Saturday, August 1, 2015 By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 79 (గురు సుబోధ)

ఓం బహురూప విశ్వమూర్తయే నమో నమ:




 శ్లో" సర్వశ్రుతి శిరోరత్న సముద్భాషిత మూర్తయే !
    వేదాంత అంబుజ సూర్యాయ తస్మై శ్రీ గురవే నమ: !!

    శోషణం భవసిందోశ్చ ప్రాపణం సారసంపద !
  యస్య పాదోదకం సమ్యక్ తస్మై శ్రీ గురవే నమ: !!

భా: సకల వేదాంత శిరోరత్నభూషితుడై ప్రకాశించువాడు, వేదాంతపద్మాన్ని వికసింపజేసే జ్ఞానసూర్యుడు అయిన సద్గురువుకు వందనములు.
ఎవరి కృపాకటాక్షంతో సంసార సాగరం పూర్తిగా శోషించి, అనంత జ్ఞాననిధి ప్రాప్తిస్తుందో అలాంటి సద్గురువుకు వందనములు.     (గురుస్తోత్రం )  



"గురుదేవుని మించిన సత్యవస్తువు ఇంకొకటి లేదు." 
గురుసేవను మించిన తపస్సు, గురుబోధను మించిన జ్ఞానం లేదు.
గురువు సర్వదేవమయుడు.
గురుకరుణ లేనిచో విషయత్యాగం, తత్వదర్శనం, సహజావస్థ- అన్నీ దుర్లభమే అవుతాయి.
"మనలో సంకుచితపు చాయలు, అహంభావపు నీడలు లేకుండా,మనలో లోపాలను సరిజేసుకుంటూ,మనస్సును శుద్ధంగా ఉంచే ప్రయత్నం చేసినప్పుడే గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది."  




' గురువు 'ను గురించి ఒక సభలో ఒకానొక శ్రేష్ఠభక్తుడు ప్రసంగిస్తూ ముందుగా గురుస్తోత్రం చేయదలచి, గురువును సూర్యునితో పోల్చాలని అనుకున్నాడు. అయితే సూర్యుడు బాహ్యంగా ప్రకాశాన్ని అందిస్తాడు, కానీ గురువు మనస్సులో నిఘూడంగా ఉన్న అజ్ఞానతమస్సును పారద్రోలగల సమర్ధుడు.సూర్యుడు దట్టమైన మబ్బులున్నప్పుడూ, గ్రహణ సమయంలోనూ, రాత్రులందూ కనుమరుగవుతాడు. కానీ గురువు ఎటువంటి ఆవరణము లేకుండా, ఎల్లవేళలా నిత్యప్రకాశవంతుడైనవాడు. కనుక గురువు సూర్యుని కంటే గొప్పవాడు అని సభికులకు తెలియజేశాడు.

చంద్రునితో పోల్చాలన్నా, చంద్రుడు వృద్ధి క్షయాలను కలిగి ఉండి,కృష్ణపక్షంలో కనుమరుగవుతున్నాడు.చంద్రునిలో కళంకం ఉంది.కానీ గురువు వృద్ధి క్షయాలు లేనివాడు,పరిపూర్ణుడు, నిష్కళంకుడు.ఎలావేళలా ప్రసన్నుడు, స్వయంప్రకాశకుడు. కనుక గురువు చంద్రుని కంటే గొప్పవాడు.

అనంత సాగరమైన సముద్రంతో పోల్చాలన్నా,సముద్రం అగాధంగా కనిపిస్తున్నా, దానిలోతు తెలుసుకోదగినదే.కానీ గురుదేవుల కటాక్షపులోతు తెలుసుకోలేనిది. అంతు పట్టనిది.సముద్రగర్భంలో లౌకికవిలువ కలిగిన ముత్యాలు,రత్నాలు ఉండగా, గురుదేవుల హృదయం కరుణరసమనే రత్నాలతోనూ,సహనమనే ముత్యాలతోనూ,వైరాగ్యమనే పగడాలతోనూ నిండి ఉండివెలకట్టలేని రీతిలో అలరారుతోంది.కనుక సముద్రం కంటే కూడా గురువే గొప్పవాడు.

అగ్నితో పోలుద్దామంటే అగ్ని స్థూలమైన వాటినే దహించగలదు.కానీ గురువు సూక్ష్మంగా, జన్మ జన్మాంతరాలుగా ఉన్న కర్మరాశులనన్నింటినీ, తన జ్ఞాన దృష్టితో భస్మం చేయగలవాడు.కనుక అగ్ని కంటే గురువే గొప్పవాడు.ఇంక సృష్టి,స్థితి,లయకారకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పోలుద్దామన్నా, ఆ మూడుకార్యాలు నిత్య సత్యమై ఉన్న ఏకమైన పరబ్రహ్మశక్తి వల్ల జరుగుతున్నాయి. అట్టి శక్తిని కలిగి ఉండి,గుణత్రయాతీతుడు,పరబ్రహ్మ స్వరూపుడైనవాడు 'గురువు 'అని పలికి ఆ పరమభక్తుడు మౌనంగా గురువుకు నమస్సులు అర్పించాడు.

"గురువు ఎడల ఇటువంటి శ్రద్ధ, విశ్వాసం ఉన్న సాధకునికి గురువు ఆదేశాలు నిత్యానుష్ఠానాలై అలరారుతాయి. అట్టివారి జన్మ చరితార్ధమవుతుంది.గురువును అటువంటి భక్తి ప్రపత్తులతో శ్రద్ధగా అర్చించి, వారి మనస్సు ప్రసన్నత పొందే విధంగా వారి ఆజ్ఞలను పాటిస్తూ, ఆదేశాలను అనుకరిస్తూ, వారి అడుగుజాడలలో నడుస్తూ, గురుదేవుల కరుణ, అనుగ్రహం సర్వులూ అందుకోగల స్థితిని ఆశిద్దాం."

సాయి గురుదేవుల ఆజ్ఞలను శిరసావహించడమే "గురుపౌర్ణమి"నాడు మా సత్సంగ కుటుంబం సమర్పించుకున్న మన:పూర్వకమైన "దక్షిణ".

సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు 



1 comments:

bharati said...

okappati 'gurubhakti mahima' anna postnu smarinchukunnaanu, mee post chadivi.

mee satsanga kutumbam samarpinche dakshina adbhutam.