Pages

Friday, August 31, 2018

నామకరణం



ఓ ...
వ్యక్తి, వృక్షం, పుష్పం, ఫలం, పత్రం, పక్షి, జంతువు, తిధి, నక్షత్రం, వారం, పక్షం, మాసం, సంవత్సరం ... ఒకటని ఏముందీ .....  ఎవరిని గుర్తించాలన్న, దేనిని గుర్తించాలన్న, వారికి, వాటికి ఓ పేరు అత్యావశ్యకం.  
అందుకే మన పూర్విజులు చాలావరకు అన్నింటికీ పేర్లు పెట్టారు. 
మనం - పశుపక్ష్యాదులు, వృక్షాదులకంటే, మేధ మనోబుద్ధ్యాది స్థాయిలో భిన్నం కాబట్టి, మన మన సంతతికి మనల్నే నామకరణం చేయమనే సంప్రదాయకంను నిర్ధేశించారు. 

సమాజహితం కై భారతీయ సంస్కృతిలో కొన్ని సంప్రదాయాలు నిర్ధారించబడ్డాయి. ఆ సంప్రదాయాలన్నీ మనల్ని సంస్కరించాడానికే. అందుకే ఈ సంప్రదాయాలనే సంస్కారాలుగా  ఋషులు తెలిపారు. 
సంస్కారమంటే - 
సంస్ర్కియతే జ్ఞానయోగ్యతామాపాద్యతే / పురుషస్య చిత్తమనేనేతి సంస్కారః
చిత్తదోషాలను శమింపజేసి, ఆ చిత్తాన్ని ఆత్మతత్వజ్ఞానానికి అర్హమైనదిగా చేయడమే సంస్కారం.
సంస్కారస్య గుణాధానేన వా స్యాద్దోషాపనయనేన వా ...
సంస్కారాలలో కొన్ని దోషాలను పోగొట్టేవి, మరికొన్ని దోషనివృత్తి, గుణ సంపాదనకై ఉన్నాయని శంకర భాష్యంలో శంకరాచార్యులవారు తెలిపారు.

ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగడానికి ఎన్నెన్నో అవరోధాలు. ఆ అవరోధాలకు కారణం అనేకం. అందులో కొన్ని ప్రారబ్ధానుసారం ప్రాప్తించేవి. మునుపటి జన్మల పాపాలు ఈ జన్మలో ప్రతిబంధకాలు కావొచ్చు. అందుకే అటువంటి ప్రతిబంధకాలను చాలావరకు నివారించడానికి, మనల్ని సంస్కరించడానికి కొన్ని సంస్కారాలను ప్రతిపాదించారు. మన స్మృతికారులు ఈ సంస్కారాలను షోడశ (పదహారు) సంస్కారాలుగా పేర్కొన్నారు. అందులోనివే జాతకర్మ, నామకరణం సంస్కారాలు. సాంప్రదాయబద్ధంగా వేదవిహితంగా సంస్కార విధులలో చెప్పినవిధంగా ముందుగా శిశువునకు జాతకర్మ ( దీనినే బాలసారె గా కొందరు వ్యవహరిస్తారు) చేయడం జరుగుతుంది.
జాతకర్మ -
మంత్రోచ్ఛారణ జరుగుతుండగా శిశువుల నాలుకకు బంగారంతో అద్దిన నెయ్యిని, తేనెను తండ్రి తాకిస్తాడు. ఈ జాతకర్మ సంస్కారం వలనపుట్టుకతో సంక్రమించిన బాలారిష్టాది దోషాలు, తల్లి తండ్రుల స్థూల శరీరముల నుండి కలిగిన అనేక (వాత కఫ మున్నాది దోషాలు) దోషాలు తొలగిపోవును.ఈ సంస్కార నిర్వాహణ ప్రభావముచే శిశువులకు దీర్ఘ యుష్యం, సర్వవిధ సంపత్సమృద్ధి ప్రాప్తించునని శాస్త్ర వచనం. 

నామకర్మ -
వామాఖిలస్య వ్యవహార హేతః శుభావహం సుభాగ్య హేతుః
నామ్నైవ  కీర్తిం లభతే మనుష్యస్తతః ప్రశస్తం ఖలు నామ కర్మః 
వ్యవహార హేతువు, శుభావహమైనది, కీర్తికారక మగు నామకర్మ ప్రశస్తమైనది. 

జాతకర్మ అనంతరం, గణపతిపూజ, పుణ్యాహవాచనమైన తరువాత నామకరణ సంస్కారంను ప్రారంభిస్తారు. ఓ పళ్లెంలో బియ్యం పోసి, తండ్రిచే దక్షిణ దిశనుంచి ఉత్తరదిశకు మూడు గీతలు గీసి, ముందు శ్రీకారం రాయించిమొదటిగడిలో బిడ్డ పుట్టిన మాసము ప్రకారం వచ్చిన పేరును, రెండవ గడిలో నక్షత్రంను బట్టి వచ్చిన పేరు, మూడవ గడిలో వ్యావహారిక నామం రాయపించి, నామకరణ విధి మంత్రాల నడుమ "అగ్నిరాయుష్మాన్... కరోమి" (అగ్ని సమిత్తులచే, చంద్రుడు ఓషదుల రసరూపమైన అమృతముచే, యజ్ఞము దక్షిణలచే, బ్రహ్మము బ్రాహ్మణులచే, దేవతలు అమృతముచే ఆయుర్దాయము కలవారైరి. అటువంటి ఆయుర్ధాయ మంత్రంచే  దీర్గాయుష్మంతునిగా ఆశ్వీరదిస్తూ ) మంత్రాన్ని జపిస్తూ, శాస్త్రోక్తముగా పూజా, జప, హోమ, దానాదులుతో  ఈ రెండు సంస్కారాలను శాస్త్రోక్తంగా వేద పురోహితులవారి ఆధ్వర్యమున నిర్వర్తిస్తారు.   

ఈ నామకరణ సంస్కారమెందుకంటే - 
తస్మాత్పుత్రస్య జాతస్య నామ కుర్యాత్, పాప్మానమే వాస్య తదపహన్తి
అపి ద్వితీయం తృతీయం, అభిపూర్వ మేవాస్య తత్పాప్మాన మపహన్తి 
అని శ్రుతి చెప్పింది. 

నామకరణ ప్రయోజనం :- 
ఆయుర్వచోభివృద్ధిశ్చ సిద్ధిర్వ్యవహృతే స్తథా 
నామకర్మ ఫలంత్వే తత్ సముద్దిష్టం మనీషిభిః 
ఆయుష్షు, వర్చస్సు, వ్యవహారసిద్ధి కలిగేందుకు ఈ సంస్కారాన్ని చేస్తారు. జన్మించిన దగ్గర నుండి కొన్ని మాలిన్యాలు శిశువుకు అంటుకునే ఉంటాయి. ఈ సంస్కారాలవలన  జన్మాంతర దోషాలు తొలగి మానవ జీవిత లక్ష్యం సిద్ధిస్తుంది.
అందుచే నామకరణోత్సవం జరుపుతారు. 



14 comments:

  1. బాగుందండీ.
    పేరు వెనుక ఇంత పరమార్థముందని తెలిసి పరమానందం పొందాను.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు కృష్ణ గారు..

      Delete
  2. Chala kaalaaniki...baga rasaru

    ReplyDelete
  3. నిజంగా మీరు రాసింది చదివాక మనసు సంతోషం తో నిండిపోయింది. మా పాప కి మరో 2 నెలలో నామకరణం చేస్తున్నాం. మీరు రాసిన ఈ వివరణ చాలా బావంది.
    మీకు ధన్యవాదాలు.

    ReplyDelete
  4. అభినందనలు సురేష్ గారు... మీ పాపకు నా శుభాశీస్సులు...

    ReplyDelete
  5. వేద శ్రీ గారు, మీరు ఏమి అనుకోకపోతే మా పాప పేరు కోసం మీ సహాయం కావాలి. పాపకి పేరు కోసం చాలా ఆలోచిస్తున్నా, కానీ జన్మనక్షత్రం ఆధారం గా వచ్చే అక్షరాలు అయిన బే,బో,జా,జి మొదటి అక్షరం గా వచ్చే పేరు సలహా ఇవ్వగలరా? నేను కొన్ని అనుకున్నా కానీ అవి అసంపూర్తిగా అనిపిస్తున్నాయి. నేను అనుకున్న పేర్లు
    బోదిత తపస్వి, బోదిత నైనా, బోదిని దర్షిత ...
    నేను అంతా బాగా చదువుకోలేదు కానీ నాకు భగవత్ గీత నుండి పేరు పెట్టాలి అని ఉంది. మీరు చేయగలరా?

    ReplyDelete
  6. మీరు అనుకున్న పేర్లు తో ఇవి కూడా ఒకసారి చూడండి... జాహ్నవి.. జానకి.. జాన్వి..జాబిలి.. జిజ్ఞాస.. జివినత.. జియాంశి.. జిశ్విత..నచ్చితేచూడగలరు..

    ReplyDelete
  7. సురేష్ గారు.. చివరి పేరు జిష్విత అని చదవగలరు...

    ReplyDelete
  8. చాలా బాగున్నాయి అండి, ధన్యవాదములు మీకు.
    నాకు జిష్విత పేరు చాలా బాగా నచ్చింది.అలాగే ఈ పేరు కి అర్థం కూడా తెలుపగలరు.

    ReplyDelete
  9. జిష్విత అంటే ఏంజిల్ అని అర్థం అండీ..

    ReplyDelete
  10. వేద శ్రీ గారు మీరు అనుమతిస్తే అందరికీ ఉపయోగకరమైన ఈ పోస్ట్ ని నేను నా Facebook లో మీ పేరు మీద పోస్ట్ చెయ్యాలి అనుకుంటున్నాను.

    ReplyDelete
  11. మనం తెలుసుకున్న విషయాలను అందరికీ తెలియజేయాలనుకోవడం సంతోషదాయకం. తప్పకుండా షేర్ చేసుకోండి సురేష్ గారు..

    ReplyDelete