Tuesday, November 10, 2015 By: Veda Sri

జ్ఞానదీపతేజం

  శ్లో" సమో& హం సర్వభూతేషు న మే ద్వేష్యో& స్తి న ప్రియ:!
    యే భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం!!(భగవద్గీత - 9.29)

  "నేను సర్వభూతముల యందు సమదృష్టి కలిగి ఉంటాను. నాకొకడు ఇష్టుడు కానీ,ఒకడయిష్టుడు కానీ లేడు. ఎవరు భక్తితో ఆరాధిస్తారో వారియందు నేను, నా యందు వారు నెలకొని ఉంటార"ని స్పష్టం చేస్తాడు భగవాన్ శ్రీకృష్ణుడు.


 మనం వెలిగించే దీపావళి దీపాలు బయట చీకటిని పారద్రోలుతున్నాయి కానీ హృదయంలో ఉన్న అజ్ఞానమనే అమావాస్యపు చీకటిని తొలగించలేకపోతున్నాయి. ప్రపంచంలో జీవులనుభవించే బాధలన్నింటికీ ఈ అజ్ఞానమే మూలకారణమై ఉన్నది. అజ్ఞానమనే ఈ గాడాంధకారం ఎన్నెన్నో జన్మలనుండి హృదయంలో ఘనీభవించి ఉన్నందునే, జన్మ పరంపరలు,సంసారపు యాతనలు కలుగుతున్నాయి. ప్రకాశవంతుడైన భగవంతుని ఉనికి కనుగొన్నాప్పుడు మాత్రమే ఈ అజ్ఞానపు చీకటి తొలగిపోతుంది. మన చిత్తంలో గల దోషాలను తొలగించుకొని హృదయాన్ని సత్త్వగుణమయం చేసుకొవాలి. మన హృదయమంతా అహంకారమనే నరకాసురుడు నిండి ఉంటే భగవద్దర్శనం లభించదు. ఈ అహంకారాన్ని నిర్మూలించుకునేవరకూ మనలోనే ఉన్న నరకుడు విజృంబిస్తూనే ఉంటాడు. 

  సర్వగం సచ్చిదానందం జ్ఞాన చక్షుర్నిరీక్ష్యతే!
  అజ్ఞాన చక్షుర్నే క్షేత భాస్వంతం భానుమందవత్!!

  'సర్వ వ్యాపకమై ఉన్న సచ్చిదానంద పరబ్రహ్మాన్ని జ్ఞాననేత్రం మాత్రమే చూడగలదు. ప్రకాశించే సూర్యుని అంధుడు చూడజాలనట్లు అజ్ఞాననేత్రం ఆ పరబ్రహ్మాన్ని దర్శించలేదు.'
  అందుచేత అహంకారమనే నరకుని నశింపజేసినపుడే, మనం ఆత్మానందమనే దీపావళిని జరుపుకున్న వాళ్ళమవుతాము.

  దీపావళినాడు భగవదారాధనం,లక్ష్మీ పూజ చేయాలని శాస్త్రవచనం. సంధ్యా సమయంలో దీపాలను వెలిగించి,అందు లక్ష్మిని ఆహ్వానించి,లక్ష్మీపూజ చేయడం పరిపాటి. 
    తామరపూవు సత్యానికి,పవిత్రతకు,సుందరత్వానికి ప్రతీక.అంతే కాక మన హృదయానికి కూడా ప్రతీకగా నిలుస్తుంది.మానవుని హృదయం తామరమొగ్గ వలె ఉండునని,ధ్యానం చేత అది వికసించునని అందు పరమాత్ముని యోగులు సర్వదా గాంచుదురని మహాత్ములు తెలిపి ఉన్నారు.తామరపుష్పానికి మరొక విశేష లక్షణం ఉంది; తామరపూవు ఉదయించే సూర్యుని రాకతో వికసించి,రాత్రికి ముడుచుకునిపోతుంది.
 మన హృదయం అనే తామర వికసించేందుకు జ్ఞానసూర్యుడు ఆవశ్యకమని కమలం మనకు ప్రభోదిస్తోంది.అందుచేతనే శ్రీమహాలక్ష్మి పంకజాసనియై,మానవుని పరిపూర్ణతకు గుర్తు తామరపుష్పం అని చేత సంకేతంగా ధరించి ఉన్నది.సమస్త ఐశ్వర్యాలకూ అధిష్టానదేవత అయిన ఆ శ్రీమహాలక్ష్మిని, దీపావళి సందర్భంగా మనలోని అజ్ఞానపు తిమిరాన్ని పారద్రోలి జ్ఞానదీప తేజాన్ని ప్రసాదించమని ప్రార్ధిస్తూ అర్చించాలి. 

 దీపావళి శుభాకాంక్షలతో.... సర్వే జనా సుఖినో భవంతు... 


సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు

2 comments:

భారతి said...

దేహమనే ప్రమిదలో శ్రద్ధ అనే నూనె వేసి, వత్తి అనే బుద్ధితో జ్ఞానమనే జ్యోతిని వెలిగించి, హృదయంలో వున్న ఆత్మను దర్శింపజేసుకోమని తెలియజేయడమే "దీపారాధన" అంతర్యం.

ప్రతీ పండుగ పరమార్ధం ... మన జీవన వికాసమే.

జ్ఞానదీపతేజంతో దీపావళి అంతరార్ధమును చక్కగా వివరించారు ... అభినందనలు.

దీపావళి శుభాకాంక్షలు వేదగారు.

భారతి said...

భక్తి అనే వత్తితో ..... అంటే బాగుంటుంది. :-)