Friday, December 11, 2015 By: visalakshi

గీతామృతసారం

  ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమ:

  ధనుర్మాసంలో వచ్చే ఏకాదశిని 'వైకుంఠ ఏకాదశి ' అంటారు. మార్గశిర శుక్ల ఏకాదశిని 'గీతా జయంతి 'గా వ్యవహరిస్తారు. ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి, గీతా జయంతి రెండూ ఒకే రోజు రావడం ఒక విశేషం.





 భగవద్గీత ఉపనిషత్తుల సారంగా, బ్రహ్మవిద్యను ప్రభోదించే గ్రంధంగా, యోగశాస్రంగా చెప్పబడింది.ఏ గ్రంధానికి లేనటువంటి ప్రత్యేకతను సంతరించుకొని,వ్యక్తులకు వలె జయంతిని జరుపుకుంటున్న భగవద్గీత, సాటిలేని ప్రస్థానత్రయంలో భాగమై,'సర్వశాస్త్రమయీ ' అనగా సర్వశాస్త్రాల సారమని చెప్పబడింది. 

 యోగీశ్వరుడైన కృష్ణుని ముఖతా వెలువడిన ఈ వాణి భరతఖండంలోనే కాక,ఖండాంతరాలలో కూడా విశేష ప్రాచుర్యాన్ని పొందింది.  ఈ గీత హిమవత్పర్వతం వంటిది. సమీపిస్తున్నా కొద్దీ దాని యొక్క వైశాల్యమూ, సౌందర్యమూ, విశిష్టత గోచరమవుతూ వస్తాయి. ఇందులో చిన్న,చిన్న విషయాలను (ధర్మం, కర్మ ) మొదలుకొని బ్రాహ్మీస్థితిని పొందేందుకు గల బ్రహ్మజ్ఞానం వరకు నిబిడీకృతమై ఉన్నాయి. 

నరుడికి, నారాయణుడికి మధ్య సంవాదంగా నిలిచి ఉన్న ఈ గీత, వారి యందు దాగి ఉన్న పరస్పర సంబంధమనే చిక్కుముడిని విప్పి, మానవ జీవిత లక్ష్య నిర్దేశ్యకంగా నిలుస్తుంది. ఇహలోకంలో మానవుణ్ణి క్రియాశీలునిగా వ్యవహరింపజేస్తూ, ఆత్మసాక్షాత్కార ప్రయాణ మార్గాన్ని తెలిపే ఈ గీత యొక్క మహాత్మ్యం వర్ణనాతీతం.

 వేగవంతమైన మనస్సు బుద్ధిని సంక్షోభంలో పడవేస్తుంది. బుద్ధి ఈ విధంగా అస్థిరతకు లోనైనప్పుడు కర్మ యొక్క నిజ స్థితిని గుర్తించలేదు. అస్థిరత్వానికి మూలం మమకారం. మన ఈ పక్షపాత వైఖరికి కారణం మమకారమనే సంకెళ్ళలో బందీ కావడమే!

"నా వారు " అనుకున్నా వారంతా యుద్ధంలో చనిపోతారు అనే భయం అర్జనుణ్ణి ఆవరించింది. అర్జనుడి దు:ఖానికి కారణం --నా వాళ్ళనే మమకారమే! 

 ఈ మమకారపు సంకెళ్ళ నుండి విడిపించడానికే శ్రీకృష్ణుడు దేహ పరిణామక్రమాన్నీ, అశాశ్వతత్వాన్నీ, పరమార్ధతత్వ జ్ఞానాన్నీ బోధిస్తూ....

  దేహినో2 స్మిన్ యధా దేహే కౌమారం యౌవనం జరా 
  తధా దేహాంతరప్రాప్తి: ధీర స్తత్ర న ముహ్యతి !! (గీత. 2 - 13)

    ' మానవుడికి ఈ దేహంలో బాల్యం,యౌవనం,ముసలితనం ఎలా కలుగుతున్నాయో, మరణం తరువాత మరొక దేహాన్ని పొందడం కూడా అలాంటిదే! ఈ విషయంలో జ్ఞానులు(ధీరులు) మోహవశులు కారు.' అని వివరించాడు. చిరిగిన వస్త్రం వదలి, కొత్త వస్త్రాన్ని ధరించినట్లు-మరణం తరువాత ఆత్మ మరో దేహాన్ని ధరిస్తుందని గ్రహించినవారే ధీరులు. అని ఉద్ఘాటించి, అర్జనుడి మోహపాశాన్ని త్రుంచి వేశాడు శ్రీకృష్ణుడు.

 ఆత్మజ్ఞానం పొందిన మహాత్ములు అతి కొద్దిమందే ఉంటారు. ఆ స్థితిని పొందడం అందరికీ అంత సులభం కాకపోవచ్చు. కానీ ఈ దేహం శాశ్వతం కాదని గుర్తెరిగి వ్యవహరిస్తే మన సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. నిజానికి మనలోని అసూయా ద్వేషాలకూ, అహంకార మమకారాలకూ,లోభ మోహాలకూ,కోపావేశాలకూ, పంతాలూ పట్టింపులకూ, భయాందోళనలకూ ముఖ్య కారణం ఈ భూమ్మీద మన జీవితం మూన్నాళ్ళ ముచ్చటేనని మరచిపోవడమే!

 ' ఈ దేహం వేరు, ఆత్మ వేరు ' అన్న అనుభూతి మనకు కలగకపోయినా  " ఈ దేహం ఎప్పుడు రాలిపోతుందో, ఈ గూటిలోని చిలుక ఎక్కడికి ఎగిరిపోతుందో" అన్న భావన మన మదిలో మెదిలితే మమకారం పటాపంచలవుతుంది. నేను-నాది అనే భావం నశిస్తుంది. 

 గీతా శ్రవణేచ్చ పూర్వజన్మ పుణ్యం వలనే లభిస్తుంది. మన మనస్సు మలినపూరితమైతే దైవ కార్యాలపట్ల ఆసక్తి జనించదు. ఒకవేళ ఆసక్తి పుట్టినా అది నిలవదు. పుణ్యకార్యాలవల్ల, నామస్మరణ వల్ల, ప్రార్ధనలవల్ల మనోమాలిన్యాన్ని తొలగించుకోవాలి. అప్పుడే దైవవాణిని వినడానికి, దివ్యానుభూతిని అనుభవించడానికి అర్హులవుతాం. దైవకృపకు పాత్రులవుతాం.


 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు.








6 comments:

Priya said...

వేద జీ!
నా కోరిక మన్నించి నాకై ఇంత చక్కటి పోస్ట్ ను పెట్టినందుకు నా ఆనందానుభూతి అక్షరాలకు అందడం లేదు.
మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

రుక్మిణీమాత, తులసి పత్రంతో కృష్ణభగవానున్ని గెలుచుకున్నట్లు ఈ పోస్ట్ తో మీరు కృష్ణారాధకుల మనస్సులను గెలుసుకున్నారు.
సమగ్రమైన గీతా సారాంశమును సక్షిప్తంగా సరళంగా తెలిపారు. అమృతం ఓ చుక్క చాలు అన్నట్లుగా గీతామృతమును ఓ చిన్న పోస్ట్ ద్వారా భక్తిరసంతో అందించారు.
అందుకొండి ... నా అభినందనలు.
ఈసరికి అందే వుంటాయి కృష్ణభగవానుని ఆశీస్సులు!

భారతి said...

visalakshi said...

వేదగారు, ప్రియగారు అన్నట్లుగా ... నిజంగా ఈసరికి మీకు కృష్ణభగవానుని ఆశీస్సులు అందేవుంటాయి. ఎందుకంటే -
శ్రీ మద్భగవద్గీత యందు అష్టాదశాధ్యాయమున 68, 69 శ్లోకముల యందు స్వయంగా ఆ వాసుదేవుడే ఇలా ఉపదేశించెను.
య ఇమం పరమం గుహ్యం మద్భాక్తేష్వభిధాస్యతి / భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్యత్యసంశయః //
ఎవరీ పరమరహస్యమగు గీతాశాస్త్రంను నా భక్తులకు చెప్పుచున్నారో, వారు సంశయ రహితులై నాయందు సర్వోత్కృష్టమైన భక్తిని చేసి నన్నే పొందగలరు, సంశయము లేదు.

న చ తస్మాన్మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః / భవితా న చ మే తస్మాధన్యః ప్రియతరో భువి //
మనుష్యులలో నా భక్తులకు గీతను చెప్పువానికంటే నాకు అధిక ప్రియమును చేయువారెవరును లేనేలేరు. ఈ భూమి యందు అట్టి గీతబోధకుని కంటే మిక్కిలి ఇష్టులు మరెవరును ఉండబోరు కూడా.

ఈటపా ద్వారా శ్రీకృష్ణునికి ప్రీతిపాత్రులైన మీరు ధన్యులు వేదగారు. ee vyaakhya bhaarati emtO aatmeeyamugaa pampina vaari spandana. endukO udayamu delete ayindi. marala post chEstunnaanu.

visalakshi said...

ప్రియగారూ!మరియు భారతి మీ ఇరువురి ఆత్మీయతతో శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులు నాకు అందినందులకు ధన్యురాలినయ్యాను. ఒక చిన్న విషయం...ఒకసారి కృష్ణుడు అర్జునుడితో......

అర్జునా! నీవు నన్ను అవతారపురుషుడని అంటున్నావు.నీకో విషయం చూపిస్తాను రా! అని నేరేడుచెట్టు వద్దకు తీసుకెళ్ళి, అక్కడ నీకేమి కనబడుతున్నాయి? అని అడుగగా, అర్జనుడు 'నేరేడుపళ్ళ గుత్తులు అని చెప్పాడు. అవి నేరేడు పళ్ళ గుత్తులు కావు దగ్గరకు వెళ్ళి చూడు అనగా అర్జనుడు దగ్గరకు వెళ్ళి చూచేసరికి చాలామంది కృష్ణులు గుత్తులు,గుత్తులుగా ఆ చెట్టుకు వ్రేలాడుతున్నారు. అర్జునా! చూచావా! అక్కడ ఎంతమంది ఉన్నారో! అన్నాడు కృష్ణుడు.

"నీవు భగవంతుణ్ణి సమీపించేకొద్దీ ఆయన ఉపాధులు,ఆరోపితమైన గుణాలు తగ్గిపోతున్నాట్లు తెలుసుకుంటావు. భక్తుడు మొదట భగవంతుడికి పది చేతులున్నాట్లు,తరువాత ఎనిమిది, ఇంకా దగ్గరకు సమీపిస్తే ఆరు చేతులున్నట్లుగాచూస్తావు. ఇంకా దగ్గరకు వెళితే రెండు భుజాలున్న గోపాలునిగా చూస్తావు.చివరకు దివ్యత్వ సాన్నిధ్యంలో నిర్గుణమైన చైతన్యజ్యోతిగా భగవంతుణ్ణి దర్శిస్తావు".దీని భావార్ధం....ఒక్కొక్కదాన్నే అనిత్యమని,అశాశ్వతమనీ గ్రహిస్తూ దానిని వదలి ముందుకుపోతూ,ఆధ్యాత్మిక పురోగతితో భగవత్సాక్షాత్కారాన్నిపొందవలెను.

భారతి said...

వేదగారు, ప్రియగారు అన్నట్లుగా ... నిజంగా ఈసరికి మీకు కృష్ణభగవానుని ఆశీస్సులు అందేవుంటాయి. ఎందుకంటే -
శ్రీ మద్భగవద్గీత యందు అష్టాదశాధ్యాయమున 68, 69 శ్లోకముల యందు స్వయంగా ఆ వాసుదేవుడే ఇలా ఉపదేశించెను.
య ఇమం పరమం గుహ్యం మద్భాక్తేష్వభిధాస్యతి / భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్యత్యసంశయః //
ఎవరీ పరమరహస్యమగు గీతాశాస్త్రంను నా భక్తులకు చెప్పుచున్నారో, వారు సంశయ రహితులై నాయందు సర్వోత్కృష్టమైన భక్తిని చేసి నన్నే పొందగలరు, సంశయము లేదు.

న చ తస్మాన్మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః / భవితా న చ మే తస్మాధన్యః ప్రియతరో భువి //
మనుష్యులలో నా భక్తులకు గీతను చెప్పువానికంటే నాకు అధిక ప్రియమును చేయువారెవరును లేనేలేరు. ఈ భూమి యందు అట్టి గీతబోధకుని కంటే మిక్కిలి ఇష్టులు మరెవరును ఉండబోరు కూడా.

ఈటపా ద్వారా శ్రీకృష్ణునికి ప్రీతిపాత్రులైన మీరు ధన్యులు వేదగారు.

visalakshi said...

గీతా మకరందాన్ని ఆస్వాదిస్తున్న మనమంతా ఆ శ్రీకృష్ణునికి ప్రీతిపాత్రులమే! భారతి,ప్రియ..మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు.