ఈ విశ్వానికే అధిపతి అయిన భగవంతుడు కోటానుకోట్ల జీవులను సృష్టించినప్పటికీ ఆయనకు సంతృప్తి కలుగలేదు. భగవానుని అనంత శక్తిని అవి గ్రహించలేకపోయాయి. అందుచేత భగవంతుడు ప్రత్యేకముగా మానవుని సృష్టించి వానికి జ్ఞానమనే ప్రత్యేక శక్తిని ప్రసాదించాడు. జ్ఞానము సహాయముననే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు.ఈ కారణము చేతనే దేవతలు సైతము మానవజన్మను ఈర్ష్యతో చూచెదరు. వారు కూడా భూమిపై మానవజన్మమెత్తి మోక్షమును సాధించవలెనని కోరెదరు. శరీరముండుట చేతనే మానవుడు తన దేహము యొక్క జగత్తు యొక్క అనిత్యత్వమును గ్రహించి ఇంద్రియ సుఖముల పట్ల విరక్తి పొంది నిత్యానిత్యవివేకముతో కడకు భగవత్సాక్షాత్కారమునుపొందుచున్నాడు.
మానవుడు భగవంతుని లీలలను, అద్భుతకార్యములను, మహత్యాలను జూచి పరవశమొందినప్పుడు భగవంతుడు మిక్కిలి సంతుష్టి జెంది ఆనందించును. అందుచే మానవ జన్మ లభించుట జన్మ సార్ధకము.
మానవ జన్మ యొక్క విలువను గ్రహించి ఈ దేహము నశ్వరమని..దేహానికి మరణం అనివార్యమని గ్రహించి జీవిత పరమావధిని సాధించుటకై విసుగు,విరామములేక రాత్రింబగళ్ళు కృషిచేసి ఆత్మసాక్షాత్కారమును సంపాదించవలెను. అహోరాత్రములు ఆత్మయందే ధ్యానము నిలువవలెను. ఈ మన ధ్యేయము సత్వరము ఫలించాలంటే సద్గురువు సాయినాధుని సాంగత్యములో అది సాధ్యము. ఆధ్యాత్మిక ఉపన్యాసములు ఎన్ని విన్ననూ, ఆధ్యాత్మిక గ్రంధములెన్ని చదివినను..తెలియరాని ఆత్మసాక్షాత్కారము సద్గురువు సాయినాధుని సాంగత్యములో సులభముగా పొందవచ్చును. ఆ జ్ఞానమునంతయు సద్గురువు చెప్పగలరు. వారి చర్యలు..సామాన్య సంభాషణలే మనకు మౌనప్రబోధములు. శాంతి, క్షమ, వైరాగ్యము, దానము, ధర్మము, మనోదేహములను స్వాధీనమందుంచుకొనుట, అహంకారము లేకుండుట మొదలగు శుభలక్షణములను సద్గురువు ఆచరణలో చూచి భక్తులు నేర్చుకొందురు. సాయిబాబా వారి పావనచరితములు భక్తుల మనములకు ప్రబోధము కలుగచేసి వారిని పారమార్ధికముగా ఉద్ధరించును. సద్గురువు సాయినాధుడు అట్టి మహా పురుషుడు. వారెప్పుడూ ఆత్మానుసంధానము నందే నిమగ్నులగుచుందురు. వారు స్థిరచిత్తులు. వారి చర్యలు నిగూఢములు. బాబావారి ప్రేమానురాగములు కొలువరానివి. స్వామి అనుగ్రహము ఇంతయని చెప్పుటకు అలవికానిది. బాబా వారి ఆదేశములలో అద్భుతమైన సందేశాలుంటాయి. అవి తెలుసుకున్నవారు ధన్యులు.
భక్తుల కొరకు మానవరూపమున అవతరించిన భగవతత్త్వమే సాయిబాబా. వారి కరుణ, అనుగ్రహము అద్భుతములు. వారే కరుణతో మన వంటి భక్తులను తమ వద్దకు చేర్చుకొనకుండిన వారి మహత్యమును తెలుసుకొనగల శక్తి యెవరికి గలదు? బాబావారు శుద్ధచైతన్యస్వరూపులు. విరాగులు, ముక్తులు, పరిపూర్ణులు. బాబా ఎల్లప్పుడు తమ ఆత్మస్వరూపమునందే లీనమై సర్వులకు హితము చేయుటయందు నిమగ్నమై యుండువారు. శ్రీసాయిబాబాను భక్తిప్రేమలతో స్మరించుటయే జీవన్మరణరూపమైన సంసారమనెడు చిక్కుముడిని విప్పు తరుణోపాయము. ఈ సాధనలో వ్యయప్రయాసలు లేవు. మన దేహేంద్రియములలో పటుత్వమున్నంత వరకు ప్రతి నిమిషమును ఈ సాధనమును అనుష్ఠించుటకు గురు సన్నిధిలో సద్గురువు చరణములను నమ్మి కొలువవలెను. మనయొక్క అంతరంగమున గల భక్తిప్రేమలను బట్టి సద్గురువు మనకు జ్ఞానమును, శాశ్వతానందమును ప్రసాదించును.
సద్గురువు సాంగత్యమున కలుగు మహిమ చాలా అద్భుతము. అది మన అహంకారమును, దేహాభిమానమును నశింపజేయును. చావుపుట్టుకలనే బంధములను కూడా నశింపజేయును. కేవలము హృదయ పూర్వకంగా సద్గురువును వంటి మహాత్మునాశ్రయించిన వారు మనలను భవసాగరము నుండి తరింపజేయుదురు. పూర్వజన్మ సుకృతము వలన శ్రీ సాయిబాబా పాదములనాశ్రయించు భాగ్యము మాకు లభించినది. మసీదుగోడ కానుకొని ఊదీమహాప్రసాదమును తనభక్తుల యోగక్షేమములకై పంచి పెట్టు సుందరస్వరూపుడు, ఈ ప్రపంచము యొక్క అభావమును చింతించువాడు, సదా పూర్ణానందములో మునిగియుండు వాడునగు శ్రీ సాయి పాదములకు సాష్టాంగనమస్కారములు చేయుచూ ...పరబ్రహ్మ స్వరూపులైన సాయినాధుడి కృప అందరికీ కలగాలని కోరుకుంటూ....
సర్వం శ్రీసాయినాధార్పణ మస్తు
0 comments:
Post a Comment