Thursday, October 1, 2015 By: visalakshi

భక్తుడి మాట భగవంతుడి బాట

  ఓం శ్రీ భక్తవత్సలాయ నమో నమ:

 శ్లో" క్షి ప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్చాంతిం నిగచ్చతి !
       కౌంతేయ! ప్రతిజానీహి న మే భక్త: ప్రణశ్యతి !! ( 9 అ" 34 శ్లో ) 



భగవంతుడు తన భక్తుడి మాటకోసం ఏమైనా చేస్తాడు.తన దాసుడి మాట నిజం కావాలి. తన మాట ఏమైనా ఫరవాలేదు. ఇది భగవంతుడి యొక్క అభిప్రాయం. భక్తుడి మాట భగవంతుడి బాట.    

భగవంతుడితో సకలవిధ బాంధవ్యమూ ఉందన్న విశ్వాసం మనలో ఏర్పడితే చాలు.  


"నా అనుగ్రహాన్ని పొందించే శాస్త్రాన్ని అతిక్రమించని సదాచారము వానిలో నిండేటట్టు చేస్తా! అంటే నన్ను చేరటానికి, విశ్వసించటానికి ఆటంకంగా ఎదురయ్యే పాపరాశినంతటిని కూడా మసి చేసి పారవేస్తా. దాని వలన మనసు లోపలి దోషములు పూర్తిగా తొలగిపోతాయి.
'శ్రీకృష్ణుడు ఆ విషయాన్ని ప్రతిజ్ఞ చేసాడు.' నా మీద ఏర్పడ్డ ప్రేమ విశ్వాసం స్థిరపడేటట్టుగా చేసేస్తాను. కుసంస్కారాలు తొలగి, నా మీద ప్రేమ మనసులో నిండుట అనే శాంతి కలిగేటట్టుగా చేస్తాను."వాడు ధర్మాత్ముడౌతాడు.లోకం ఎంత బాగా ఆరాధిస్తుందంటే 'తిరుప్పాణి అని ఒక ఆళ్వారు .ఆయన మాలదాసరిగా జన్మించినా భగవత్ భక్తి,విశ్వాసం పరిపూర్ణంగా అతడిలో నిండేసరికి భగవంతుడు అతడిని కొండంతగా ప్రేమించాడు.  ఆయనంటాడూ.."నాలో ఉండే లోపాల్ని తొలగించి నీ ఆంతరంగిక కైంకర్యాన్ని ప్రసాదించేటంత ఔన్నత్యాన్ని కల్గించావా తండ్రీ!"అని.

 హే! కౌంతేయా! కుంతీపుత్రా! నీవు ప్రతిజ్ఞ చేయవయ్యా!ఏం చెయ్యమంటావు కృష్ణా! అని అడిగాడు అర్జునుడు.నా భక్తుడు ఎన్నటికీ చెడడు.అంటే కృష్ణ భక్తుడు ఎన్నటికీ చెడడని ప్రతిజ్ఞపూను.నేనెందుకయ్యా ప్రతిజ్ఞ చేయడం? నీ భక్తుడు చెడడని కావాలంటే నీవు చెప్పు అని అన్నాడు అర్జునుడు.

"అర్జునా! విను..రామావతారంలో నేను ప్రతిజ్ఞ చేస్తే నిలబడతా! కానీ కృష్ణావతారంలో , నా ప్రతిజ్ఞకంటే భక్తుడి మాటకే నేను ఎక్కువ ప్రాధాన్యమిస్తాను అన్నాడు. భీష్ముడు ఒక ప్రతిన పూనాడు. కృష్ణుడు ఒక ప్రతిన పూనాడు. 'ఆయుధం పట్టనన్నాడు కృష్ణుడు.' పట్టిస్తానన్నాడు భీష్ముడు దుర్యోధనుడి దగ్గర. ఇద్దరూ దుర్యొధనుడి దగ్గరే చేస్తారు ఈ ప్రతిజ్ఞలు.దానికతడే సాక్షి. అది తెలిసి శ్రీ కృష్ణుడు "భీష్ముడి మాట నిజం చేయడమే తన కర్తవ్యం"అనుకున్నాడు.అందుకోసమే భారత సంగ్రామం జరిగేటప్పుడు ఎన్నో సందర్భాలలో ఆయుధం పట్టాడు. జయద్రధ   సం హారం చేయించడం కోసం తాను చక్రం పట్టాడు. 

భీష్ముడు యుద్ధంలో 11 వ రోజున అతి తీవ్రమైన పోరుసల్పుతుంటే అర్జునుడు నిర్వీర్యుడైపోతే, ఆ అర్జనుడిని కాపాడే వంకతో చక్రం చేతపట్టి ఒక్కసారి దూకాడు. ఆవేళ భీష్ముడు "కృష్ణా! నేను గెలిచాను" అన్నాడు ఆయన. ఎందుకని? ఎందుకంటే "స్వనిగమమపహాయ ప్రతిజ్ఞాం    ఋతమధికర్తుం అవప్లుతో రధస్థ:"నేను నిన్ను చక్రం పట్టిస్తాను అని అన్నానని నా మాట నిజం చేయడం కోసం నీమాటను వదిలేసుకొని చక్రం చేతపట్టి క్రిందకు దూకావా తండ్రీ! అని ప్రార్ధన చేస్తాడు.

 అనుక్షణం నా భక్తులను కాపాడుకుంటూ ఉంటాను. "అర్జునా! నీవు ప్రతిజ్ఞ చేయి. ఈ లోకంలో నీ ప్రతిజ్ఞను నిలబెట్టటం కోసం నేను ఏవైనా చేస్తాను." భగవంతుడి యొక్క రక్షణ దీక్ష అంత గొప్పది. ఆయనయొక్క శాశ్వతమైన రక్షణ మనకు నిరంతరం ఉంటుందని స్వామి ప్రతిన పూనారు. ఆయన ప్రతినను విశ్వసిద్దాం. భక్తి ప్రపత్తులతో భగవంతుడి బాటలో నడుద్దాం...


 సర్వం శ్రీ సాయి కృష్ణార్పణ మస్తు









0 comments: