వతమూ అయిన ఆనందం లభిస్తుంది."నా గురువులెవ్వరో, వారినుండి నేను నేర్చినదేమో యోగ్యుడవైన నీకు వివరిస్తాను.  

నా మొదటి గురువు 'భూమి '..రెండవ గురువు 'వాయువు '..మూడవ గురువు 'ఆకాశము '..నాలుగవ గురువు 'అగ్ని '..ఐదవ గురువు 'సూర్యుడు '..ఆరవ గురువు 'పావురము '..ఏడవ గురువు 'కొండచిలువ '.. ఎనిమిదవ గురువు 'సముద్రము '.. తొమ్మిదవ గురువు 'మిడుత '..పదవ గురువు 'ఏనుగు '..పదకొండవ గురువు 'చీమ '.. పన్నెండవ గురువు 'చేప '..పదమూడవ గురువు 'పింగళ అనే వేశ్య '.. పదునాలుగవ గురువు 'శరకారుడు '..15వ గురువు ' బాలుడు '..16వ గురువు 'చంద్రుడు '..17 వ గురువు 'తేనెటీగ '.. 18 వ గురువు 'లేడి '..19 వ గురువు 'గ్రద్ద '..20 వ గురువు 'ఒక కన్య '.. 21 వ గురువు 'సర్పము '.. 22 వ గురువు 'సాలెపురుగు '.. 23 వ గురువు 'భ్రమరకీటము '..24 వ గురువు 'జలము '.....వీరినుండి అవధూత నేర్చిన జ్ఞానం .......తదుపరి టపాలో....


  సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు

0 comments: