Thursday, January 7, 2016 By: Veda Sri

శ్రీ గురుని సాన్నిధ్యము..(గాణుగాపూర్)

 ఓం శ్రీ దత్తాత్రేయ స్వామియే నమో నమ:
 గాణుగాపూర్ క్షేత్ర మహత్యము:........ భీమ,అమరజా నదుల సంగమం జరిగిన ప్రదెశము. దీనినే "సంగం" అంటారు. ఈ పుణ్య ప్రదేశంలో స్నానమాచరించి  శ్రీ నృసిం హ సరస్వతి స్వామిని దర్శించుకోవాలి. కర్ణాటక యందు  గుల్బర్గా జిల్లాలో సంగమ స్థానమందున్న దివ్య దత్త జాగృతీ స్థానము. ఇచట స్వామి 20 సం"లు తపస్సు చేసి ఎందరో భక్తులను అనుగ్రహించారు. 

 శ్రీ గురువు తృతీయావతారమందు శ్రీ నృసిం హ సరస్వతిగా ప్రసిద్ధి చెంది, ఎందరో దీనులను ఉద్ధరించిరి. భక్తులకు అనేక లీలలు చూపించారు....చూపిస్తున్నారు. అవతారమునకు ధ్యేయమైన జ్ఞానప్రబోధము చేసి ఉన్నారు. కృష్ణానదీతీరమందు సాంగ్లీజిల్లాలో ఔదుంబర క్షేత్రమున,భీమ అమరజాసంగమ స్థానమందున్న 'గాణుగాపురము ' లేక గంధర్వనగరమందును వీరు మనోహర పాదుకలను స్థాపించిరి.శ్రీ నృసిం హ సరస్వతులు నేటికిని తమ భక్తులకు దర్శనమిచ్చుచునే ఉన్నారు.

  పల్లకీ సేవ:- స్వామి వారికి ప్రతిరోజూ రాత్రి సమయమందు పల్లకీ సేవ జరుగును. అందు విశేషంగా భక్తులు పాల్గొందురు. మా అనుభవం..... పల్లకీ సేవ ఎలా ఉంటుందా! అన్న ఉత్సాహముతో మేము ఆరోజు ముందుగా క్షేత్రమును చేరుకొని స్వామిని దర్శించుకొని ఆలయ ప్రాంగణములో కూర్చున్నాము. స్వామిని ఊరేగింపుగా మూడుసార్లు ఆలయము చుట్టూ పల్లకీ సేవను మంగళవాద్యాలతో భక్తి కీర్తనలతో చేస్తారు. భక్తులంతా పడుకొని ఉండగా వారిని దాటుకుంటూ వారి మీదనుండి స్వామిని ఊరేగిస్తారు. దానికై ఎంతో అతృతతో ఎదురు చూసిన మాకు మూడవసారి ఆ అవకాశం లభించింది. మా మీదుగా స్వామి పల్లకిపై వెళుతుంటే ..ఆ అనుభూతితో మేము మైమరచాము భక్తిప్రపత్తులతో స్వామికి వందనాలు అర్పించాము. 

 భిక్ష:- ఈ ప్రసిద్ధ క్షేత్రంలో మధ్యాహ్నము భక్తులు ఒక ఐదుగురి వద్ద బిక్ష తీసుకొని,  తాను మరల ఐదుగురికి బిక్ష సమర్పించాలి.ప్రతిరోజు శ్రీగురుడు ఏదో ఒక రూపంలో వచ్చి భిక్ష తీసుకుంటారుట. అది నాకు అర్ధం కాక ఏమి జరుగుతుందా అని ఎదురు చూస్తున్నాను. అపుడు మావారు ఎక్కిరాల భరద్వాజ గారి గురించి ఇలా చెప్పారు.....వారు గాణుగాపూర్ సందర్శానానికి వచ్చి బిక్షకు ఏ రూపంలో వస్తాడో చూస్తాను. అన్నారుట.ఆయన సంగం లో స్నానమాచరించి వచ్చునంతలో వారికి విపరీతమైన జ్వరం వచ్చి అక్కడ గట్టు మీద పడుకున్నారుట. మెళుకవ వచ్చేసరికి మధ్యాహ్న సమయము మించిపోయిందట.వారు భిక్షకు వచ్చి జోలె ముందుకు చాచగా వారు ఇందాకే కదా వచ్చి భిక్ష తీసుకున్నావు..మరల వచ్చావేమి అని అడుగగా భరద్వాజ గారు 'స్వామీ నా రూపంలో వచ్చావా అని తన్మయులయ్యారట. మేము ప్రసాదము చేయించి మేము వరుసలో భిక్ష వేయుటకు సిద్ధముగా ఉన్నాము. మేము నలుగురం ఉన్నాము . మావారు ఐదుగురికి వేసి వారు భిక్షకై వెళ్ళారు. నేను కూడా ఐదుగురికి వేసి భిక్షకై వెళ్ళాను . నేను ఐదుగురి వద్ద తీసుకొని వచ్చి చూస్తే ప్రసాదము ఇంకా చాలా ఉండడముతో నేను భిక్ష వేస్తాను అన్నాను. సరే అని వేస్తుండగా అందరూ నాకు శ్రీగురుని వలే చిరునవ్వుతో, అడిగి,అడిగి వేయించుకుంటుంటే ఒక తెలియని తన్మయమునకు లోనయ్యాను. ప్రసాదము చివరి వరకు అక్షయ పాత్రలా అందరికీ భిక్ష వచ్చింది. మేము కూడా ఆ ప్రసాదమును స్వీకరించి ధన్యులైనాము.  

ఈ క్షేత్రమునకు ఎక్కువగా వికలాంగులు,మానసిక రోగ పీడితులు, పిచ్చివారు వస్తుంటారు. వారు వచ్చి ఒకసారి సందర్శిస్తే స్వామి సాన్నిధ్యంలో రుగ్మతలు తగ్గి  వారికి ఆరోగ్యం చేకూరుతుందని భక్తుల నమ్మకము. దీనికి అనేకములైన నిదర్శనాలు ఉన్నాయని లోకోక్తి.  

 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు


0 comments: