Pages

Thursday, April 14, 2022

ఆప్తగమన....అంతగమన...

 



శ్లో" ఊర్ధ్వమూలో 2 వాక్ శాఖ ఏషో 2 శ్వత్థః సనాతనః !

        తదేవ శుక్రం తద్ బ్రహ్మ తదేవామృతముచ్యతే !

 తస్మింల్లోకాః శ్రితాః సర్వే తదు నాత్యేతి కశ్చన !ఏతద్ వై తత్ !!

 

ఈ అశ్వత్థ వృక్షం పురాతనమైనది.పైకి వ్రేళ్ళూనినది. క్రిందికి వ్యాపించిన కొమ్మలు కలది. అదే పావనమైనది. అదే భగవంతుడు. అది అవినాశి. సమస్త లోకాలూ దానియందే ఉన్నాయి. దానిని ఎవరూ అతిక్రమించలేరు.అదే సత్యం.

తలక్రిందులుగా నిలబడి ఉన్న ఒక రావిచెట్టు తో (అశ్వత్థవృక్షం) జీవితం పోల్చబడుతోంది.ఎప్పుడు ఒక వస్తువు తలక్రిందులుగా కనిపిస్తుంది?ప్రతిబింబించి నప్పుడు. ఏటి ఒడ్డున నిలబడ్డ చెట్టు ప్రతిబింబాన్ని నీటిలో చూసినప్పుడు చెట్టు తలక్రిందులుగా నిలబడ్డట్లుగా కనిపిస్తుంది. దాని వ్రేళ్ళభాగం పైన కొమ్మలు క్రింద ఉన్నట్లుగా కనిపిస్తుంది. ప్రతిబింబం నిజం కాదు.

ఏటి నీటిలో చెట్టు తలక్రిందులుగా కనిపిస్తుంది. దాన్లోని సత్యాన్ని ఆకళింపు చేసుకోగోరితే ఆ ప్రతిబింబాన్ని వదిలిపెట్టి, ఆ ప్రతిబింబానికి ఆధారమైన చెట్టును చూడాలి. అదే సత్యం. ఆ విధంగానే జీవిత సత్యాన్ని తెలుసుకోగోరితే జీవితానికి ఆధారమైన భగవంతుణ్ణి పొందగోరాలి.జీవిత వృక్షాన్నే భగవంతునిగా చెబుతోంది ఈ మంత్రం.





నీవు గాఢ నిద్రలో ఉన్నప్పుడు నీకు శరీరధ్యాస ఉండదు. అప్పుడు మృత్యుభయముంటుందా..? నీవు పూర్తిగా మేల్కొని, నీ శరీరాన్ని, ప్రపంచాన్నికి చూస్తున్నప్పుడే ఆ భయముంటుంది. కలలు లేని నిద్రలో వలె నీవు వీటిని చూడకుండా, కేవలం ఆత్మగానే ఉన్నప్పుడు ఏ భయమూ నిన్ను సోకలేదు. ఏదో పోతుందన్న భావమే భయాన్ని కలిగిస్తుంది. ఆ పోయేదేమిటి అని విచారిస్తే అది నీ శరీరం కాదనీ, అందులో పని చేసే మనస్సనీ తేలుతుంది.


తనకి ఎల్లప్పుడు ఎరుక ఉండేట్టయితే, ఈ రోగపీడితమైన శరీరాన్ని, దాని వల్ల కలిగే ఇబ్బందినీ వదిలించు కోవటానికీ అందరూ సిద్దమే. పోతుందని అతను భయపడేది ఈ ఎరుకని, ఈ చైతన్యాన్ని. జీవించి ఉండటమంటే, సదా ఎరుక కలిగి ఉండటమే. అదే వారి ఆత్మ. ఇదంటేనే అందరికీ ప్రీతి. అటువంటప్పుడు ఈ దేహంలో ఉంటూనే ఆ శుద్ధ చైతన్యాన్నే పట్టుకొని ఎందుకుండ కూడదు.. అన్ని భయాలనీ ఎందుకు వదిలించుకోకూడదు..నీ సహజస్థితి లోనే ఉండు"...

అంతగమనమైన మృత్యువు ను అత్యంత ఆత్మీయమైన చెలికాడుగా భావించి, ఆలింగనం కోసం అంతరంగం పడుతున్న తపన ఇది. మరణం దారుణమైనది కాదనీ , దయామయమైందన్న భావనకు నిదర్శనమిది. పరమశాంతికి మనల్ని చేరువ చేసే ప్రస్థానమే పరలోకగమనం. అందుకే జీవితపరమావధి తెలిసిన ప్రాజ్ఞులు , అస్తమయాన్ని ఆత్మబంధువుగా అక్కున చేర్చుకునేందుకు సంసిద్ధులై ఉంటారు.

భౌతిక శరీరంతో జీవాత్మకు కలిగే సంబంధమే జన్మ.  శరీరం నుండి జీవాత్మ విడిపోవడమే మృత్యువు.

నా ఆగమనంలోనూ నీవే... నా నిష్క్రమణంలోనూ నీవే! నా ఆనందంలోనూ నీవే... నా ఆవేదనలోనూ నీవే! అనుక్షణం నీ అద్భుత, అదృశ్యశక్తి నన్ను ఆత్మీయపవనమై ఆలింగనం చేసుకుంటూనే ఉంటుంది. నా ప్రమేయం లేకుండానే నీ అనురాగ హస్తం నన్ను చేయి పట్టుకుని ముందుకు నడిపిస్తూనే ఉంటుంది. అది జననంలోనైనా...మరణంలోనైనా!

గమనించినా గమనించకపోయినా మనం ఊపిరి పోసుకున్న క్షణం నుంచి ఊపిరి విడిచే క్షణం వరకు ఓ దివ్యశక్తి మనల్ని అనుక్షణం అనుగమిస్తూనే ఉంటుంది. అజ్ఞాతంగా అందరి ఆలనకు పాలనకు ఆధారభూతమవుతూనే ఉంటుంది. ఈ ప్రపంచంలో ప్రత్యక్షంగా కనిపించే మమతానుబంధాలకు , కురిపించే ప్రేమానురాగాలకు పరోక్ష ప్రేరకుడు ఆ పరమాత్మే!

నిజమే!అంతర్యామి అయిన ఆ అనంతాత్ముడు ఆనుదినం మనపై అనేక రూపాల్లో తన ప్రేమవృష్టిని కురిపిస్తున్నాడు.

జీవితమంటే ఎడతెగని బంధంతో మన ఆలోచనల్లోకి మరణాన్ని రానివ్వం.అది అనివార్య పరిణామమే అని తెలిసినా దాన్ని భయంకరమైన ఆలోచనగా దూరంగా ఉంచడానికి, వీలైనంత సుదూర ప్రక్రియగా మరచిపోవటానికి ఇష్టపడతాం. కానీ సత్యాన్ని అంగీకరించడానికి సిద్ధపడాలి. మృత్యు భయాన్ని జయించడం కంటే తపస్సిద్ధికి మరో తార్కాణం ఏముంటుంది!నిజానికి మరణం అంటే మరో రూపంలో మాధవుడే! అందుకే 'సంహారకులలో సర్వసంహర్తయైన మృత్యువును నేనే 'అంటాడు భగవద్గీత 'విభూతియోగం'లో శ్రీ కృష్ణభగవానుడు.




ధర్మ పురిని దర్శిస్తే యమపురి ఉండదని శాస్త్ర వాక్కు .శ్రీ నృసింహ స్వామివారి మహా మృత్యుంజయ మంత్రం మహామహిమాన్వితమైన మంత్రం ప్రతీరోజూ పఠించడం వలన అపమృత్యువు, అకాల మృత్యువు, అనుకోని ఆపదలు మన దరిచేరవు. ఆదిశంకరాచార్య విరచిత నృసింహ కరావలంబ స్తోత్రం. ఋణ విమోచన శ్రీ నృసింహ స్తోత్రం. శ్రీ నృసింహ ద్వాదశనామ స్తోత్రం.


ప్రతిరోజూ ఈ నరసింహ మహా మృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. జాతకరీత్యా అపమృత్యు దోషాలున్నవారు ప్రతిరోజూ జపించినా, లక్ష్మీ నరసింహ స్వామిని పూజించినా దోషం నివారింపబడి దీర్గాయుష్మంతులు అవుతారని శాస్త్రవాక్కు.


🙏శ్రీ నృసింహుని మహా మృత్యుంజయ మంత్రం🙏


ఉగ్రం వీరం మహావిష్ణుం 

జ్వలంతం సర్వతోముఖమ్‌

నృసింహం భీషణం భద్రం 

మృత్యోర్‌ మృత్యుం నమామ్యహం


🙏నరసింహ స్వామి అంత గొప్ప రక్షణ ఇస్తారు. ఆనాడు మృత్యువు కోరలలో చిక్కుకున్న ప్రహ్లాదుడిని రక్షించినట్లుగా మనల్ని కూడా రక్షణ చేస్తారు. పిల్లల చేత ప్రతిరోజూ చేయిస్తే వారికి ఆయుష్షు చేకూరుతుంది.


🙏ఆదిశంకరులు చేసిన నృసింహ కరావలంబ స్తోత్రం కూడా విశేష ఫలదాయకమైనది. శ్రీ నృసింహ కరవలంబ స్తోత్రం, రుణ విమోచన నృసింహ స్తోత్రం, నృసింహ ద్వాదశనామ స్తోత్రం కూడా పఠించాలి.


ఆదిశంకర భగవత్పాదాచార్య విరచిత శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం🙏


ప్రతీ రోజు శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారిని స్మరించడం, సకల శుభకరం.


ఆదిశంకరభగవత్పాదులు ఒకటి లక్ష్మీనృసింహకరావలంబ స్తోత్రం చేశారు, రెండు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చేశారు. ఇంకా ఏమైనా వారు చేసిన కరావలంబ స్తోత్రం ఉన్నాయేమో నాకు తెలియదు. అసలు కరావలంబం అంటే ఏమిటి? స్వామి వారిని "మాకు సహాయం చేసే చేతులను ఇవ్వు..." అని వేడుకోవడం. అంటే ఈ సకల లోకాలనూ రక్షించే నీ బాహువులతో మమ్మల్ని రక్షించు అని. కరావలంబ స్తోత్రం చాలా చాలా శక్తివంతమైనది. ఆదిశంకరులు ఒక విపరీతమైన ఆపద సమయములో నరసింహస్వామి వారిని కరావలంబస్తోత్రముతో పిలిస్తే, స్వామి తత్ క్షణమే వచ్చి ఆదిశంకరులను రక్షించారు. 


 శంకరులు మమదేహి కరావలంబం అని అంత అద్భుతమైన రెండు స్తోత్రాలు ఇచ్చారు అంటే, వాటిని ప్రతీరోజు మనం అనుసంధానం చేసుకుంటే, ఏ విధముగా ఆపదల నుంచి రక్షింపబడి, స్వామి యొక్క కృపకి పాత్రులము అవుతామో మన ఊహకి కూడా అందదు.


ఆదిశంకరులు అందించిన అటువంటి అద్భుతమైన మరియు శక్తివంతమైన స్తోత్రములలో ఒకటి  శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం...

*****                           ******                *****



"నిర్భయంగా వచ్చాను; నిర్భయంగా వెళతాను

ఉచ్ఛ్వసిస్తూ వచ్చాను ; నిశ్వసిస్తూ వెళతాను

మృత్యువు నృత్యం చూసి జడిపిస్తారెందుకని?

భయమెందుకు? నా ఇంటికి నే వెళతాను!

అంటూ ఈ లోకం నుంచి సెలవు తీసుకున్నారు.... దాశరధి కృష్ణమాచార్యులు.

                       *******************

                     ఓం నమః శివాయ...


No comments:

Post a Comment