Thursday, February 13, 2025 0 comments By: visalakshi

శుద్ధ భక్తి...

 


#శుద్ధ భక్తికి ముగ్ధుడైన పూరి జగన్నాథుడు ....

[కళ్ళలో ఆనందభాష్పాలు తెప్పించే కృష్ణుడి లీల] ...

  

బంధు మహంతి అతని భార్య , ఇద్దరు మగపిల్లలు భోజనం చేయక 2 రోజులు అయ్యింది. వర్షాలు లేక  కరువుకు బలి అయిన పేద కుటుంబం అతనిది. ఒడిషాలోని కటక్ మరియు బాలాసోర్ మధ్య వున్న జాజ్పూర్ లో భిక్షమెత్తుకొని  వచ్చిన కొంత అన్నాన్ని పిల్లలకు పెట్టి తాను  తన భార్య ఇంకా మిగిలివున్న చెట్ల యొక్క ఆకులు తింటూ బ్రతుకుతున్నాడు బంధు మహంతి. 


భార్య కంట తడిపెట్టినప్పుడల్లా బంధు ఇలా అనేవాడు '' ఏడవకు. నాకు పూరి నగరంలో ఒక ధనవంతుడైన స్నేహితుడున్నాడు. చాలా మంచివాడు. ఎవరు ఏ సహాయం అడిగినా అతను కాదనడు. మనకూ అతను సహాయం చేస్తాడులే''. 


ఒకరోజు భార్య ''మనం మీ  స్నేహితుడిదగ్గరికెళ్ళి మన దీనావస్థను చెప్పుకొందాం. ఇంకా ఆలస్యం చేస్తే పిల్లలు చనిపోతారు , '' అంటే బంధు మహంతి భార్య  పిల్లల్ని తీసుకొని  144 కి.మీ. దూరం లో వున్న పూరి నగరానికి బయలుదేరాడు. మధ్య దారిలో అడవి వస్తుంది. 


1530 వ సంవత్సరం లో నాలుగురోజులు కాలినడకన ప్రయాణించి బంధు మహంతి పురి నగరం చేరాడు. రాత్రి అయ్యింది. '' ఇపుడు నా స్నేహితుడు నిద్ర పోతుంటాడు. నిద్రా భంగం చేయడం మంచిది కాదు. ఉదయం ఆయన ఇంటికి వెళదాం '' అన్నాడు బంధు.


ఆమె సరే అంటూనే '' ఇపుడు పిల్లలకు తినడానికేమీ లేదు. వాళ్లు ఆకలికి ఏడుస్తున్నారు '' అని అంటే అపుడు బంధు '' చూడు , మనం ఇపుడు పూరి జగన్నాథుడి మందిర ప్రాంగణంలోవున్నాం. గుడి తలుపులు మూసేసారు అయినా ఒకసారి ఆ తలుపులనే చూసి వద్దాం అంటూ భార్యా పిల్లల్ని తీసుకొని ద్వారం బయటే నిలబడి కృష్ణ భగవానుడిని ప్రార్థించాడు . ఆరాత్రి అతను చేసిన ప్రార్థన ఎంత గొప్పదంటే సమస్త పురాణాల సారమంతా అందులో వుంది :  


'' ప్రభూ , నేను నీ భక్తుడిని . నీవు తప్ప నాకు ఎవరు దిక్కు ? నేను కటిక పేదవాడిని. నేను ఆకలితో వున్నాను. అయినా నాకు బాధ లేదు. కానీ నా భార్య , పిల్లలు ఆకలితో మరణిస్తారేమో. నేను ఇన్ని రోజులూ నా భార్యకు 'నాకో స్నేహితుడున్నాడు, అతను మనకు సహాయం చేస్తున్నాడు' అని చెపుతూ వస్తున్నాను. 


కానీ ఆమెకు తెలియదు నీవే ఆ స్నేహితుడని. ఇపుడు వాళ్ళ ఆకలి తీరలేదు, ఏ సహాయం అందలేదు అనుకో, ఆమెకు నీవు వున్నావు అనే విశ్వాసం పోతుంది. నేనది భరించలేను. నా మాటలు నమ్మి నీమీద నమ్మకం పెట్టుకొన్న ఆమెను నిరాశ పరచొద్దు. నీవు వున్నావు , నీవు ఇదంతా చూస్తున్నావు. ఇది నా నమ్మకం. ఆతరువాత నీ ఇష్టం. '' 


వాపసు వచ్చి ఆలయ ప్రాంగణంలో కుండల్లో పెట్టిన నీరు త్రాగి అక్కడే పడుకొన్నారు. మధ్యరాత్రి అయ్యింది. ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన బ్రాహ్మణ రూపంలో వున్నాడు. బంధు మహంతి భార్య కళ్ళు మూస్కొన్నది కానీ నిద్రపట్టలేదు. చిన్నగా చప్పుడైతే లేచి కూర్చొంది. ఆ బ్రాహ్మణుడు ఒక పెద్ద పళ్ళెంలో కమ్మని పదార్థాలను ఆమె ముందు పెట్టాడు. ఆమె భావోద్వేగంతో పళ్ళెం అందుకొన్నది. ఆయన వెళ్ళిపోయాడు. 


ఆమె బంధును, పిల్లల్ని నిద్రలేపి 'ఒక బ్రాహ్మణుడు వచ్చి ఇది ఇచ్చిపోయాడు ' అని చెప్పింది. బంధు అన్నాడు 'నేను చెప్పాను కదా? నా స్నేహితుడు చాలా మంచివాడు అని. అతనే పంపివుంటాడు.' ఆ రాత్రి జగన్నాథుడే స్వయంగా అందించిన ఆహారాన్ని ఆ పేద భక్త కుటుంబం సంతోషంగా తిని , ఆ పళ్ళాన్ని కడిగి గుడ్డ సంచిలో పెట్టి నిద్ర పోయారు. 


కథ అయిపోయిందా? లేదు . ఇపుడు మొదలౌతుంది. 


తెల్లవారింది. జగన్నాథ దేవాలయం అర్చకులు మందిరం తలుపు తెరచి , స్వామి విగ్రహానికి నీళ్ళతో అభిషేకించి , అలంకరించబోతుంటే అక్కడుండాల్సిన బంగారు పళ్లెం లేదు. నిమిషాల్లో వార్త అందరికీ తెలిసిపోయింది.   ఇంతలో ఆలయంలో పనిచేసే ఒక వ్యక్తి బంధు దగ్గర బంగారు పళ్ళెం వుండటాన్ని చూసి , అధికారులకు చెప్పాడు. 


వాళ్ళు అర్చకులతో కలిసివచ్చి బంధును పట్టుకొని కొట్టడం మొదలుపెట్టారు. బంధు  ఏమీ మాట్లాడటం లేదు. కళ్ళు మూసుకొని దెబ్బలు తింటూనే మనసులో ' నేను దొంగను అని వీళ్లు నన్ను కొట్టినంతమాత్రాన, నీపై నాకున్న నమ్మకం పోతుందా? నీవు వున్నావు, ఇదంతా చూస్తున్నావు ' అని జగన్నాథుడైన  కృష్ణుడితో అంటున్నాడు. 


అతని భార్య మాత్రం ఏడ్చుకొంటూ ' ఆయన్ని కొట్టకండి. ఆయనకు ఏమీ తెలియదు. నిన్నరాత్రి ఒక  బ్రాహ్మణుడు వచ్చి ఈపళ్ళెంలో నాకు ఆహారం ఇచ్చి వెళ్ళిపోయాడు. మేము దొంగలం కాదు,'' అని  అంటున్నా వాళ్ళు వదల్లేదు. బంధును తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఆలయప్రాంగణంలో ఒక చెట్టు క్రింద ఏడ్చి ఏడ్చి పిల్లలను గుండెలకు హత్తుకొని బంధు భార్య సొమ్మసిల్లి పడిపోయింది. 


రాత్రి అయ్యింది. పూరి నగరంలోవున్న అప్పటి రాజు ప్రతాపరుద్రుడికి మధ్యరాత్రి ఒక కల వచ్చింది. '' అక్కడ నా భక్తుడు చెరసాలలో బాధపడుతుంటే , ఇక్కడ నీవు హాయిగా నిద్రపోతున్నావా ? అతను నాకు నిజమైన భక్తుడు. అతను నిరపరాధి. అతనికి బంగారు పళ్ళెంలో ఆహారాన్ని ఇచ్చింది నేనే , '' అని స్పష్టంగా ఎవరో చెప్పారు. ఆయన కాక ఇంకెవరు చెప్పివుంటారు ?


ఆ క్షణమే ప్రతాపరుద్రుడు జగన్నాథ మందిరానికి వెళ్ళి , అధికారులందరినీ రమ్మని ఆదేశించాడు. బంధు భార్య గురించి అక్కడివారు రాజుకు చెప్పారు. వారినీ అక్కడికి తీసుకురండి చెప్పి , స్వయంగా ప్రతాపరుద్ర రాజే జైలు గదికి వెళ్ళి , తాళాలు తీయించాడు. ఆ తరువాత ఆయన చేసిన పని అక్కడున్న వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. 


ఒడిషా మహారాజు అయిన ప్రతాపరుద్రుడు ,  బంధు మహంతి కాళ్ళకు సాష్టాంగ ప్రమాణం చేసాడు. అంతే కాదు , అక్కడిక్కడే బంధు మహంతిని పూరి జగన్నాథ మందిరపు వంటశాలకు ప్రధాన వంటవాడి గా నియమించాడు. అదొక్కటే కాదు , బంధు మహంతి కుటుంబానికి జగన్నాథ  దేవాలయం యొక్క ప్రధాన వంటవాళ్ళు గా శాశ్వత హక్కులు కల్పించాడు.ఇప్పటికీ బంధు మహంతి కుటుంబమే 494 సంవత్సరాలుగా జగన్నాథ దేవాలయంలో వంటపనిని నిర్వహిస్తున్నారు.


నమ్మక బాగుపడినవారు.. లేరు .. నమ్మి చెడినవారు లేరు.

.

..జై.. జగన్నాధ్ ....

నేటి వివాహవ్యవస్థ ....

                           ఓం శ్రీ మాత్రే నమః...


                                

                                    వివాహం....

బంధువులు.. ఆప్తులు...మిత్రుల సందడితో..ముక్కోటి దేవతలు ఆశీర్వాదం తో వేదోచ్ఛారణ మంత్రాలతో... భాజా భజంత్రీలతో అపురూపంగా జరిగే పెళ్లి వేడుక...నూతన వధూవరులు కోటి ఆశలతో ఒకటయ్యి...సంసారం లోకి అడుగిడుతున్నారు... ఇంత వరకు సజావుగా సాగిన వీరి జంట చిన్న చిన్న తగవులతో. మొదలయ్యి...తారాస్థాయికి గొడవలు జరుగుతున్నాయి..ఈ రోజుల్లో... స్వతంత్ర భావాలతో ఎవరికి వారు సంపాదనాపరులై వ్యక్తిత్వంతో గౌరవం గా మెలుగుతున్నారు..కానీ విలువలు లేని జీవితాన్ని కొనసాగిస్తున్నారు....కొందరు కొన్ని సంవత్సరాలుగా జంటగా కనిపిస్తున్నా ఇన్నర్ గా గొడవలు... ఒక స్టేజ్ లో విపరీత మానసిక స్ట్రగుల్ తో ఇరువురు ద్వేషాలతో పరుష పదాలతో వారిని వారు అందరి ముందు చులకన చేసుకుంటున్నారు... కొందరు మిత్రులు వారిని సమర్ధిస్తూ వారి గొడవలను పెంచుతారు .వైవాహిక బంధం.. మరియు జీవనానికి ఒకరికి ఒకరు కట్టుబడి ఉండట్లేదు సరికదా!నేను నీకు లోబడి ఉండను అనే వైఖరి కొన్ని జంటలలో చూస్తున్నాం...చిన్న చిన్న విషయాలకే విడాకులు దాకా... స్వతంత్ర జీవనం కావాలి.. ఇరువురికీ...పిల్లల భవిష్యత్ కోసం ఆగాం కానీ అంటూ ఈనాటి మహిళల ఆవేదన...భార్యాభర్తల ఇగో లతో కుటుంబ వ్యవస్థలో అపార్ధాలతో..అవమానించుకుంటూ పెద్ద వారికి తెలియకుండా వారిని లెక్కచేయకుండా.. స్వంత నిర్ణయాలతో జీవితాన్ని దుఃఖమయం చేసుకుంటున్నారు.

ఇలా నేను ఈ విషయం రాద్దాం అని ఒక పేరా రాసాను.. ఈరోజు whatsapp లో ప్రస్తుత పరిస్థితి అని ఒక లాంగ్ మెసేజ్ వచ్చింది.. చదివాను..కొంచం కఠినంగా ఎవరో రాసినా నిజమే కదా అని కింద కాపీ చేసాను...లాస్ట్ కొద్దిగా ముగింపు నేను రాసాను....


*ప్రస్తుత  పరిస్థితి*

------------------------------------------------

 *కోడళ్ళ కోసం పరితపిస్తున్న పేరెంట్స్...అర్హత లేకున్నా అందలం ఎక్కుతున్న అమ్మాయిలు!! కొడుకు కు ముప్ఫై ఏళ్ల లోపు పెళ్లి కాకుంటే ఆజన్మ బ్రహ్మా చారిగా ఉంటాడనే బెంగ తల్లి దండ్రులను పట్టి పీడిస్తుంది...ఎక్కడ చూసినా మహిళా జనాభా ఎక్కువైనా కూడా ముప్ఫై ఏళ్ల వరకు అమ్మాయిలు కూడా పెళ్లి ధ్యాస లేకుండా ఉద్యోగం లో ఎదుగుదల కోసం ...మరియు సమాన స్థితిలో కాబోయే భర్త ఉండాలని సమాజంలో ఉన్నత స్థాయిలో ఆ జంట ఉండాలనే పెళ్లి  ఆలస్యం గా చేసుకుంటున్నారు అమ్మాయిలు.  ఈ తరం అమ్మాయిలు చెట్టు ఎక్కి మరి పిల్లవాడి రేజ్యూం చూసి పెదవి విరవడంతో ఒక అమ్మాయికి పదిమంది నిష్పత్తి చొప్పున పెళ్లి చూపుల పరంపర కొనసాగుతూనే ఉంది!! అబ్బాయిలు బెండకాయ ముదిరినట్టు ముదిరి పోతున్న పెళ్లి జాడ లేక విలవిల లాడి పోతున్నారు...అమ్మాయిల డిమాండ్ కన్నా ఆమెను కన్న పేరెంట్స్ కోరికలు చాంతాడు అంత ఉండడం తో పెళ్ళి కొడుకులు క్యూ కడుతున్నారు...వాడికి పర్మినెంట్ జాబు ఉండాలి ఒక ఐదెకరాల పొలం ఉండాలి...హైదరాబాద్ లో కోటి రూపాయల అపార్ట్మెంట్ ఉండాలి...అమ్మాయి మెళ్ళో ఇరవై ఐదు తులాల బంగారం వేయాలి...పెద్ద వివాహ వేదిక లో వెయ్యి మందికి భోజనం పెట్టాలి... ఆన్న డిమాండ్ ముందు ఉంచడమే కాకుండా అమ్మాయి పెళ్లి అయ్యాకా కూడా జాబ్ చేస్తే ఆ అమ్మాయి సంపాదన తల్లి దండ్రులకు చెందాలి  ఆన్న ప్రధాన డిమాండ్ల ను తలవొగ్గి పెళ్లి పీటల మీద కు అమ్మాయి వచ్చే వరకు వణుకుతూ పెళ్లి పనులు చేసే మగ పెళ్లి వారి బాధలు ఏ పగ వాడికి కూడా వద్దు! ఒక్క తెలుగు రాష్ట్రాల లోనే కాదు దేశం మొత్తం మీద అమ్మాయిల కోరికలు గుర్రాలు అయి పరిగెడుతుంటే భవిష్యత్ భారతంలో వివాహ వ్యవస్థ ఉంటుందా లేక *సహాజీవన వ్యవస్థ* గా మారిపోతుందా అనే భయం విద్యాధికులకు, సంప్రదాయ వాదులకు పట్టుకుంది..ఎందుకంటే కాలేజీ దాటగానే ఉద్యోగం ఆఫర్ రావడంతో ఇరవై ఐదేళ్ళకే అమ్మాయిలకు ముప్ఫై వేల ఉద్యోగం దొరకడం...మూడేళ్లలో అది రెట్టింపు కావడంతో సొంత కారు...కావాల్సిన కాస్మెటిక్స్...మాడ్రన్ దుస్తులతో కార్పోరేట్ కల్చర్ లోకి వెళ్లి పోతున్న అమ్మాయిలు...పెళ్లి ధ్యాస మరిచి రంగుల ప్రపంచం లో విహరిస్తూ *ఆడింది ఆట పాడింది పాట* జీవితం కొనసాగుతుంటే, పెళ్లి మీద ద్యాస ఎందుకుంటుంది?!...దానికి తోడు అమ్మాయిల కొలీగ్స్ లలో ఇద్దరో  ముగ్గురో డైవర్స్ కేసులు ఉంటే వాళ్ళ ప్రభావం వీళ్ళ మీద పడి, "పెళ్లి  చేసుకొని వాడి చెప్పిన మాట వినే కన్నా సోలో లైఫ్ బెటర్" అనే అమ్మాయిల సైకాలజీ వల్ల పెళ్ళిళ్ళు అటు మొగవారికి ఇటు ఆడవారికి సరియైన వయసులో జరగపోవడం, దానికి తోడు అబ్బాయి *మంచి వాడా చెడ్డవాడా* అని  తెలుసుకోవడానికి ఆర్నెల్లు *సహజీవన యాత్రలు* చేసి రావడంతో మోజు తీరి మరో *ఎర్నర్* కోసం వెతుకుతున్న ఈ తరం యువతుల వల్ల వివాహ వ్యవస్థ పెద్ద కుదుపునకు లోనవుతుంది...*కులం చెడ్డ సుఖం దక్కాలనే* పెద్దల మాట పెడచెవిన పెట్టి, రంగు రూపు చూసి వాడి బుట్టలో పడి రిజిష్టర్ మ్యారేజ్ చేసుకొని వాడు *సకల కళా వల్లభుడు* అని తెలుసుకొని అమ్మ గారి ఇంటికి చేరుకుని లబోదిబోమంటే పోయిన మృదుత్వం వస్తుందా?! ఇలా ముప్ఫై ఏళ్లు గడిచాకా డబ్బున్న ఏజ్ బార్ వాడు దొరికితే వాడితో నైనా సరిగా సంసారం చేస్తుందా అంటే అదీ లేదు! పిల్లలు పుడితే అందం ఎక్కడ మసి బారుతుందో అని ముప్ఫై ఐదేళ్ల వరకు పిల్లలు కనకుండా టాబ్లెట్లు మింగే అమ్మాయిల అతి ప్రవర్తన వల్ల మనవలు - మనవరాళ్లు కావాలనుకునే  పేరెంట్స్ ఆశలు అడియాశలు అయి పోతున్నాయి...2024 లో యువతుల *పెళ్లి సందడి* ముప్ఫై ఏళ్ళు దాటుతుంది అంటే అమ్మాయిల్లో పెళ్లి ద్యాస కన్నా సంపాదన ద్యాస ఎక్కువగా ఉందనే విషయం తేట తెల్లమవుతుంది...! ఏ వయసులో ఆ వయసు ముచ్చట తీరాలని పెద్దలు ఊరికే అనలేదు...అది లేకే నేటి పిల్లల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నాయి...ఎంత మంచి ముహూర్తం పెట్టినా కూడా పెళ్ళిళ్ళు మూడు నాళ్ళ ముచ్చటగా కావడానికి ఆడపిల్లల తండ్రులు మొదటి కారణం కాగా *పిల్లవాడు సెటిల్* కాలేదు...అని అబ్బాయి ఆదాయం పై ఆశలు పెంచుకున్న తల్లిదండ్రులు రెండో కారణం! ముప్ఫై ఏళ్ల వరకు మహా అయితే అదా చేసుకుంటే యాభై లక్షలు ఉంటాయి కాబోలు *కోటి* ఆశలు తల్లి దండ్రులు ఉంటే ఆ కోటి వచ్చేసరికి నెత్తి మీద జుట్టు ఊడి పోతూ లేక...చిక్కి శల్యమైన *అతన్ని* ఏ పిల్ల పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తుంది?...ఆడపిల్లలు అందరూ మహేష్ బాబు లాంటి అబ్బాయి...ఆయన లా ఆడి కారు ఉండాలని కోరుకోవడంలో  తప్పులేదు.... కానీ అలాంటి వరుడు వేటలో ఉన్న ఎంపిక అయ్యే సరికి ఈడు పోయి అనాకారి దొరికితే వాళ్ళ ఆశలు అడి యాశలు అయి పెళ్లయిన ఏడాదికే కోర్టు మెట్లు ఎక్కుతూ డైవర్స్ ఆట మొదలు పెడుతున్నారు!🌷🌷🌷🌷🌷🌷🌷ఇక పవిత్ర భారత దేశంలో ఇప్పుడు అత్తల ఆరళ్ళ కన్నా కోడళ్ళ ఆరళ్ళు ఎక్కువవుతున్నాయి...   పెళ్లయిన ఆర్నేళ్ళకే వేరు కాపురం పెట్టి, అత్త మామలు రాకుండా సూటి పోటి మాటలు అంటూ దూరం పెడుతున్న వనితల అతి ప్రవర్తన వల్ల కుటుంబ వ్యవస్థ బీటలు వారిపోయింది...వృద్ధాప్యంలో కొడుకు కన్నా ఇంటి ముందు శునకం పెంచుకోవడం బెటర్ అనే మైండ్ సెట్ లో ఓల్డ్ ఏజ్    పేరెంట్స్ ఉంటున్నారు...పొరపాటున ఆడపిల్లల కన్న తల్లి దండ్రులు కూడా అటు అల్లుడి పంచన చేరలేక...చేరినా కూడా అక్కడ అడ్జెస్ట్ కాలేక మానసిక వేదన తో కుమిలి  పోతున్నారు...ఇక ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్లు ఉన్న ఇంట్లో.... పేరెంట్స్ బాధ వర్ణనాతీతం...ఆస్తుల పంచాయతీలు ఒక వైపు ఆదరణ లేక *వృద్ధ పక్షులు* ఒకరికి ఒకరై ఓదార్చు కుంటూ దేవుడు ఎప్పుడు తీసుకు వెళ్తాడా? అని ఎదురు చూస్తున్నారు! పదేళ్లు ఎత్తుకొని కాలికి ముల్లు అంటకుండా పెంచిన పిల్లలు...సంపాదన పరులు అయ్యాక తల్లి దండ్రులకు మంచి చెప్పులు కూడా కొనివ్వని దౌర్భాగ్య పరిస్థితి నేడు కనబడుతుంది...! నాలుగు రోజులు పెద్ద కొడుకు...నాలుగు రోజులు బిడ్డ దగ్గర ఉంటే వాళ్లకేం తోడి పెడుతున్నారని కొడుకు - కోడళ్ళ వేధింపులతో ఒంటరి జీవనంలో ఇమడలేక....అటు పిల్లలు ఆదరణ కోల్పోయి  కళ్ళ   వెంట ధారగా కన్నీళ్లు కారుస్తూ ఎవరూ ముందు పోయినా మరొకరికి కష్టం అని *భార్యభర్తలు* ఒకరికొకరం ఉన్నామని ధైర్యం చెప్పుకుంటూ జీవనం వెళ్ళ బోస్తున్నారు...! చాలా మంది అత్తమామలు కొడుకు కోడలు నుండి ఆదరణ -  ఆప్యాయతతో కోరుకుంటారు. చాలా సందర్భాల లో వాళ్లకు అది దూరం అవుతుంది..

మన 'ఆధునిక సమాజంలో అత్త మామలు అడ్జెస్ట్ కాలేక పోతున్నారు...ఇదీ చాదస్తం అనే కన్నా *ప్రేమ* ఎక్కువవడం అంటే కరెక్ట్!

భారతదేశంలోని కొంతమంది కోడలు ఎదుర్కొంటున్న మానసిక, ఆర్థిక సమస్యలు దీని వల్లే తలెత్తుతున్నాయి...అత్త పెత్తనం కోడలు సహించదు...తన కోడలు తన చెప్పు చేతల్లో ఉండాలని కోరుకుంటున్న తల్లి తన కూతురు మాత్రం *స్వేచ్ఛ* లేదు అని ఆరాట పడుతుంది...మహిళల్లో ఈ ద్వంద వైఖరి వల్లే కోడళ్ళు శాడిస్ట్ లుగా తయారవుతున్నారు...

అత్తమామలతో జీవించడం వాళ్లకు పెద్ద సవాళ్లు గా అనిపిస్తుంది.

ఈ తప్పుడు భావాలు అనాదిగా ఉంటూనే ఉన్నాయి..*కోడలు బిడ్డ కాదు...అల్లుడు కొడుకు కాదు* అనే  మైండ్ సెట్ ఇంకా వందేళ్లు అయినా మారేట్టు లేదు!  అత్తగారు - కోడలు మధ్య సంబంధం నిజానికి అందంగా ఉండాలి... కానీ తరచుగా వారి మధ్య ఘర్షణ వాతావరణం, ఆధిపత్య పోరాటం కొనసాగుతూనే ఉంటుంది..ఈ తప్పుడు భావాలు ఇద్దరి మధ్య మంచితనాన్ని నాశనం చేస్తున్నాయి. బహుశా, అత్తమామల జోక్యం, కొడుకు పై పెత్తనం వల్ల తాను *స్వాతంత్ర్యం* కోల్పోతున్నాననే అభద్రతా భావం లో కోడలు ఉంటుంది.. ఆ భయాలను ఆమె తల్లి దండ్రులు ఎక్కువ చేయడం వల్ల ఇంట్లో అశాంతి ఎక్కువవుతుంది.. తన కుమార్తె  తన అత్తమామలతో సుఖంగా జీవించాలని కోరుకునే తల్లి దండ్రులు ఉంటే ఇలాంటి అపశృతులు రావు...కూతురికి ఒక న్యాయం కోడలికి ఒక న్యాయం ఉండాలని కోరుకోవడం వల్లే ఈ అశాంతి!!

  ఒక కోడలు మరియు ఆమె అత్తగారి మధ్య ఏర్పడే సమస్యలు 'పోటీ' పడుతుంటాయి!  ఇది వివాహవ్యవస్థలో చాలా సమస్యలను కలిగిస్తుంది!  తల్లి మరియు భార్య ఇద్దరి మధ్య కొడుకు నలిగి పోతాడు...తల్లి కన్నా పెళ్ళామే బెల్లం అనుకున్న మరుక్షణం కొడుకు ఇంటి వైపు తల్లి చూడదు!!  అటు తల్లి ఇటు పెళ్ళాం మధ్య మానసిక వేదనకు గురయ్యే పుత్ర *రత్నాలు* కూడా కోకొల్లలు!!🌷🙏🌷🌷🙏🙏🌷🙏🌷🙏🙏

ఈ ఇంటికి నేను మొదటి కోడలు ను అనే ఇగో తల్లిలో బలంగా ఉంటుంది..

 35 సంవత్సరాలకు క్రితం ఈ ఇంటి పరువును నిలబెట్టాను...అలా నువ్వు అణిగి మణిగి ఉండాలని అత్తా కోరుకోవడంలో తప్పు లేదు కానీ  ఆనాటి అత్తలు వేరు ఈ  నాటి కోడళ్ళు వేరు! ఆనాటి అత్తలకు కావాల్సిన అస్తి ఉండేది...దానికి చూసుకోవడానికి కోడలు కు ఇంటి బాధ్యత అప్పగిం చేది. అయిన ఆనాటి అత్త కోడళ్ళు మధ్య కూడా అభిప్రాయ బేధాలు ఉండేవి...ఇంటి నిండా పనిమనుషులు ఉన్నారు కాబట్టి ఇంటి గుట్టు  బయట పడలేదు... ఇప్పుడు అలా కాదు కోడళ్ళు సంపాదన పరులు అయ్యారు. అత్త కొంగు పట్టుకు తిరగాలి అంటే ఏ కోడలు ముందుకు రాదు!   ఇప్పుడు కట్న కానుకల కన్నా *స్వేచ్ఛ జీవితం*, కోరుకుంటున్న ఈ తరం జంటల వల్ల మానవ సంబంధాలు ఆప్యాయతలు గంగలో కలిసి పోయాయి...మనవలతో అడుకోనివ్వని కోడళ్ళు...ఆతి గారాబం చేయవద్దని చెప్పే కొడుకుల వల్ల తాత మనవల ఆత్మీయత మసి బారి పోయింది!

కొత్తగా పెళ్లయిన వధువులు తమకు ఇష్టమైన దుస్తులను ధరించడానికి,  లేదా వారి తల్లిదండ్రులను ఎప్పుడు తన దగ్గరకు వచ్చి పోతుండాలి అని కోరుకుంటుంది తప్ప అత్తా మామలను ఆదరించాలని అనుకోక  పోవడం వల్లే అత్త కోడళ్ళ మధ్య బాగా గ్యాప్ పెరిగిపోతుంది! ఒక వేళ కొడుకు ఇంటికి వెళితే   ఆలస్యంగా నిద్ర లేచిన  కోడలు... చెప్పులు వేసుకొని ఇంట్లో తిరిగే కోడలు...పూజలు పునస్కారాలు  లేకుండా, స్నానం ఆచరించకుండానే వంటింట్లో దోసెలు వేసే కోడళ్ళ *పనితీరు* వంట బట్టలేక ఏదైనా మాట అత్త గారు అంటే తాను స్వేచ్చలేని పంజరంలో చిలుకను అయ్యాయని ఏడుస్తూ బెడ్ రూం లో అలక పాన్పు ఎక్కుతున్న సుందరాంగి మాటలు విని తల్లి పై కోపగిస్తున్న కొడుకుల ప్రవర్తన వల్ల కూడా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ బీటలు వారిపోతుంది!! అత్తమామలు కొడుకు ఇంటికి వస్తే *హై-సెక్యూరిటీ జైలు* లో బంధించి నట్టు కోడలు ఫీలు అవుతుంది.. అత్త 'నియమాలు' కోడలు కు నచ్చవు...కోడలు తీరు అత్తకు నచ్చదు...

పిల్లల యొక్క ఏకైక బాధ్యత ఎలా కోడలు తీసుకుంటుందో 

అత్తమామలతో కలిసి జీవించడం కూడా బాధ్యత అనుకునే కోడళ్ళు ఈ కాలంలో చాలా తక్కువ!  

వృద్ధ అత్తమామలతో కలిసి జీవించడం ప్రతి కోడలికి ఎంతో విజ్ఞాన దాయకం., ఎందుకంటే వారి ప్రతి చిన్న విషయం పట్ల శ్రద్ధ వహించడం వాళ్ళు చేస్తారు...తెలివైన కోడలు అయితే అత్తా మామలతో ప్రేమ గా ఉంటే సగం పనిభారం తగ్గినట్టే! అత్త గారే వంట చేస్తుంది...మామ గారే పిల్లలను బడికి పంపే బాధ్యత తీసుకుంటారు...కానీ వంటింట్లో ఏదో *దోచుకుపోతుంది* అని భయపడి కిచెన్లోకి రానివ్వని కోడళ్ళు...కోడలు ఇంట్లో సమకూర్చిన ప్రతి వస్తువు తన కూతురు ఇంట్లో ఉండాలని అనుకునే అత్తల వల్ల ఈ గ్యాప్ ఎక్కువవుతూనే ఉంది! భారతదేశంలో పవిత్రమైన కర్తవ్యంగా అత్త కోడళ్ళు ఉండాలి... కానీ ఈ తరం మహిళల లో మార్పు వస్తేనే కుటుంబ వ్యవస్థ మళ్ళీ చిగురిస్తుంది..సేకరణ...

ముగింపు......

అమ్మాయి.. అబ్బాయి తల్లి తండ్రులు వివాహం దాని ప్రాధాన్యత గురించి ముందుగా వారికి వివరించి, ముందు తరాలకు ఆదర్శంగా నిలవాలి మీ కుటుంబం అని వారికి ఆశీర్వాదాలతో దీవెనలు ఇవ్వాలి...ఉమ్మడి కుటుంబం యొక్క విలువలు వివరించగలగాలి..మన ప్రయత్న లోపం లేకుండా మనం చెప్పగల వివరణ చెప్పాలి...ఇక వారి వారి పరిధిలో వారిని వదిలేయాలి...

                  సర్వే జనా సుఖినోభవంతు....







Monday, January 27, 2025 0 comments By: visalakshi

గీతాజ్ఞాన అభ్యాసం..


“భగవద్గీత - ఆత్మవిజ్ఞానశాస్త్ర మహాగ్రంధం”





కురుక్షేత్ర మహాసంగ్రామంలో అర్జునుడు గాండీవాన్ని క్రిందపడవేసి .. యుద్ధరంగం నుంచి పలాయనం చిత్తగించాలని చూసినట్లు...,  ఒక్కోసారి మనం కూడా ఆత్మజ్ఞానంతోనో, పామరత్వంతోనో మన జీవన కర్తవ్యాల నుంచి తప్పించుకో జూస్తూంటాం. అప్పుడు భగవద్గీత మనకు సత్యాన్ని బోధించి .. మనతో ధర్మాన్ని ఆచరింపజేసి .. క్రిందపడిన గాండీవాన్ని మళ్ళీ అర్జునుడిచే సంధింపజేయించినట్లు మనల్ని కూడా కర్తవ్య పరాయణులను చేస్తుంది♪. అందుకే “భగవద్గీత” అన్నది ఆత్మవిజ్ఞాన శాస్త్ర మహాగ్రంథం.


అది మనకు సత్య దర్శనం గురించీ మరి ధర్మాచరణం గురించీ విశేషంగా ప్రబోధిస్తూ ఉంటుంది.


“సత్యం” అన్నది “జ్ఞాతవ్యీయం” .. అంటే తెలుసుకోవలసినది .. మరి “ధర్మం” అన్నది “ఆచరణీయం” అంటే నిరంతరం ఆచరించవలసింది.


సత్యం తెలియకపోతే మనకు ధర్మాన్ని ఆచరించే విధివిధానం అర్థం కాదు. దాంతో యుద్ధరంగం నుంచి పలాయనం చెందాలని అర్జునుడు ప్రయత్నించినట్లు మనం కూడా ప్రాపంచిక సంసారంలో కర్తవ్యాల నుంచి తప్పించుకోవాలని చూస్తూంటాం.


మన ముసలి తల్లితండ్రులనూ మరి ఇంట్లో ఉన్న ఇతర పెద్దలనూ చూసుకోవడానికి విముఖత చూపిస్తూ .. వారిని వృద్ధాశ్రమాలలో చేర్పించి .. అదే "కర్తవ్యం” అని చేతులు దులుపుకుంటాం. కానీ .. “ఈ జన్మలో మనం మన కర్తవ్యాలను సరిగ్గా ఆచరించకపోతే మళ్ళీ మళ్ళీ అనేక జన్మలు ఎత్తి అవే కర్తవ్యాలను అవే పరిస్థితులలో మళ్ళీ మళ్ళీ నిర్వర్తించాల్సి వస్తుంది” అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి.


“తే త్వం భూంక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి

ఏవం త్రయీధర్మమనుప్రపన్నా గతాగతం కామకామా లభంతే”

                        (భ.గీ.9-2)


“ఆ విశాలమైన స్వర్గలోకాలలోగల భోగాలను అనుభవించిన తరువాత .. మరి పుణ్యం అయిపోగానే .. నువ్వు మళ్ళీ మర్త్యలోకాలకు ప్రవేశిస్తావు. ఈ ప్రకారంగా మూడు రకాల ధర్మ కర్మలను ఆచరిస్తూ .. భోగాలను ఆశిస్తూ .. స్వర్గ మర్త్య లోకాలకు మధ్య రాకపోకలను సాగిస్తూనే ఉంటావు” అన్నారు శ్రీకృష్ణుల వారు.


పుణ్యం పెరగగానే స్వర్గలోకానికీ మరి పుణ్యం క్షీణించగానే మర్త్యలోకానికీ తిరుగుతూ .. మనలో ఉన్న “కామం” అన్నది “అకామం” అయ్యేంతవరకూ మనం రాకపోకలను సాగిస్తాం. ఎప్పుడయితే “త్రయీధర్మ పరాయణులుగా” మన 'దేహధర్మం', మన 'కుటుంబధర్మం' మరి మన 'సంఘధర్మానికి' చెందిన కర్తవ్యాలను ఆత్మజ్ఞానంతో సంపూర్ణంగా ఆచరిస్తామో .. అప్పుడు ఇక మళ్ళీ ఈ భూమిమీదకు నేర్చుకోవడానికి రావలసిన అవసరం ఇక ఉండదు.


 #“దేహధర్మం”:


ఈ దేహం మనకు ప్రకృతి నుంచి లభించింది♪. ఇందులోకి మనం ప్రవేశించాం కనుక దీనిని జాగ్రత్తగా చూసుకోవడం మన ధర్మం. అశాస్త్రీయమైన తిండితో, అశాస్త్రీయమైన ఆలోచనలతో మరి అశాస్త్రీయమైన కర్మాచరణలతో దానిని పాడుచేసుకోకూడదు.


అద్దెకు తీసుకున్న కొంపను ఇష్టం వచ్చినట్లు “కొల్లేరు”లా చేస్తే దాని యజమాని ఊరుకోనట్లే .. ప్రకృతి నుంచి అద్దెకు తీసుకున్న మన ఈ శరీరాన్ని తినకూడని వాటితో మరి తాగకూడని వాటితో నింపేస్తూంటే ఆ శరీరానికి యజమాని అయిన ప్రకృతి చూస్తూ ఊరుకుంటుందా? “నా ఇంటిని నీకు ఎలా ఇచ్చానో .. నువ్వు నాకు అలాగే అప్పచెప్పకపోతే నీ మీద ‘దావా’ వేస్తాను” అని ఇంటి యజమాని బెదిరించినట్లు .. ప్రకృతి కూడా ఏ క్యాన్సర్ రూపంలోనో, డయాబెటీస్ రూపంలోనో, లివర్ సిర్రోసిస్ రూపంలోనో మన మీద ‘దావా’ వేస్తుంది.


చాలా మంది “మాకు అన్నీ తెలుసు” అనుకుంటూ..“ ఎవరో చంపిన జంతువులను మేము తింటే తప్పేంటి? మేము స్వయంగా చంపట్లేదు కదా?” అని అతితెలివిగా వాదిస్తూంటారు. ఎవడో వచ్చి మన క్రొత్త పెట్రోలు కారులో ‘డీజిల్’ పోస్తే పాడైపోయేది మన కారే కదా! ఇది కూడా అంతే.


ప్రకృతిని మనం ఎంతగా నాశనం చేస్తామో అంతగా అది మనకు శిక్ష వేస్తుంది. కనుక ‘నాగరికత’ ముసుగులో శరీర ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించకుండా .. చేయవలసిన ధ్యానం చేసి విశ్వశక్తితో శరీరాన్ని వజ్రకాయంలా మార్చుకోవాలి.


#“కుటుంబ ధర్మం”: 


ఒకానొక తల్లిగా, ఒకానొక తండ్రిగా, ఒకానొక కొడుకుగా, ఒకానొక కూతురుగా, ఒకానొక అన్నగా, ఒకానొక తమ్ముడిగా .. ఇలా మనం కుటుంబంలో ఏ పాత్రలో ఉంటే ఆ పాత్రకు తగ్గట్లు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ మన సకల కుటుంబసభ్యుల పట్ల విద్యుక్త ధర్మాలను నెరవేర్చాలి.


#“సంఘధర్మం”:


మనకు ఉన్నదాంట్లో కొంత వాడుకుని .. మిగతాది సంఘంలోని ఇతర సభ్యులతో పంచుకోవాలి. సంఘ నిర్వహణ కోసం ప్రకృతిపరంగా విధించబడిన కట్టుబాట్లను గౌరవిస్తూ .. రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరిస్తూ సంఘంలో ఒక సభ్యుడిగా సంఘం పట్ల మన కనీస ఆధ్యాత్మిక, ప్రాపంచిక ధర్మాలను నెరవేర్చాలి.


“యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి

శుభాశుభపరిత్యాగీ భక్తి మాన్ యః స మే ప్రియః”     

                       (భ.గీ.12-17)


“ఇష్టవస్తు ప్రాప్తికి పొంగిపోనివాడు, దేనిపట్ల కూడా ద్వేషభావం లేనివాడు దేనికీ శోకింపని వాడు, దేనినీ ఆశింపనివాడు .. శుభాశుభ కర్మలను త్యజించినవాడు అయిన భక్తుడు నాకు ప్రియుడు” అని ఒకానొక ఆత్మజ్ఞాని యొక్క లక్షణాలను తెలియజేశారు శ్రీకృష్ణులవారు.


ఇలా ఏది ఉన్నా ఏది ఊడినా బాధపడకుండా దేనిపట్ల కూడా ద్వేషం లేకుండా, దేనికీ శోకించకుండా ప్రకృతి మనకు అందించిన వాటిని “ఉన్నది ఉన్నట్లుగా” స్వీకరించి ముందుకు సాగుతూ మనం స్వర్గలోకానికీ .. మర్త్యలోకానికీ మధ్య రాకపోకలు చేయాలి. వస్తూ పోతూండే ఈ క్రమంలో .. క్షీణించిన మన శరీరాన్ని చినిగిన బట్టను విసిరివేసినట్లు వదిలివేస్తూ .. మళ్ళీ క్రొత్త బట్టలను ధరించినట్లు .. క్రొత్త జన్మలో క్రొత్త శరీరాన్నిధరిస్తూ ఉండాలి.


అనగ అనగ రాగమతిశయించినట్లు రాగాపోగా ఎప్పటికో ఒకప్పటికి మనలోని కామాలన్నీ కూడా “అకామాలు” అయిపోయి .. పరిశుద్ధం చెందబడతాయి.


“అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే

తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షే మం వహామ్యహామ్”

                      (భ.గీ.|| 9-22)


“వేరే ప్రాపంచిక ఆలోచనలు లేకుండా నిరంతరం తనలో తాను నిమగ్నమవుతూ నిష్కామ భావంతో తనను తాను సేవించుకునే వారి యోగక్షేమాలను వారు స్వయంగా వహిస్తాను” అని భగవాన్ శ్రీకృష్ణుల వారు తెలియజేశారు.


ప్రతి ఒక్క ఖజానాను తెరవడానికి ఒక రహస్యమైన “తాళం చెవి” ఉన్నట్లే భగవద్గీతను అర్థం చేసుకోవడానికి కూడా ఒక రహస్యమైన “తాళం చెవి” ఉంది.


#అదే “మామ్” మరి “అహం” పదాలు యొక్క సరియైన అర్థాలు:


ఇక్కడ “మామ్” అన్నా మనమే .. మరి “అహం” అన్నా మనమే! ఒకటి మన అంశాత్మకు సంకేతం మరి ఇంకొకటి మన పూర్ణాత్మకు సంకేతం! రెండూ మనమే!


అంశాత్మలమైన మనం మన స్వీయ పూర్ణాత్మల పట్ల అనన్య భక్తితో ఉంటూ, పూర్ణాత్మనే సేవిస్తూ .. పూర్ణాత్మనే ధ్యానిస్తూ .. నిష్కామ భావంతో పూర్ణాత్మనే చింతిస్తూ ఉంటే .. మన పూర్ణాత్మే మన యోగక్షేమాలను చూసుకుంటూ ఏదో ఒక నాటికి మనల్ని కూడా తనంతటి పూర్ణాత్మలుగా పరిమారుస్తుంది! అంటే మనల్ని మనమే ఉద్ధరించుకుంటున్నామన్న మాట.


“ఉద్ధరేదాత్మనాత్మానాం ఆత్మానమవసాదయేత్

ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః”

                            (భ.గీ.6-5)


“ఈ సంసార సాగరంలో ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఎవరూ తమను తాము అధోగతి పాలుచేసుకోకూడదు. వాస్తవానికి ఈ లోకంలో ఎవరి ఆత్మే వారికి మిత్రుడు మరి ఎవరి ఆత్మే వారికి శత్రువు” కనుక .. మనం చెయ్యవలసిందల్లా నిరంతరం ధ్యానసాధనతో కూడిన ఎరుకతో మన పూర్ణాత్మకు అనుసంధానమై ఉండడమే .. అదే మనకు వున్న ఒక్కగానొక్క రాచబాట!


ఇలా నిరంతరం ధ్యాన యోగ సాధన వల్ల మాత్రమే ఆత్మతత్త్వం అవగతమై .. మన ఆత్మను ఆవరించి ఉన్న దుఃఖం దూరం అవుతుంది కనుక ..


“తపస్వి యోగీ జ్ఞానిభ్యోపి మతోధికః

కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున” 

                          (భ.గీ.6-46)


“ఒకానొక యోగి తాపసులకంటే శ్రేష్ఠుడు. శాస్త్రజ్ఞానుల కంటే శ్రేష్ఠుడు. సకామ సాత్విక కర్మలను ఆచరించే వారి కంటే శ్రేష్ఠుడని భావించవచ్చు, కనుక అర్జునా! యోగివి కా” అని సూచించాడు శ్రీకృష్ణుడు.


రకరకాల పూజలూ, ఉపవాసాలూ మరి తపస్సులూ చేస్తే శరీరం తపిస్తుందే కానీ ఆత్మను ఆవరించి ఉన్న అజ్ఞానం మాత్రం పోదు గాక పోదు! సకల సంస్కృత శ్లోకాలను కంఠతా పట్టేసి రకరకాల శాస్త్రవిజ్ఞాన గ్రంథాలను పఠించేస్తే అక్షర పండితుడు అనబడతాడు కానీ అతని ఆత్మను ఆవరించి ఉన్న దుఃఖం పోదు గాక పోదు! గొప్ప గొప్ప కర్మలు చేసి ఎన్నెన్నో కీర్తిప్రతిష్ఠలు పొందినా ఆత్మను ఆవరించి వున్న అజ్ఞానం పోదు గాక పోదు! అందుకే ..


“క్లైబ్యం మాస్మ గమః పార్థ నైతత్త్వ య్యుపపద్యతే

క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప”

                            (భ.గీ.2-3)


“ఓ అర్జునా! పిరికితనానికి లోనుకావద్దు .. నీకు ఇది ఉచితం కాదు♪. ఓ పరంతపా! ఈ హృదయ దౌర్భల్యాన్ని వీడి యుద్ధం చేయడానికి నడుము బిగించు” అంటూ కర్తవ్య బోధ చేశాడు శ్రీకృష్ణుడు.


“శరీరం” అన్నది “ఆత్మ” కు “నీడ” వంటిది. శరీరానికి రోగం వచ్చినప్పుడు నీడకు చికిత్స చేస్తే లాభం లేనట్లు ఆత్మకు “అజ్ఞానం” అనే రోగం ఆవరించినప్పుడు దాని నీడలాంటి శరీరంతో తపస్సులు చేసినా, ఉపవాసాలు చేసినా, ఆసనాలు వేసినా, పుణ్యనదులలో మునిగినా మరి స్త్రోత్ర పారాయణలు చేసినా లాభం ఉండదు! చెయ్యవలసింది .. చిత్తవృత్తులన్నింటినీ నిరోధించుకుని ధ్యానం చేసి ఆత్మమూల ప్రకృతితో సంయోగం చెంది సత్యాన్ని అవగతం చేసుకోవడం.


సత్యాన్ని తెలుసుకునేంత వరకూ .. దానిని తెలుసుకోవడమే మన పని! మరి తెలుసుకున్నాక దానిని అందరికీ తెలియజెయ్యడమే మన పని!


మనం ఎవరిమో ఏ పని కోసం పుట్టామో తెలుసుకునేంత వరకూ మన ఆత్మకు దుఃఖమే ఉంటుంది. తెలుసుకున్న తరువాత ఇక ఆ చెయ్యాల్సిన పని చేస్తూంటే ఆనందమే ఆనందం! అలనాడు గౌతమ బుద్ధుడు అనుభవించిన ఆనందం అదే.. మరి ఈ రోజు ఆనాపానసతి .. “శ్వాస మీద ధ్యాస” ధ్యానప్రచారం చేస్తూ పిరమిడ్ మాస్టర్స్ అనుభవిస్తూన్న ఆనందం అదే.


కనుక చిన్నప్పటి నుంచే యోగస్థితిలో ఉంటూ పరమ యోగిలా గృహస్థధర్మంలోకి ప్రవేశించి విహిత ప్రాపంచిక కర్మలు చేయాలి. అప్పుడే అవి ధర్మబద్ధంగా సమస్థితిలో ఉంటాయి. లేకపోతే జీవితం అంతాకూడా తప్పులతడకగా మారి “గృహస్థధర్మం” అంతా కూడా “గృహస్థ అధర్మం” అవుతుంది. అందుకే....


 “యోగస్థః కురుకర్మాణి సంగం తక్త్వా ధనంజయ

సిద్ధ్యస్సిద్ధ్యో సమోభూత్వా సమత్వం యోగ ఉచ్యతే”

                          (భ.గీ.2-48)


 “ఓ ధనుంజయా! యోగస్థితుడవై ఆసక్తిని వీడి, సిద్ధి అసిద్ధుల పట్ల సమత్వభావాన్ని కలిగి కర్తవ్యకర్మలను ఆచరించు. ఈ సమత్వభావాన్నే యోగం అంటాం” అని యోగాన్ని నిర్వచించాడు శ్రీక్రుష్ణుడు.


“దమం” లోంచి “సమం” అన్నది వస్తుంది. “దమం” అంటే బహిరేంద్రియాలను లోపలికి ముడుచుకోవడం; .. “సమం” అంటే అంతరేంద్రియాన్ని అదుపులో ఉంచుకోవడం. బహిరేంద్రియాలను లోపలికి ముడుచుకుని ధ్యానం చేసినప్పుడు అంతరేంద్రియమైన మనస్సు అదుపులోకి వచ్చి .. మనం సమత్వస్థితిని పొంది ఆత్మ మూలప్రకృతిని అవగతం చేసుకుంటాం.


ఇలా “ఆత్మ యొక్క మూల ప్రకృతిని అవగతం చేసుకుని సమత్వస్థితిని పొందటమే యోగం” అనిపించుకుంటుంది కానీ ‘శీర్షాసనం’, ‘కుక్కుటాసనం’ వంటి శారీరక విన్యాసాలు చేసి “అదే యోగం” అనుకున్నంత మాత్రాన ఆత్మసత్యం అవగతమైపోదు.


“ధ్యానం” ఉన్నచోట “వివేకం” ఉంటుంది. వివేకంతో కూడిన బుద్ధితో చేసే కర్మలన్నీ కూడా ఫలాపేక్ష లేని అకర్మలుగా మారి లోకకల్యాణ కారకాలవుతాయి. కనుక ..


“కర్మణ్యకర్మ యః పశ్యేదకర్మణి చ కర్మ యః

స బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్తః కృత్స్నకర్మతృత్”

                          (భ.గీ.4-18)


“కర్మలో అకర్మనూ, మరి అకర్మలో కర్మనూ దర్శించేవాడు మానవులలో బుద్ధిశాలి; అతడే యోగి .. మరి సమస్త కర్మలనూ చేసేవాడు” అంటూ యోగస్థితిలో ఉన్న బుద్ధిమంతుడు చేసే కర్మలపట్ల స్పష్టతను తెలియజేశారు శ్రీకృష్ణులవారు.


కర్మను “అకర్మ”గా .. అకర్మను “కర్మ”గా భావించడమే నిజమైన కర్మ! “భావం” అన్నదే “భవం” అవుతుంది కనుక “నా ద్వారా ఉత్తమోత్తమమైన కర్మ నిర్వహించబడుతోంది” అని భావన చేసుకుని .. కర్మ ఫలితాన్ని ఆశించకుండా అంకిత భావంతో కర్మలు చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే అది “అకర్మ” అవుతుంది.


“అనుకోవడం” బీజం .. “అవడం” వృక్షం. బీజం వేస్తే ఏదో ఒకరోజు వర్షం పడి .. ఆ బీజం మొలకెత్తి .. ఒకానొక మహావృక్షం అయినట్లు .. ఉత్తమోత్తమమైన సంకల్పం చేసినప్పుడే ఉన్నతోన్నతమైన కర్మలు నిర్వహించబడతాయి.


“తపస్విభ్యోధికో యోగీ జ్ఞానిభ్యోపి మతోధికః

కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీభవార్జున”

                       (భ.గీ.|| 6-46)


“ఒకానొక యోగి తాపసులకంటే శ్రేష్ఠుడు; శాస్త్రజ్ఞానులకంటే శ్రేష్ఠుడు; సకామ కర్మలను ఆచరించే వాడి కంటే కూడా శ్రేష్ఠుడని భావించబడుతుంది కనుక ఓ అర్జునా! నువ్వు యోగివి కా!” అన్నాడు యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు.


వేదవ్యాసులవారు నాలుగు వేదాల సారాన్నీ మరి సకల ఉపనిషత్తుల సారాన్నీ చక్కగా క్రోడీకరించి “పంచమవేదం”గా మనకు మహాభారతాన్ని అందించారు.


ఆనాటి సమకాలీన సమాజానికి చెందిన హీరోలను శ్రీకృష్ణుడు, పాండవుల పాత్రలుగా మరి విలన్‌లను కౌరవుల పాత్రలుగా మలచి అన్ని సత్యాలనూ మరియు అన్ని ధర్మాలనూ అందులో పొందుపరచి అనేకానేక ఉపమానాలతో అతి రమణీయమైన మహాభారత కావ్యాన్ని మనకు అందించారు. శ్రీకృష్ణుడిని గోవర్థన గిరిధారి అని స్తుతించాడు.


” ‘గోవర్థన గిరిధారి’ అంటే ధ్యానయోగ సాధకుడే” “గో” లేదా “గోవులు” అంటే “ఇంద్రియాలు”. “మామూలు కంటికి కనిపించేదే జ్ఞానం’ అనుకునే “గోకులం” లో ఒకడిగా పుట్టిన ధ్యాన యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు .. “గోపాలకుడి”లా వాళ్ళ ఇంద్రియాలను పాలన చేస్తూ “వర్థనం” చేస్తూ .. తన అతీంద్రియ శక్తితో చిటికెన వ్రేలుపై “గోవర్థనగిరి”ని ఎత్తినంత సులభంగా వాళ్ళ సమస్యలకు సమాధానాలు ఇచ్చేవాడు.


అంటే “ధ్యానయోగసాధన” అన్నది మన ఇంద్రియాలను వర్థనం చేసి మనల్ని అతీంద్రియుల్లా పరిమార్చివేస్తుంది.


అప్పుడు మనం ఇక్కడ వినపడే వాటితో పాటు ఎక్కడో గొప్ప గొప్ప “ఆస్ట్రల్ మాస్టర్స్” ఇచ్చే జ్ఞానపూర్వకమైన సందేశాలను వినవచ్చు; ఇక్కడ కనపడే వాటితో పాటు ఎక్కడో అందమైన లోకాలలోని సుందర దృశ్యాలను చూడవచ్చు; ఇక్కడి వాసనలతో పాటు ఏవేవో జన్మల వాసనలు కూడా పసిగట్టవచ్చు; మరి ఇక్కడ ఉన్న గురువులతో పాటు ఏవేవో లోకాలలో ఉన్న గురువులతో సంపర్కం పొందవచ్చు.


ఇలా తన ఇంద్రియాలపై తాను స్వయంగా పట్టును కలిగి ఉన్న ఒకానొక యోగి .. తన ఆత్మశక్తితో, ఆత్మజ్ఞానంతో అందరినీ సేదదీరుస్తూ గోవర్థునుడిలా వర్థిల్లుతూంటాడు.


“యత్ర యోగీశ్వరః కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః

తత్ర శ్రీర్విజయో భూతిః ధృవా నీతిర్మతిర్మమ”

                        (భ.గీ.18-78)


 ‘యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు మరియు ‘ధనుర్ధారి’ ‘ధర్మధారి’ అయిన అర్జునుడు ఉండేచోట సకల సంపదలు, సర్వవిజయాలు, సకల భోగాలు మరి సుస్థిరమైన నీతి కొలువుదీరి ఉంటాయి.” అని తన నిశ్చితాభ్రిప్రాయాన్ని తెలియజేశాడు సంజయుడు.


ప్రాపంచిక కర్మలు చేస్తూనే అర్జునుడిలాంటి మనం అంటే “నరులం” .. ధ్యానం చేసి మన ఆత్మ యొక్క విశ్వరూపాన్ని దర్శించుకుని ఆ రకంగా జీవించాలి♪. అప్పుడు మన జీవితరధానికి పూర్ణాత్మ అయిన “నారాయణుడు” రథసారధిలా సారధ్యం వహిస్తూ ప్రాపంచిక కురుక్షేత్రంలో మనకు విజయాన్ని ప్రాప్తింపజేసి మనల్ని కూడా నారాయణుడిలా అంటే తనంతటి పూర్ణాత్మలా మార్చేస్తాడు.


మళ్ళీ ఆ సరి క్రొత్త పూర్ణాత్మ .. సూర్యకిరణాలలా వేల కొద్దీ అంశాత్మలను ఈ భూమి మీదకు పంపించి వారికి సందేశాలు అందిస్తూ .. వారి ద్వారా తాను సృష్టి రచనా విన్యాసంలో పాలుపంచుకుంటూ ఉంటుంది.


ఇదంతా జరగాలంటే ముందు నరుడిలా పుట్టిన అంశాత్మలో .. నారాయణుడిలాంటి “పూర్ణాత్మ”ను తెలుసుకోవాలన్న జిజ్ఞాస మొదలుకావాలి. అందుకు తపన చెందాలి; సాధన చెయ్యాలి.


“మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే

యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః”

                            (భ.గీ.7-3)


 “వేలకొద్దీ మనుష్యుల్లో ఎవడో ఒకడు మాత్రమే తనను గురించి తాను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు♪. అలా ప్రయత్నించిన వారిలో కూడా ఒకానొకడు మాత్రమే తన యథార్థ స్వరూపాన్ని తెలుసుకుంటాడు” అని లెక్కలు కూడా కట్టారు భగవాన్ శ్రీకృష్ణుల వారు. అంతేకాదు....


“సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ

అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః”

                        (భ.గీ.18-66)


“సర్వధర్మాలనూ అంటే సమస్త కర్తవ్యకర్మలనూ తాత్కాలికంగా పరిత్యజించి .. నీలో నువ్వు స్వీయ శరణు భావనతో వుండు. అప్పుడు అన్ని పాపాల నుంచి నిన్ను నువ్వే విముక్తి చెందించుకుంటావు” అని అభయం కూడా ఇచ్చారు.


 “ఇక్కడ ‘మామ్’ అంటే అంశాత్మ అనీ ‘అహం’ అంటే ‘పూర్ణాత్మ’ అనీ గుర్తించి మన సకల ఇంద్రియ ధర్మాలనూ, కుటుంబ ధర్మాలనూ ఒకింత ప్రక్కన పెట్టి .. ధ్యాన అభ్యాసం చెయ్యాలి” అని అర్థం చేసుకోవాలి.


కళ్ళు రెండూ మూసేసుకుని మన అంతరంగంలోకి ప్రవేశించి మన స్వీయ ఆత్మను అంటే “మామ్”ను మనం శరణు వేడాలి. అప్పుడు మన “పూర్ణాత్మ” అంటే మన “అహం”.. మనం గత అనేకానేక జన్మలుగా కూడబెట్టుకున్న అనేకానేక పాపకర్మల నుంచి మనల్ని విముక్తులను చేస్తుంది.


మనం కొంత చేస్తే .. మన పూర్ణాత్మ మిగిలింది చేయగలుగుతుంది. మనం చెయ్యవలసింది చేస్తేనే మనం పొందవలసిన వాటిని ఏ ఆటంకం లేకుండా సకాలంలో పొంది శోకవిముక్తులం అవుతాము.


విశ్వనియమాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి ఒక్కటీ అక్కడ ఖచ్చితంగా అమలుపరచబడుతుంది.


 కనుక ఎంత “ఎరుక”తో మనం ఇక్కడ జీవిస్తే పైలోకాలలో అంత ప్రశాంతంగా ఉంటాం; అదే “సరస్వతీ జ్ఞానం” మరి ఆ సరస్వతీ జ్ఞానాన్ని మనకు తత్త్వ దర్శినులే అందిస్తారు. అలాంటి తత్త్వదర్శినులు దానికి సంబంధించిన ప్రశ్నలనే మనం తత్త్వ దర్శనులను అడగాల్సిందే.


తత్త్వదర్శనం పొందిన “జ్ఞానులు” మనకు సత్యాన్ని బోధిస్తారు:


“తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా

ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన స్తత్త్వ దర్శినః”

                          (భ.గీ.4-34)


“తత్త్వదర్శనుల నుంచి జ్ఞానాన్ని గ్రహించాలి. వారికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి .. సేవించి కపటం లేకుండా భక్తితో వారిని సముచితరీతిలో ప్రశ్నించాలి. అప్పుడు ఆ జ్ఞానస్వరూపులు నీకు సత్యాన్ని ఉపదేశిస్తారు” అని తెలియజేసారు శ్రీకృష్ణుల వారు.


“రెండు కాళ్ళూ .. రెండు చేతులూ, ఒక మొండెం .. ఒక శిరస్సు .. మనస్సు మరి బుద్ధి” అనే ఎనిమిది అంగాలతో శ్వాసగురువుకు సాష్టాంగ నమస్కారం చెయ్యాలి.


అంటే బహిరేంద్రియాలనూ, మనస్సునూ బుద్ధినీ “శ్వాస గురువు”కు అధీనం చేసి .. “పరి సేవ” చెయ్యాలి. అప్పుడు మన చిత్తవృత్తులన్నీ నిరోధం కాబడి మన దివ్యచక్షువు తెరుచుకోబడి .. తత్త్వదర్శనులైన ఎందరెందరో ఉన్నత లోకవాసులు మనకు దివ్యచక్షువులో దర్శనం ఇస్తారు. వారిని మనం “చనిపోయిన తరువాత ఏమౌతుంది?” అన్న పరిప్రశ్న వేసి వారి నుంచి “సరస్వతీ జ్ఞానాన్ని” పొందాలి. అదొక్కటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన జ్ఞానం.


అంతే కానీ ధ్యానంలో జ్ఞానస్వరూపులు దర్శనం ఇవ్వగానే .. “నా కొడుకు పెళ్ళి ఎప్పుడవుతుంది?” .. “నాకు ప్రమోషన్ ఎప్పుడొస్తుంది?” .. “నాకు పిల్లలు పుడతారా?” .. “నా స్థలానికి ఎంత రేటు వస్తుంది?” అంటూ మూర్ఖపు ప్రశ్నలు అడగకూడదు. అలా అడిగిన వారు ఏమీ సమాధానం చెప్పరు.


ఊరికే మనవైపు కాస్సేపు చూసి వెళ్ళిపోతారు అంతే! ఏకలవ్యుడు తపస్సు చేసి శారదాదేవి ప్రత్యక్షం అయ్యింది. అప్పుడు అతడు తనకు గొప్ప విలువిద్యను ప్రసాదించమని ఒక ప్రాపంచిక కోరిక కోరాడు. ఆమె “తథాస్తు” అంది! కానీ ఆ విలువిద్య అతనికి పనికి వచ్చిందా? శారదా దేవి అంతటి తత్త్వదర్శిని ప్రత్యక్షమైనప్పుడు .. “ఈ లోకంలో మరి పరలోకంలో కూడా నన్ను తరింపజేయగల సరస్వతీజ్ఞానాన్ని ఇవ్వమ్మా” అని కోరుకోవాలే కానీ .. ఈ లోకంలోనే పనికివచ్చే విలువిద్యను కోరుకోవడం తప్పు.


మన జీవిత పరిస్థితులను మనమే ఎంచుకుని వచ్చాం కాబట్టి .. “వాటిని మార్చెయ్యాలి” అనుకోవడం తప్పు.


బాగా ధ్యానం చెయ్యడం మరి ప్రాపంచిక జీవితానికి సంబంధించి ఏమీ అడగకుండా ఉండడమే సరియైన జీవితం♪. సరియైన జీవితాన్ని జీవిస్తూంటే .. రావలసినవి అన్నీ వాటంతట అవే వస్తాయి.


“ధ్యానం” అన్నది ఒక ఆత్మవిజ్ఞానమహాశాస్త్రం! ఇంత గొప్ప శాస్త్రాన్ని నిరంతర ధ్యానప్రచారం ద్వారా ప్రపంచం అంతా తెలియజేసే బృహత్తర బాధ్యతను చేపట్టిన “పిరమిడ్ మాస్టర్స్” అందరూ “ఆత్మవిజ్ఞాన శాస్త్రవేత్తలు”!


గత అనేకానేక జన్మలుగా “శ్వాస మీద ధ్యాస” పెట్టి ధ్యానం చేసి చిత్తవృత్తులను నిరోధం చేసుకుని .. నాడీ మండలాన్ని శుద్ధి చేసుకుని .. దివ్యచక్షువును ఉత్తేజితం చేసుకుని తమ మీద తామే ప్రయోగాలు చేసుకున్న ఈ అనుభవజ్ఞానశాస్త్రజ్ఞులు .. ఇప్పుడు ఆ ఆత్మవిజ్ఞానాన్నంతా ఇతరులకు బోధించడానికే ఈ జన్మలో ఆ దివి నుంచి ఈ భువికి దిగివచ్చారు.


దివ్యచక్షువును ఉత్తేజితం చేసుకోవడం ద్వారా ప్రతి ఒక్కరూ “మనంకూడా దివి నుంచి భువికి దిగి వచ్చిన ఆత్మలం” అని తెలుసుకుంటారు. సుఖమయప్రాణాయామం ద్వారా మరి అభ్యాస వైరాగ్యాల ద్వారా సూక్ష్మంలో మోక్షాన్ని పొందుతారు.


ఇలా అభ్యాస వైరాగ్యాల ద్వారా గత అనేకానేక జన్మలుగా ఎంతెంతో ధ్యానసాధన చేసిన మాస్టర్లంతా ఒక్కొక్క జీవిత ప్రణాళికతో .. ప్రపంచంలోని ఒక్కొక్క ప్రాంతంలో పుట్టి తాము నేర్చుకున్న ఆత్మవిద్యను అందరికీ బోధిస్తూ ఆధ్యాత్మిక ఉద్యమాలను నిర్వహిస్తున్నారు.


తమ దివ్యచక్షువుతో ఉన్నత లోకాలను దర్శిస్తూ అక్కడి మాస్టర్లతో సజ్జనసాంగత్యం చేస్తూ తమ “జ్ఞానచక్షువు”ను ఉత్తేజితం చేసుకుంటారు. అప్పుడే వాళ్ళకు “యుక్త అవబోధ” కలిగి ఇతరులకు ఆత్మసత్యాలను సరిఅయిన విధంగా బోధించగలిగే అర్హత వస్తుంది.


సకల రాజరికపు సంపదలతో తులతూగుతూన్న బుద్ధుడు తన అంతర్వాణి ప్రబోధంతో సంపదలన్నీ వదిలివేసి .. ప్రపంచానికి దుఃఖ నివారణా మార్గం కనుగొనడానికి బయలుదేరాడు. ఆనాపానసతి ధ్యానసాధన చేసి తన దివ్యచక్షువును ఉత్తేజితం చేసుకుని .. తన గతజన్మ పరంపరను చూసుకుని .. కర్మసిద్ధాంతాన్ని అవగతం చేసుకుని “బుద్ధుడు” అయ్యాడు.


“బుద్ధుడి”గా అయిన తక్షణమే అతడు తాను కనుక్కున్న సత్యాన్ని అందరికీ తెలియజేయడం మొదలుపెట్టాడు. మరి తన వాక్కును అద్భుతంగా వినియోగించుకుంటూ లోకోద్ధరణకు నడుము కట్టాడు.


అందుకే మనస్సును నిగ్రహించుకుని సత్యదర్శనం చేసిన ఒకానొక ధ్యానయోగి మాటకే అంతటి విలువ వస్తుంది కనుక “అర్జునా! నువ్వు ధ్యానయోగివికా నాయనా!” అని సూచించాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో! అందుకు అర్జునుడు


“చంచలం హి మనఃకృష్ణ ప్రమాధి బలవద్ధృడమ్

తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్”

                          (భ.గీ.6-34)


“ఈ మనస్సు చాలా చంచలమైంది. బాగా ప్రమాద స్వభావం కల్గినదీ, దృఢమైనదీ మరి ఎంతో బలమైంది. దీనిని నిగ్రహించడం అంటే గాలిని ఆపడంలా ఎంతో దుష్కరం” అని వాపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ..


“అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్

అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చగృహ్యతే”

                          (భ.గీ.6-35)


“నిస్సందేహంగా మనస్సు చంచలమైందే మరి దానిని వశపరచుకోవడం చాలా కష్టం! కానీ కౌంతేయా! .. అభ్యాస వైరాగ్యాల ద్వారా దానిని వశపరచుకోవడం సాధ్యమే! అని తెలియజేశాడు శ్రీకృష్ణుడు.  “అభ్యాసం” + “వైరాగ్యం” ..


రోజులో కాస్సేపు చర్మచక్షువులను మూసేసుకుని కర్మేంద్రియ చాపల్యాలన్నింటినీ లోపలికి ముడుచుకుని .. కూర్చోవడాన్ని “వైరాగ్యం” అంటాం! మరి శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చెయ్యడాన్ని “అభ్యాసం” అంటాం. ఇలా అభ్యాస వైరాగ్యాల ద్వారా ఇంద్రియాలతో కూడిన మనస్సును అదుపులో ఉంచుకున్న వారే మహేంద్రులు. వారి దగ్గరికే అక్షయపాత్ర .. కామధేనువు .. కల్పవృక్షం .. చింతామణి .. వజ్రాయుధం .. ఐరావతం.. ఇలాంటివి అన్నీ వచ్చి చేరుతాయి.


కాబట్టి, మనస్సు పట్ల జాగ్రత్త! మాట పట్ల జాగ్రత్త! మరి చేసే కర్మల పట్ల జాగ్రత్త వహించాలి! వారికే మాట శాంతంగా ఉంటుంది .. మనస్సు శాంతంగా ఉంటుంది .. మరి వారు చేసే కర్మలు ప్రశాంతంగా ఉంటాయి! ఇలా ప్రజలు అందరూ యోగులుగా మారితే భూలోకం అంతా కూడా శాంతిమయం అవుతుంది.

🙏  భగవద్గీత కు జేజేలు! 

వేదవ్యాసుల వారికి సహస్రకోటి ప్రణామాలు 🙏


సేకరణ....