Thursday, September 3, 2015 By: Veda Sri

కుటుంబ భ్రాంతి

  ఓం శ్రీ నారాయణాయ నమో నమ:


 5 సం"లు వయసు గల ప్రహ్లాద మహారాజు తన స్నేహితులకు "మీరు తక్షణమే నారాయణభక్తిని ప్రారంభించాలి" అని చెబుతున్నాడు.అదృష్టవశాత్తు వారికి భగవత్ భక్తుడైన ప్రహ్లాదుని యొక్క సాంగత్యం లభించింది.

 ఎప్పుడు అవకాశం దొరికినను గురువుగారు తరగతిలో లేనప్పుడు ప్రహ్లాదుడు తన స్నేహితులతో 'నారాయణ ' మహామంత్ర కీర్తనలను గానం చేసేవాడు. 


  ఎప్పుడైతే మనం ఈ ఇంద్రియ తృప్తి అనే మాయాజాలంలో చిక్కుకుంటామో దాని నుండి బయటపడటం చాలా కష్టం.అందుకే వైదిక సంస్కృతి ప్రకారం మగపిల్లవానికి 5 సం"ల వయస్సు నుండే ఆధ్యాత్మిక విద్యను బోధిస్తారు.దీనినే బ్రహ్మచర్యం అంటారు. బ్రహ్మచారి తన జీవితాన్ని బ్రహ్మజ్ఞానాన్ని పొందటమే లక్ష్యంగా ఉంచుకుంటాడు.

 ప్రతి ఒక్కరు కుటుంబ మమకారంలో చిక్కుకొని ఉన్నారు.ఎవరైతే కుటుంబ వ్యవహారాలలో మునిగి ఉన్నారో వారికి ఇంద్రియాలను నియంత్రంచటం సాధ్యం కాదని ప్రహ్లాద మహారాజు తెలుపుతున్నాడు. 

  అందరు భౌతిక ప్రేమ బంధాలలో ఉన్నారు. ప్రేమపాశం చాలా బలమైనందు వలన భౌతిక ప్రేమలో ఉన్నవారు ఆధ్యాత్మిక పురోభివృద్ధిని సాధించటం చాలా కష్టం.అందుకే ప్రతి బాలుడికి ఐదు నుండి పదిహేను సం"లమధ్యకాలంలో శిక్షణను ఇవ్వడం వలన వారు సంపూర్ణులు కాగలరు.అని ప్రహ్లాద మహారాజు ప్రతిపాదిస్తున్నాడు.

   మనమందరం ఆత్మస్వరూపులం అయినప్పటికిని ఈ భౌతిక ప్రపంచంలో ఉండి ఎలాగైనా సరే ఆనందాన్ని అనుభవించాలని అనుకుంటాము.ఇదే భౌతికం అంటే!

" ఈ భౌతిక తృప్తి కేవలం స్త్రీ - పురుషుల యొక్క కలయిక పైన ఆధారపడి ఉంటుంది. మొదట ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూసి ' చాలా బాగుంది ' అనుకుంటాడు. అలాగే అమ్మాయి అబ్బాయిని చూసి అలాగే అనుకుంటుంది.ఎప్పుడైతే వారు ఒకరినొకరు కలుసుకుంటారో వారి భౌతిక సంబంధం బలంగా ఏర్పడి అది కామానికి దారి తీసి దాని వలన వారు ఆ ఆకర్షణలో పూర్తిగా బంధింపబడుతారు.తరువాత వివాహం,సంతానం,సమాజంలో గుర్తింపు,ప్రేమ,స్నేహితులు ఈవిధంగా భౌతికమైన ఆకర్షణ పెరుగుతూ పోతుంది.వీటన్నిటికీ డబ్బు అవసరం. వారికి తెలుసు ఇవన్నీ శాశ్వతం కావని..ఆకర్షణ బలమైనది కుటుంబాన్ని పోషించడానికి తన ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి వెనుకాడరు.ఇదే మాయ. ఈ భవబంధంలో చిక్కుకొని తమను తామే మరచిపోతారు. "


 తన ఆధ్యాత్మిక ఆచార్యుడైన నారదముని ద్వారా జ్ఞానాన్ని పొంది ఉండటం వలన కేవలం ఐదు సంవత్సరముల వయసు గల ప్రహ్లాదుడు ఒక గొప్ప అనుభవజ్ఞుడైన వాని వలె బోధిస్తున్నాడు. "జ్ఞానం ద్వారా మనిషి ఎదుగుతాడు కానీ వయసు ద్వారా కాదు" అని నానుడి.ప్రతి జీవి వృద్ధాప్యం వరకు జీవిస్తారని ఖచ్చితమైన హామీ లేదు. మరణం ఎప్పుడైనా సంభవించవచ్చు. కాబట్టి ఆధ్యాత్మిక జీవితాన్ని వాయిదా వేయటం చాలా ప్రమాదకరమైనది. కాబట్టి అందరూ నారాయణ చైతన్యాన్ని అలవర్చుకొని భక్తిలో ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించాలి."స్థిరచరాలైన వృక్షాలు,మొక్కల నుండి బ్రహ్మ వరకు అన్నింటా అందరి హృదయాలలోనూ శ్రీ మహా విష్ణువు పరమాత్మ రూపంలో ఉంటాడు " అని ప్రహ్లాద మహారాజు బోధిస్తున్నాడు. 

 " స్వయంగా భగవంతుడు అంతటా వ్యాపించి ఉండటం వలన మనం అతని అంశలమై ఉన్నందు వలన సర్వ జీవరాసులపై దయను కలిగి ఉండటం మన యొక్క బాధ్యత"


సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు

1 comments:

భారతి said...

OM SREE NAARAAYANAAYA NAMO NAMAH