Thursday, November 5, 2020 By: visalakshi

దేవుడు..సద్గురువు.. శ్రీ సాయిబాబా

ఓం శ్రీ భగవత్స్వరూపాయ నమః



సాయితత్వం అంటే ప్రేమతత్వం.సద్గురువు తన శిష్యులకు జ్ఞాన మార్గాన్ని చూపించి వారిని తనతో పాటు ఆధ్యాత్మిక మార్గం లో నడిపిస్తూ దైవానికి దగ్గర చేస్తాడు.శిష్యుల అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు.. దేవుడు మానవరూపం ధరిస్తే దాన్ని అవతారం అంటారు. అవతార మూర్తికి పంచతత్వాలపై నియంత్రణ ఉంటుంది. సాయి లో ఈ రెండు లక్షణాలూ స్పష్టంగా మనకు కనబడతాయి.. అందుకే సాయి కొందరికి సద్గురువు. కొందరికి దేవుడు.

సాయి బోధనలయిన జీవకారుణ్యం, సర్వమత సమానత్వం, సామాజిక సౌభ్రాతృత్వం మొదలైనవన్నీ మన ఆధునిక సమాజానికి ఉపయుక్తమైనవి.అందుకే ఆయన ప్రవచించిన ప్రేమతత్వం ఆయన సమాధి చెందిన ఇన్నేళ్ల తర్వాత కూడా ఖండఖండాంతరాల్లోనూ వ్యాప్తి చెందుతోంది. ఆయన సద్గురువా..దేవుడా.. అనే మీమాంస వీడి సాయి ప్రవచించిన విలువలను పాటించాలి.

 శరణు..శరణు..సాయి! సమర్థ సద్గురు సాయీ*

శరణు..శరణు..సాయి!

సమర్థ సద్గురు సాయీ! నీకు సాష్టాంగ నమస్కారం.

జీవ జంతువుల్లోనూ, జీవంలేని వస్తువుల్లోనూ నువ్వే ఉన్నావు.

పురుగు మొదలు పరబ్రహ్మ స్వరూపం వరకూ అంతా నువ్వే, అంతటా నువ్వే నిండి ఉన్నావు.

పర్వతాలు, నేల, ఆకాశం, గాలి, నీరు...అన్నిటిలోనూ నువ్వే ఉన్నావు.

సమస్త జీవరాశిలో నువ్వే వ్యాపించి ఉన్నావు.

భక్తులందరూ నీకు సమానమే.

నీకు ఇష్టమైనవి, అయిష్టమైనవి లేవు.

నిన్నే సదా స్మరిస్తూ, నీ చరణారవిందాల చెంతనే సదా  'శరణు శరణు సాయీ!' అంటే చాలు మా కోరికలన్నీ తీరుస్తావు. మా జీవిత పరమావధిని నెరవేరుస్తావు.

సంసారం మహాసముద్రం. దీనిని దాటటం చాలా కష్టం. విషయ సుఖాలనే కెరటాలు దురాలోచన అనే ఒడ్డును బలంగా తాకుతూ ధైర్యమనే వృక్షాలను పడగొడుతూంటాయి. అహంకారమనే గాలి రయ్యిన వీస్తూ మహా సముద్రాన్ని అల్లకల్లోలం చేస్తుంది. అలజడి రేపుతుంది. కోపం, అసూయ, ద్వేషాలనే మొసళ్లు నిర్భయంగా సంచరిస్తూంటాయి.

మరోపక్క 'నేను', 'నాది' అనే స్వార్థాల వంటి సుడిగుండాలు గిర్రున తిరుగుతూంటాయి. మంచితనం, వివేకం అనేవి ఆ సుడిగుండంలో పడి కొట్టుకుపోతూంటాయి. పరనింద, అసూయ, ఓర్వలేని తనం అనే చేపలు అక్కడక్కడా తిరుగాడుతూంటాయి."

ఇలాంటి మహాసముద్రమనే సంసారాన్ని దాటటం కష్టమే అయినా, మనకు సమర్థ సద్గురువైన సాయిబాబా అండగా ఉన్నారు. బాబా మహర్షులలో అగస్త్యుని వంటి వారు.    వ్యామోహాలు భౌతికవాంఛలపై ఆసక్తిని నశింపచేసే వారు.

బాబా ప్రకాశాలలో సూర్యుని వంటి వారు. సూర్యుడు జ్ఞానానికి సంకేతం. బాబా తన జ్ఞాన ప్రకాశాలతో భక్తుల మదిలో అలముకున్న అజ్ఞానపు చీకట్లను తొలగిస్తారు.

బాబా లీలలు దీపస్తంభాలు. అవి ఈ భవసాగరాన్ని సురక్షితంగా దాటించే వెలుగుదివ్వెలు.

బాబా! మా మనసులు చెదిరిపోనివ్వకుండా స్థిరంగా ఉంచు. మేము నిన్ను తప్ప మరేమీ  కోరము. నీ ఉపదేశాలను నిత్యం ఆచరిస్తాం. నీ లీలల్ని సదా గానం చేస్తాం. మా బుద్ధులు నీవు చూపిన దారిలో పయనించేలా చూడు" అని ప్రార్థిస్తే బాబా మనల్ని చేయిపట్టి నడిపిస్తారు.

దైవమెప్పుడవతరించినా ఆ రూపం ఎంతో సమ్మోహనపరుస్తుందట. దత్తావతారమైన సాయి రూపం కూడా అలానేఉండేదట. శ్రీసాయిబాబానుసన్నిహితముగాను,వాస్తవముగాను సేవించిన వారు బాబాను భగవదవతారముగా ఇప్పటికీ కొలుచుచున్నారు.  

బాబావారి సహచరులలో ఒకరు ఇలా వ్రాసారు: "బాబా సశరీరులుగా ఉన్నపుడు వారొక రూపుదాల్చిన భగవత్స్వరూపంగా తమ భక్తులకు భాసిల్లుతూ, తమ లీలాప్రబోధాల ద్వారా సాధకుల మార్గమును ప్రకాశింపజేయుచుండెడివారు. వారినశ్వరమైన దేహము మాయమైపోయినది గాని , దానిలో అప్పుడుండిన 'బాబా' మాత్రము ఇప్పటికిని అనంతశక్తి వలె నిలిచి  వారు సమాధి చెందకముందు భక్తులకు తోడ్పడినట్లే ఇప్పటికిని వారినాశ్రయించు అసంఖ్యాక భక్తులకు నిశ్శబ్దంగా సహాయపడుచున్నారు."

శ్రీ సాయి మా గృహమునందు ప్రకటితమై వారి దివ్య లీలలతో, ప్రబోధాలతో మమ్ములను అనుగ్రహించారు. మాలో కొలువై ఉండి సదా మమ్ములను ఆధ్యాత్మిక దారిలో నడిపించు "దేవుడు" శ్రీ సాయిబాబా. బాబా మాకు దేవుడు, గురువు, తండ్రి..అన్నీ తానే అయిమాకుటుంబంకు....ఆత్మబంధువులకు మార్గనిర్దేశం చేయుచున్నారు. 

మన చుట్టూ ఉన్న వారు విభిన్న మనస్తత్వాలతో ,భిన్న అభిప్రాయాలతో..భిన్న అభిరుచులతో ఉంటారు. అందరికీ అన్నీ తెలుపలేము.  "స్వానుభవంతో , సాధనతో భగవంతుని" తెలుసుకోగలగాలి తప్ప వాద ప్రతివాదాలు మనలో మూర్ఖత్వాన్ని పెంచి పోషిస్తాయి. 

దత్తావతారమైన శ్రీ సాయినాధుని అందరూ సద్గురువు గా కొలుస్తారు..శ్రీ సాయి కూడా ఎప్పుడూ తను ఒక ఫకీరు నని..గురువునని చెప్పేవారు. భక్తులకు మాత్రం వారు కొలిచే దైవంగా దర్శనమిచ్చారు. మాకు కూడా "లక్ష్మీ నృసింహ స్వామి" గా దర్శనమిచ్చారు.శ్రీ కృష్ణుడు విశ్వరూపం ని చూపినట్లు తనలో అందరినీ చూపారు బాబా. అలా బాబాతో మా అనుభవాల అనుభూతులు మాకే ఇంత అద్భుతంగా ఉంటే.. వారితో ఉండి వారి దర్శన అనుభవాలు.. సాయికి సేవ చేసే భాగ్యం..కలిగిన వారి సహచర భక్తుల జన్మ ధన్యం.


                    ●||ఓం సాయి రామ్ ||●

3 comments:

Anonymous said...

విశ్వామిత్రుడు అత్రి మహర్షి లాంటివారు అరుంధతి సుమతి లాంటివారు శ్రీపాదులు శ్రీ రాఘవేంద్రులు వెంకయ్యస్వామి లాంటివారు ఎందరో ఉన్నారు పంచభూతాలపై నియంత్రణ సాధించినవారు. మరి వారంతా దేవుల్లేనా?

Vanitavanivedika.blogspot.com said...

విశ్వామిత్రుడు అత్రిమహాముని అరుంధతి సుమతిలాంటి వారందరూ పురాణ ఇతిహాసాల లోని మహనీయులు పూజ్యనీయులు..🙏
గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః
గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మైత్ శ్రీ గురవే నమః..
శ్రీ పాద శ్రీ వల్లభస్వామి దత్తాత్రేయ అవతారం గురు పరంపర లో2వ అవతారం.. వారి సంస్ధానం పిఠాపురం లో ఉంది..వారి మహిమలు అపారం.కొలిచిన వారికి వారి అనుగ్రహం లభిస్తుంది..
శ్రీ రాఘవేంద్రస్వామి గురుపూజ్యులు.వారి మహిమలు విన్నాను. చదివాను.. వారికి మంత్రాలయం లో మఠం ఉంది.. వారి వద్దకు భక్తులు భగవంతుడు గా భావించి దర్శించుకుంటారు.
శ్రీ వెంకయ్యస్వామి ఒక అవధూత.ఒక మహాయోగి సద్గురువు. శ్రీ సాయిబాబా శ్రీ వెంకయ్య దగ్గరకు వచ్చి ఆతిధ్యం స్వీకరించి ఉపదేశము చేసినట్టు వారి గ్రంథం లో ఉంది. శ్రీ వెంకయ్యస్వామి తనకు షిర్డీసాయి బాబా అన్నగారని చెప్పిన సందర్భాలున్నాయి.
పంచ భూతాలపై నియంత్రణ సాధించిన ఈ మహనీయులు అందరూ గురువుగా నమ్మిన వారికి గురువు గా దేవుడు గా విశ్వసించిన వారికి దేవుడు గా అనుగ్రహిస్తారు.

Anonymous said...

గురువు అనుకునేవారికి గురువు
దేవుడు అనుకునేవారికి దేవుడు.
అబ్బా...ఎంత బాగ చెప్పారో... మన భావనల బట్టే అంతా ఉంటుందన్నమాట.
వాస్తవానికి మీ సమాధానం 30% సంతృప్తికరం.