Monday, September 16, 2024 By: visalakshi

నేను ఎవరు?

                                                          

                                                     భగవాన్ రమణ మహర్షి...

       

   



అరుణాచల శివ..అరుణాచల శివ..అరుణాచల శివ..అరుణాచలా .....          


 *జీవితంలో  అన్నిటి కంటే  గొప్ప మత్తు "భగవాన్ " సన్నిధి "‌.... చలం.!!

*దర్శనం కన్నా ….ఆ దర్శనం కోసం ' ఆవేదన ' ఎంతో ముఖ్యం....... "రమణ మహర్షి" .!!

*కుటుంబంతో సహా..రమణాశ్రమానికి చేరుకున్నాక నా మనసును జయించారు భగవాన్".... చలం.!!

"ఇప్పుడే విస్కీ  మత్తుతో వ్రాస్తున్నాను...అని మొదలు పెట్టి ' అరుణాచలం నుంచి తిరిగి రమ్మని ' శ్రీశ్రీ ' ఉత్తరం రాసినా. అది చదివి చలించని, .కదలని  'చలం'…!!"విస్కీ కంటే గొప్ప మత్తు 'భగవాన్ ' "సన్నిధి "వలన లభిస్తుందని " .నువ్వే ఇక్కడకి రా..! అంటూ..తిరుగు జాబు రాశారు చలం. తన జీవిత చరమాంకం వరకు చలం గారు అరుణాచలంలోనే  ఉండిపోయారు.

  తన నివాసానికి "రమణస్థాన్"అని పేరు పెట్టుకున్నారు.రమణస్థాన్ లో చలంగారు పడిన వేదనకు,ఆవేదనకు అంతే లేదు. భగవాన్ "దర్శనంకన్నా... దర్శనంకోసం పడే 'ఆవేదన' ముఖ్యం"   అన్న భగవాన్ బోధ  చలం గారిపై బాగా ప్రభావం చూపింది.!


"*నేను…"...* నువ్వు  "  ఎవరో తెలుసుకుంటే మహదానందమే అన్న భగవాన్ చింతన చలంగారి తాత్వికలోక దర్శనానికి  తెరతీసింది.


* చలంగారి పై 'భగవాన్ ' బోధనల ప్రభావం..!!


లోకంలో గురుబోధ గొప్పది. ఆధ్యాత్మిక గురు బోధ ఇంకా గొప్పది..అయితే గురుబోధ బాధలకు ఉపశమనమే కానీ, శాశ్వత పరిష్కారం కాదు. గురువుదారి మాత్రమే చూపుతాడు.సాధనతో గమ్యా‌నికి చేరుకోవాల్సిన బాధ్యత…..మాత్రం మనదే...దానికి శరీరాన్ని కష్టపెట్టాలి. లౌకిక వాసనలకు దూరంగా వుండాలి. పరిసరాలు,ధ్వని, వాతావరణ కాలుష్యాలకు ఎడంగా జరగాలి. మనసుకు పట్టిన జాడ్యాల్ని,వికారాల కిలుంను వదిలించు కొని,మనసును తెల్లగా మల్లెపూవులా వుంచు కోవాలి.. అప్పుడే మన పెద్దలు చెప్పినట్లు 'సాధనమున పనులు సమకూరుతాయి'....!

రమణులవారి బోధనలు ఫలితంగా చలంగారు తనను తాను కష్టపెట్టుకున్నారు. తనలోని…"నేను" గురించి తెలుసుకోడానికి నానాయాతనలు పడ్డారు.

*నేనెవరు ...? నువ్వెవరు. ?ఈ రెండూ బోధపడితే మనిషి తన  జన్మకు  ఆనవాళ్ళు, తన అస్తిత్వానికి మూలాలు తెలుసుకున్నట్లే…. భగవాన్ ఆధ్యాత్మిక గురుబోధవల్ల మాత్రమే ఈ రెండూ తెలుస్తాయి.

ఇవి తెలుసుకున్న రోజున మానవుడి ఆనందానికి అంతుండదు. అవధులుండవు.‌ అనంతమైన ఈ జగత్తులో తాను పూసుకున్న లౌకిక భవబంధాల రంగువెలిసి పోతుంది... కళ్ళకు కప్పిన మాయపొర తొలిగి,సత్యం తెలిసిపోతుంది.అప్పుడు విశ్వం ఓ‌ ఊయలవుతుంది .మనం అందులో  పరుండే పసి పాపగా  మారిపోతాం..!

ఇన్నాళ్ళు లోకంలో పెంచుకున్న స్వార్థపు రేఖలు చెరిగిపోతాయి. భవబంధాల చిక్కుముడులు విడిపోతాయి.మనం  అనుభవించిన బాధలు,  మానసికక్షోభ  దూదిపింజలై ఎగిరిపోతాయి. మన ముందు భూమ్యాకాశాలు కూడా పిల్లాడి చేతిలో ఆటవస్తువులుగా మారిపోతాయి.

చలం గారు భగవాన్ రమణుల వారిని గొప్పఆధ్యాత్మిక గురువుగా భావించారు..సేవించారు.!

*సత్య శ్రవణం :..!!

మనం ఏది విన్నా,దాని ప్రభావం సున్నితమైన మన...మనస్సుపై బలంగా పడుతుంది. అందుకే ఏది పడితే అది వినకుండా..వినేటపుడు జాగ్రత్త వహించాలి. మంచి  మాత్రమే మనసుకు ' మైల'  అంటకుండాచేస్తుంది .అందుకే మంచినిమాత్రమే వినాలి. ఎందుకంటే విశ్వంలో అదే.. సత్యం...నిత్యం.!

ఈ సత్య వస్తువును గురించిన శ్రవణం రెండు రకాలని రమణుల వారు చెబుతారు.

 *మొదటిది గురువు వివరించి చెప్పగా వినడం.

 *రెండవది తనకుతానే ప్రశ్నించుకోవడం…

గురువు వివరించి చెబితే..అది ద్రాక్ష పాకం.తేలిగ్గా తెలిసిపోతుంది......సులభంగా బోధ పడుతుంది. రెండోది నారీకేళ పాకం..ఇది మనకు మనమే సాధించుకోవాల్సిన మార్గం. ఇది కొంత కష్టం. తినగాతినగా వేము తీయన అన్నట్లు..నిరంతర సాధనతో‌‌ అభ్యాసంతో సాధించుకోవాలి. అఖండమైన ' నేను ' గా తనయందే అన్వేషించి, సమాధానం కనుగొనాలి. అయితే..ఈ రెండింటిలో ఏది గొప్పదంటే..‌ రెండోమార్గమే గొప్పదంటారు రమణుల వారు..గురువు దారి చూపుతాడు శిష్యుడు స్వయంగా  ప్రయాణించి అమృతభాండాన్ని కనుగొనాలి. ఆ తర్వాత అందుకొని,సేవించి అలా అలౌకమైన ఆత్మానందాను భూతిని పొందాలంటారు రమణుల వారు

చలం గారు తన జీవిత చరమాంకం వరకు ఈఆత్మానందానుభూతి కోసమే తపించారు.తపస్సుచేశారు.

*"మిధ్య" అంటే ..?

"నేను " అని మీరంటున్నారే... ఆ   " నేను "  ఎవరో తెలుసుకుంటే... ఆ తర్వాత మీకే తెలు స్తుంది." అంటారు భగవాన్ రమణుల వారు.....మనం " నేను " అనే భౌతిక ప్రపంచం లో ఉన్నాం. నిద్రలో మాత్రం " నేను " ఎక్కడా కనబడదు.  'నేను ' అనేది పనిచేయదు. మనం నిద్రలో ఉన్నపుడు నిద్రలోని  నేనే... మెళుకువలోనూ ఉంటుంది. అయితే వ్యత్యాసం నిద్రలోని నేనుఆలోచించే మనసుతో కలవడం లేదు మెలుకువలో కలుస్తోంది అంతే...

*నీ నిజ స్వరూపం ఏది ?

నీ నిజం స్వరూపం ఏది? ఆలోచన తో కలిసి పోవడమా.?లేక కలగకుండా వేరుగా ఉండడమా?" ఇప్పుడు అంటే ...

మెలుకువలో ఇలా చెప్తున్నావు మరి నిద్రలో ఇలా అనలేవుకదా  పోనీ... నిద్రలో ' నేను'   అని అనగలవా?".

*నిజానికి అనలేము.....

" రెండు అవస్థలలొను...నీవు ఉన్నావు అసలు ఉండుటనేది "ఆత్మ"  లక్షణము... ఉన్నాను అను  స్ఫురణను అనుభవిస్తూనే ఉన్నావు.. ఈ ఆత్మే నీ అసలు స్వరూపము…"..అంటారు భగవాన్ .

మరైతే..ఈ సత్యాన్ని తెలుసు కోవడానికైనా,ఆలోచించాలి కదా? అన్న అనుమానం వస్తుంది. అప్పుడెలా? అంటే….

"ఇతర ఆలోచనలని  తొలిగించడానికే .....ఈ ఆలోచన" ఈ" నేను"  ఎవరు? ....ఎవరిది ..ఈ అజ్ఞానం .ఈ ప్రశ్నలకు జవాబు దొరికితే.... ఆత్మ ను గుర్తించినట్లే ఎవరైనా ఎంతటి అజ్ఞాని..... అయినా తాను లేనని అనలేడు కదా....నిద్రలో నేను లేనని అనలేడు కదా.అలా నిజమైన ఆత్మ ఉనికిని అంగీకరించక తప్పదుఆ ఆత్మను గుర్తిస్తే అసలు  అజ్ఞానమే ఉండదు..అంటారు భగవాన్.!!

ఆత్మజ్ఞానం అంటే కోరికలు లేకపోవడమే కదా? కోరికలు లేకపోతే అతను మానవుడు అవుతాడా? అన్న ప్రశ్న మళ్ళీ మనిషి బుర్రను తొలుస్తుంది...దానికి భగవాన్ ఏమంటున్నారో చూడండి…

నిద్రలో నేను ఉన్నది కానీ మనస్సు తో కలవలేదు.అప్పుడు శరీరాన్ని కూడా గుర్తించలేదు అందుచేత నేను   అంటే...ఈ దేహము.మాత్రమే అని అనవు...... నీకు అన్యంగా దేనిని చూడవు..ఇక ఇప్పుడు దేహంతో ఏకత్వం పొంది యున్నావు..నేను అంటే ఈ దేహమే అని తలుస్తూన్నావు నీకు అన్యంగా ఇతర వస్తువులు,విషయాలు ఉన్నాయని తలుస్తూన్నావు...అప్పుడు కోరికలు  పుడుతున్నాయి నిద్రలో ...నీకు ఏ కోరికా లేదు.ఏ దుఃఖమూ లేదు .  ఈ మానవ ఆకారమే " నేను " ,అనుకున్నప్పుడే ఈ కోరికలు పుడతాయి. కనుక ఈ మానవ ఆకారమే నేను అనుకొని...ఈ కోరికలు ఈ..వేడుకలు ఎందుకు  కొని తెచ్చుకోవాలి?

నిజానికి ఈ జడ శరీరము నేను అని పలకదు.... మరి ఈ శరీరానికి భిన్నంగా మరొకటి ఉండాలి కదావుంటే .అదేమిటి?అదే. "ఆత్మ ".ఈ శరీరమే నేను అని అనదు మధ్యలో మెలుకువతో పాటు నేను అని ఒకటి పుడుతుంది అది "అహం" మునుముందుగా ఈ "నేను " ఎవరు అని నిరంతరం ప్రశ్నించుకో, అపుడు నీకు తప్పక సమాధానం దొరుకుతుంది.."  అంటారు రమణుల వారు.

స్వామి ఎప్పుడూ, ఎవరినీ, దేనినీ, దేనికి ఖండించేవారు కాదు,విమర్శించేవారు కాదు,నివారించేవారు కాదు, నిరోధించేవారు కాదు, నిందించేవారు కాదు. ఎవరినీ, ఏమీ అనకుండా ఊరికే జరిగి పోతున్న వాటిని చూస్తూ వుండేవారు.“జీవితాన్ని బంధించకు. తలుపులు పూర్తిగా తెరిచెయ్యి. నీలోఅందరికీ,అన్నింటికీ, అన్ని వేళలా చోటియ్యి," అనేదే స్వామితత్వం.అదే  ఆయన మార్గం. అదే ఆయన శక్తి . ఆయన్నిసమీపించిన వారు ఏ వర్గానికి ,ఏ మతానికి, యేసిద్ధాంతానికి, సాంప్రదాయానికి, ఏ పద్ధతికి . చివరికి దేనికి చెందినవారైనప్పటికీ ఆయన ఎప్పుడూ ఎవరినీ.., దేనినీ,... ఖండించ లేదు , విమర్శించ లేదు.చివరికి జీవితంలో ఎదురైన దుర్మారుల్ని ,దొంగల్నిదుష్టుల్ని, శత్రువుల్ని తిరుగుబాటుదారుల్ని ఎవరినీ ఎప్పుడూ ఆయన ఏమీ అనలేదు, ప్రశ్నించలేదు, కనీసం సందేహించ లేదు. ఏమీ చేయలేదు. అందుచేత ఆయన్ని ఎవరూ ఏ కారణానికి సమీపించినా, వారి అహం అణగిపోయేది. ఆయన్ని...యేం చేయడానికి వారికి తోచేది కాదు, అది మౌనాన్ని మించిన గొప్ప ఆయుధం. చలం గారు ..ఈ భగవతత్వానికి లొంగిపోయారు. ఆయన  తన జీవిత చరమాంకం వరకు భగవాన్ చూపిన దారిలో నడవటానికే….ప్రయత్నించారు. తన అనుభవ సారాన్ని."భగవాన్ స్మృతులు" పేరిట అక్షరబద్ధం చేశారు. ప్రతి రమణ భక్తుడు చదివి తీరాల్సిన పుస్తకం ఇది. చదువుతున్నంత సేపు మనం రమణుల వారి సన్నిధిలోవున్నా మన్న అనుభూతి కలుగుతుంది.


చిత్రమేమిటంటే 1917కు పూర్వం చలంగారు రాసిన ఓ భావగీతంలో...ఓ" ఆరాధన "  కనబడుతుంది.

*ఎన్నాళ్ళనీ యెట్టు యెదురు చూచెద స్వామి

సుంతైన దయ రాదుగా.

పలుపాపి నేనని పడిపడి వేడిన

విలపింప వలదను పలుకైన లేదాయె.

ప్రాణవల్లభయని పలువరించుటె కాని

యెన్నడైనను పోనీ కన్నెత్తి చూచెదవే.

పిలుచుటే తడవుగ వారింతు వీవని

పలుకుల వలలోనె పడి మోసపోయితి.

వేచితి నిరతము ప్రేమ దృష్టిని గోరి

వేచి విసుగుటె కాని ఫలమేమి లేదాయె.(*చలం.) 

ఆప్పట్లో  చలంగారి మీద రవీంద్రుడి ప్రభావం ఉన్నా కూడా ఆ గీతాల్లో మనకి భగవంతుణ్ణి స్వయంగా చూసిన అనుభవం కనిపించదు. ఒక సౌందర్యం భావనని మాత్రమే  ప్రేమిస్తున్న వైనం కనిపిస్తుంది. కాకపోతే 1917 నుంచి 1937 దాకా అంటే ఇరవయ్యేళ్ళు ఆయన సౌందర్యాన్ని స్త్రీలో.... వెతుక్కున్నాడు, నిజమైన ఈశ్వరసందర్శనానుభవం ఎలా ఉంటుందో తెలియడానికి ఆయనకి  ఆ తర్వాత ముప్పై ఏళ్ళు పట్టింది. 

రమణాశ్రమానికి చేరుకున్నాక.ఆయన భగవంతుణ్ణి సౌందర్యంలో వెతుక్కున్నాడు.అనుభవానికి తెచ్చుకున్నాడు. అంతకు ముందు..ఒక భక్తుడు భగవంతుణ్ణి ప్రేమించినట్టుగా ఆయన స్త్రీని ప్రేమించాడు.  ఆ మహామోహమయ, ఆనందమయ అనుభూతి,ఆయన ప్రేమలేఖల్లోనూ, తొలి ఎనిమిది నవలల్లోనూ కనిపిస్తుంది. కానీ…., 1938 లో దీక్షితులు గారితో కలిసి మొదటిసారి తిరు వణ్ణామలై వెళ్ళి రమణ మహర్షిని చూసిన తర్వాత ఆయనలో సంఘర్షణ మొదలయ్యింది. అంతదాకా తనకుసౌందర్యనిధానంగా నూ,ఆనందప్రదాయినిగానూ ఉన్న స్త్రీ ఒకవైపూ, రమణ మహర్షి మరొక వైపూ ఆయన్ని లాగడం మొదలుపెట్టారు.  దాదాపు పది పన్నెండేళ్ళు ఆయన తీవ్రమైన నలుగులాట పడ్డాడు. అదంతా ఆయన దీక్షితులు గారికి రాసినఉత్తరాల్లో స్పష్టంగా కనిపిస్తుంది.

*భగవాన్ తో…..

 లోకోత్తర అనుభవం..!!

ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారు ఓ సారి రమణస్థాన్లో  ఉన్న చలం గారిని చూడటానికి వెళ్ళారు ఈ సందర్భంగా ఆయన చలం గారిని ఓ ఆసక్తికరమైన ప్రశ్న వేశారు..

"భగవాన్ని చూసినందు వల్ల మీకు కలిగిన లోకోత్తర అనుభవం ఏమిటి? అంతా చూడ్డం వేరు..మీరు చూడ్డం వేరు" అనడిగారు..  హనుమత్ శాస్త్రి గారు.

 దీనికి చలంగారు రెండు నిముషాలు గంభీరంగ చూసి ఓ చిరునవ్వు నవ్వి ఇలా చెప్పారు..

"భగవాన్ని చూడటానికి నిజానికి చాలా ప్రశ్నలతోవెళ్ళాను. కానీ జరిగిన చిత్రం ఏమంటే..భగవాన్ ఎదుట చాలామందిలో నేనూ ఒకడిగా ఒక పక్కకూర్చొని వున్నాను. భగవాన్ ఎవరిమీదా దృష్టి నిలపకుండా సరాసరి ఒక చూపు నాపై వేశారు. దాంతో నాలో చెప్పరాని వేదన  బయల్దేరింది. అంటే చండ్ర నిప్పులు మీద కూర్చోబెడితే ఎలావుంటుందో అట్లా ఆ చూపును నేను భరించలేక పోయాను. తరువాత నేనడగదలచిన ప్రశ్నలన్నీ..నాకే పేలవంగా తోచాయి. నేనేమీ ఆయన్ను అడగలేకపోయాను. తరువాత ఎన్నోసార్లు ఆశ్రమానికి వెళ్ళాను. నాలోని శంకలకూ..సంశయాలకు ఏదో‌ తేజస్సు జవాబు చెప్పినట్లయింది."..అని చలంగారు బదులు చెప్పారు....

                                                            అరుణాచల శివ🌹

0 comments: