ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమ:
మహాభారత యుద్ధానికి కురుపాండవ సైన్యాలు సిద్ధమవుతున్న సందర్భమది.... ఆ సన్నాహాల్లో భాగంగా ధుర్యోధనుడు, అర్జునుడు శ్రీకృష్ణుడి సహాయాన్ని అర్ధించేందుకు ఆయన నివాసానికి వెళ్ళారు. ఇద్దరూ దగ్గరివారే కావడంతో ఎవరినీ కాదనలేక ఇరుపక్షాలకూ సాయపడేందుకు అంగీకరించాడు ఆ మధుసూదనుడు. ఒక పక్షానికి సర్వసైన్య బలం, రెండవ పక్షానికి ఆయుధం పట్టని కేవలం రధసారధ్యం మాత్రమే అని స్పష్టం చేశాడు. ఎవరికి ఏది కావాలో నిర్ణయించుకోమని అర్జనుడికి, సుయోధనుడికి అవకాశమిచ్చాడు. కిరీటి ఎలాంటి సంశయం లేకుండా కృష్ణుడినే ఎంపిక చేసుకున్నాడు. ఆయుధం కూడా పట్టనన్న వాసుదేవుణ్ణి కోరుకున్న అర్జునుడి అవివేకానికి నవ్వుకొని, ఆ కౌరవ అధినేత బలరామానుజుడి బలగమైన సైన్యాన్ని కోరుకున్నాడు. అలా ఆనందంగా దుర్యోధనుడు వెళ్ళగానే శ్రీకృష్ణుడు విజయుడితో అయ్యో బావా! నువ్వు అమాయకుడిలా ఉన్నావే! అంత భారీ సేనను కాదనుకొని కేవలం రధాన్ని తోలే నన్ను ఎంపిక చేసుకున్నావు! అన్నాడు చిద్విలాసంగా!అప్పుడు ఆ కౌంతేయుడు 'ఏ యుద్ధాన్నైనా ఎదుర్కోవడానికి కావలసిన సైన్యం, శక్తిసామర్ధ్యాలు, అవసరమైన ఆయుధసామాగ్రి నా వద్ద ఉన్నాయి. కానీ నాకు సరైన తోవను చూపే మార్గదర్శకుడు లేడు.అందుకే నిన్ను ఎంచుకున్నాను. నీవు ఒక్కడివి ఉంటే చాలు.అదే బలమూ, బలగమూ!అన్నాడు.
నీవొక్కడుండగా జగమంత ఎదురైన
భయమేమి భయమేమి భయమేమి ఓ ప్రభూ!
నీవొక్కడుండక జగమంత నాదైన
సుఖమేమి సుఖమేమి సుఖమేమి ఓ ప్రభూ!
అలాంటి ధైర్యంతోనే ఆ ధనుంజయుడు స్వామి సారధ్యంతో అజేయుడై నిలిచాడు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ పార్ధసారధి స్వామిగా కొలవ బడుతున్నారు.
చెన్నైలోని తిరువళ్ళికేనిలో పురాతన పార్ధసారధి కోవెల ఉంది. ఆ ఆలయ ఉత్సవమూర్తి గురించి ఒక చారిత్రక సత్యం ఉంది. క్రీ.శ. 8వ శతాబ్దంలో పల్లవరాజు మొదటి నరసింహవర్మన్ ఉత్సవమూర్తి విగ్రహాన్ని చేయమని ఒక కంసాలికి చెప్పాడు. అతను లోహమును కరిగించి, అచ్చులోపోసి విగ్రహాన్ని తయారుచేశాడు. ఆ విగ్రహంలో అందమైన కృష్ణపరమాత్మ ముఖానికి గాట్లు, బొబ్బలు వచ్చాయి. అప్పుడు ఆ కంసాలి 'అయ్యో! నేను ఏదో తప్పు చేశాను. అందుకే అందమైన కృష్ణపరమాత్మ ముఖానికి గాట్లు, బొబ్బలు వచ్చాయి ' అని విచారించాడు. అతడు మరొక విగ్రహాన్ని తయారు చేయడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు అతనికి కృష్ణపరమాత్మ కనిపించి 'నువ్వు మరొక విగ్రహము చేయవద్దు. దీనినే ఉత్సవమూర్తిగా స్వీకరించండి ' అని చెప్పాడు. అప్పుడు ఆ కంసాలి 'ఇంత అందవికారంగా ఉన్న విగ్రహాన్ని ఉత్సవమూర్తిగా ఎలా ఉపయోగించమంటారు ' అని అడిగాడు. అప్పుడు కృష్ణపరమాత్మ అతనికి ఇలా తెలియజేశాడు.
"మహాభారతయుద్ధంలో భీష్మాచార్యులు పార్ధునిపై (అర్జునునిపై) ప్రయోగించిన బాణాలన్నింటినీ రధసారధిగా ఉన్న నేను స్వీకరించాను. అందులో ఒక్కబాణం అర్జునునికి తగిలినా అతను మరణించి ఉండేవాడు. అర్జునుణ్ణి రక్షించే క్రమంలో ఆ బాణాలన్నీ నా ముఖానికి తగిలాయి. ఆ కారణంగా నా ముఖం మీద గాట్లు ఇవి. నేను భక్తులను ఎన్నివిధాలుగా కాపాడుతుంటానో రాబోవు తరాలవారు తెలుసుకోవాలంటే ముఖం మీద గాట్లున్న ఈ విగ్రహాన్నే ఉత్సవమూర్తిగా ఉపయోగించండి."
కృష్ణపరమాత్మ ఆదేశం ప్రకారం తిరువళ్ళికేనిలోని పార్ధసారధి దేవాలయంలో ఆ విగ్రహాన్నే ఉత్సవమూర్తిగా నేటికీ ఊరేగించడం జరుగుతోంది.
సర్వం శ్రీసాయికృష్ణార్పణ మస్తు
No comments:
Post a Comment