***భాగవతం లో నవనాధుల బోధ***
కవి, హరి, అంతరిక్షుడు , ప్రబుద్ధుడు , పిప్పలాయనుడు, అవిర్హోత్రుడు , ద్రమీళుడు , చమసుడు, కరభాజనుడు. వీరు తొమ్మిదిమంది బ్రహ్మవిద్యావిశారదులయ్యారు.వీరే నవనాధులు.
నవనారాయణాంశ సంభూతులే ఈ నవనాధులు . ఋషభ చక్రవర్తికి గల 100 మంది కుమారులలో నారాయణాంశ కలిగిన తొమ్మిది మందే ఈ నవనాథులు. సృష్టి అంతా పరమాత్మ స్వరూపమని ఎరిగి ముక్తులై అన్ని లోకాలలో సంచరిస్తుంటారు.
వీరు భాగవతము ఏకాదశ స్కందము లో చేసిన బోధ..
ఈ తొమ్మిది మంది ఒకసారి జనకుని యజ్ఞం చూడడానికి వచ్చారు. జనకుడు వారిని పూజించి, ఉచితాసనాలిచ్చి గౌరవించాడు. తర్వాత 'మీరు విష్ణుమూర్తిని ఎంతో భక్తిశ్రద్ధలతో భజించే గొప్ప తపోనిధులు,జీవన్ముక్తులు.' ఈ సంసారాలు పరమ సారం లేనివి. సామాన్య సంసారులకు ఆత్మజ్ఞానం ఎలా లభిస్తుంది?ముక్తి ఎలా పొందుతారు?అని ప్రశ్నించాడు. అప్పుడు జనక భూపాలునికి కవి ఇలా చెప్పాడు.
కవి సంభాషణ ..
అంతేకాదు సకల రకాల జంతువుల జన్మల కంటే మానవ జన్మ శ్రేష్ఠమైనది, అది ప్రాప్తించటం కష్ట సాధ్యం. అందులోనూ శ్రీమన్నారాయణుని చరణయుగళ స్మరణంమీద ఆసక్తి కలగటం మరీ కష్టం. అందువలన, శాశ్వతమైన క్షేమాన్ని గురించి అడుగ వలసి వచ్చింది. ప్రపత్తి యందు నిష్ఠగల భక్తులకు పరమేశ్వరుడు శ్రీమహావిష్ణువు సారూప్యం ఎలా ఇస్తాడు, ఈ విషయం చెప్పండి.” అని అడిగిన విదేహరాజుతో శ్రీహరి కథామృతాన్ని త్రాగి పరవశులు ఐన ఆ మునులలో కవి అనే మహానుభావుడు ఈ విధంగా చెప్పటం మొదలుపెట్టాడు.
“(1) అరిషడ్వర్గం అనే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఆరింటిలోను; ఈషణత్రయం అనే దారేషణ ధనేషణ పుత్రేషణ మూడింటిలోనూ; చిక్కుకుని మాత్సర్యంతో కూడిన మనసు కల మానవుడికి శ్రీహరి పాదపద్మాలను భజించే భాగ్యం ఎలా ప్రాప్తిస్తుంది?
(2) విశ్వము వేరు, ఆత్మ వేరు అని భావించే వాడికి భయం ఎలా లేకుండా పోతుంది?
(3) అట్లు అవిద్యాంధకారంలో మునిగితేలే వాడికి విష్ణుభక్తి ఎలా అలవడుతుంది?
(4) అటువంటి నరుడు మొదట శరీరాన్ని త్యజించి పరతత్వాన్ని ఏ విధంగా చేరుతాడు?
(5) కండ్లు మూసుకుని నడిచే మనిషి దోవలో తడబాటులు పడుతూ పోతున్నట్లుగా, విజ్ఞానంతో శుద్ధమైన హృదయంలో భక్తిభావన లేకుండా పోతే పరమపదం ఎలా సిద్ధిస్తుంది” అని అడిగావు. సమాధానాలు చెప్తాను శ్రద్ధగా విను. త్రికరణశుద్ధిగా అనగా మనసుతో, వాక్కుతో, కాయంతో చేసే ప్రతీ కర్మా “కృష్ణార్పణం” అని మనస్ఫూర్తిగా పలకటమే సుజ్ఞానము అని మహామునీశ్వరులు అంటారు. జ్ఞాన, అజ్ఞానాలలో కలత చెందుతుంటే స్మృతి వ్యత్యస్తమవుతుంది. కాబట్టి, గురువునకు దేవుడికి అనుగుణంగా నడచే బుద్ధిమంతుడైన నరుడు లక్ష్మీపతి ఐన విష్ణుమూర్తిని ఉత్తమోత్తముడైన పురుషోత్తముడిగా చిత్తంలో చేర్చి సేవించాలి. కలల యందు, కోరికల యందు, వాంఛల యందు సర్వసంకల్పాలు నాశనం అవుతాయి. కనుక, ఎట్టి పూనిక గట్టిగా నిలుబడదు. అందుచేత, వాటిని అణచుకుని ఎప్పుడూ శ్రీహరిని ధ్యానిస్తూ ఉండే వాడికి కైవల్యం చేతిలో ఉసిరికాయలాగ సులభంగా ప్రాప్తిస్తుంది. ఓ రాజా! సదా శ్రీకృష్ణ సంకీర్తనలు వీనులవిందుగా వినాలి; హరినామ కథనాన్ని సంతోషంతో ఆడుతూ పాడుతూ చెయ్యాలి; నారాయణుని దివ్యమైన నామాలను హృదయంలో సదా స్మరిస్తూ ఉండాలి; కమలనయనుని లీలలను అడవులలో చరిస్తున్నా భక్తియుక్తంగా పాడాలి; విశ్వమయుడిని వెఱ్ఱిగా కీర్తిస్తూ లోకానికి అంటీ అంటకుండా ఉండాలి; ఈ సృష్టి మొత్తం విష్ణుమయ మని తెలుసుకోవాలి; భేదబుద్ధి ఏ మాత్రమూ చూపరాదు.”అని మహాముని కవి చెప్పాడు
హరిమునిసంభాషణ ..
అంత, విదేహ (జనకమహారాజు)రాజు ఇలా అడిగాడు. “భాగవతధర్మ మేది? అది ఏ ప్రకారంగా ప్రవర్తిస్తుంది? భాగవతుల గుర్తు లేమిటి? ఇవి చెప్పటానికి మీరే తగినవారు.” దానికి వారిలో హరి అనే మహాముని ఇలా చెప్పసాగాడు. “భాగవతుడు అంటే ఆ హరి యందు భక్తీ ఆసక్తీ కలవాడు; సర్వభూతమయుడైన పద్మలోచనుడు శంఖం చక్రం దాల్చి తన ఆత్మలో ఉన్నాడనే విశ్వాసం కలవాడు. ఓ మహా రాజా విదేహ! భాగవతుడు చతుర్వర్ణాలు చతురాశ్రమాలు వాటి ధర్మాలు కర్మలు అంటూ వీటిలో మునిగిపోకుండా, భక్తిమార్గాన్ని ఆశ్రయించి, శ్రీహరి విశ్వం అంతా నిండి ఉన్నాడు అంటాడు. భాగవతోత్తముడు ఈ విధంగా సకల బంధాలను త్రెంపుకుని అన్నింటిలో పరమాత్మను గుర్తించినవాడై మెలగుతాడు. మహాప్రభువైన సూర్యుడు తన సహస్ర కిరణాలచేత ముల్లోకాలనూ పావనం చేయునట్లు, తన పాదధూళి చేత జగత్రయాన్నీ పవిత్రం చేస్తూ ఉంటాడు. దేవదానవులకు కూడా సేవింపదగిన జనార్ధునుని చరణారవిందాలకు నమస్కరించా లనే అభిలాష కలిగి ఉంటాడు. తన భక్తిని రవ్వంత కూడ చలించనీయక చంద్రుడు ఉదయించడంతో ఎండ బాధ పోయినట్లు నారాయణుని చరణకాంతుల వెన్నెలలచే భాగవతుడు హృదయతాపం పోగొట్టుకుంటాడు. ఉత్తమ భాగవతుడు తన భక్తి అనే బంధాలతో వాసుదేవుని చరణపద్మాలకు బంధించుకుని ధ్యానానందంలో పరవశిస్తూ ఉంటాడు.” ఈ విధంగా మహాముని తెలుపగా రాజు విదేహుడు ఇలా అన్నాడు. మహాత్ములారా! మీరు ఇంద్రియాలను జయించిన మహానుభావులు. మూడులోకాలను పరమ పవిత్రం చేసే, గజరాజవరదుడు శ్రీహరి గుణవిశేషాలను మనోరంజకంగా మీనుండి వినాలని నాకు వేడుక పుట్టింది.”
అంతరిక్షుసంభాషణ
ఇలా పలికిన విదేహుని(జనకుని)తో అంతరిక్షుడు అనే మహర్షి ఇలా అన్నాడు.“పరబ్రహ్మ అన్నా; పరతత్వము అన్నా; పరమపదము అన్నా; ఈశ్వరుడు అన్నా; శ్రీకృష్ణుడు అన్నా; శ్రీమన్నారాయణుడే. ఆయనే జగద్భరితుడై ప్రకాశిస్తూ ఉంటాడు.అవ్యక్తమైన నిర్గుణ పరబ్రహ్మంనుండి తనకు ఇతరంగా కలిగే జ్ఞానాన్ని విష్ణుమాయ అంటారు. ఆ మాయ చేతనే ప్రపంచాన్ని నిర్మించి భగవంతుడు ఏ చింతా లేకుండా ఉంటాడు. ఇంద్రియాల వెంట తిరిగే చెడుబుద్ధి గలవారికి నిద్ర, స్వప్నం, మెలకువ అని మూడు అవస్థలతోపాటు పరమేశ్వరుని పొందలేకపోవటం అనే నాలుగో అవస్థ కూడ కలుగుతుంది. కలలో గ్రహింపదగినదీ గ్రహించేవాడూ గ్రహించటం అనే మూడు భేదాలుంటాయి. ఈ విధంగా అవిద్య అనే చీకటిచే చుట్టుకోబడి మూడువిధాలయ్యే కోరిక స్వప్నంలో అణిగిన విధంగా మూడువిధాలైన మాయ కూడా ఆత్మలో విలీనమవుతుంది.
పరమేశ్వరుడు మొదట పృథివి, అగ్ని, జలం , వాయువు ఆకాశం అనే పంచభూతాలతో నిండిన సృష్టిని కలిగించాడు. అందులో పంచభూతాత్మకమైన ఆత్మకు పదకొండు ఇంద్రియములతో భేదం పుట్టిస్తూ గుణాలచేత గుణాలను అంగీకరిస్తూ ఆత్మ యందు వ్యక్తమైన గుణాలవల్ల గుణాలను అనుభవిస్తూ ఉంటాడు. సృష్టిని తనదిగా భావిస్తాడు. శరీరధారి పూర్వకర్మ మూలంగా నైమిత్తికాలైన కర్మలు చేస్తూ వాటి ఫలితాన్ని అంగీకరించి దుఃఖానికే వశుడై వర్తిస్తుంటాడు. అనేక దుఃఖాలలో మునిగిన ఆ దేహి కర్మఫలాన్ని పొందుతూ ప్రపంచానికి జలప్రళయం వచ్చే దాకా స్వేచ్ఛను కోల్పోయి, చావుపుట్టుకలలో పడి పొరలుతుంటాడు. కల్పాంత సమయంలో ద్రవ్యగుణాల స్వరూపమైన జగత్తును ఆద్యంతాలు లేని కాలం ప్రకృతిని పొందిస్తుంది.ఆ పైన నూరేండ్లు వానలులేక భయంకరమైన ఎండల వల్ల అన్నిలోకాలు తగలబడుతాయి. అటుపిమ్మట, అధోలోకంనుండి ఆదిశేషుని ముఖం నుంచి ఆవిర్భవించిన అగ్నిజ్వాలలు వాయు సహాయంతో లేచి దిక్కులంతటా వ్యాపిస్తాయి. ఆ తరువాత సంవర్తకాలనే మేఘాలు నూరేండ్లు ధారాపాతంగా వర్షం కురుస్తాయి. వానిలో విరాడ్రూపం విలీనమవుతుంది. అప్పుడు ఈశ్వరుడు కట్టెలలో అగ్నివలె అవ్యక్తాన్ని ప్రవేశిస్తాడు. అనంతరం భూమండలం తన గంధ గుణాన్ని కోల్పోయి జలరూపాన్ని ధరిస్తుంది. ఆ జలం రసాన్ని కోల్పోయి తేజో రూపాన్ని పొందుతుంది. ఆ తేజస్సు అంధకార నిరస్తమై రూపం పోయి వాయువులో అణుగుతుంది. ఆ వాయువు స్పర్శను పోగొట్టుకుని ఆకాశ మందు సంక్రమిస్తుంది. ఆకాశం శబ్దగుణాన్నిపోగొట్టుకుని ఆత్మ యందు అణగిపోతుంది. ఇంద్రియాలు మనస్సు బుద్ధి వికారాలతో అహంకారాన్ని ప్రవేశిస్తాయి. ఆ అహంకారం తన గుణములతో కలసి పరమాత్మను చేరుతుంది. ఈ విధంగా మూడువర్ణాలు కలిగిన సృష్టి స్థితి లయాలకు కారణమైన మాయ ఇటువంటిది” అని దాని స్వరూపమూ మాహత్య్మమూ వివరించగా విని విదేహరాజు ఇలా అన్నాడు. “మీరు లోకోత్తములు. సత్యవాక్య పరిపాలకులు. కనరాని మాయను లోపల అణచివేసి అజ్ఞానులు ఏ విధంగా వైకుంఠాన్ని చేరగలుగుతారు? ఈ విషయాన్ని దయతో చెప్పండి.” ఇలా అన్న విదేహునితో ప్రబుద్ధుడు అనే మహముని ఆదర పూర్వకంగా ఇలా అన్నాడు.
ప్రబుద్ధునిసంభాషణ ..
ప్రతిదినము మానవుల ఆయువు, సూర్యుడు ఉదయించడం అస్తమించటంతో, క్షీణిస్తుంటుంది. దేహంపైనా, భార్యపైనా, స్నేహితులపైనా, సోదరులపైనా నాది, నావారు అనే మమకారంతో కట్టుబడిపోతారు. ఆ బంధం నుంచి విడివడే ఉపాయం కనపడక సంసార మనే చీకటిలో మునిగి భూత భవిష్యత్తులు తెలియక గుడ్లగూబల లాగా మానవులు పుట్టుక ముసలితనం రోగాలు ఆపదలు చావు పొందుతూ కూడ శరీరమే మేలనుకుంటూ ఉంటారు. మోహాన్ని కలిగించే మద్యపానంతో మత్తులై ఇంద్రియవిషయ ఆసక్తులై తమ్ము తాము తెలుసుకోలేక విరక్తిమార్గం తెలియక నడయాడుతుంటారు అటువంటి మూఢులైన మానవుల సమీపానికి పోవలదు. కేవలం నారాయణుని పైన భక్తిభావం గల సద్గురువును నిత్యము భజించి ఉత్తమమైన భాగవతధర్మాలను అనుష్టించాలి. ఆ ధర్మాలు ఏవంటే:
1. మూఢుల పొంతల పోకపోవుట; 2, సద్గురు ప్రతిదిన భజనము; 3. సత్త్వగుణము కలిగి ఉండటం; 4. భూతదయ; 5. హరికథామృత పానం; 6. బ్రహ్మచర్య వ్రతం; 7. ఇంద్రియ సుఖాలందు మనస్సును చేరనీయ కుండటం; 8. సాధుసంగమం; 9. సజ్జనులతో స్నేహం; 10 వినయ సంపద; 11. శుచిగా ఉండటం; 12. తపస్సు; 13 క్షమ; 14. మౌనవ్రతం; 15. వేదశాస్త్రాలను చదవటం వాటి అర్ధాన్ని అనుష్ఠించటం; 16. అహింస; 17. సుఖాన్నిగాని దుఃఖాన్నిగానీ సహించటం; 18. ఈశ్వరుడు అంతటా ఉన్నట్లు భావించటం; 19. మోక్షం పొందాలనే కోరిక; 20. కుజనుల సంగతి వదలటం; 21. వల్కలాలు మొదలైనవి కట్టడం; 22. దానంతట అది లభించిన దానితో సంతుష్టి చెందటం; 23. వేదాంతశాస్త్రాల అర్ధాలను తెలుసుకోవా లనే కుతూహలం; 24. ఇతర దేవతలను నిందించకుండా ఉండటం; 25. త్రికరణసుద్ధి; 26. సత్యమే పలకటం; 27. శమం దమం మొదలైన గుణవిశేషాలు; 28. ఇల్లు తోటలు పొలాలు భార్య సంతానం ధనం మొదలైనవాటిని పరమేశ్వరార్పణం గాభావించటం; 29. భక్తులు కాని వారిని ఆశ్రయించకుండా ఉండటం.” అని చెప్పి పిమ్మట... మహారాజ! హరిభక్తులతో స్నేహంచేస్తూ హరిలీలలను తలచుకుంటూ కన్నులలో ఆనందబాష్పాలు నిండగా ఒళ్ళు పులకరిస్తుండగా మానవుడు హరిమాయను గెలుస్తాడు.”అనగా ఆ విదేహచక్రవర్తి వాళ్ళతోఇలాఅన్నాడు. “భాగవతులారా! సమస్త లోకాలకూ ప్రభువై నారాయణుడనే నామంతో అలరారే పరమాత్ముని ప్రభావాన్ని వినాలనుకుంటున్నాను ఆనతీయండి.” అంటే పిప్పలాయను డనే మునీంద్రుడు ఇలా అన్నాడు.
పిప్పలాయనభాషణ
“రాజా! విను నీకింపు కలిగే విధంగా లోకేశ్వరుని చరిత్ర చెబుతాను. సృష్టి స్థితి లయలకు కారణమైన పరంజ్యోతి స్వరూపం దేహేంద్రియాలలో స్థిరంగా ప్రవేశిస్తుంది మంటలు అగ్నిలోపల ప్రవేశింపలేనట్లు, ఇంద్రియాలు ఆత్మను ఆక్రమించలేవు. నాదం పిల్లనగ్రోవిని లోగొన లేదు కదా. సత్త్వము రజస్సు తమస్సు అనే గుణత్రయం మహదహంకార రూపమై చైతన్యంతో కలిస్తే జీవమంటారు. ఇదే సత్తు అసత్తు స్వరూపంగా ఎన్నబడుతుంది. ఇందుకు అతీతమైన దాన్ని పరమాత్మగా తెలుసుకుని బ్రహ్మ మొదలైనవారు స్తుతిస్తారు. ఇటువంటి పరమాత్మ స్థావరజంగమాలను అధిష్టించి వృద్ధిక్షయాలు పొందక నిమిత్రమాత్రంగా చెట్లు తీగలు మొదలైనవాని లోపల వర్తిస్తుంటాడు. సర్వేంద్రియాలచే ఆవరించబడిన ఆకారము పోగా మనస్సును వదలి శ్రుతి విరహితుడై తిరుగుతుంటాడు. నిర్మలమైన జ్ఞానదృష్టి కలవాడు సూర్యుని కాంతి పుంజం దర్శించినట్లు. సుజ్ఞాని అయినవాడు హరిభక్తిచేత గుణకర్మార్థములైన చిత్త దోషాలను నశింపజేసి ఈశ్వరుని చేరుకోగలుగుతాడు.” అంటే విని విదేహుడు ఇలా అన్నాడు. “మహర్షిపుంగవ! పురుషుడు ఏయే కర్మలను ఆచరిస్తే పుణ్యుడై పాపాలను పోగొట్టుకుని మురారి పాదాలను చేరుకోగలుగుతాడో చెప్పండి.”
ఆవిర్హోత్రుని భాషణ ..
అలా అడుగగా ఆవిర్హోత్రుడనే మహాముని విదేహప్రభువుతో ఈ విధంగా చెప్పసాగాడు. “కర్మ అకర్మ వికర్మ వీటిని ప్రతిపాదించే శ్రుతివాదులు లౌకికులు చెప్పినవి కాదు. అటువంటి వేదాలు సర్వేశుని స్వరూపాలు వాటిని పండితులు కూడ తెలుసుకోలేరు. వాటిని కర్మాచారాలు అంటారు. మోక్షంకోసం నారాయణ భజనం అన్నిటి కంటే పవిత్రమైనది. వేదం చెప్పినట్లు చేయక ఫలాలు కోరేవారు ఎన్నో జన్మలు ఎత్తుతారు. మోక్షాన్ని కోరేవారు శాస్త్రం చెప్పినవిధంగా హరిని పూజించాలి. ఆ పూజావిధానం ఎటువంటిదంటే పరిశుద్ధమైన దేహంతో భగవంతుని సన్నిధిలో పవిత్రచిత్తుడై ప్రవర్తించాలి. షోడశోపచారాలతో చక్రధరుని ఆరాధించాలి. గంథం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం అర్పించి సాష్టాంగదండప్రణామాలు చేయాలి. విశేషమైన భక్తిభావం మనసున నింపుకోవాలి. అట్టివాడు పరమాత్మను జేరుతాడు.” అని వివరించగా విని విదేహమహారాజు ఇలా అన్నాడు. “ఈశ్వరుడు ఏ లీలలు ఆచరించాడు. ఆ వివరం అంతా తెలుపవలసింది.” అనగా ద్రమిళుడనే మునివర్యుడు ఇలా అన్నాడు. రాజా ఆకాశంలోని చుక్కలను లెక్కపెట్టవచ్చు. భూమిపై గల ఇసుక రేణువులను కూడ లెక్కపెట్టవచ్చును. కానీ నారాయణుని గుణములు చరిత్రలను మాత్రం శివుడు బ్రహ్మ మొదలైనవారు కూడ వర్ణించ లేరు.
భగవంతుడు తాను సృష్టించిన పంచభూతాలతో సంభూతమైన పురమును చేసి, దానిలో తన అంశతో ప్రవేశించి పిమ్మట సగుణనిష్ఠుడై నారాయణుడు అను పేరు కల ఋషీశ్వరుడుగా విరాజిల్లాడు. ఆయన పది ఇంద్రియాలతో నిర్మితాలైన శరీరాలను దాల్చి జగత్తును సృష్టించటం రక్షించటం సంహరించటం మొదలైన కార్యాలు చేయటం వలన రజస్సత్త్వతమోగుణాలతో బ్రహ్మ, విష్ణు, రుద్రుడు అనే పేర్లతో ఒప్పుతుంటాడు. త్రిగుణాత్మకుడు అనబడే ఆ నారాయణుని చరిత్ర చెబుతాను విను.
నారయణఋషి భాషణ ..
బదరీకాశ్రమంలో ధర్ముడు దక్షపుత్రికను పెండ్లాడాడు. ఆ దంపతులకు సత్కర్ముడు పరిశుద్ధుడు ఐన నారాయణఋషి జన్మించాడు. ఆ నారాయణముని బదరికాశ్రమంలో అపారమైన నిష్ఠతో తపస్సు చేయసాగాడు ఆయన తపస్సుకు ఇంద్రుడు భయపడి తపోభంగం నిమిత్తం మన్మథుడిని అప్సరసలను పంపించాడు. ఆ ప్రకారం వారు నారాయణాశ్రమానికి అతని తపస్సును భగ్నంచేయడానికి వచ్చారు. ఆ తపోవనం మామిడి, మద్ది, మారేడు, అరటి, ఖర్జూరం, నేరేడు, నిమ్మ, చందనం, సురపొన్న, మందారం మొదలైన అనేక వృక్షాలతో నిండి ఉన్నది. పూలతో, పండ్లతో కొమ్మలు క్రిందికి వంగి ఉన్నాయి. గురువింద పొదల పూలగుత్తుల మకరందం త్రాగి మదించిన తుమ్మెదలు చేసే ఝంకారాలతో దిక్కులు నిండిపోతున్నాయి. బంగారు పద్మాలు, కలువలు, ప్రకాశించే సరస్సులలో జక్కవలు, కొంగలు, క్రౌంచ పక్షులు, హంసలు జంటజంటలుగా విహరిస్తున్నాయి. తామరతూళ్ళను తినుటం కోసం సారసపక్షులు ముక్కులతో చీల్చబడిన తామర మొగ్గలలోని కేసరాలతో సరోవరాలు భాసిస్తూ ఉన్నాయి. అటువంటి తపోవనంలో ఆ చంద్రముఖులైన అప్సరసలు నెమ్మదిగా నడుస్తూ చెమట బిందువులను కొనగోళ్ళతో చిమ్ముకుంటూ నారాయణమహర్షిని సమీపించారు. ఆ సమయంలో నారాయణఋషి మన్మథుని బాణాలకు లొంగ లేదు. ధైర్యము విడువలేదు. ఆ కాంతల వాడి చూపులకు మోహము పొంద లేదు. ఏమాత్రం చలించక తన హృదయంలో అచ్యుతుడు, అనంతుడు, జగన్నివాసుడు, రమేశుడు అయిన శ్రీహరిని నిశ్చలభక్తితో మనసున నిలుపుకుని ఉన్నాడు. ఆయన వారితో ఇలా అన్నాడు. “పద్మముఖులార! ఇంద్రుడు పంపగా మీరు వచ్చారు. ఇక్కడ విహరించాలనే కోరిక ఉంటే మీ ఇష్టంవచ్చినట్లు తిరగండి.” అనేటప్పటికి వాళ్ళంతా సిగ్గుపడి ఆ మహర్షితో ఇలా అన్నారు. “దేవమునీంద్రా! నీ దివ్యమైన చరిత్ర గ్రహించి స్తుతించటానికి ఎవరికి సాధ్యం అవుతుంది. పుత్రులు, మిత్రులు, భార్యలు మొదలైన భోగాలను వదలి తపస్సు చేసే సద్ధర్మ పరులకు విఘ్నాలు కలుగుతాయా? జగదీశ్వరుడిని కొలిచేవారికి ఆటంకాలు ఉంటాయా? కామం క్రోధం కలిగిన తాపసుల తపస్సు బురదగుంటలోని నీటి వంటిది కదా. ఓ నిర్మలాత్మా! నిన్ను వర్ణించడం మాతరం కాదు. మా తప్పులు క్షమించు.” అని నుతించారు. అంత నారాయణమహర్షి ప్రసన్నుడై తన సామర్ధ్యాన్ని తెలియజేయాలని అనుకున్నాడు.
ఆ మునిశ్రేష్ఠుడు అందరూ ఆశ్చర్యపోయేలా తన రోమకూపాల నుండి మూడుకోట్ల కన్యకలను పుట్టించాడు. అది చూసిన ఆ అప్సరసలు అత్యంత ఆశ్చర్యంతో భయంతో ఆ మహర్షిని స్తుతించారు. ఆ అందగత్తెలలో నుండి ఊర్వశి అనే ఒక సుందరాంగిని తీసుకుని వెళ్ళి జరిగినదంతా ఇంద్రునికి చెప్పారు. మునిశక్తికి వెరగుపడిన ఇంద్రుడు మిన్నకున్నాడు. అటువంటి నారాయణముని చరిత్ర వినే వాళ్ళు మిక్కిలి శుభకరమైన గుణాలను పొందుతారు.”
ఋషభునకు ఆత్మయోగాన్ని ఈవిధంగా ఉపదేశించిన అచ్యుతుడు విష్ణువు భూభారాన్ని అణచుటకు ఎన్నోఅవతారాలెత్తి పట్టుదలతో దుర్మార్గులు అయిన రాక్షసులను సంహరించాడు.
అటువంటి పరమేశ్వరుడు లీలావిలాసంగా గ్రహించిన అవతారాలు మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రఘురామ బలరామ బుద్ధ కల్కి అనే దశావతారాలే కాదు ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటిని తెలిసి స్తుతించటం బ్రహ్మదేవుడికైనా, ఆదిశేషునికైనా అలవి కాదు.” అని పలికి శ్రీహరిని ఇలా స్తుతించాడు. “నవవికసిత పద్మములవంటి కన్నుల జంట కలవాడ! హరి! పాదము మూలము లందు ఆకాశగంగ పుట్టినవాడ! వేదములచేత పొగడబడు వాడ! లక్ష్మీదేవి యొక్క కలశముల వంటి వక్షోజాలకు అలరుతుండెడి కస్తూరి పరిమళాలు అంటిన హృదయం కలవాడ! భూమిని మోసిన వాడ! బ్రహ్మదేవుడు మున్నగు దేవతలు సంస్తుతించు వాడ! నడుము నందు బంగారచేలము ధరించినవాడ! గరుత్మంతుడు వాహనముగా కలవాడ! కైలాసపతి శంకరునిచే నుతింపబడు వాడ! నిరంతర జపం చేసే వారి యందు ఆసక్తి కలవాడ! నియమబద్ధమైన చరిత్ర కలవాడ! మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ బలరామ రామ కృష్ణ కల్కి అను దశావతారములను దాల్చినవాడ! గజేంద్రవరదా! మునులు నరులు సురలు గరుడులు మున్నగు వారిచే పొగడబడు వాడ!” ఇలా హరిస్తుతి చేసి ఇలా అన్నాడు. “ఈ విధంగా ప్రవర్తిల్లిన శ్రీమన్నారాయణమూర్తి లీలావిలాసములు లెక్కపెట్టలేనన్ని ఉన్నాయి. మనోవాక్కాయకర్మలా హరిపూజ చేయకుండా విపరీత మార్గాలలో తిరుగుతూ ఉండే మూఢులకు ఏవిధంగానూ సద్గతి కలుగదు.” అని మహాముని అనగా ఆ మహారాజు ఆ పరమపురుషులతో “అటువంటి మూర్ఖులు ముక్తిపొందే ఉపాయం తెలియ జెప్పండి.” అని అడిగాడు. వారిలో చమసు డనే మునిముఖ్యుడు విదేహుడితో ఇలా అన్నాడు.
విష్ణుమూర్తి ముఖం బాహువులు తొడలు పదములు వీటి యందు వరుసగా నాలుగువర్ణాలు పుట్టాయి. అందులో స్త్రీలు శూద్రులు హరిని తలుస్తారు. కలికాలంలో విప్రులు వేద శాస్త్ర పురాణాలందు ప్రసిద్ధులై, కర్మలుచేస్తూ గర్వంతో హరిభక్తులను అపహాస్యం చేస్తారు. వారు నరకానికి పోవటం ఖాయం. స్వచ్ఛమైన పక్వాన్నం భుజించుట మాని మాంసాహారులై జీవహింసకు పాల్పడేవాడికి పాపం తగులుతుంది. శ్రీహరిని నుతింపక స్త్రీలోలు డైనవాడికి ఎప్పుడూ నరకమే నివాసం. అందుచేత, ఇండ్లు పొలాలు, సంతానం, భార్య, ధనం, ధాన్యం మున్నగు వాటిమీద వ్యామోహంతో మోక్షం కంటికి కనపడేదికాదు. కనుక లేదని నిందించే వారు; హరిభక్తి లేనివారు దుర్గతిలో కూలిపోతారు.” అని మునిశ్రేష్ఠుడు అనగా విదేహుడు ఇలా అడిగాడు.
“అవ్యయుడు, జగన్నాథుడు అయిన విష్ణుమూర్తి ఏ యుగంలో ఏ రీతిగా ఉన్నాడు? ఏ రూపం ధరించాడు? ఏ విధంగా మునులచేత, దేవతలచేత కీర్తించబడ్డాడు?”అని అడుగగా విని వారిలో కరభాజనుడనే ఋషి విదేహరాజుతో ఇలా అన్నాడు. ఎన్నో అవతారాలు; ఎన్నెన్నో రూపాలు; అనేక రకాల వర్ణాలు ధరించి రాక్షసులను సంహరించి; దుష్టశిక్షణం శిష్టరక్షణం కావించే శ్రీ మహవిష్ణువు…
కృతయుగంలో తెల్లని రంగుతో నాలుగుచేతులు కలిగి ఉంటాడు; జడలు నారచీరలు జింకచర్మం జపమాలిక దండం కమండలము దాల్చి నిర్మలమైన తపస్సు ధ్యానము అనుష్టానము గల మునిశ్రేష్ఠులచేత హంసుడు, సుపర్ణుడు, వైకుంఠుడు, ధర్ముడు, అమలుడు, యోగీశ్వరుడు, ఈశ్వరుడు, పురుషుడు, అవ్యక్తుడు, పరమాత్ముడు అనే దివ్య నామాలతో ప్రశంసింపబడుతూ ప్రసిద్ధి చెందుతాడు.
త్రేతాయుగంలో ఎఱ్ఱనిరంగుతో, నాలుగుచేతులు బంగరురంగు జుట్టు కలిగి, మూడు పేటల మేఖలలు ధరించి, మూడువేదాల ఆకృతి ధరించి, స్రుక్కు స్రువము మొదలైన ఉపలక్షణాలతో శోభిల్లుతూ; విష్ణువు, యజ్ఞుడు, పృశ్నిగర్భుడు, సర్వదేవుడు, ఉరుక్రముడు, వృషాకపి, జయంతుడు, ఉరుగాయుడు అనే పేర్లతో బ్రహ్మవాదులచేత నుతింపబడతాడు.
ద్వాపరయుగంలో నీలవర్ణంతో, పసుపుపచ్చని బట్టలు కట్టుకుని, రెండు చేతులతో, దివ్యమైన ఆయుధాలు పట్టుకుని, శ్రీవత్సం కౌస్తుభం వనమాలికల ప్రకాశిస్తూ; మహారాజ లక్షణాలు కలిగి జనార్ధునుడు, వాసుదేవుడు, సంకర్షుణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, నారాయణుడు, విశ్వరూపుడు, సర్వభూతాత్మకుడు మున్నగు పేర్లతో వెలసి చక్రవర్తులచేత సన్నుతించబడతాడు.
కలియుగంలో నల్లనిరంగుతో కృష్ణుడు అనుపేరు కలిగి, భక్తులను రక్షించడానికి పుండరీకాక్షుడు యజ్ఞములందు కీర్తించబడతాడు. అప్పుడు ఆయనను హరి, రాముడు, నారాయణుడు, నృసింహుడు, కంసారి, నళినోదరుడు మున్నగు పేర్లతో బ్రహ్మవాదులైన మునీంద్రులు స్తుతిస్తూంటారు. ద్రావిడదేశంలో తామ్రపర్ణి, కావేరి, కృతమాల మొదలైన నదులలో భక్తితో స్నానంచేసి తర్పణంచేస్తే మానవులకు పుణ్యం కలుగుతుంది.
ఈవిధంగా ప్రశంసించదగిన కావేరి మున్నగు మహనదుల పావనజలాలలో స్నానం చేయటంలోను, దానాలు చేయటంలోను, విష్ణుధ్యానంలోను, హరికథామృత రసానుభవంలోను నిష్ణాతులైన భాగవతోత్తములు చెడని పరమపదాన్ని పొందుతారు” అని చెప్పారు. భగవంతుని ప్రతిబింబాలయిన పరమపురుషుల వంటి వారైన ఋషభకుమారులు, విదేహమహారాజుకి మోక్షపదంపొందే భగవద్భక్తి ధర్మాలను ఉపదేశించి అంతర్ధానమైపోయారు. మిథిలాపతి విదేహుడు జ్ఞానయోగాన్ని అంగీకరించి నిర్వాణపదాన్నిపొందాడు. ఈ విదేహ ఋషభ ఉపాఖ్యానాన్ని వ్రాసినా చదివినా విన్నా ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యమూ కలిగి, పుత్రపౌత్రాభివృద్ధి కలిగి సమస్తమైన కలికల్మషాలు నశించి విష్ణులోకంలో నివసిస్తారు.” అని నారదుడు వసుదేవుడికి చెప్పి ఇంకా ఇలా అన్నాడు. “వసుదేవా! కమలలోచనుని కథలు విన్నావు కనుక, నీ పాపాలు తొలగిపోయాయి. లోకంలో నీ యశస్సు ప్రఖ్యాత మౌతుంది. అనంతరం నీకు కైవల్యం సిద్ధిస్తుంది. శ్రీకృష్ణుడు నీ కుమారుడనే మోహాన్ని విడిచిపెట్టి విష్ణువుగా తెలిసి సేవించు. అతడు నీ కొడుకై అవతరించటం వలన నీవు పరిశుద్ధుడవు అయ్యావు. అతనితో సరససల్లాపాలు జరుపుతూ చక్కని అనురాగం పెంచుకోవటంవలన నీవు పవిత్రుడవు అయ్యావు. శిశుపాలుడు, పౌండ్రకుడు, నరకుడు, మురాసురుడు, జరాసంధుడు, కాలయవనుడు వాసుదేవునితో వైరం పెట్టుకుని కూడ ముక్తిని పొందారు. బ్రహ్మదేవుడు మొదలగు దేవతలు ప్రార్థించగా, దుష్టజనులను శిక్షించడానికి; శిష్టజనులను రక్షించడానికి; శ్రీహరి భూమిమీద అవతరించాడు. ఈ విధంగా జగత్తును రక్షించటం కోసమే భగవంతుడు కృష్ణుడుగా అవతరించాడు.” అని హరిభక్తి పరాలైన ఉపాఖ్యానాలను నారదుడు చెప్పగా విని దేవకీ వసుదేవులు విస్మయం చెందారు. శ్రీకృష్ణుని పరమాత్మగా భావించారు.......సేకరణ......
సర్వం శ్రీ సాయి నాధార్పణ మస్తు....
Thank you VS garu..Maaku teliyani vishayaalu,telusukovalasina vishayaalu teliyajesaaru.. Thanks a lot..
ReplyDeleteధన్యవాదాలు! రుక్మిణిగారూ. మీరు నవనాధులు గురించి చెప్పండి..అని అడిగినప్పుడు నాకు కూడా బాబా సచ్చరిత్ర లో 45వ అధ్యాయం గుర్తు వచ్చింది. అక్కడ కూడా భాగవతంలోని నవనాధుల బోధ గురించి దీక్షిత్ మరియు శ్యామాలకు చర్చ జరుగుతుంది..ఆ నవనాధుల వారి గురించి వివరంగా తెలుసుకుందామని గూగుల్ లో వెతికాను. అప్పుడు ఒక సేకరణ లభించింది. అది అందరికీ ఉపయుక్తంగా ఉంటుంది. తెలియని వారు చదువుతారని బ్లాగులో పెట్టడం జరిగింది. ఆ తరువాత భాగవతం 11వ స్కంధంలో నవనాధులు జనకమహారాజుకి చేసిన బోధ ఉందని తెలుసుకుని ఆ గ్రంధం చదివి సేకరణలోని అనవసర అంశాలను తొలగించి వివరణను ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఆ నవ యోగుల గురించి తెలుసుకునేలా దోహదపడినందుకు మీకు నా అభినందనలు. ..
ReplyDelete