Pages

Wednesday, June 9, 2021

త్రయంబకేశ్వరం - నాసిక్

           *త్రయంబకేశ్వర క్షేత్రం-  నాసిక్*

గోదావరి తల్లి అడుగుల సవ్వడితో, త్రయంబకేశ్వరుని దివ్య చరణాలతో పునీతమైన పరమ పునీతధామం త్రయంబకేశ్వరం. ఈ అపురూప ఆధ్యాత్మిక క్షేత్రం ఎన్నో అందాలకు, మరెన్నో విశిష్ట ఆలయాలకు నెలవు. 


ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రముఖమైన  త్రయంబకేశ్వర లింగానికి ఎంతో విశిష్టత ఉంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు కొలువైన క్షేత్రం కనుకనే దీనిని త్రయంబకం అంటారు. వీరితో పాటుగా సాక్షాత్తు ఆ ఆదిపరాశక్తి కూడా ఇక్క‌డ కొలువై ఉందని ప్రశస్తి. అలాగే 33 కోట్ల దేవతలు కొలువై ఉన్నారని నమ్మకం.


స్థల పురాణం:


కొన్ని యుగాల‌కు పూర్వం ఈ ప్రదేశం అంతా  రుషులు, సాధువుల‌కు నివాస ప్రాంతంగా ఉండేది. సప్తరుషులలో ఒకరైన గౌతమ మహర్షి తన ధర్మపత్ని అహల్యతో కలిసి ఇక్కడ జీవించేవారు. ఒకానొక సమయంలో ఈ ప్రదేశం కరవుకాటకాలతో అల్లాడింది.. ఆ సమయంలో గౌతమ మహర్షి తన తపోశక్తిని ధారపోసి ఓ సరస్సును సృష్టించారు. అహల్యతో పాటు మిగిలిన రుషి ప‌త్నులు  ఆ సరస్సులోని నీటిని ఉపయోగించుకునేవారు. కానీ వారిలో గౌతమ మహర్షిపట్ల, అహల్య పట్ల  అసూయా ద్వేషాలు పెరిగి, తమ భర్తలను కూడా అలాంటి సరస్సులను నిర్మించమని వారు పోరు పెట్టారు. అప్పుడు రుషులందరు కలిసి గణేశుడి గురించి తపస్సు చేయగా ప్రత్యక్షమైన వినాయకుడు వరంగా ఏమి కావాలి అని అడగగా, వారు గౌతమ మహర్షి వద్ద ఉన్న గోవు చనిపోయేటట్లు చేయమంటారు. అది పాపం అని చెప్పినా వారు వినకుండా, అదే వరం కావాలని పట్టుపడతారు. దాంతో ఏమి చేయలేని స్థితిలో వినాయకుడు ఆ వరాన్ని ప్రసాదిస్తాడు.


 ఒకనాడు పంట చేలో మేస్తున్న గోవును దర్భపుల్లతో అదిలించగా, అది గాయపడి మరణిస్తుంది. ఇదే అదునుగా భావించిన రుషులందరూ  గో హత్య మహాపాపమని ఈ ప్రదేశంలో గంగను పారేట్లు చేస్తే ఆ హత్యకు పరిహారం అవుతుందని తెలుపుతారు. దాంతో గౌతముడు, అహల్య చాలా సంవత్సరాలు శివుని కోసం తపస్సు చేయగా పరమశివుడు, బ్రహ్మ, విష్ణు, ఆదిపరాశక్తిలతో కలిసి ప్రత్యక్షమవుతాడు.


ఏం వరం కావాలని అడగగా గంగను విడుదల చేయమని కోరుతారు. అప్పుడు శివుడు తన జటను విసరగా అది వెళ్లి బ్రహ్మగిరి పర్వతం మీద పడగా, గంగా నది అక్కడి నుంచి ప్రవహిస్తూ కిందకి వస్తుంది.  దానినే గౌతమి లేదా గోదావరి అనే పేరుతో పిలుస్తున్నారు.


ఈ ప్రదేశంలో శివుడు, బ్రహ్మ, విష్ణువు ముగ్గురు పానవట్టం లోపల మూడు లింగాకారాలలో ఉంటారు. అందువలనే దీనిని త్రయంబకం అంటారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా, అత్యంత ప్రాముఖ్యాన్ని పొందిన   ఈ మహా లింగం త్రయంబకం.


ఆలయ విశిష్టత: 


సాధారణంగా శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు. కానీ ఇక్కడ మాత్రం నందీశ్వరునికి ప్రత్యేకమైన మందిరం ఉంటుంది. మొదటగా నందీశ్వరున్ని దర్శించుకున్న అనంతరం దేవదేవుణ్ని దర్శించుకుంటాం. భక్తులకు ముందుగా ఆ నందీశ్వరుడి దర్శన భాగ్యం కలుగుతుంది. ఆలయ ప్రాంగణంలో  ఓ కోనేరు ఉంటుంది. అది ఎప్పుడూ  గోదావరి న‌దీ జలాలతో నిండి ఉంటుంది. గుడి ప్రాంగణం   విశాల‌మైంది. గుడి మొత్తాన్ని  నల్లరాతితో నిర్మించారు. ఆలయ ప్రాకారంలో చిన్న చిన్న శివలింగాలు, చిన్న చిన్న ఆలయాలు అమర్చి ఉంటాయి. గుడి ప్రాకారాలను చాలా ఎత్తులో నిర్మించడం జరిగింది. గుడిలోని కలశాలను బంగారంతో నిర్మించారు. అప్పట్లోనే ఈ కలశాలను నిర్మించడానికి 16 లక్షల రూపాయలు ఖర్చు అయినట్లు, వీటన్నింటిని కూడా 16వ శతాబ్దంలోనే నిర్మించినట్లు చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి.


 ఇది స్వయంభూ జ్యోతిర్లింగం. గర్భగుడి లోపల మూడు లింగాలు కలిపి ఒకే పానవట్టంలో ఉంటాయి. 


ఈ మూడు లింగాలను కూడా త్రిమూర్తులకు ప్రతీకలుగా భావిస్తారు. పానవట్టం లోపల నుంచి  ఎప్పుడూ జలం వస్తూనే ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది  ఇప్ప‌టికీ అంతు చిక్కని  విష‌య‌మే . ఆ జలం నిత్యం శివలింగాన్ని అభిషేకం చేస్తుంది. అయితే గర్భగుడిలోనికి అంద‌రికీ అనుమతి లేకపోవడంతో 5 మీటర్ల దూరం నుంచే స్వామి వార్ల దర్శన భాగ్యం కల్పిస్తారు.


పాండవులు ఇక్కడ ఒక కోనేటిని నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి. ఆ కోనేరు ఎప్పుడు కూడా గోదావరి జలాలతో నిండి ఉంటుంది. ఆ కోనేట్లోకి నేరుగా బ్రహ్మగిరి పర్వత శ్రేణుల నుంచి వచ్చే నీరు ప్రవహిస్తుంది  అని చెబుతారు. ఈ కోనేట్లో స్నానమాచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. 


కుంభమేళా నిర్వహించే సమయంలో సాధువులు, హిమాల‌యాల నుంచి వచ్చే రుషులు, అఘోరాలు ఈ కోనేటిలో స్నానాలు ఆచరిస్తారు.  ఈ కోనేరు   చుట్టూ అనేక లింగాలూ, వివిధ దేవతా మూర్తుల  విగ్ర‌హాలూ కొలువై ఉంటాయి.


పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళాను నిర్వహిస్తారు. సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి మూడు కూడా ఒకేసారి సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు ఇక్కడ సింహస్థ కుంభమేళా నిర్వహిస్తారు. కుంభమేళా సమయంలో కోనేటిలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని ప్రశస్థి.


              ఓం నమః శివాయ 🙏🙏

1 comment:

  1. Quite good information VS garu
    2 times visit chesaamu అనుకోకుండా.
    Om నమశ్శివాయ..

    ReplyDelete