Wednesday, September 28, 2016 By: visalakshi

అస్తేయ సాధన

 మహాత్మాగాంధీ ఈ అస్తేయాన్ని సత్యాహింసలతో అనుసంధానించి ఇలా అంటారు.."అహింస యొక్క సారమే ప్రేమ". ఎప్పుడైతే మనం నిజంగా ప్రేమిస్తామో అప్పుడు చౌర్యం అనేది అసాధ్యం. మనకు తెలిసిగానీ, తెలియకగానీ ఇతరుల వస్తువులు తీసుకుంటే అపరాధభావానికి లోనవుతాము. మనకు అవసరంలేని వస్తువులను మన దగ్గర ఉంచుకుంటే -అదీ చౌర్యమే. మన నిజమైన అవసరాలు కొన్నే.కానీ మితిమీరిన ఆశలే చౌర్యాలకు పాల్పడేలా చేస్తాయి. దుబారాగా ఖర్చు చేయడం మరొక రకమైన చౌర్యం..పొదుపు చేయడం అస్తేయం.



 మనం తరచుగా అనేకచోట్ల నుండి ఇతరుల భావాలను సేకరించి, మన రచనలలోనూ, ప్రసంగాలలోనూ ఉపయోగించి ఆ ఘనతను మనకు ఆపాదించుకుంటాం..కానీ ఏ మూలం నుండి గ్రహించామో వారిపట్ల కనీసం కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరచకపోవడం కూడా చౌర్యమే!

  ఇక అస్తేయ సాధన ఎలాగో చూద్దాం. ఇందులో స్థూలమైనవి మరియు సులభమైన విషయాలను ముందుగా పరిశీలిద్దాం. ఇంటిని కొల్లగొట్టడం, జేబు దొంగతనాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, తప్పుడు కొలతలు, కల్తీ వ్యాపారం, పన్ను ఎగవేత కోసం తమ ఆదాయాన్ని తక్కువగా చూపడం....ఈ రకమైన పనులన్నింటినీ వదిలిపెట్టటమే అస్తేయ సాధన. 

 స్తేయానికి మూల కారణం - 'మనిషికి ఉన్న అత్యాశే', దాన్ని రూపుమాపడమే నిజమైన అస్తేయ సాధన. ఇక్కడ ప్రతిపక్షభావనం అంటే ఈ దుర్వ్యాపారాలను ప్రేరేపించే ప్రవృత్తులకు వ్యతిరేక ఆలోచనలను ప్రవేశపెట్టడం ద్వారా దీన్ని సాధించవచ్చు.దొంగతనం అనేది చట్టరీత్యా నేరం. అందుకు శిక్ష కూడా పడుతుంది. దొంగతనం వంటి పనులకు పాల్పడిన వ్యక్తుల పట్ల ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతారు.ఆ పని అశాంతికి, అపరాధభావానికి లోను చేస్తుంది. మనిషికి ఆశ ఎన్నటికీ చావదు. మానసిక అస్థిరతకు, బాధలకు అదే మూలకారణం. ఇది మిత్రులను సైతం శత్రువులుగా మార్చివేయగలదు.ఈ రకమైన ఆలోచనలు ప్రతిపక్షభావనలు. ఈ ఆలోచనలు మనిషికి అస్తేయ సాధన పట్ల సంకల్పబలాన్ని కలిగిస్తాయి. 



 ఆధ్యాత్మిక సాధకుడు ఇతరుల నుండి దాచి ఉంచవలసిన పనులు ఎంతమాత్రం చేయరాదు. "ముందు నీ పట్ల నీవు సత్యవంతంగా ఉండు. ఆ తర్వాత ఇతరుల పట్ల కూడా! ఈ విషయంలో ఆత్మవంచనకు తావు ఇవ్వకూడదు."     - శ్రీరామకృష్ణులు... 

 ఎప్పుడైతే సమాజంలో  ధర్మాత్ముల కంతే ధనవంతులే ఎక్కువగా గౌరవించబడతారో, అప్పుడు జనసామాన్యం అంతా అడ్డదారిలోనైనా ధనవంతులు కావాలనే చూస్తారు. ఈ సామాజిక రుగ్మతను నిర్మూలించాలంటే నైతిక ధర్మాలను నిత్య జీవితంలో పునరుద్ధించి అనుసరించాలి.  



అంతరంగంలోను, బాహ్యంగానూ అస్తేయ సాధనను అలవరచుకున్న వ్యక్తి మనస్సు చురుకుగానూ, మిక్కిలి జాగరూకతతోను ఉంటుంది.తత్ఫలితంగా అది యోగసాధనలో పైస్థాయికి ధ్యానం వైపు సులభంగా మొగ్గుచూపుతుంది. దురాశ అనేది ఒక రకమైన బంధం.అది సాధనా మార్గంలో దు:ఖాన్ని కలిగించే అడ్డంకులైన పంచక్లేశాల (అవిద్య, అహంకారం, రాగం, ద్వేషం, అభినివేశం) వంటిది. 

 ఈశావాస్య ఉపనిషత్తులో నొక్కి వక్కాణించిన అస్తేయం యొక్క ఆధ్యాత్మిక దృక్కోణాన్ని ఇప్పుడు చూద్దాం. అంతా ఒక్కటిగా చూస్తున్నప్పుడు, అంతా ఒక్కటిగా ఉన్నప్పుడు ఇక 'చౌర్యం' మాట ఎక్కడ? ఈ రకమైన ఆధ్యాత్మిక భావంలో నెలకొన్న యోగికి ఆశించదగినది ఏదీ లేదు.అలాగని పోగొట్టుకునేది కూడా ఏదీ లేదు. తమలో ఉన్న భగవంతుడే ఆ దొంగలోనూ వ్యక్తం కావడం వారు చూస్తారు. 



  ఒకసారి ఘాజీపూర్ లోని పవహారీబాబా ఆశ్రమంలోకి ఒక దొంగ ప్రవేశించాడు. అతడు ఏదో అలికిడి విని తప్పించుకుందామనేసరికి బాబా మేల్కొన్నారు. తను దొంగిలించిన సొత్తు అక్కడే వదిలేసి ప్రాణభయంతో ఆ దొంగ పరిగెత్తసాగాడు. బాబా కూడా అతనిని వెంబడించి చాలా దూరం పరిగెత్తిన తరువాత అతడిని పట్టుకోగలిగారు. తరువాత బాబా ఆ దొంగను 'నారాయణా అని సంబోధిస్తూ అతడు దొంగిలించిన సొత్తు అతడికే ఇచ్చివేశాడు. ఆశ్చర్యపోయిన ఆ దొంగ తరువాత జీవితంలో గొప్ప సాధువుగా పరిణమించాడు.

 భగవద్గీతలో చెప్పినట్లు ఎవరైతే భగవంతుణ్ణి శరణుజొచ్చి, హృదయపూర్వకమైన భక్తిని కలిగి ఉంటారో అలాంటి వారి యోగక్షేమాలను ఆ భగవంతుడే చూసుకుంటాడు. చరాచర సృష్టి వెనుక ఉన్న ఏకత్వాన్ని ధ్యానించడం, స్తేయ అస్తేయాలనే ద్వంద్వాలకు అతీతమైన ఆధ్యాత్మిక చైతన్యం మనలో జాగృతం అవడం - అస్తేయ సాధన యొక్క అంతిమ లక్ష్యం ఇదే!    

2 comments:

ప్రియ said...

ధన్యవాదములు వేదగారు.
తెలిసిన విషయాలే అయినప్పటికీ, ఆధ్యాత్మిక జాగృతిని కలిగించి, మానవుని ఆత్మోన్నతికి అవసరమైన విషయాలను పదే పదే స్మరణం, మననం, శ్రవణం, పఠనం చేసినప్పుడే ఆచరణ సులభతరం. అటులనే వాటిని ప్రాచుర్యం చేయడం అత్యవసరం. ఏమంటారు?

visalakshi said...

అవును...నిజం చెప్పారు ప్రియగారూ! థాంక్యూ.....