పుట్టిన క్షణం నుంచి మరణించే క్షణం దాకా కాలవాహినిలో మనిషి ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంటాడు. సుఖాలు అనుభవిస్తున్నప్పుడు కాలం తెలియకుండానే గడచిపోతుంది. కష్టాల్లో మాత్రం దినం ఒక యుగంగా గడుస్తుంది. అందుకే మనిషి అనంత సంసార సముద్రంలో నుంచి ఉద్ధరించమని అనంత పద్మనాభుణ్ని వేడుకుంటాడు. అలా వేడుకొంటూ చేసే వ్రతమే అనంత పద్మనాభ వ్రతం.
అనంత శబ్దం అంతులేని కాలానికి ప్రతీక. అనంతుడు అంటే ఆదిశేషుడు. అందుకే విష్ణువుకు అనంత శయనుడు అని పేరు. సర్వవ్యాపి అయిన విష్ణువు కూడా అనంతుడే. ఇలా కాలానికి, ఆదిశేషుడికి, విష్ణువుకు అవినాభావ సంబంధాన్ని తెలిపే ఈ వ్రతం ఎందరికో ఆరాధ్యంగా మారింది.
పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఎన్నో కష్టాలను అనుభవించారు. ఒకనాడు వారిని పరామర్శించేందుకు కృష్ణుడు వచ్చాడు. కృష్ణుణ్ని చూడగానే ధర్మరాజుకు ఎంతో సంతోషం కలిగింది. తమను కష్టాలనుంచి గట్టెక్కించగల మార్గదర్శి కృష్ణుడే అని దృఢంగా నమ్మిన ధర్మరాజు తాము పడుతున్న కష్టాలను ఏకరువు పెట్టి, ఎలాగైనా తమకు తరణోపాయం చెప్పమని కోరాడు. అప్పుడు కృష్ణుడు- ‘మీరు పడుతున్న కష్టాలకు కాలమే కారణం కనుక అనంతకాల స్వరూపుడైన మహావిష్ణువును పూజించమని’ చెప్పి, వ్రత విధానాన్ని కూడా వివరిస్తాడు. పూర్వం ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించారా అని ధర్మరాజు కృష్ణుణ్ని ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నకు సమాధానంగా పూర్వం కృతయుగంలో సుమంతుడు అనేవాడు ఈ వ్రతాన్ని ఆచరించి, ఎన్నో కష్టాలనుంచి గట్టెక్కాడని కృష్ణుడు ఆ కథను వివరించి చెబుతాడు. అనంతుడు అనే పేరు కాలాన్ని చెబుతుంటే, పద్మనాభుడు అనే పేరు బ్రహ్మ సృష్టికి మూలమైన విష్ణువు నాభి కమలాన్ని చెబుతుంది. పద్మం వికా సానికి సంకేతం. సృష్టి అంటే వికాసమే కదా? ‘నాభి’ అంటే మూలస్థానం, మధ్యస్థానం కనుక మానవ సృష్టికి సంబంధించిన మూలస్థానమైన పద్మనాభుణ్ని తెలుపుతూ ఈ వ్రతంలోని ప్రధాన దైవాన్ని సాక్షాత్కారం చేస్తోంది. ఈ వ్రతంలో ముఖ్యమైన దోరాన్ని(రక్షా సూత్రాన్ని) కుడిచేతికి ధరించే సందర్భంలో చేసే ప్రార్థనలో- ‘ఓ అనంతకాల స్వరూపా! నన్ను ఈ అంతంలేని సంసార మహా సముద్రంలోనుంచి గట్టెక్కించు’ అని కోరడంలోని ఆంతర్యాన్ని గ్రహిస్తే మనిషి తనను కష్టాల కడలినుంచి ఉద్ధరించమని ఆర్తితో అడగడం లక్ష్యంగా కనబడుతుంది.
అనంత వ్రతంలో చతుర్దశ(పద్నాలుగు) సంఖ్యకు విశిష్టత ఉంది. అనంత పద్మనాభుడు చతుర్దశ భువనాలకు అధిపతిగా ప్రసిద్ధుడు. ఈ వ్రతం చతుర్దశీ తిథినాడే జరుగుతుంది. ఆదిశేషుడి రూపంలో ఉండే అనంతుడి పడగలు పద్నాలుగులో సగం అయిన ఏడే. పూజలో సైతం పత్రాల్లో, పుష్పాల్లో, ఫలాల్లో, పిండివంటల్లో, మధుర పదార్థాల్లో పద్నాలుగు సంఖ్య తప్పక ఉంటుంది. ఈ వ్రతాన్ని కూడా పద్నాలుగేళ్లు ఆచరించాలనే సంప్రదాయం ఉంది.
అనంత పద్మనాభ వ్రతంలో ప్రధానమైంది యమునా పూజ. పూర్వం యమునా నదీతీరంలో ఈ వ్రతాన్ని ఆచరించినందువల్ల, కలశంలో పవిత్ర జలాలను యమునా నదీజలాలుగా భావించి, పూజించడం కనబడుతుంది. ఈ వ్రతాన్ని ఆచరించినవారు ధరించే దోరానికి గల గ్రంథులు సైతం పద్నాలుగే ఉంటాయి. ఈ వ్రతాన్ని పూర్ణిమతో కూడిన చతుర్దశినాడే ఆచరించాలనే నియమం ఉంది. పుణ్యకార్యాల్లో దర్భలకు విశేష ప్రాధాన్యం ఉండటం వల్ల అనంతుడి రూపంలో ఉండే ఆదిశేషుడి ఫలాలను దర్భలతో అల్లి, పూజాస్థానంలో నిలుపుతారు.
వ్రతం కారణంగా మానసికంగాను, దైహికంగాను, వాచికంగాను పవిత్రతను పాటించడంవల్ల మనిషి జీవితం నిర్మలం కావడం పరమార్థం..(from FB..)
No comments:
Post a Comment