#శుద్ధ భక్తికి ముగ్ధుడైన పూరి జగన్నాథుడు ....
[కళ్ళలో ఆనందభాష్పాలు తెప్పించే కృష్ణుడి లీల] ...
బంధు మహంతి అతని భార్య , ఇద్దరు మగపిల్లలు భోజనం చేయక 2 రోజులు అయ్యింది. వర్షాలు లేక కరువుకు బలి అయిన పేద కుటుంబం అతనిది. ఒడిషాలోని కటక్ మరియు బాలాసోర్ మధ్య వున్న జాజ్పూర్ లో భిక్షమెత్తుకొని వచ్చిన కొంత అన్నాన్ని పిల్లలకు పెట్టి తాను తన భార్య ఇంకా మిగిలివున్న చెట్ల యొక్క ఆకులు తింటూ బ్రతుకుతున్నాడు బంధు మహంతి.
భార్య కంట తడిపెట్టినప్పుడల్లా బంధు ఇలా అనేవాడు '' ఏడవకు. నాకు పూరి నగరంలో ఒక ధనవంతుడైన స్నేహితుడున్నాడు. చాలా మంచివాడు. ఎవరు ఏ సహాయం అడిగినా అతను కాదనడు. మనకూ అతను సహాయం చేస్తాడులే''.
ఒకరోజు భార్య ''మనం మీ స్నేహితుడిదగ్గరికెళ్ళి మన దీనావస్థను చెప్పుకొందాం. ఇంకా ఆలస్యం చేస్తే పిల్లలు చనిపోతారు , '' అంటే బంధు మహంతి భార్య పిల్లల్ని తీసుకొని 144 కి.మీ. దూరం లో వున్న పూరి నగరానికి బయలుదేరాడు. మధ్య దారిలో అడవి వస్తుంది.
1530 వ సంవత్సరం లో నాలుగురోజులు కాలినడకన ప్రయాణించి బంధు మహంతి పురి నగరం చేరాడు. రాత్రి అయ్యింది. '' ఇపుడు నా స్నేహితుడు నిద్ర పోతుంటాడు. నిద్రా భంగం చేయడం మంచిది కాదు. ఉదయం ఆయన ఇంటికి వెళదాం '' అన్నాడు బంధు.
ఆమె సరే అంటూనే '' ఇపుడు పిల్లలకు తినడానికేమీ లేదు. వాళ్లు ఆకలికి ఏడుస్తున్నారు '' అని అంటే అపుడు బంధు '' చూడు , మనం ఇపుడు పూరి జగన్నాథుడి మందిర ప్రాంగణంలోవున్నాం. గుడి తలుపులు మూసేసారు అయినా ఒకసారి ఆ తలుపులనే చూసి వద్దాం అంటూ భార్యా పిల్లల్ని తీసుకొని ద్వారం బయటే నిలబడి కృష్ణ భగవానుడిని ప్రార్థించాడు . ఆరాత్రి అతను చేసిన ప్రార్థన ఎంత గొప్పదంటే సమస్త పురాణాల సారమంతా అందులో వుంది :
'' ప్రభూ , నేను నీ భక్తుడిని . నీవు తప్ప నాకు ఎవరు దిక్కు ? నేను కటిక పేదవాడిని. నేను ఆకలితో వున్నాను. అయినా నాకు బాధ లేదు. కానీ నా భార్య , పిల్లలు ఆకలితో మరణిస్తారేమో. నేను ఇన్ని రోజులూ నా భార్యకు 'నాకో స్నేహితుడున్నాడు, అతను మనకు సహాయం చేస్తున్నాడు' అని చెపుతూ వస్తున్నాను.
కానీ ఆమెకు తెలియదు నీవే ఆ స్నేహితుడని. ఇపుడు వాళ్ళ ఆకలి తీరలేదు, ఏ సహాయం అందలేదు అనుకో, ఆమెకు నీవు వున్నావు అనే విశ్వాసం పోతుంది. నేనది భరించలేను. నా మాటలు నమ్మి నీమీద నమ్మకం పెట్టుకొన్న ఆమెను నిరాశ పరచొద్దు. నీవు వున్నావు , నీవు ఇదంతా చూస్తున్నావు. ఇది నా నమ్మకం. ఆతరువాత నీ ఇష్టం. ''
వాపసు వచ్చి ఆలయ ప్రాంగణంలో కుండల్లో పెట్టిన నీరు త్రాగి అక్కడే పడుకొన్నారు. మధ్యరాత్రి అయ్యింది. ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన బ్రాహ్మణ రూపంలో వున్నాడు. బంధు మహంతి భార్య కళ్ళు మూస్కొన్నది కానీ నిద్రపట్టలేదు. చిన్నగా చప్పుడైతే లేచి కూర్చొంది. ఆ బ్రాహ్మణుడు ఒక పెద్ద పళ్ళెంలో కమ్మని పదార్థాలను ఆమె ముందు పెట్టాడు. ఆమె భావోద్వేగంతో పళ్ళెం అందుకొన్నది. ఆయన వెళ్ళిపోయాడు.
ఆమె బంధును, పిల్లల్ని నిద్రలేపి 'ఒక బ్రాహ్మణుడు వచ్చి ఇది ఇచ్చిపోయాడు ' అని చెప్పింది. బంధు అన్నాడు 'నేను చెప్పాను కదా? నా స్నేహితుడు చాలా మంచివాడు అని. అతనే పంపివుంటాడు.' ఆ రాత్రి జగన్నాథుడే స్వయంగా అందించిన ఆహారాన్ని ఆ పేద భక్త కుటుంబం సంతోషంగా తిని , ఆ పళ్ళాన్ని కడిగి గుడ్డ సంచిలో పెట్టి నిద్ర పోయారు.
కథ అయిపోయిందా? లేదు . ఇపుడు మొదలౌతుంది.
తెల్లవారింది. జగన్నాథ దేవాలయం అర్చకులు మందిరం తలుపు తెరచి , స్వామి విగ్రహానికి నీళ్ళతో అభిషేకించి , అలంకరించబోతుంటే అక్కడుండాల్సిన బంగారు పళ్లెం లేదు. నిమిషాల్లో వార్త అందరికీ తెలిసిపోయింది. ఇంతలో ఆలయంలో పనిచేసే ఒక వ్యక్తి బంధు దగ్గర బంగారు పళ్ళెం వుండటాన్ని చూసి , అధికారులకు చెప్పాడు.
వాళ్ళు అర్చకులతో కలిసివచ్చి బంధును పట్టుకొని కొట్టడం మొదలుపెట్టారు. బంధు ఏమీ మాట్లాడటం లేదు. కళ్ళు మూసుకొని దెబ్బలు తింటూనే మనసులో ' నేను దొంగను అని వీళ్లు నన్ను కొట్టినంతమాత్రాన, నీపై నాకున్న నమ్మకం పోతుందా? నీవు వున్నావు, ఇదంతా చూస్తున్నావు ' అని జగన్నాథుడైన కృష్ణుడితో అంటున్నాడు.
అతని భార్య మాత్రం ఏడ్చుకొంటూ ' ఆయన్ని కొట్టకండి. ఆయనకు ఏమీ తెలియదు. నిన్నరాత్రి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఈపళ్ళెంలో నాకు ఆహారం ఇచ్చి వెళ్ళిపోయాడు. మేము దొంగలం కాదు,'' అని అంటున్నా వాళ్ళు వదల్లేదు. బంధును తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఆలయప్రాంగణంలో ఒక చెట్టు క్రింద ఏడ్చి ఏడ్చి పిల్లలను గుండెలకు హత్తుకొని బంధు భార్య సొమ్మసిల్లి పడిపోయింది.
రాత్రి అయ్యింది. పూరి నగరంలోవున్న అప్పటి రాజు ప్రతాపరుద్రుడికి మధ్యరాత్రి ఒక కల వచ్చింది. '' అక్కడ నా భక్తుడు చెరసాలలో బాధపడుతుంటే , ఇక్కడ నీవు హాయిగా నిద్రపోతున్నావా ? అతను నాకు నిజమైన భక్తుడు. అతను నిరపరాధి. అతనికి బంగారు పళ్ళెంలో ఆహారాన్ని ఇచ్చింది నేనే , '' అని స్పష్టంగా ఎవరో చెప్పారు. ఆయన కాక ఇంకెవరు చెప్పివుంటారు ?
ఆ క్షణమే ప్రతాపరుద్రుడు జగన్నాథ మందిరానికి వెళ్ళి , అధికారులందరినీ రమ్మని ఆదేశించాడు. బంధు భార్య గురించి అక్కడివారు రాజుకు చెప్పారు. వారినీ అక్కడికి తీసుకురండి చెప్పి , స్వయంగా ప్రతాపరుద్ర రాజే జైలు గదికి వెళ్ళి , తాళాలు తీయించాడు. ఆ తరువాత ఆయన చేసిన పని అక్కడున్న వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఒడిషా మహారాజు అయిన ప్రతాపరుద్రుడు , బంధు మహంతి కాళ్ళకు సాష్టాంగ ప్రమాణం చేసాడు. అంతే కాదు , అక్కడిక్కడే బంధు మహంతిని పూరి జగన్నాథ మందిరపు వంటశాలకు ప్రధాన వంటవాడి గా నియమించాడు. అదొక్కటే కాదు , బంధు మహంతి కుటుంబానికి జగన్నాథ దేవాలయం యొక్క ప్రధాన వంటవాళ్ళు గా శాశ్వత హక్కులు కల్పించాడు.ఇప్పటికీ బంధు మహంతి కుటుంబమే 494 సంవత్సరాలుగా జగన్నాథ దేవాలయంలో వంటపనిని నిర్వహిస్తున్నారు.
నమ్మక బాగుపడినవారు.. లేరు .. నమ్మి చెడినవారు లేరు.
.
..జై.. జగన్నాధ్ ....
0 comments:
Post a Comment