Pages

Thursday, July 2, 2020

బిల్వదళం...మోక్షఫలం..

బిల్వ దళం – మోక్ష ఫలం



మహాత్ముల అవతార ఉద్దేశం ఏమైనప్పటికీ వేలాది మంది తరించడం దానికి అవాంతర ప్రయోజనమై ఉంటుంది. గంగ భగీరథుని పితరులను తరింపచేయడనికి వచ్చినా ఇప్పటికి ఎన్ని తరాలుగా ఎంతమందిని తరింపంజేస్తొంది?!

మహాస్వామి వారు 1935 ప్రాంతాలలో కాశీ యాత్రకు వెళుతున్నప్పటి సంఘటన ఇది...

స్వామివారు కర్నూలు దాటి చిన్న చిన్న గ్రామాల గుండా శ్రీశైలం వైపు తమ పరివారంతో ప్రయాణం చేస్తున్నారు. రోడ్డునకు కొంచం లోపలగా ఉన్న గ్రామపు జమీందారు, తమ గ్రామస్థులందరితో కూడి పూర్ణకుంభంతో నుంచుని ఉన్నాడు. ముందు మఠ నిర్వహణ వారు ఎర్పాటు చేసినట్లు స్వామివారు మరికొంచం దూరం వెళ్ళి రోడ్డు పక్కనే ఉన్న గ్రామంలో బస చేయవలసి ఉన్నది. కానీ జమిందారుతో కూడిన గ్రామాస్తులందరూ శ్రీవారు తమ గ్రామాన్ని పావనం చేసి అక్కడ బస చేయాలని ప్రార్ధించారు.

జమిందారు గారు ఊరిలో ఒక చెరువు, దాని వడ్డున సత్రం ఉన్నాయని, శ్రీవారి బసకు, పుజకు, పరిచారికులకు సౌకర్యంగా ఉంటుందనీ వివరించాడు. ఎదో ఒకటి రెండు రోజులు ఉండి పోదాము అనుకున్న స్వామివారు రమణీయమైన పరిసరాల మధ్యనున్న గ్రామం, ఆ గ్రామస్థుల భక్తి చూసి అక్కడ కొంత కాలం ఉండటానికి ఒప్పుకున్నారు. అంతే!! గ్రామస్తులందరూ కలిసి కావలసిన పందిళ్ళు, పాకలు వేయించడంలోను, సంబారములు సమకూర్చడంలోనూ నిమగ్నమైనారు. మరునాటి ఉదయం చంద్రమౌళీశ్వర పుజకి కావలసిన వస్తువులన్నీ సమకూర్చబడినాయి. కాని చంద్రమౌళీశ్వర పుజకి కావలసిన బిళ్వదళాలు మాత్రం రాలేదు. ఆ గ్రామస్తులకు మారేడు దళాలు అంటే ఎమిటో తెలియలేదు. ఉన్న ఒకటి రెండు బ్రహ్మణ కుటుంబాల వారు కూడా బిళ్వదళాలు ఈ చుట్టుపక్కల లేవు అని తేల్చి చెప్పారు.

పూజకు సంబంధించిన సంబారాలు చూచే మఠొద్యోగులకు ఏమి చేయాలో తోచలేదు. ఇంతలో స్వామివారు స్నానం చేసి వచ్చి అనుస్టానం ఆచరించబోతూ "బిళ్వదళాలేవి?" అని అడగనే అడిగారు. పరిచారకులు "ఇక్కడ బిళ్వదాళలు ఎరిగినవారే లేరట" అని చేప్పారు. స్వామివారు చిరునవ్వు నవ్వి గోశాల వెనకనున్న బండరాయి పైన కూర్చుని అనుస్టానం ఆరంభించారు. పరిచారకులు నిర్మాల్యంలో ఉన్న బిళ్వదళాలను చూపి ఊరి యువకులని వాటిని వెతుక్కుని రమ్మని పంపారు.

స్వామిమివారి ఒక గంట జపం ముగిసి కనులు తెరిచారు. జనం కుడా ఆత్రుతగా బ్రహ్మానుభవంలో ఓలలాడే ఆ పరమాత్మ వంక చూస్తున్నారు. స్వామివారు బిళ్వదళాల లేమికై ఎమి చెప్పబోతారో? తాము ఉందామనుకొన్నని రోజులు ఉండకుండానే వెళిపోతారేమోనని కలత పడుతున్నారు. ఇంతలో శ్రీమఠ పరిచారకులలో ఒకరు ఎంతో ఆనందంతో బిళ్వదళాలు పట్టుకుపస్తూ పందిరి వద్ద కనిపించారు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

స్వామివారు బిళ్వదళాలు చేతిలొకి తీసుకుని పరీక్షించారు. "ఈ చుట్టుపక్కల మారేడు చెట్లే లేవన్నారే? ఈ దళాలు ఎక్కడ నుంచి వచ్చాయి. అన్నీ నవనవలాడుతూ కోమలంగా మూడు మూడు ఆకులతో ఉత్తమంగా ఉన్నాయి. ఎవరు కోశారు? ఎక్కడ నుండి వచ్చాయి?" అని అడిగారు. బుట్ట తీసుకువచ్చిన పరిచారికుడు నేను యాదృచ్చికంగా అటుపక్క వెళ్ళినపుడు పందిరి గుంజ పక్కన ఈ బుట్ట పెట్టి ఉన్నది స్వామి. ఎవరు తెచ్చారో చుడలేదన్నాడు. "ఎవరు ఇక్కడ పెట్టరు అని నీవడగలేదా?" అన్నారు స్వామివారు.

"అడిగాను కానీ ఎవరూ తమకు తెలియదంటున్నారు" అన్నాడు పరిచారికుడు.

“మరెవరు తెచ్చి ఉంటారు? చంద్రమౌళీశ్వరుడే తన పుజకు తానే బిల్వములను తెప్పించుకున్నాడ” ని నవ్వుతూ పూజకు వెళ్ళారు స్వామివారు. ఆరోజు కార్యక్రమాల వత్తిడిలో బిల్వదళాల గురించి మళ్ళీ ఎవరూ ఆలోచించలేదు.

మరుసటిరోజు పూజా సమయానికి పూజకట్టు పర్యవేక్షించే అధికారి క్రితపు రోజు బిల్వదళాలు తేచ్చిన పరిచారికునితో ఈ రోజు కూడా బిల్వదళాలు ఏర్పాటు చేయలేదు. నిన్న ఉన్న చోట మళ్ళీ ఉన్నాయేమో చూసిరా అన్నారు.

ఆశ్చర్యంగా ఆ రోజుకుడా అక్కడ బిల్వదళముల బుట్ట పెట్టి ఉన్నది. పూజకి వచ్చిన స్వామివారు సాభిప్రాయముగా అధికారి వంకకు చూసారు.

"అవును స్వామి ఈ రోజు కూడా అక్కడ బిల్వదళముల బుట్ట పెట్టి ఉన్నది“ అన్నాడాయన. మూడవరోజు కుడా ఇదే తంతు.

నాల్గవరోజు స్వామివారి ఆజ్ఞమేరకు పరిచారకుడు పొద్దున్నుండీ ఎవరికీ కనిపించని చోటు నుండి రోజూ బిల్వదళాముల బుట్ట పెట్టబడే స్థానాన్ని పరిశీలిస్తూ కుర్చున్నాడు.

సుమారు 8 - 8:30 గంటలకు తూర్పు పక్కనున్న మామిడి తోపు నుండి ఒక యువకుడు తలపై బుట్ట పెట్టుకుని వస్తున్నాడు. సరిగా దువ్వి ముడిపెట్టని పెద్ద శిఖ, మోకాళ్ళ పైదాక కట్టిన నీరుగావి పంచతో శుద్ధ గ్రామీణునిలా కనిపిస్తున్నాడు. అతను అటూ, ఇటూ తేరిపార చూసి తాను రోజూ పెట్టే స్థానంలో బుట్ట పెట్టి వెళ్ళబోతున్నాడు.

పరిచారకులు పరుగెత్తుకుని వెళ్ళి శ్రీకార్యం వద్ద ప్రవేశపెట్టారు.

అతను భయముతో వణుకుతూ సాష్టాంగం చేసి నమస్కరించాడు. "భయపడకు నీవేనా రోజూ ఈ దళాలు తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టేది? అన్నారు శ్రీకార్యం. అవునన్నాడు ఆ కుర్రవాడు.

"మంచిది సాయంకాలం స్నానం చేసి, తల సరిగా దువ్వుకుని శిఖముడి వేసుకుని, మంచి బట్టలు కట్టుకుని రా!" స్వామివారి దగ్గరకు తీసుకుని వెళ్తాను. ఆశీస్సులు పొందవచ్చు" అన్నారు శ్రీకార్యం. మూడు గంటలకు ఆ యువకుడు ఆజ్ఞాపించిన విధంగా వచ్చాడు.

దూరం నుండి ఆ యువకుని చూపించి ఎదో చెప్పారు శ్రీకార్యం. స్వామివారు దగ్గరకు పిలిచారు. భయపడుతూ ఎంతో వినయంగా నమస్కరించాడు ఆగంతకుడు.

పేరేమిటి! అని తెలుగులో ప్రశ్నించారు స్వామివారు.

"పురంధర కేశవులు" అని స్వచ్చమైన తమిళంలో బదులిచ్చాడు.

"తమిళుడివలే ఉన్నావు, ఇక్కడికి ఎలా వచ్చావు?" అన్నారు స్వామివారు.

"నా స్వగ్రామం ఉసిలంపట్టి, మధురై దగ్గరండి. నే పుట్టిన రెండు సంవత్సరాలకే నా తల్లి గతించింది. మా నాన్నే నన్ను పెంచాడు. ఆరు ఏళ్ళ క్రితం నాతో బ్రతుకుతెరువుకై ఈ దేసం వచ్చాడు ఆయన. ఈ జమీన్ గ్రామంలో ఆవులు మేపే పనిదొరికింది. నేను చిన్నప్పటి నుండీ ఈ పనే చేస్తున్నాను. చదువుకోలేదు. మా నాన్నే నాకు ఎన్నో విషయాలు చెప్పేవాడు. ఆయనకు సంగీతంపై మక్కువ. పురంధరదాసు కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు వినికిడి జ్ఞానం వల్ల పాడేవాడు. అందుకే నాకు పురంధరకేసవులని పేరు పెట్టాడు. రెండేళ్ళ క్రితం ఆయన మోక్షానికి చేరుకున్నాడు. నాకిప్పుడు పన్నెండేళ్ళు స్వామి! ఆవుల్ని మేపుతూ ఉంటాను. జమీన్ లో భోజనం పెట్టి జీతం ఇస్తారు" అన్నాడు.

"ఈ చుట్టుపక్కలెక్కడా మారేడు చెట్లే లేవంటున్నారు. మరి నీవెలా తెస్తున్నావు?" ప్రశ్నించారు స్వామివారు.

"ఇక్కడికి మూడు నాలుగు మైళ్ళ దూరంలో పర్వతం మొదట్లో దట్టమైన పచ్చిక, చెట్లూ ఉన్నాయి. మేము ఆవులని మేపడానికి వెళ్ళేవాళ్ళం. అక్కడ మూడు పెద్ద బిల్వ వృక్షాలున్నయి. మానాన్న ఆ ఆకులను చూపి "ఒరే పురంధరా! ఈ మూడు ఆకులు కలిసిన దానిని బిల్వదళం అంటారురా! దీంతో శివునికి పూజ చేస్తే మహా విశేషం" అని చెప్పేవాడు.

మూడు రోజుల ముందు పూజ దగ్గర ఉండే అయ్యావారు ఇటువంటి ఆకులు కావాలని ఈ ఊరివాళకు చెబుతున్నారు. నాకు వెంటనే ఈ చెట్లు గుర్తుకువచ్చాయి. పరిగెత్తికెళ్ళి కోసుకుని వచ్చాను. అయితే గొల్లవాడు తెచ్చిన దళాలతో మీరు పూజ చేస్తారో లేదో అని ఎవరూ చూడకుండా అక్కడ పెట్టి వెళ్ళాను ఇది సత్యం స్వామి" అన్నాడు.

స్వామివారు ఎంతో ప్రీతిచెందారు.

పురంధరా నీకు ఏమి కావలో చెప్పు ఇప్పిస్తాను అన్నారు స్వామివారు. వాడు రెండు చెంపలు వేసుకున్నాడు. "స్వామీ! మీ వద్ద లౌకికమైన విషయాలు కోరడమా! మా నాన్న ఇవన్నీ క్షణ భంగురాలని చెప్పేవాడు. అయితే నాకు రెండు కోరికలు ఉన్నాయ్ స్వామి! మీరు అనుగ్రహిస్తే ఒకటి ఇప్పుడు అడుగుతాను, రెండవది మీరు ఈ ఊరినుండి వెళ్ళేప్పుడు అడుగుతాను" అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ సాస్టాంగ నమస్కారాలు చేస్తున్నాడు. స్వామి వారు వాడిని బుజ్జగించి చెప్పు నీ కొరికేమిటో అన్నారు.

"ఎం లేదు స్వామి మా నాన్న నాకు పురంధరదాసు కృతులు, త్యాగరాజ కృతులు నేర్పాడు, నేను ఆవుల దగ్గర పని చేస్తూ ఒంటరిగా పాడుకుంటూంటాను. ఒక్కసారి మీ ఎదురుగా పాడలని ఉంది స్వామి" అన్నాడు. స్వామివారికి ఆ కోరిక విని చాలా ఆనందం వేసింది.

"తప్పకుండా! నేనే కాదు అందరమూ వింటాము. నేనున్నన్ని రోజులూ సాయంత్రం మూడు గంటలకి ఇక్కడకి వచ్చి పాడు. అమ్మవారు అయ్యవారు (త్రిపురసుందరీ చంద్రమౌళీశ్వరులు) కుడా విని నిన్ను అనుగ్రహిస్తారు" అన్నారు.

పురంధరకేశవుల ఆనందానికి అంతే లేదు. "సరి నీ రెండో కొరిక ఏమి?" అన్నారు స్వామివారు.

నవ్వుతూ "అది మీరు వెళ్ళిపొయేటప్పుడు కోరతాను" అన్నాడు అతను.

స్వామి వారు తమ మెడలో ఉన్న తులసి మాలను అనుగ్రహించారు. ఎంతో అపురుపంగా కనులకు అద్దుకుని గంతులేసాడు పురంధరకేశవులు. ఆ ఊళ్ళో స్వామి వారు ఇరవైఒక్క రోజులు ఉన్నారు. వెళ్ళిపొయే రోజు వచ్చింది. ఊరు ఊరంతా విరిగిపడినట్లు వచ్చారు జనాలు. అందరినీ ఆశీర్వదించి నిదానంగా ముందుకు సాగారు స్వామివారు. గ్రామప్రజలందరి కళ్ళలో నీరు. ఏదో కోల్పోతున్న భావన. అంతలో ఏదో జ్ఞాపకం వచినట్లుగా వెనక్కి తిరిగి చూసారు మహాస్వామి. దూరంగా పందిరి గుంజకు చుట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ పురంధరకేశవులు ఉన్నాడు.

"పురంధరా! నీకు ఉన్న భక్తి విశ్వాసాలకు నీకు తప్పక ఉన్నతి లభిస్తుంది. ఇంకో కోరిక వెళ్ళేటఫ్ఫుడు చెబుతానన్నావే! అదేమిటి?" అన్నారు.

వాడు వెక్కి వెక్కి ఏడుస్తూ, వచ్చే వేక్కిళను ఆపుకుంటూ అన్నాడు. “స్వామి! మా నాన్న దేముడిని లౌకికమైన చిన్న చిన్న విషయాలు గురించి అడగకూడదు. జన్మ అంటేనే దు:ఖం. మరుజన్మ లేని మోక్షాన్ని కోరుకోవాలి. దానికోసం మనం సత్యమే చెప్పాలి. ధర్మంగా జీవించాలి. మహాత్ములను మనం కోరవలసినది మోక్షమే అని చెప్పేవాడు. స్వామీ! నువ్వే మానాన్న చెప్పిన మహాత్ముడివి. నాకు మోక్షం ప్రసాదించు స్వామి!” అంటూ బావురుమన్నాడు.

కదిలిపోయారు స్వామివారు. పన్నెండేళ్ళ పసివాడు మాట్లాడే మాటలా ఇవి. ఆశ్చర్యపోయారు. అబ్బురపాటు చెందారు.

ఎంతో ప్రేమతో కరుణగా చూచి నవ్వుతూ "తగిన సమయంలో భగవంతుడు నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు" అంటూ దూరంగా ఉన్న జమిందారుని పిలిచి "పురంధరుని విషయంలో ఏమి జరిగినా మఠానికి టెలిగ్రాం పంపు" అన్నారు.

చాలాకాలం గడిచిపోయింది. స్వామివారు కాశీ యాత్ర ముగించి తిరిగివచ్చారు. అప్పుడు కంచిలో ఉన్నారు. ఒక మధ్యాహ్నం హఠాత్తుగా మఠం నుండి బయల్దేరి కామాక్షీ గుడిలోని కొలనుకి వచ్చారు. స్నానం చేసి ఒక గంట సేపు జపం చేశారు. మళ్ళి స్నానం చేసి మళ్ళీ జపం చేస్తున్నారు. సాయంకాలం ఆరుగంటలదాక ఈ విధంగా ఎనిమిది సార్లు చేసారు. స్వామివారు ఎందుకిలా చేస్తున్నారో ఎవరికీ అవగతం కాలేదు. చివరిసారిగా స్నానం చేసి మెట్లు ఎక్కుతున్నప్పుడు మఠం నుండి టెలిగ్రాం పట్టుకుని "కర్నూలు నుండి టెలిగ్రాం వచ్చింది స్వామి! పురంధరకేశవుల ఆరోగ్య పరిస్థితి ఎంతో ఆందోళన కరంగా ఉన్నదట. మరి ఈ పురంధరకేశవులేవరో ఎవరికీ తెలియడం లేదు స్వామి" అన్నారు.

"పురంధరకేశవులు కొద్దిసేపటి ముందే కాలం చేసాడు. వాని గ్రామం వెళ్ళినపుడు నన్ను మోక్షంకై ప్రార్ధించాడు. మంచి జీవి అతడు. చంద్రమౌళీశ్వరుని అనుగ్రహము వలన మోక్షం లభిస్తుందని చెప్పాను. కొద్ది కాలంగా అతనికి విషజ్వరం వచ్చింది. శరీర బాధ గురించి పట్టించుకోకుండా మొక్షేచ్చతో పరితపించిపోతున్నాడు. అతనికింకో ఆరు జన్మలు పొందాల్సిన కర్మ ఉన్నది. ఎలాగోలా మొక్షం కలగాలని ప్రార్ధిస్తూ ఇలా జపం చేస్తున్నా. "పురంధరకేశవులు శుద్ధాత్మ" అంటూ మఠం వైపుకు దారి తీసారు.

స్వామివారు అతనికి మొక్షం లభించిందనే విషయం స్పష్టంగా చెప్పలేదు. అయితే ఆ పురంధరునికి మోక్షం వచ్చి ఉంటుందనడంలో మరి సందేహం ఏముంటుంది.

అయితే అద్వైత శాస్త్రం ‘ఙ్ఞానాదేవహి కైవల్యం’ అని చెబుతున్నది కదా! ఇంకొకరికి మొక్షం ప్రసాదించడం ఎలా అన్న ప్రశ్న పుస్తక జ్ఞానం కలవారికి తోచవచ్చు. మహస్వామి వారి తపస్సు చేత అతని కర్మలను దహించడం వల్ల శుద్ధమైన జీవునికి జ్ఞానం కలిగి ఉండవచ్చు.

అయినా దీనిగురించి విచారం అనవసరమేమో! శ్రీ రమణభగవానులు తమ తల్లిగారితో సహ అనేక మందికి మోక్షాన్ని అనుగ్రహించారు.

--- శ్రీకార్యం చల్లా విశ్వనాథ శాస్త్రి, ఋషిపీఠం ప్రచురణల నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

బిల్వ పత్రాలు....:




#ఏక బిల్వం శివార్పణం*

పరమ శివుని పూజించుకునేటప్పుడు మనం "ఏక బిల్వం శివార్పణం" అంటూ మారేడు దళాలను సమర్పించుకుంటూ పూజించుకుంటాము. 

ఙ్ఞానస్వరూపమయిన పరమాత్ముడే పరమశివుడు. మనలోని అఙ్ఞానాన్ని రూపుమాపి, ఙ్ఞానజ్యోతిని వెలిగించి, మన మనసులను పవిత్రం చేసి, నిర్మలమైన జీవనాన్ని కలిగించమని, ఙ్ఞానస్వరూపమైన మారేడు దళాలను స్వామికి సమర్పించుకుంటూ ఉంటాము.

మారేడు దళాలను పరిశీలించినప్పుడు మూడు దళాలు కలిసి ఒక్క కాండానికే ఉండటాన్ని గమనించగలము. అందుకే, దీనికి బిల్వము అనే పేరు వచ్చింది. 

ఈ మూడు రేకులకు ఆధ్యాత్మికంగా పూజకుడు-పూజ్యము- పూజ / స్తోత్రము - స్తుత్యము- స్తుతి/ ఙ్ఞాత - ఙ్ఞ్యేయము - ఙ్ఞానము అనే అర్ధాలను చెబుతున్నారు. 

ఇలాగ ఈ మూడింటిని వేరు వేరుగా భావించటమే త్రిపుటి ఙ్ఞానము.

ఒక వృక్షానికి కొమ్మలు వేరు వేరుగా కనిపించి నప్పటికీ, ఆధారకాండము ఒకటే అయినట్లు , సృష్టి, స్థితి ,లయ కారకుడైన ఆ మహదేవుడు మారేడు దళాలతో " మూడు పత్రాలుగా వేరు వేరు ఉన్నట్లు గోచరిస్తున్నాడు. కాని ఆయనే సర్వాంతర్యామి!

బిల్వపత్ర దర్శనం వలన అత్యంత పుణ్యం లభిస్తుంది. వాటిని స్పృసించడంవలన వలన సర్వ పాపాలు నశిస్తాయి.
ఓక బిల్వ పత్రాన్ని శివునికి భక్తిశ్రద్ధలతో అర్పించతం వలన, ఘోరాతిఘోరమైన పాపాలు సైతం తొలగిపోతూ ఉంటాయంటారు. 

అటువంటి త్రిగుణాలుగల బిల్వ దళ్ళాన్ని స్వామికి అర్పించుకుంటే ఆయన అనుగ్రహం సులభంగ కలుగుతుంది. 

పూజకుడవు నీవే, పూజింబడేది నీవే - అనే భావంతో శివుని పూజించుటయే ఉత్తమమైన భావం. 

ఈ ఙ్ఞానరహస్యాన్ని తెలుసుకుని - బిల్వపత్రరూపంతో ' త్రిపుటి ఙ్ఞానాన్ని ' నీ పాదాల చెంత నేను సమర్పిస్తున్నాను అని స్వామికి విన్నపించుకుని " శివోహం, శివోహం " అనే మహావాక్య ఙ్ఞానాన్ని స్థిరపరిచేదే బిల్వార్చన అవుతుంది.

పవిత్రమైన ఈశ్వర పూజకు " బిల్వపత్రం " సర్వశ్రేష్టమైనది. శివార్చన కు మూడు రేకులతోనున్న పూర్తి బిల్వదళాన్ని ఉపయోగించాలి.
బిల్వదళాలు వాడిపోయినప్పటికి పూజర్హత కలిగి ఉంటాయి.

ఏక బిల్వ పత్రంలోని మూడు ఆకులలో ఎడమవైపునున్నది బ్రహ్మ అని, కుడి వైపు ఉన్నది విష్ణువు అని, మధ్యన ఉన్నది శివుడు అని చెప్పబడుతోంది.

ఇంకా బిల్వదళంలోని ముందు భాగం లో అమృతము, వెనుక భాగంలో యక్షులు ఉండటఒ చేత బిల్వపత్రం యొక్క ముందు భాగాన్ని శివుడి వైపుకు ఉంచి పూజ చెయ్యాలి.

బిల్వవనం కాశి క్షేత్రంతో సరిసమానం అని శాస్త్రవచనం.

మారేడు చెట్ట్లు ఉన్న చోట శివుడు నివసిస్తాడు. ఇంటి ఆవరణలో , ఈశాన్య భాగం లో మారేడు చెట్టు ఉంటే, ఆపదలు తొలగి, సర్వైశ్వర్యాలు కలుగుతాయి!

తూర్పున ఉంటే సుఖప్రాప్తి కలుగుతుంది.
పడమర వైపు ఉంటే సుపుత్రసంతాన ప్రాప్తి, దక్షిణ వైపు ఉంటే యమబాధలు ఉండవు!

No comments:

Post a Comment