Wednesday, May 28, 2025 By: visalakshi

శ్రీ దత్త స్తవము....

                      ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః



శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వాములవారు (టెంబేస్వామి)దత్తస్వామిని సదా కీర్తించిన స్తవమే ఈ శ్రీ దత్తస్తవము. వారు భక్తులకు దత్తాత్రేయుడు అనుగ్రహం సులభంగా లభించాలన్న తపనతో, దత్తస్వామిని ఆర్తితో స్మరించి ఈ స్తవాన్ని రచించారు. ఈ దత్తస్తవము అమిత శక్తివంతమైనది. దత్త స్తోత్రాలన్నింటికీ ఇది తలమానికం లాంటిది. దత్తుడి అనుగ్రహాన్ని సత్వరమే అందించే విశేషశక్తి కలిగి వుండడం ఈ స్తోత్ర ప్రత్యేకత. ఈ విశేషాన్ని గ్రహించిన ఎందరో ఉపాసకులు దీనిని పఠించి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రగతిని సాధించారు. ఈ స్తవాన్ని నిత్యం పఠించేవారికి దత్తుడే రక్షకుడిగా ఉంటాడు అంటే సత్యదూరం కాదు.

ఈ దత్తస్తవ పారాయణతో ఎంతోమందికి మనశ్శాంతి కలిగింది. దీర్ఘ రోగాలు నివారణ అయ్యాయి.ఇది సమస్త గ్రహదోషాలు నివారిస్తుంది. సర్వ అనర్ధాలనూ..సమస్త క్లేశాలనూ నివారించి సకల శుభాలు ఒనగూర్చుతుంది భావాన్ని గ్రహించి పారాయణ చేయడం ఫలప్రదం.

  శ్రీ దత్త స్తవము...

1.దత్తాత్రేయం మహాత్మానాం వరదం భక్తవత్సలం !

   ప్రపన్నార్తి హరం వందే స్మర్తృగామి సనోవతు !!

భా...మహాత్ముడు , వరములనిచ్చేవాడు , భక్తులను కన్నబిడ్డలవలె రక్షించేవాడు , ఆశ్రయించినవారి బాధను తొలగించేవాడు అయిన దత్తాత్రేయ స్వామికి వందనం చేస్తున్నాను. స్మరించగానే వచ్చి దత్తాత్రేయుడు మమ్ము రక్షించుగాక!

2. దీనబంధుం కృపాసింధుం సర్వకారణ కారణం !

   సర్వ రక్షాకరం వందే స్మర్తృగామి సనోవతు !!

భా..దీనజన బాంధవుడు, దయాసముద్రుడు, సర్వకారణాలకు మూలకారణమైనవాడు , సమస్త రక్షణలను ఇచ్చేవాడు అయిన దత్తాత్రేయ స్వామికి వందనం చేస్తున్నాను.స్మరించగానే వచ్చి దత్తాత్రేయుడు మమ్ము రక్షించుగాక!

3. శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణం !

    నారాయణం విభుం వందే స్మర్తృగామి సనోవతు !!

భా..తనను శరణు వేడినవారిని ,దీనులను ,ఆర్తులను బాధలనుండి రక్షించడమే కర్తవ్యంగా కలవాడు , నారాయణ స్వరూపుడు , విశ్వవ్యాపకుడు అయిన దత్తాత్రేయ స్వామికి వందనం చేస్తున్నాను. స్మరించగానే వచ్చి దత్తాత్రేయుడు మమ్ము రక్షించుగాక !

4. సర్వానర్ధ హరం దేవం సర్వ మంగళ మంగళకం !

    సర్వక్లేశ హరం వందే స్మర్తృగామి సనోవతు !!

భా.. సర్వ అనర్ధాలనూ హరించేవాడు ,  భగవంతుడు , అన్ని శుభాలకు శుభకరుడు , సమస్త దుఃఖాలను నివారించేవాడు అయిన దత్తాత్రేయ స్వామికి వందనం చేస్తున్నాను. స్మరించగానే వచ్చి దత్తాత్రేయుడు మమ్ము రక్షించుగాక!

5. బ్రహ్మణ్యం ధర్మ తత్వజ్ఞం భక్త కీర్తి వివర్ధనం !

   భక్తాభీష్టప్రదం వందే స్మర్తృగామి సనోవతు !!

భా..బ్రహ్మజ్ఞానియు ధర్మతత్వము నెరిగినవాడు , తన భక్తుల కీర్తిని వర్ధిల్లజేయువాడు ,భక్తుల కోర్కెలు నెరవేర్చేవాడు అయిన దత్తాత్రేయ స్వామికి వందనం చేస్తున్నాను. స్మరించగానే వచ్చి దత్తాత్రేయుడు మమ్ము రక్షించుగాక!

6. శోషనం పాప పంకస్య దీపనం జ్ఞాన తేజసః !

   తాప ప్రశమనం వందే స్మర్తృగామి సనోవతు !!

భా.. పాపాలనే బురదను ఎండింపజేసేవాడు , జ్ఞానాన్ని తేజస్సు ను అభివృద్ధి చేసేవాడు తాపత్రయాలను(అనగా శారీరక.. మానసిక.. దైవిక తాపాలను)  నశింపజేసేవాడు అయిన దత్తాత్రేయ స్వామికి వందనం చేస్తున్నాను. స్మరించగానే వచ్చి దత్తాత్రేయుడు మమ్ము రక్షించుగాక !

7. సర్వరోగ ప్రశమనం సర్వ పీడా నివారణం !

    విపదుద్ధరణం వందే స్మర్తృగామి సనోవతు !!

భా.. సర్వరోగాలనూ ఉపశమింపజేసేవాడు ,సర్వ పీడలనూ నివారించేవాడు , ఆపదలనుండి ఉద్ధరించేవాడు అయిన దత్తాత్రేయ స్వామికి వందనం చేస్తున్నాను. స్మరించగానే వచ్చి దత్తాత్రేయుడు మమ్ము రక్షించుగాక !

8. జన్మ సంసార బంధఘ్నం స్వరూపానంద దాయకం!

    నిశ్శ్రేయస పదం వందే స్మర్తృగామి సనోవతు !!

భా.. జనన మరణాలతో కూడిన సంసార బంధనాలను తెగగొట్టేవాడు , జీవుడికి తన నిజ స్వరూపమైన బ్రహ్మానందాన్ని ప్రసాదించేవాడు , మోక్షపదాన్ని అనుగ్రహించేవాడు అయిన దత్తాత్రేయ స్వామికి వందనం చేస్తున్నాను. స్మరించగానే వచ్చి దత్తాత్రేయుడు మమ్ము రక్షించుగాక !

9. జయలాభ యశః కామ దాతు ర్దత్తస్య యస్తవం!

    భోగ మోక్షప్రద స్యేమం ప్రపఠేత్ న కృతీ భవేత్ !!

భా.. జయము , లాభము ,యశస్సులను కలుగజేసేవాడు , కోరికలు నెరవేర్చేవాడు , భోగము ,మోక్షములను ప్రసాదించేవాడు అయిన దత్తాత్రేయుడి యొక్క ఈ స్తోత్రాన్ని ప్రతి నిత్యం ఏకాగ్రతతో పఠించేవారు కృతకృత్యులౌతారు.

                 ఓం శ్రీ దత్తాత్రేయ నమో నమః...



0 comments: