Tuesday, October 10, 2017 By: Veda Sri

ఆత్మీయత-అంతరంగం

 ఓం శ్రీ సాయినాధాయ నమ:


ఆత్మీయత అనేది అంతరంగ భావం. జనన కాలం నుండి ఆత్మీయానురాగాలను మనం పొందుతాం.మనమూ ఆస్వాదిస్తాం. అది ఒక కుటుంబ పరంగా కావచ్చు ..స్నేహం కావచ్చు..మరేదైనా బంధం కావచ్చు. అందరినీ ఆత్మీయులుగా భావించి పరస్పర అవగాహన మేరకు సంభాషణలు చేసుకుంటాము. కానీ "ఆత్మీయత"కు నిర్వచనం ఏమిటి? అంటే చెప్పగలమా...అది అనుభవిస్తేనే ఆ మధురత తెలుస్తుంది. "రెండు వేరు వేరు నదులలోని జలాలను ఒక కలశంలో పోస్తే ఆ జలాలు అవినాభావ సంబంధంతో కలిసిపోయి ఉంటాయి." అలాగే "ఆత్మీయులు" అంతరంగాన మిళితమైన భావనలతో కలిసి ఉంటారు. స్నేహాన్ని మించిన సహచర్యంతో సంతోషభావ ప్రకాశకులై ఉంటారు.    

ఆత్మీయత, అనురాగాలకు దర్పణం రామాయణ కావ్యం. సోదరుల మధ్య అనురాగము, భార్యాభర్తల మధ్య ఆత్మీయానురాగము.. తండ్రీ కుమారుల ఆత్మీయతా మమకారము.. ఇలా రామాయణ మహా గ్రంధములో ఆత్మీయతతో కూడిన అంతరంగాలకు ప్రతి పాత్ర అద్దం పడుతుంది. ఆత్మీయతకు ప్రతిరూపం ఆదికావ్యంలోని శ్రీ రామచంద్రమూర్తి. 

సీతారాముల కళ్యాణంగా శ్రీరామనవమిని భక్తిశ్రద్ధలతో మనం జరుపుకుంటాం. ఎంతో భక్తితో కోదండరాముణ్ణి అర్చిస్తాము. సీతారాముల తరువాత దైవత్వస్థాయిని పొందిన రామదూత "హనుమంతుడు". సీతారాములకు భక్తితో దాసుడైన హనుమంతునకు.. మనము భక్తితో శ్రీ ఆంజనేయకు  దాసులం.
శ్రీరామపట్టాభిషేకం తరువాత ఒకరోజు సీతారామలక్ష్మణులు తమ మందిరంలో ఉన్న హాలులోకి వెళ్ళారు. ఒక్కొక్క చిత్రపటం చూసి దానిగురించి చెప్పుకుంటూ హనుమంతుడి చిత్రం వద్దకు వచ్చారు. లక్ష్మణుడు 'అయం ఆర్యో హనుమాన్- ఈ పూజ్యుడు హనుమంతుడు '  అన్నాడు.... సీత, 'ఏష స: చిరనిర్విణ్ణజీవలోకప్రత్యుద్ధరణగురూపకారీ మహానుభావో మారుతి:- చిరకాలంగా నిర్వేదంలో పడి దు:ఖిస్తున్న జీవలోకాన్ని ఆ దు:ఖమునుంచి    బయటపడేసి మహోపకారం చేసిన మహానుభావుడు ఈ హనుమంతుడు ' అంది.....రాముడు  'దిష్ట్యా  సో2 యం మహాబాహు: అంజనానందవర్ధన: యస్య వీర్యేణ కృతినో వయం చ భువనాని చ - ఎవరి పరాక్రమం వలన మేమూ, లోకాలూ కృతార్ధులమయ్యామో ఆ మహానుభావుడు ఈ ఆంజనేయుడు ' అన్నాడు.

రామపట్టాభిషేకం అయిన తరువాత రాముని అనుమతితో వానరులూ రాక్షసులూ వారి వారి దేశాలకు వెళుతున్నారు. అప్పుడు  హనుమ ఇలా అన్నాడు.

శ్లో"స్నేహో మే పరమో రాజంస్త్వయి తిష్ఠతు నిత్యదా,
     భక్తిశ్చ నియతా వీర భావో నాన్యత్ర గచ్చతు.

రామా! నాకు నీపట్ల నిత్యమూ స్నేహమూ, అచంచలమైన భక్తీ ఉండుగాక! నా మనస్సు ఇతరవిషయాలవైపు మరలకుండా ఉండుగాక. ఈ భూలోకంలో నీ చరిత్ర ఎంతవరకు మానవులు చెప్పుకుంటారో అంతవరకూ నేను జీవించే ఉంటాను. నీ చరితామృతం వింటూ, నీకు దూరమయ్యాననే బెంగను తొలగించుకుంటాను.

శ్లో"ఏవం బ్రువాణం రామస్తు హనూమంతం వరాసనాత్,
     ఉత్ధాయ సస్వజే స్నేహద్వాక్యమేతదువాచ హ.

హనుమను రాముడు స్నేహత్వభావంతో అంతరంగాన ఆత్మీయమైన గౌరవభావము ఉప్పొంగగా. సింహాసనము దిగి .ఆనందముతో కౌగలించుకున్నాడు. ఆ వాయునందనుడు చేసిన మహోపకారాలకు తన కృతజ్ఞత అనితరసాధ్యమైన రీతిలో తెలియజేసాడు.

 శ్లో" ఏకైకస్యోపకారస్య ప్రాణాన్ దాస్యామి తే కపే,
      శేషస్యేహోపకారాణాం భవామ ఋణినో వయం.

హనుమా! నువ్వు మాకు ఎన్నో ఉపకారాలు చేసావు. వాటిలో ఒక్కొక్క ఉపకారం ఎటువంటిదంటే కేవలం ఆ ఒక్క ఉపకారానికే నా ప్రాణాలు ధారపోసినా కూడా నీ ఋణం తీరదు. మిగిలిన ఉపకారాల ఋణం మిగిలే ఉంటుంది. వాటికి నీకు (శాశ్వతంగా) ఋణగ్రస్తుడినయే ఉంటాను. 

శ్లో" మదంగే జీర్ణతాం యాతు యత్త్వయోపకృతం కపే,
     నర: ప్రత్యుపకారాణామాపత్స్వాయాతి పాత్రతాం.

మనం ఆపదలలో ఉండగా ఎవరైనా మిత్రుడు ఉపకారం చేస్తే తరువాతికాలంలో ఆ మిత్రుడికి ప్రత్యుపకారం చెయ్యాలనుకుంటాం. కానీ ఆ మిత్రుడికి ఆపద వస్తేనే మనకి ప్రత్యుపకారం చేసే అవకాశం వస్తుంది. నేను నీకు ప్రత్యుపకారం చెయ్యాలని కోరుకోను. (ఎందుకంటే నువ్వు చేసిన ఉపకారాలకి నీ ఋణం తీర్చుకోవాలంటే నీకు ఆపదలు కలగాలి. నీకు ఆపదలు కలగాలని కలలో కూడా కోరుకోలేను కనుక నీ ఋణం ఎన్నటికీ తీరదు.) "అందుచేత నువ్వు చేసిన మహోపకారాలన్నీ నాలోనే జీర్ణమైపోతాయి."  రాముడు ఇంత గొప్ప మాట హనుమను తప్ప ఇంకెవరిని గురించీ అనలేదు. వెంటనే రాముని మెడలో ఉన్న అమూల్యమణిహారం తీసి హనుమంతుడి మెడలో వేసి తన అత్యంత ఆత్మీయతను కనపరిచాడు.
హనుమంతుడు రామాయణ మహామాలారత్నం. అరిషడ్వర్గాన్ని జయించినవాడు కనుక జితేంద్రియుడు అని, రాముడు మెచ్చిన తెలివైనవాడు కనుక బుద్ధిమతాం వరిష్ఠం అన్నారు. హనుమ ఉన్నచోట భయం ఉండదు. ధైర్యం ఉంటుంది. కార్యదీక్ష ఉంటుంది. విజయం ఉంటుంది. అనితర సాధ్యమైన కార్యాలు సాధించినా ఆత్మస్తుతి ఉండదు. వినయమే ఉంటుంది. ఆవేశం కాకుండా ఆలోచన ఉంటుంది.ఇవన్నీ హనుమద్భక్తులుగా మనం నేర్చుకొని ఆచరించవలసిన అంశాలు.


  

రామాయణంలో శ్రీరాముడి సాన్నిహిత్యం కన్న తమకి వేరే ఏమీ అక్కరలేదనుకొని కోరి రాముడికి దాసులైనవారు ఇద్దరు. వారు లక్ష్మణుడు, హనుమంతుడు.. లక్ష్మణుడు పుట్టుకనుంచీ రాముడితో కలిసి ఉన్నాడు. తన జీవితం రాముడికే అంకితం చేసాడు. రాముడి గుణగణాలు చూసి తనంత తాను కోరి రాముడికి దాసుడయ్యాడు. లంకలో రాక్షసుల మధ్య నిలబడి తానెవరో చెప్తూ 'దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణ: - నేను కోసలదేశాధిపతి రాముడికి దాసుణ్ణి ' అని తన గుర్తింపును తెలిపాడు హనుమంతుడు. 

పట్టాభిషేకం తదుపరి రాముడు అనేక దానములు చేసి వానరులకు, రాక్షసులకు విలువైన కానుకలు ఇచాడు. సీతమ్మకు అమూల్యమైన వస్త్రాలు,ఆభరణాలూ ఇచ్చాడు. ఆమెకి చంద్రకాంతిలా ఉన్న స్వచ్చమైన ముత్యాలహారం ఇచ్చాడు. సీత ఆ హారం తన మెడనుంచి తీసి రాముడివైపు, హనుమవైపు, వానరులవైపు చూసింది. ఆమె  ఆలోచన  గ్రహించిన రాముడు సీతా! తేజస్సు,యశస్సు,నేర్పు,సామర్ధ్యం,వినయం,నీతి,పౌరుషం,పరాక్రమం,తెలివి-ఇవన్నీ సర్వదా ఎవరిలో ఉంటాయో, నువ్వు ఎవరిపట్ల ఆనందంగా ఉంటావో అతడికి ఆ హారం ఇయ్యి 'అన్నాడు. సీత వెంటనే ఆ ముత్యాలహారం హనుమంతుడికి బహుకరించింది. అంతటి మహిమాన్విత మహానుభావునికి మనము మనసారా సాష్టాంగ వందనాలు అర్పిస్తూ....


పవమానసుతుడు పట్టు పాదారవిందములకు,
నీ నామరూపములకు నిత్యజయమంగళం.
  


   0 comments: