Pages

Saturday, December 15, 2018

ఆత్మవిశ్వాసం

 ఓం శ్రీ గురుభ్యో నమ: 

శ్లో"మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే!
    యతతామసి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వత:!!

భా-వేలకొలది మనుష్యులలో ఒకానొకడు పూర్వపుణ్య విశేషముచే ఆత్మజ్ఞానసిద్ధి కొరకు ప్రయత్నము చేయుచుండును. అట్లు ప్రయత్నము చేయుచు సిద్ధిని పొందిన వారలలో సహితము ఏ ఒక్కడో నన్ను యధార్ధముగా తెలిసికొనుచున్నాడు.   



ఎల్లప్పుడూ బాబా స్మరణతో ఉంటూ ఆధ్యాత్మిక స్ఫురణలో   "ఆత్మవిశ్వాసం"
అనే ఈ కధనాన్ని అందరికీ పంచుతున్నాను.. రమణ మహర్షులను తెలియనివారుండరు.. కానీ వారి భక్తుల గురించి కొందరికే తెలియవచ్చును.
రమణమహర్షి ముఖ్య ఉపదేశం:-

"లోనికి చొచ్చుకుపో నిర్విరామంగా ఆలోచనలను అల్లే మనస్సు యొక్క మూలాన్ని అన్వేషించు, ఎగసిపడే భావాలని తిరస్కరించి అన్నిటికీ మూల భావంపై ధ్యాస నిలుపు. ఆ మౌనంలో విశ్రమించు. నీ ప్రయత్నం అంతవరకే. ఆ పైన జరిగేదే అనుభవం, సాక్షాత్కారం. అది మాటలకు అందదు." ఆ ఆనందధామాన్ని ఆత్మవిశ్వాసంతో కొద్దిమందే చేరారు.


రమణాశ్రమంలో మహర్షి భక్తురాలు ఒకామెని అందరూ ఎచ్చెమ్మాళ్ అంటారు. ఆమె అసలుపేరు లక్ష్మీ అమ్మాళ్. అతిచిన్న వయసులోనే ఆమే శోకమయ జీవితాన్ని అనుభవించారు. 25సం"లు వచ్చేసరికి ఒకరి తరువాత ఒకరుగా భర్త, కొడుకు, కూతురు పోయారు. తగిలిన దెబ్బలవలన ఆమె మనస్సు అస్తవ్యస్తమయింది."తన" గురించి ఆలోచించుకునే శక్తిని కోల్పోయింది. ఆమెకు ఎటు చూసినా నిరాశే,అంధకారమే. ఆమె మనశ్శాంతి కోసం ఎందరో సాధువులను కలుసుకుంది. కానీ ఎవ్వరూ ఆమె దు:ఖభారాన్ని తీసేయలేకపోయారు. మహాయోగుల అనుగ్రహం పొందాలన్న ఆమె మానసిక వ్యధను గమనించిన ఆమె బంధువులు,హితులు తిరువణ్ణామలైలో కొండపై ఉన్న యువకుడి గురించి చెప్పారు. వయసులో చిన్నవాడేఅయినా గొప్పయోగి అనీ, మౌనస్వామి అని, విశ్వాసంతో ఆయనను దర్శించుకున్న వారెందరో లబ్ధిపొందారనీ ఈమె కూడా ఆయనను దర్శించుకుంటే తిరిగి రాకపోవచ్చుననీ..ఈమాటలు విన్న ఎచ్చమ్మాళ్ తిరువణ్ణామలైకి ప్రయాణమయింది. ఒక స్నేహితురాలితో కొండెక్కి మహర్షిని చూసింది. ఆయన పలుకకుండా నిశ్చలంగా కూర్చుని యున్నారు. ఆయన సమక్షాన ఒక గంటసేపు మౌనంగా నిలబడింది. ఆ ఆశ్రమాన్ని విడవాలనిపించలేదు. ఎట్టకేలకు బలవంతంగా అక్కడ నుండి బయటపడి కొండ దిగువన ఉన్న స్నేహితురాలి ఇంటికి చేరుకుంది. మహర్షి అనుగ్రహం వల్ల తనని పీడిస్తున్న శోకం మాయమైందని స్నేహితురాలితో చెప్పింది. ప్రతిరోజూ ఆమె ఆశ్రమానికి వెళ్తుండేది. కొన్నాళ్ళకి గతించిన తన వారిగురించి, కన్నీరు కార్చకుండా..మనస్సులో విషాదచ్చాయలైనా లేకుండా మాట్లాడగలిగేది. తనలో ఆ శోకసముద్రం ఎలా పోయిందో, తన అంతరంగంలో ప్రశాంతత ఎలా నెలకొన్నదో ఆమె చెప్పలేకపోయేది. ఆమెకి తెలిసిందల్లా ఒక్కటే. అదంతా కొండమీద నెలకొన్న మహర్షి అనుగ్రహంవల్ల, కరుణ వల్ల మాత్రమే!.

 "మహర్షిని నేను అభిమానిస్తాను, గౌరవిస్తాను, ఆరాధిస్తాను" అని మాత్రమే అనగలిగేది ఆమె. అప్పటినుండి ఆమె ప్రతిరోజూ మహర్షికీ, ఆయనను దర్శించటానికి వచ్చేవారికి భోజనం వండి కొండమీద వారెక్కడున్నా వెళ్లి వారికి సమర్పించి, వారు తినగా మిగిలిన దానిని అతి భక్తితో స్వీకరించేది. తన రక్షకుడు మహర్షి అని ఆయనను వీడరాదని నిశ్చయించుకుంది.తండ్రి సోదరుడూ పంపిన పైకాన్ని నిస్సంకోచంగా ఆమె మహర్షి కొరకూ,వారి అనుగ్రహం కొరకూ వెచ్చించింది.ఆమె లేమిలో గడిపినా సర్వస్వమూ ధారపోసింది. మహర్షి భక్తులకు,అతిధులకు ఆమె నివాసం ఆశ్రయమయింది. ప్రతిఫలంగా ఆమెకు మనశ్శాంతి. ప్రగాఢమయిన విశ్వాసము లభించాయి. తనకి సంభవించిన మంచి చెడులను ఆమె మహర్షికి విన్నవించుకొనేది.వారు ఆమె భక్తిని మెచ్చుకొనేవారు. సుఖదు:ఖాలకు స్పందించేవారు. తననాశ్రయించిన భక్తులందరిపట్ల ఆయన అలాగే ఉండేవారు...



మహర్షి అనుమతితో ఆమె సెల్లమ్మాళ్ అనే ఒక అమ్మాయిని పెంచుకొంది.ఆ అమ్మాయికి వివాహం చేసి మనవడు పుట్టినపుడు ఎంతో సంబరపడింది. ఆ పసివాడికి 'రమణ' అని మహర్షి పేరునే పెట్టుకొంది. కాని విధివశాత్తూ ఆమె కూతురు మరణవార్త తంతి ద్వారా అల్లుడు తెలిపాడు. ఏ అస్వస్థత లేకుండా కూతురు హఠాత్తుగా మరణించడం అన్న వార్త ఆశనిపాతంలా తగిలింది. దు:ఖాన్ని దిగమింగుకొని కొండపైకి వెళ్ళి తంతిని మహర్షికి చూపింది. దానిని చదివి కంట తడి పెట్టుకున్నారాయన. ఎచ్చమ్మాళ్ గ్రామానికి వెళ్ళి కూతురు అంత్యక్రియలు జరిపి మనవడు రమణను తీసుకొని వచ్చింది. తనకీ తన మనవడికీ ఆశ్రయం మహర్షే. ఆయన చేతుల్లో మనవడిని పెట్టింది. ఆమె ఎలా గుండె నిబ్బరం చేసుకుందో గ్రహించారాయన. ఇప్పుడామె మహర్షిపైనే ఆశలన్నీ పెట్టుకుంది. పూర్వం వలె దు:ఖపు తుఫాను ఆమెను పెకిలించివేయలేదు. ఆమెకు గల ఆత్మ విశ్వాసానికి ప్రతిఫలమే ఆమె  తేరుకోగలగటం. మనశ్శాంతిని పున:ప్రతిష్ఠించుకోగలగటమూను!.


 ఇక ఎచ్చమ్మాళ్ ఆధ్యాత్మిక ప్రగతికి వస్తే - నిస్వార్ధమైన సేవద్వారా తనకి మోక్షప్రాప్తి జరుగుతుందని ఆమె 'దృఢవిశ్వాసం'. యోగాభ్యాసంలో ఒక గురువు ఆమెకు మనస్సుని ఏదో ఒక భావంపై కేంద్రీకరించడం ఎలాగో నేర్పారు. ఆ ప్రక్రియలో కొంత సాధన చేసిందామె. తన నాసికపై కేంద్రీకరించటం అలవర్చుకున్నది. కాంతిపుంజమేదో తనకి మనోదృశ్యంగా తోచేది. దానిపైనే మనసు నిల్పి కొన్ని రోజులపాటు ఆ దృశ్యాన్నే ధ్యానించేది.ఒక్కొక్కసారి దేహస్పృహ లేకుండా 24గంటలూ ఆమె నిశ్చలంగా ఉండగలిగేది.ఈ సంఘటనలన్నీ మహర్షికి ఎవరో చెప్పేవారు.వారు మిన్నకుండేవారు. చివరికి ఆమే తన అనుభవాలని చెప్పగా ఆయన ఆ అభ్యాసాలను మానమని చెప్పారు. "నీకు కనబడే ఆ జ్యోతులు నీ గమ్యం కావు. నీవు నీ నిజతత్వాన్ని తెలుసుకోటానికే ప్రయత్నించాలి గానీ అంతకంటే తక్కువదేమీ కాదు"

 'మన ఆలోచనలన్నీ మౌనం దాల్చి భావరాహిత్య స్థితిని చేరుకోవాలి.మన ప్రధాన్యతలూ ఇష్టాఇష్టాలు మన ముందుకు రాకూడదు. మనకు లభించిన అంతరాదేశాల ప్రకారం నడుచుకుంటే అదే యోగం. అపుడా జీవితమంతా యోగమే అవుతుంది. మనలో మనది కాని ఏదో శక్తి మనద్వారా పనిచేయడం గమనంలోకి వస్తుంది. ఒక విధమైన నిశ్చలతత్వం,ఆనందం మనకు అనుక్షణం అనుభూతం అవుతాయి. అందుకే అంతటా ప్రశాంతంగా మౌనంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. సమర్పితభావంతో ఆత్మ విశ్వాసంతో నీలో నన్ను సాక్షాత్కారం పొందు ' అని మన హృదయవాసి చెప్పకనే చెప్పాడు.
 ఫలితంగా తనకి సంతోషదాయకమైన యోగాభ్యాసాలను ఆమె విరమించుకొంది. మహర్షి నిర్దేశించిన లక్ష్యాన్ని ఆమె చేరుకోలేకపోయినా ఆయన తనకు రక్షకుడన్న అకుంఠిత విశ్వాసమూ,ఆయన గురించి నిరంతర చింతా ఆమెకుండేవి అలా మహర్షిని ఎప్పుడూ తలచుకోవటం వల్ల కొన్ని ఆధ్యాత్మిక అనుభూతులు ఆమెకు కలుగుతుండేవి. 



 మహర్షి దర్శనార్ధమై ఒక పండితుడు వచ్చాడు. విరూపాక్ష గుహవద్ద ఈ పండితుడు మహర్షితో మాట్లాడుతుండగా ఎచ్చమ్మాళ్ వణుకుతూ అచటికి వచ్చి నిలిచింది. కారణమేమిటని ప్రశ్నించగా ఆమె తనకు అప్పుడే కలిగిన అనుభవాన్ని వివరించింది.సద్గురు స్వామి గుహ ప్రక్కగా ఆమె కొండనెక్కవలసి వచ్చింది. ఆమె అలా నడుస్తూ వెనుకకు తిరిగి చూసినప్పుడు ఆమెకిద్దరు మనుష్యులు కనబడ్డారు. అందులో ఒకరు రమణమహర్షి,రెండవ ఆయన అపరిచితుడు.ఆమె కొండనెక్కడం కొనసాగిస్తుండగా ఆమెకొక వాణి వినిపించింది. "ఇక్కడ ఉండగా, పైకి ఎక్కటమెందుకు?"అని. వారు కనబడ్డ ప్రదేశం వైపు ఆమె తిరిగి చూడగా అక్కడగానీ,ఆ పరిసరాలలో గానీ ఎవ్వరూ లేరు.ఆమెకు భయం కంగారు కలిగి వణికిపోతూ కొండనెక్కి మహర్షి ఆశ్రమాన్ని చేరుకుంది. ఎచ్చమ్మాళ్ చెప్పిన ఈ వివరాలకి ఆ పండితునకు ఎంతో అసూయ కలిగి  "స్వామీ ఇక్కడ నాతో మాట్లాడుతూనే ఉండి,మీరు ఆమెకు మీ రూపాన్ని దర్శనమిచ్చ్హారు. మీ అనుగ్రహ చిహ్నమేమీ నాకు ఇప్పించలేద"న్నాడు. మహర్షివారు ఆమె ఎల్లప్పుడూ (మహర్షి)తన గురించే చింతిస్తూండడంవల్ల అటువంటి మనోదృశ్యం ఆమెకు గోచరించిందని చెప్పారు. మహర్షి పైనే ధ్యాస గల అనేకమంది భక్తులకు ఇటువంటి అనుభవాలు కలుగుతూనే ఉండేవి. అందరికీ ఆయన ఒకే హెచ్చరికను సలహాను ఇచ్చేవారు. 'అటువంటి అనుభూతులలో లీనమైపోకూడదనీ, వాటి గురించి సంతోషముతో ఉప్పొంగిపోకూడదనీ జీవిత పరమావధి ఆత్మజ్ఞానము ఒక్కటే! 'నిజతత్వాన్ని మరువకుండా "నేనెవరిని" అన్న ప్రశ్న వేసుకోవడమే మానసిక సంకల్పం వల్ల జరుగుతుంది.   నేను ఈ దేహాన్ని,మేధనీ, కోర్కెలనీ కాను అని గ్రహిస్తే .. 
ఆ శోధన  చెయ్యాలన్న దృక్పధమే నీ అంతరాంతరాలలో నుంచి సమాధానాన్ని చెప్పిస్తుంది. అప్పుడు సత్యం నీలోనుండి సూర్యరశ్మి వలె ప్రకాశిస్తుంది. "నేను"అనుభవంలోకి వచ్చి అనుభూతి చెందడం స్వామి ఉపదేశించిన   సాక్షాత్కారం. 

 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు 




  





    

No comments:

Post a Comment