Thursday, February 2, 2017 By: Vedasree

ఆదిత్య తేజం

 ఓం ఆదిత్యాయ నమో నమ:


 ఓం విశ్వాని దేవ సవితర్ దురితాని పరాసువ!
యద్  భద్రం తన్న ఆసువ!!  (యజుర్వేదము 30 - 3)


 ఈ వేద మంత్రంలో మూడు శబ్దాలున్నాయి. సవిత, దురుతములు, భద్రం. సవితా శబ్దానికి సృష్టికర్త, పరమాత్ముడు, ప్రేరకుడు, సూర్యుడు అనే అర్ధాలున్నాయి. రాత్రి గడచి ఉదయం సూర్య కిరణాలు వస్తువులపై పడగానే ఆ పదార్ధాలు - వస్తువులలో ఒక విధమైన ప్రేరణ జాగృతి కలుగుతుంది. అందుకే సూర్యునికి కూడా సవితా అనే పేరుంది. సూర్యుడు క్రొత్తగా ఏదీ ఉత్పన్నం చేయడు. పదార్ధాలలో సహజంగా దాగి ఉన్న శక్తే సూర్యకిరణాల స్పర్శతో ప్రకటమౌతుంది. వాటికి క్రొత్త జీవనం వస్తుంది. వేదమూర్తి ర్మహాభాగో - జ్ఞానదృష్టి ర్విచార్య చ !
 బ్రహ్మణా స్థాపితం పూర్వం - యాతయామవివర్జితం .

యాజ్ఞవల్క్యో మునిశ్రేష్ఠ: - కృతకృత్యో2భవ త్తదా !
ఋగాదిసకలాన్ వేదాన్ - జ్ఞాతవాన్ సూర్యసన్నిధౌ .   - (ఆదిత్య కవచం)


 ఆదిదేవ! నమస్తుభ్యం - ప్రసీద మమ భాస్కర !
 దివాకర! నమస్తుభ్యం - ప్రభాకర  నమోస్తుతే .

" సమస్త జీవకోటికి ఆ దినకరుడు తన అపారశక్తితో ధీర్గాయువును, ఆయురారోగ్యాలనూ ప్రసాదిస్తున్నాడు.  భాస్కరుడిని వేదాలు కొలిచాయి. 'నరుడికైతే ఆదిత్యుడు నడయాడే పరమాత్మ.'  ప్రత్యక్ష దైవం.  భాస్కరుడిని తొలిదేవుడిగా  ఆరాధించాడు  మానవుడు. "

ఓం స్వస్తి పంధా మనుచరేమ సూర్యా చంద్రమసావివ!
పునర్దదతా ఘ్నతా జానతా సంగమేమహి!! (ఋగ్వేదం 5-51-15)

సమస్త మానవులు సూర్యచంద్రులను ఆదర్శంగా తీసుకొని ఉన్నతమార్గంలో నడవాలి అని ఈ వేద మంత్రాభిప్రాయం. పగలు సూర్యుని ద్వారా కాంతి,  రాత్రి చంద్రుని ద్వారా శాంతి మనకు లభిస్తాయి. దదతా అంటే దానగుణం. అఘ్నతా అంటే అహింసను పాటించడం. జానతా అంటే ఇతరులను గూర్చి తెలుసుకోవడం. ఉత్తమ సమాజ నిర్మాణానికై దానగుణం, అహింస, పరస్పర అవగాహన అనే ఈ మూడు సుగుణాలు చాలా అవసరం. 


సృష్టిలో సూర్య చంద్రులు పరమాత్ముని ద్వారా చైతన్యం కలిగిన వసుదేవతలు. ఈశ్వరాజ్ఞతో అవి నిరంతరం వాటి వాటి కక్ష్యలలో చరిస్తున్నాయి. ఈ దేవతలు ఒక్కరోజు కనిపించకపోతే సమస్త భూమండలం అంధకారంగా నిర్జీవంగా, అచేతనంగా కనిపిస్తుంది. సూర్యునితోనే ప్రపంచానికి కాంతి, చైతన్యం, స్పృహ కలుగుతాయి. సూర్య,చంద్ర నక్షత్రాదులు ఆ పరమాత్ముని అధీనంలో ఉన్నాయి. శ్రీమన్నారాయణుడే వీటికి అధిష్ఠాత. 

సూర్య  మహాత్ముని అవతరణ....


బ్రహ్మపురాణములో ఇతిహాసగాధ ప్రకారం.. శ్రీమన్నారాయణుడి వర ప్రధానంతో బ్రహ్మ ఉద్బోధనతో దక్ష ప్రజాపతి దంపతులకు ఈసారి 60 మంది కుమార్తెలు కలిగారు.  దక్షుడు వారిలో 10 మందిని యమధర్మరాజుకు, 13 మందిని కశ్యప మునికి, 27 మందిని చంద్రునికి, ఇద్దరిద్దరు చొప్పున భూతుడికి, అంగిరసుడికి, కృశాశ్వుడికి, మిగిలిన నలుగురిని తార్ష్యునికి ఇచ్చి వివాహం చేశాడు. తార్ష్యుని భార్యలు వినత, కద్రువ, పతంగి,యామిని. వీరిలో పతంగికి పక్షులు, యామినికి మిడతలు, వినతకు( స్థావర జంగము)  గరుత్మంతుడు, అనూరుడు పుట్టగా కద్రువకు సర్పాలు పుట్టాయి. చంద్రుని భార్యలు కృత్తికాది 27 నక్షత్రాలు. దక్షుని కూతుళ్ళందరికీ సంతానం కలిగింది. అలా పుట్టినవారిలో దేవతలున్నారు, రుద్రగణాలున్నాయి, భయంకరులైన ప్రేతలు,పితృగణాలు కూడా ఉన్నాయి. కశ్యపుని భార్యలలో తిమికి జలచరాలు,  .....సురసకు రాక్షసులు, అరిష్టకు గంధర్వులు, దనువుకు దానవులు 18 మంది పుట్టారు. దితికి దైత్యులు జన్మించారు  అసురుల ఆట కట్టించగల అపారశక్తిమంతుడిని బిడ్డగా ప్రసాదించమని అదితి సౌరశక్తిని ప్రార్ధించింది. గర్భం ధరించి  అలాంటి పుత్రునికై వ్రతాలూ, ఉపవాసాలూ చేస్తున్న అదితిని కశ్యపుడు ఎగతాళిగా బిడ్డను ఆకలితో చంపేస్తావా అని అరిచాడు. ఆ మాటకు తల్లి మనసు గాయపడి నిరసనగా తన గర్భాండాన్ని త్యజించింది. నేలమీదపడ్డ ఆ అండం వేడికి సృష్టి తల్లడిల్లింది. అదితీకశ్యపుల ప్రార్ధనతో ఆ అండం పగిలి వెలుగులు వెదజల్లుతూ బాల భానుడు అవతరించాడు. అదితి గర్భాన శ్రీమన్నారాయణుడు భానుడుగా అవతరించాడు. ఆ రోజు మాఘశుద్ధ సప్తమి. "రధసప్తమి". అదితికి  భానుడు గాక 12మంది ఆదిత్యులు పుట్టారు. అదితికి జన్మించినవారు సాత్విక గుణములు కలవారు  దేవతలు.   మిగిలినవారికి జన్మించినవారు రాజసిక, తామసిక గుణములు కలిగినవారు.
కాలమానం, క్షణం, ముహుర్తం, పగలు,రాత్రి, రోజులు, వారాలు, పక్షాలు, మాసాలు, సంవత్సరాలు, ఋతువులు, ఆయనాలు ఇవన్నీ సూర్యకాలగమనము వలన ఏర్పడ్డాయి. 

ద్వాదశాదిత్యులు:  ఆదిత్య, సవిత, సూర్య, మిహిర, అర్క,ప్రభాకర, మార్తాండ, భాస్కర, భాను, చిత్రభాను, దివాకర, రవి.  

సూర్యుడు చైత్రమాసం మొదలుకొని ఏ మాసంలో ఏ నామంతో ప్రవర్తిస్తాడో సూతుడు తెలియజేస్తున్నాడు...ద్వాదశాదిత్యులు....
 శ్రీమన్నారాయణ స్వరూపుడైన సూర్యుడు ఒక్కడే అయినా కాలాన్ని బట్టి కార్యభేదాన్నిబట్టి ఋషులు అభివర్ణించారు.

 చైత్రంలో సూర్యుడిని ధాత అంటారు. కృతస్థలి అప్సరగా, హేతి రాక్షసుడిగా, వాసుకి సర్పంగా, రధకృతుడు యక్షుడిగా, పులస్త్యుడు రుషిగా తుంబరుడు గంధర్వుడుగా వారి పనులు వారు నిర్వర్తిస్తారు.


వైశాఖంలో సూర్యుడు అర్యముడు.పులహుడు రుషి, అధౌజుడు యక్షుడు, పుంజిక స్థలి అప్సర, ప్రహేతి రాక్షసుడు, నారదుడు గంధర్వుడు, కచ్చనీరుడు సర్పంగా కార్యనిర్వహణ చేస్తారు. 


జేష్ఠంలో సూర్యుడు మిత్రుడు, అత్రిరుషి, పౌరుషేయుడు రాక్షసుడు, తక్షకుడు సర్పం, మేనక అప్సర, హాహా గంధర్వుడు,రధస్వనుడు యక్షుడు. 


ఆషాఢమాసంలో సూర్యుడిని వరుణుడంటారు. ఆయన కార్యవర్గంలో వసిష్ఠుడు రుషి, రంభ అప్సర, సహజన్యుడు యక్షుడు, హూహూ గంధర్వుడు, శుక్రుడు నాగరాజు, చిత్రస్వనుడు రాక్షసుడిగా ఉంటారు. 


శ్రావణ మాసంలో సూర్యుని ఇంద్రుడు అంటారు. అనుచరులుగా విశ్వాసువు గంధర్వుడు, శ్రోత యక్షుడు, ఏలా పత్రుడు నాగం, అంగిరా రుషి, ప్రంలోచ అప్సర, వర్యుడు రాక్షసుడు ఉంటారు. 

భాద్రపదంలో సూర్యుడు వివస్వనుడు. ఆయనకు తోడుగా ఉగ్రసేనుడనే గంధర్వుడు, వ్యాఘ్రుడనే రాక్షసుడు, ఆసారణుడనే యక్షుడు, భృగువనే రుషి, అనుమోచ అనే అప్సర, శంఖుపాలుచనే నాగరాజు ఉంటారు.

ఆశ్వయుజంలో సూర్యుడు త్వష్టా, జమదగ్ని రుషి, కంబళనాగుడు, తిలోత్తమ అప్సర, బ్రహ్మాపేత రాక్షసుడు, శతజిత్తు యక్షుడు. ధృతరాష్త్ర గంధర్వుడు తమ కార్యాల్ని నిర్వర్తిస్తారు. 

కార్తీక మాసంలో సూర్యుడు విష్ణువు. అశ్వతరనాగుడు, రంభ అప్సర, సూర్యవర్చాగంధర్వుడు, సత్యజిత్ యక్షుడు, విశ్వామిత్రుడు రుషి, మరవాపేతుడు రాక్షసుడు సూర్యగణంలో ఉంటారు.

మార్గశిర మాసంలో సూర్యుడు అంశువు. కశ్యప రుషి, తార్ క్ష్యుడు యక్షుడు, రుతసేనుడు గంధర్వుడు, ఊర్వశి అప్సర, విద్యుచ్చత్రుడు రాక్షసుడు, మహాశంఖుడు నాగరాజు.

పుష్యమాసంలో భగుడు సూర్యుడు. స్పూర్జుడు రాక్షసుడు, అరిష్టనేమి గంధర్వుడు, ఊర్ణుడు యక్షుడు, ఆయువు రుషి, పూర్వచిత్తి అప్సర, కర్కోటకుడు నాగరాజు.

మాఘమాసంలో సూర్యుడు పూషుడు. ఆయన పరివారంలో ధనుంజయుడనే నాగం, వాత రాక్షసుడు, సుషేణగంధర్వుడు, సురుచి యక్షుడు, ఘృతాచి అప్సర, గౌతమరుషి ఉంటారు.

ఫాల్గుణమాసంలో సూర్యుడు పర్జన్యుడు. క్రతు యక్షుడు, వర్చా రాక్షసుడు, భరద్వాజరుషి, సేనజిత్ అప్సర, విశ్వగంధర్వుడు, ఐరావతసర్పం ఆయనకు తోడుగా ఉంటాయి. 

ఇలా ఆరుగురు అనుచరులతో సూర్యనారాయణుడు 12 మాసాలలో సంచరిస్తూ ఉపాసన చేసే భక్తుల పాపాలను నిర్మూలిస్తాడు. ఆయన అలా నడుస్తుంటే వేదమంత్రాలు చదువుతూ రుషులు స్తుతిస్తారు. అప్సరసలు నృత్యం చేస్తారు. గంధర్వులు పాటలు పాడుతారు. నాగరాజులు రధానికి పగ్గాలుగా ఉంటారు. యక్షులు రధాన్ని అలంకరిస్తారు. రాక్షసులు రధాన్ని వెనుకనుంచి తోస్తారు. 60వేలమంది వాలఖిల్యులనే మహర్షులు సూర్యునివైపు చూస్తూ స్తుతి పాఠాలు చదువుతుంటారు. ఇలా ఆదిమధ్యాంతరహితుడైన ఆదినారాయణుడు తన్ను తాను విభజించుకొంటూ ప్రతికల్పంలోనూ ప్రజలను పోషించి, పాలిస్తుంటాడు.  

సూర్యభగవానుని ప్రార్ధిస్తూ భక్తితో ఆవాహన చేసి, స్తవనం, జపము, నామస్మరణ మొదలగు షోడశోపచారములు, స్నాన,పుష్ప,ఫల,ధూప,దీప,నైవేద్య, ఆరతులతో ఆరాధించి.. బ్రాహ్మణులకు దక్షిణ సమర్పించి, భజన,కీర్తనలతో సూర్యభగవానునికి మనసారా సూర్యప్రదక్షిణ నమస్కారములు సమర్పించాలి. ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు సూర్యనమస్కారాలతో పఠించాలి.  సర్వం శుభంకరం.   సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు1 comments:

భారతి said...

చక్కటి టపా. చాలా విషయాలు తెలుసుకోగలిగాను. అభినందనలు వేద.