శరీర విషయంలో జ్ఞాపకం ఉంచుకోవలసిన ముఖ్యవిషయం ఏమిటి ?
వ్యాఖ్యానం : సూక్ష్మంగా
🌺*ప్రతివారి జీవితంలోనూ, బాల్యం, యవ్వనం, వార్ధక్యం - అని 3 స్థితులు ఉంటాయి. ఈ 3 స్థితులను అజ్ఞానంలో ఎలా గడిపేస్తున్నాడో ఇక్కడ తెలియజేస్తున్నారు*.
*1. బాల్యం*:- బాల్యావస్థ అంతా ఆటపాటలతోను, చదువు సంధ్యల తోను గడిచిపోతుంది. ఈ వయస్సులో జీవితాన్ని గురించిన అవగాహన ఉండదు. ఆటబొమ్మల మీద, చిత్ర విచిత్ర వస్తువుల మీద ఆసక్తి కలిగి ఉంటాడు. అవి కావాలని కోరుకుంటాడు. వాటికోసం మారాం చేస్తాడు. లభిస్తే ఆనందిస్తాడు. లభించకపోతే దుఃఖిస్తూ గోల చేస్తాడు. కర్తవ్యాన్ని గురించి ఆలోచించే అవకాశం ఈ అవస్థలో రానేరాదు.
*2. యౌవనం*:- బాల్యం గడిచిపోగానే యౌవనం వస్తుంది. ఈ వయస్సులో శరీర సౌష్టవం బాగా ఉంటుంది. యౌవనమంతా శారీరక సంబంధమైన వాంఛలతోను, ధనసంపాదనల గురించి వృత్తి, వ్యాపారం, ఉద్యోగం, వ్యవసాయం మొదలైన ఆలోచనలతోను గడిచిపోతుంది.
*3. వార్ధక్యం*:- యౌవనం గడిచిపోతే క్రమక్రమంగా శరీరంలోని బిగువులన్నీ సడలిపోయి వృద్ధాప్యం వస్తుంది. శరీర అవయవాలలో పటుత్వం తగ్గిపోయి పనిచేసేశక్తి క్షీణిస్తుంది. పనిచేయగలిగినంత కాలం పనిలో నిమగ్నమైపోతాడు. అనేక విషయాలలో తల దూర్చుతాడు. తన చుట్టూ పెద్ద లంపటాన్ని చేర్చుకుంటాడు. ఇక వృద్ధాప్యంలో దానిని గురించిన ఆలోచనలు - చింతలు.
🌺ఇలా వృద్ధాప్యం గడిచిపోతుంది. ఆ తర్వాత ఎప్పుడో ఒక్కప్పుడు అన్ని బంధాలు తెంచుకొని, దేహంతో సహా అన్నింటిని, అందరిని వదలి అవ్యక్తంలోకి వెళ్ళిపోవటమే.
🌺జీవితమంతా ఇలా గడచిపోతుంటే ఇక జీవిత పరమార్థమైన మోక్షాన్ని అందుకోవటానికి కృషి చేసేదెప్పుడు? పరమాత్మను చేరుకొనేదెప్పుడు? అన్నీ లౌకికవిషయాలే అయితే పారమార్థిక విషయాలకు చోటెక్కడ? మనిషిగా పుట్టినందుకు, భగవంతుడు వివేకాన్ని ఇచ్చినందుకు వాటిని ఉపయోగించుకొని సాధించవలసినది ఇదేనా? కానేకాదు*.
🌺పరమాత్మవైపుకు బుద్ధిని మళ్ళించి - ఆయనపై ప్రేమానురాగాలు చూపించి, ఆయనకు సంబంధించిన సత్కర్మలు చేస్తూ, ఆయనను గురించి ఆలోచనలు చేస్తూ, ఆయనను స్మరిస్తూ, ఆయనను అందుకోవటమే మానవ జీవిత పరమార్థం. అందుకే మనకు మానవ జన్మ లభించింది. పరమాత్మను అందుకుంటున్నాం అంటే దుఃఖాలతో, బాధలతో కూడిన ఈ సంసార జనన మరణ చక్రం నుండి తప్పించుకొని మనను మనం ఉద్ధరించుకొంటున్నామన్న మాట. క్షణికమైన లాభనష్టాలు, సుఖదుఃఖాల నుండి విముక్తి చెంది శాశ్వత పరిపూర్ణ ఆనందాన్ని అందుకొంటున్నామన్న మాట.
🌺కనుక జీవితమంతా ఆటపాటలతోను, కామవాంఛలతోను, చింతలతోను గడిపి, జీవితాన్ని వ్యర్థం చేస్తుకోవటం గాక సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మవైపుకు అడుగు వేయాలి. అదీ బాల్యంలోనే వేస్తే మహా అదృష్టం. అలాగాక పోతే యౌవనంలోనన్నా వేయాలి. కనీసం వృద్ధాప్యంలో కూడా భగవంతునివైపు తిరగలేకపోతే ఈ మానవజీవితాన్ని వ్యర్థం చేసుకున్నట్లే.
No comments:
Post a Comment