Pages

Friday, November 12, 2021

అయ్యప్పస్వామి దీక్ష..

 




#అయ్యప్పదీక్షలో ఆధ్యాత్మిక రహస్యాలు*


⚜️ అయ్యప్ప దీక్షలోని భాగాలైన నల్లని వస్త్ర ధారణ, మాల ధారణ, చన్నీటి స్నానం, విభూతి, చందనాలతో అలంకరించుకోవడం మొదలైన ఆచారాలన్నింటిలోను అనంతమైన ఆధ్యాత్మిక, ఆరోగ్య, వేదాంత పరమైన రహస్యాలున్నాయి. 


⚜️ ఒంటిమీద భస్మధారణ ఈశ్వర సంకేతంగా భాసిస్తుంటే, నుదుటపై మెరిసే తిరునామం విష్ణుమూర్తిని నుతించేలా చేస్తుంది. 


 ⚜️ఈశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీకమాసం దక్షిణాయనంలో ప్రారంభమయ్యే అయ్యప్పపూజ విష్ణువుకు ఇష్టమైన ఉత్తరాయణం మార్గశిరంతో ముగుస్తుంది.

 

⚜️అయ్యప్పస్వామి వారి పద్దెనిమిది మెట్లను ‘పదునెట్టాంబడి’ అని అంటారు. ఈ పదునెనిమిది మెట్లలో ఒక్కో మెట్టుకూ ఒక్కో దేవత వుంటుంది. మోక్ష సామ్రాజ్య కైవసానికి ఈ మెట్లు ఉపకరణాలు అని శాస్త్రం. ఈ సోపానాలపై పద్దెనిమిదిమంది దేవతలను ఆవాహన చేశారు. "ఎనిమిది మంది దిక్పాలకులు, నాలుగు వేదాలు, రెండు శాస్త్రాలు, అవిద్య, విద్య, జ్ఞానం, అజ్ఞానం" అన్నీ కలిపి మొత్తం పద్దెనిమిది మెట్లుగా ఇక్కడ వున్నాయి. వీటన్నింటిని దాటుకొని వెళితేనే జ్ఞానస్వరూపుడైన ఆ భగవంతుని దర్శనం సులభం అవుతుంది.

 

⚜️ ఈ ఆలయంలో స్వామి ప్రతిష్టుడైన సందర్భంగా, మృదంగ, భేరీ, కాహళ, దుంధుబి, తుంబుర, మద్దెల, వీణ, వేణువు, నూపుర, మట్టుక, డిండిమ, ఢమరుక, ఢక్క, ధవళ, శంఖ, పరుహ, జజ్జరి, జంత్ర అనే పద్దెనిమిది వాద్యాలు మోగించారు. ఇదీ ఈ మెట్లకున్న నియమ ప్రాముఖ్యం. 


⚜️ నలభై రోజులు దీక్ష చేసినవారు మాత్రమే ఈ మెట్లు ఎక్కడానికి అర్హులు. ఎంతో నిష్ఠలతో ఈ మెట్లు దాటాలి. అప్పుడే ఆ ఆనందరూపుని దర్శించుకోగలం. ఈ మెట్ల క్రింద ఎంతో మహిమాన్వితమైన, పవిత్రమైన యంత్రస్థాపన జరిగింది. యంత్ర ప్రతిష్ట ఎంతో పునీతమూ, శక్తిమంతమూ కాబట్టే వాటిని ఎంతో భక్తి విశ్వాసాలతో, నియమ నిష్టలతో దాటాలి.


⚜️ అయ్యప్ప దీక్షకు చన్నీటి స్నానం, భూశయనం, పాదచారులై నడవడం, ఒంటిపూట భోజనం, బ్రహ్మచర్యం, మద్యమాంసాదులు, మసాల దినుసులు వంటి తామసకారకాలైన పదార్థాలను త్యజించడం వంటి నియమాలు పాటించాలి.


⚜️ ఆ స్వామి దీక్షను చేపట్టే వారు గురుస్వామి ద్వారా తులసి, రుద్రాక్ష మాలలను ధరిస్తారు. రెండుపూటలా చన్నీళ్ళ స్నానం ఆరోగ్యాన్ని చేకూర్చడమే కాక, మనసును ప్రశాంతంగా ఉంచి భగవధ్యానానికి తోడ్పడుతుంది. తులసి, రుద్రాక్షల లోని స్వాభావిక ఔషధ గుణాలు అనారోగ్యానికి గురికాకుండా కాపాడుతాయి మరియు రక్తపోటు, మధుమేహం మొదలైన ఎన్నో రోగాల అదుపుకు ఉపకరిస్తాయి.

 

⚜️ దీక్షా సమయంలో పాటించే ఆహారనియమం శరీరాన్ని అదుపులో ఉంచి, చెడు కోరికలను దూరం చేస్తుంది. మనోనిశ్చలత, జ్ఞానశక్తి దేహానికి బలాన్ని ఇస్తాయి కాబట్టే ఆ అయ్యప్ప భక్తులకు కఠినమైన బ్రహ్మచర్యాన్ని దీక్షలో ఓ భాగంగా విధించారు. చెప్పులు తొడగరాదనే నియమం వెనుక ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయి. ఇందువల్ల భక్తులకు కష్టాలను సహించే శక్తి కలుగుతుంది. నలభై ఒక్క రోజులు పాదరక్షలు లేకుండా నడిస్తే పాదాల క్రింద చర్మం మొద్దుబారి అడవులలో సునాయాసంగా నడిచే వీలు వుంటుంది. అయ్యప్ప దీక్షలో నలుపు రంగు వస్త్రాలను ధరిస్తారు. నలుపు తమోగుణాన్ని సూచిస్తుంది. అన్ని వర్ణాలను తనలో లీనం చేసుకునే నలుపు పరమాత్ముని లయకారక తత్వం. నల్లరాళ్ళను కూడా కరిగించగలిగే నరదృష్టి దోషాన్ని హరిస్తుంది. రంగురంగుల బట్టలపై మమకారం ఉండకూడదనటానికే నలుపు దుస్తుల ధారణ ముఖ్యోద్దేశం.

 

⚜️ అయ్యప్ప భక్తులు నొసటన తప్పనిసరిగా చందనం, విభూతి ధరిస్తారు. అయ్యప్ప విభూతి అన్నిటినీ మించిన దివ్యఔషధం. పంబా తీరంలో వంట చేసిన 108 పొయ్యిల నుంచి భస్మాన్ని సేకరిస్తారు. ఇలా సేకరించిన బూడిదను జల్లించి స్వామికి అభిషేకించగానే దానికి ఎనలేని శక్తి కలిగి సర్వరోగ నివారిణిగా తయారై ప్రాణదాతగా ఉపయోగపడుతుంది. అటువంటి మహిమాన్వితమైన విభూతి, గంధం ధరించడం వల్ల చక్కటి వర్చస్సు, మనోబలం కలుగుతాయి. అంతేకాక వాత, పిత్త, కఫం వంటి రోగాలు దరిచేరవు.

 

⚜️ 40 రోజుల అయ్యప్ప దీక్షను ముగించుకొన్న స్వాములు శబరిమల యాత్రకు ఇరుముడిలో బయలుదేరతారు. ఇరుముడిలో రెండు భాగాలు వుంటాయి. ముందు భాగంలో పూజాసామాగ్రి, వెనుక భక్తునకు కావలసిన వస్తువులు, తినుబండారాలు ఉంటాయి. ముందు భాగంలో ఉండే ఆవునెయ్యి భక్తుని ఆత్మతో సమానం. కొబ్బరికాయ దేహంతో సమానం. అనగా భక్తులైన వారు ఆత్మతో సమానమైన నేతితో స్వామికి అభిషేకం చేసి (ఆత్మార్పణ గావించి) దేహం వంటి కొబ్బరికాయను స్వామి సన్నిధిలోగల హోమగుండంలో వేయాలి. 

 

 ⚜️కామ క్రోధాలను వీడి, కొబ్బరికాయలో ఉన్న మోహమనే నీళ్ళను త్రోసి, జ్ఞానమనే నెయ్యిని పోసి, భక్తి నిష్ఠలనే ఇరుముడులను వేసి నలభై ఒక్క రోజులు స్వామి తలపులతోనే కఠినమైన జపం చేయాలి. అంటే శరీరం మీద మోహాన్ని విడిచి భగవంతునికే అంకితం చేయాలని అర్ధం.* 


⚜️ వెనుక భాగంలో ఉన్న తినుబండారాలు మానవుని ప్రారబ్దకర్మలు. ఎవరి ప్రారబ్ధాన్ని వారే మోసుకొని పోవాలి, వారే అనుభవించాలి. స్వామి సన్నిధికి చేరుకొనేసరికి తినుబండారాలు అయిపోవాలి. అంటే స్వామి సన్నిధికి చేరుకున్న భక్తుడు ప్రారబ్ధకర్మను వదిలివేయాలని అర్ధం.


⚜️‌ ఆవునెయ్యి శక్తికి సంకేతం. స్వామి వారికి అభిషేకించిన నేతిని సర్వరోగ నివారిణిగా సేవిస్తే తప్పనిసరిగా సత్ఫలితం చేకూరుతుంది. ఆవునెయ్యి సహజంగానే చాల పవిత్రమైంది, ఆరోగ్యమైంది. ఆవునేతిని కొబ్బరికాయలో నింపి స్వామివారిని అభిషేకించగానే దానికి ఎనలేని మహిమ వస్తుందని భక్తుల నమ్మకం.

 

⚜️శబరి సన్నిధానంలో వెలిగించే కర్పూరం మన చుట్టూ ఉండి హాని కలిగించే సూక్ష్మక్రిములను నాశనం చేసి, వాతావరణం కలుషితం కాకుండా కాపాడి అయ్యప్పలకు కవచంగా తోడ్పడుతుంది. శబరిమల భక్తులకు ఏ వ్యాధులు సోకవు. వీరి నియమనిష్ఠలే వారిని సర్వరోగాల నుండి రక్షించి కాపాడుతాయి. ఎరుమేలి నుండి ఒంటిమీద ఆచ్చాదన లేకుండా ఇరుముడిని తలపై దాల్చి అడవుల్లో నడిచి వెళుతుంటే అక్కడ వుండే ఎన్నో రకాల ఔషధవృక్షాల నుంచి వచ్చే మలయ మారుతాలు శరీరాన్ని తాకి రోగనిరోధక శక్తిని కలిగిస్తాయి. అక్కడ పారే సెలయేళ్ళు, అళుదానది, పంబానది కూడా ఎన్నో వనమూలికల మీదుగా ప్రవహించడం వల్ల వాటిలో స్నానం చేస్తే శరీర రుగ్మతలు తొలగుతాయి.

 

⚜️ యోగపట్టం ధరించిన దివ్యాసనాలతో వుంటాడు అయ్యప్ప స్వామి. అన్ని యోగరహస్యాలు స్వామి మూర్తిలోను, తత్సన్నిధి కోసం జీవుడు చేసే యాత్రలోనూ ప్రస్ఫుటమవుతాయి. 


⚜️పూర్ణ సంఖ్య అయిన 18, పరిపూర్ణతను సాధించిన జ్ఞానానికి సంకేతం. అటువంటి జ్ఞానాన్ని సాధించడమే 18 మెట్లు ఎక్కడం.మాల ధరించిన రోజు నుంచి భక్తులు ప్రతిరోజు రెండు పూటలా స్వామిని అర్చించి, నలభై ఒక్క రోజులు అయ్యప్ప వ్రతదీక్షాపరులై  నియమనిష్ఠలతో తలపై ఇరుముడిని ధరించి అడవిలో ప్రయాణించి శబరిమలై చేరుకొని అష్టాదశ సోపానాలు అధిరోహించి, హరిహర పుత్రుని దర్శించి సాయుజ్యాన్ని పొందుతారు.


#శబరిమలలో స్వామికి జరిగే నిత్య కైంకర్యాలు*


హరిహరసుతుడు అయ్యప్పస్వామికి భక్తిశ్రద్ధలతో శాస్త్ర ప్రకారం నిర్వహించే పూజలు, అర్చనలు హైందవ సంప్రదాయానికి ప్రతీకలు. మండలం, మకరం, ఓణం సందర్భాల్లో సన్నిధానంలో ఘనంగా పూజలు నిర్వహిస్తారు.

 

హరిహరసుతుడు అయ్యప్పస్వామికి భక్తిశ్రద్ధలతో శాస్త్ర ప్రకారం నిర్వహించే పూజలు, అర్చనలు హైందవ సంప్రదాయానికి ప్రతీకలు. మండలం, మకరం, ఓణం సందర్భాల్లో సన్నిధానంలో ఘనంగా నిర్వహించే పూజాదికాలతో పాటూ పంప, ఎరుమేలిల్లోని ఉత్సవాలూ భక్తులకు కనువిందు చేస్తాయి. మండలం, మకర విలక్కు సందర్భాల్లో ఉదయం 7.30 గంటలకు నిర్వహించేది ఉషపూజ. ఈ పూజను మేల్‌సంతి నిర్వహిస్తారు. ఈ సందర్భంలోనే ‘ఉష పాయసాన్ని’ స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. మధ్యాహ్న సమయంలో తంత్రి ఆధ్వర్యంలో జరిగే పూజ ఉచపూజ. ఈ పూజలో ప్రత్యేకంగా తయారు చేసిన 25 కలశాలను ఉంచి, ఎలనైవేద్యం, ఆరవణ పాయసాలను స్వామివారికి నివేదిస్తారు. రాత్రిపూట అదాజ పూజను మేల్‌సంతి చేస్తారు. ఈ సమయంలో ఎలనైవేద్యం, అప్పంలను నైవేద్యంగా సమర్పిస్తారు.


సన్నిధానానికి దీక్షతీసుకున్న భక్తుల్ని చేర్చే పద్దెనిమిది మెట్లకు పడి పూజ చేస్తారు. మండలం, మకర విలక్కు సందర్భాల్లో భక్తుల రద్దీని బట్టి పూజను చేసేదీ లేనిదీ నిర్ణయిస్తారు. అయితే మలయాళ మాసాల్లో ఆలయాన్ని తెరిచిన ప్రతి సందర్భంలోనూ పడి పూజ చేస్తారు. ఈ పూజ తంత్రి ఆధ్వర్యంలో, మేల్‌సంతి సహకారంతో జరుగుతుంది. మకరజ్యోతి దర్శనం తర్వాత, ఆలయాన్ని మూసివేసే ముందు పడిపూజ నిర్వహిస్తుంటారు.


మండల పూజ సమయంలో పదిరోజులపాటు ‘ఉల్సవం’ పేరుతో ఓ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ముందు తంత్రి ఆధ్వర్యంలో ‘కొడిమరం’ అనే ఆచారం ప్రకారం ధ్వజస్తంభం దగ్గర జెండాను ఎగురవేస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలూ, అభిషేకాలూ ఉంటాయి. చివరి రోజున ఉత్సవమూర్తిని గజారోహణంపై ఊరేగించి, పంపకు తీసుకొస్తారు. అక్కడ పవిత్ర స్నానం చేయించి ‘ఆరాట్టు’ వేడుక జరుపుతారు. ఈ కార్యక్రమానికి మేల్‌సంతి ఆధ్వర్యం వహిస్తారు.


మాలికాపురత్తమ్మ శబరిమల నుంచి శరంగుత్తి వరకూ గజారోహం ద్వారా సాగించే యాత్రే ఎజున్నెలిప్పు. అలంకరించిన ఏనుగు మీద అమ్మవారి ప్రతిమను ఉంచి, స్వామి సన్నిధి మీదుగా శరంగుత్తికి తోడ్కొనివస్తారు. అక్కడ కన్నెస్వాములు గుచ్చిన శరాలను చూసి వెనుదిరిగి పదునెట్టాంబడి మీదుగా మాలికాపురత్తమ్మ ఆలయానికి ఈ ఊరేగింపు సాగుతుంది. శరాలను చూసిన ఏనుగు విషణ్ణవదనంతో వెనక్కి వస్తుందని భక్తులు చెబుతారు.


మకర విలక్కు తర్వాత సన్నిధానాన్ని మూసే ముందు రోజు అమ్మవారి ఆలయంలో పందళరాజు నిర్వహించే కార్యక్రమమే గురుథి. ఆ రోజు రాత్రంతా రాజు ఆలయంలోనే ఉంటారు. ఈ సందర్భంలో అక్కడ ఎవరికీ ప్రవేశం ఉండదు.


జ్యోతి దర్శనానికి ముందు రోజు పంపానది తీరంలో భారీ ఎత్తున జరిగే అన్నదాన కార్యక్రమమే పంప సద్య. ఇతిహాసాల ప్రకారం వేటకు వెళ్లిన అయ్యప్ప ఇక్కడే తన సన్నిహితులకు అన్నదానం చేశారనీ, దానికి సంబంధించిందే ఈ కార్యక్రమమనీ అంటారు. అనంతరం పంప విలక్కు పేరుతో దీపాలు వెలిగించిన ఓ పడవను నదిలో వదులుతారు.


ఎరుమేలిలోని వావర్‌ మసీదు దగ్గర ముస్లింలు చేసే వేడుక చందనకుడం. మకర విలక్కు సమయంలోనే ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అలంకరించిన ఏనుగుల మీద చందన కలశాలు ఉంచి మేళతాళాలతో మసీదుకు వచ్చి అయ్యప్ప స్నేహితుడైన వావర్‌కు నైవేద్యంగా ఇస్తారు.


అంబళ్‌పుజ-అలంగత్‌ పేటతుల్లాల్‌ : సందళ్‌పేట తరువాత అంబళ్‌పుజ, అలంగత్‌ అనే ప్రాంతాల ప్రజలు ఎరుమేలిలో భారీయెత్తున పేటతుల్లాల్‌ అనే వేడుకను జరుపుతారు. వీరంతా వావర్‌ దర్శనం చేసుకుని ఎరుమేలిలో స్నానం చేసే సమయంలో ఓ గరుడ పక్షి వచ్చి అక్కడ తిరుగుతుంది. వీటితోపాటు ఆలయం తెరిచిన సమయంలో నిత్యం సుప్రభాత సేవ, ఘృతాభిషేకాలు, చందనాభిషేకం, పుష్పాభిషేకం, కలశభిషేకం, భస్మాభిషేకం, గణపతి హోమం, హరిహరాసనం లాంటి ధార్మిక విధులను తప్పకుండా నిర్వర్తిస్తారు.


             #స్వామియే శరణమయ్యప్పా🙏🏻🙏🏻

సేకరణ.....

1 comment:

  1. Nenu vellaanandi శబరిమలై..exact gaa 50 means half century kottina ventane అవకాశం vachhindi.. మా vaaru 11 yrs deeksha,తరువాత every year శబరిమలై visit..
    Chaalaa విలువైన విషయాలు వివరించారు

    ReplyDelete