Saturday, September 27, 2014 By: Veda Sri

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం _ 67

ఓం సమర్ధ సద్గురు శ్రీసాయినాధాయ నమ:


శ్లో" మధులుబ్ధౌ యధాభృంగ: పుష్పాత్ పుష్పంతరం వ్రజేత్!

  జ్ఞానలుబ్ధ స్తధాశిష్యో గురోర్గుర్వంతం వ్రజేత్!! మధువునందు ప్రీతిగల తేనెటీగ పుష్పము నుండి పుష్పమునకు తిరిగి మధువును సంపాదించినట్లు, ముముక్షువైన శిష్యుడు పలువురు గురువులను దర్శించి, వారినుండి జ్ఞానమును సంపాదింపవలెను.

శ్రీమధ్భాగవతంలో అవధూత తాను 24 మంది గురువులనుండి జ్ఞానమార్జించినట్లు చెబుతారు.

భగవాన్ శ్రీరమణ మహర్షి వంటి ఆత్మవేత్తలు, మహనీయుల సందర్శన సేవా - సాంగత్యములెంతో శక్తివంతములైనవనీ,పవిత్రమైనవనీ చెప్పారు.

శ్రీ సాయినాధుని గురువు కూడా మొదట అడవిలో వారికి కనిపించి "భగవంతుని కృపలేక ఎవ్వరూ మా వంటివారిని మార్గంలో కలవలేరు" అంటారు.

దేవ, గురు, ప్రాజ్ఞ దర్శన సేవనాదులు ముముక్షువుకు ఆవశ్యమని శ్రీమద్భగవద్గీత చెబుతుంది.

గురుకరస్పర్శ ప్రభావము 

సంసారమను సాగరములో జీవుడనెడి యోడను సద్గురుడే సరంగుయై నడుపునప్పుడు అది సులభముగను సురక్షితముగను గమ్యమును చేరును.

సద్గురువనగానే నా కండ్ల ఎదుట సాయిబాబా నిలచియున్నట్లు, నా నుదుట ఊదీ పెట్టుచున్నట్లు, నా శిరస్సుపై చేయివేసి ఆశీర్వదించుచున్నట్లు పొడముచున్నది. నా మనస్సు సంతోషముతో నిండిపోయి, కండ్లనుండి ప్రేమ పొంగి పొరలుచున్నది. గురుహస్తస్పర్శ మహిమ అద్భుతమైనది.

ప్రళయాగ్నిచే కూడా కాలనట్టి వాసనామయమైన సూక్ష్మశరీరము గురుకరస్పర్శ తగులగనే భస్మమైపోవును; అనేకజన్మార్జిత పాపసంచయము పటాపంచలైపోవును. ఆధ్యాత్మికసంబంధమైన విషయములు వినుటకే విసుగుపడువారి వాక్కు కూడా నెమ్మది పొందును.

శ్రీసాయి సుందరరూపము కాంచుటతోడనే కంఠము ఆనందాతిరేకముతో గద్గదమగును;కన్నులనుండి ఆనందాశ్రువులు పొంగిపొరలును;హృదయము భావోద్రేకముతోయుక్కిరిబిక్కిరియగును.'నేనేతాన'ను(పరబ్రహ్మస్వరూపమను) స్ఫురణ మేల్కొని,ఆత్మసాక్షాత్కారానందమును కలిగించును.'నేనునీవు ' అను బేధభావమును తొలగించి బ్రహ్మైక్యానుభవమును సిద్ధింపజేయును. 

తదుపరి అధ్యాయములో శ్రీ సాయి అంతర్యామిత్వము..అద్భుతములను తెలుసుకుందాము.       సశేషం...

సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు.
2 comments:

భారతి said...

గురుర్దేవో గురుర్ధర్మో గురౌ నిష్టా పరం తపః
గురో: పరతరం నాస్తి త్రివారం కధయామి తే //
ఇది శివుడు పార్వతీదేవికి చెప్పినది.

Veda Sri said...

ధన్యవాదములు భారతిగారూ!మీ వ్యాక్య చూస్తే మిమ్మల్ని కలిసినంత ఆనందంగా ఉంది.

"గురు" అను రెండక్షరములే మహా మంత్రము. గురు పాదారవిందమే అనన్య శరణ్యమని నమ్మి సదా ఉపాసించుచున్న దాని కంటే వేరొక భాగ్యవంతుడులేడు.అతడే ధన్యుడు, కృతార్ధుడు.గురుని ఏ విధంగా ఉపాసించి సేవించి తరించవలెనో పరమశివుడు, పార్వతీదేవికి చెప్పిన గురుగీత.