Pages

Friday, July 21, 2017

సుబ్రహ్మణ్యేశ్వరస్వామి (కుమారస్వామి)

ఓం శరవణ భవాయై నమ:



శివశక్తుల సంయోగం ఒక విశ్వవిజేతకు, అద్భుతపరాక్రమశాలికి, జ్ఞానప్రదాతకు  మూలకారణం  కానుంది.

 'అద్వైతం సత్యం'.నిరంజనం, నిరంతరం, నిర్గుణం, నిరామయం ఈ అద్వైత లక్షణాలు. అదే మహాపరమేశ్వర తత్వం. మహాకాలాగ్ని స్వరూపం ఈశ్వరుడు. 

'ద్వైతం కల్పితం'. సకల చరాచర సృష్టి, కదలీ కదలక కదలే కదలికలకు కారణం ఈ ద్వైతం. అదే మహాశక్తి స్వరూపం.

లోకకళ్యాణదక్షులైన వారిరువరి భావం. అర్ధనారీశ్వరతత్వం. వారు కార్యకారణ వినిర్ముక్తులు.అయినా ఒక మహాప్రయోజనం కోసం పార్వతీ పరమేశ్వరులై కళ్యాణభావం పొందారు. మనోజ్ఞమంగళమూర్తి పరమేశ్వరుడు వరుడు. ముగ్ధమనోహర సుందర సుకుమార లావణ్యరాశి పార్వతి వధువు. హిమవంతుడు కన్యాదానం చేశాడు. శుభలగ్నంలో అమ్మ కామేశబద్ధ సూత్రశోభిత అయ్యింది. సదాశివ కుటుంబం రూపుదిద్దుకుంది ఆ క్షణంలో. కుటుంబలక్ష్యం విస్తరించడం, స్వామి పితృభావం పొందాలి. సర్వమంగళ మాతృశోభ సంతరించుకోవాలి. వారి తొలి సంతానం అద్భుత ప్రతిభా సంపన్నుడైన పుత్రరత్నం, కారణజన్ముడై జన్మించాలి. వరగర్వితుడైన తారకాసుర సంహారం కేవలం ఆ వీరబాలకుడి వల్లే జరగాలి. ఇదంతా ఓ జగన్నాటకం. 





ఈ పరిణామ క్రమంలో 'పంచభూతాలు స్వామి ఆవిర్భావానికి పాత్రధారులయ్యాయి.' పృధ్వి, అగ్ని, జలం, నక్షత్రశక్తి కృత్తికలు అలౌకికమైన మహాగ్నికి కారణభూతమైన రెల్లుగడ్డి పాత్రధారులైనాయి. పార్వతీ పరమేశ్వర అంశను కపోతరూపుడైన అగ్ని ధరించాలి. ఆ  తేజస్సును  ఎక్కువకాలం భరించలేక  గంగలో వదిలాడు. గంగకూ ఆ తేజస్సు తాలూకు వేదన తప్పలేదు. ఆమె రెల్లుగడ్డిలో ఆ తేజస్సును వదిలింది. ఆ తేజస్సు త్వరితగతి బాలరూపం ధరించింది. ఆ బాలుణ్ణి తమ స్తన్యం ఇచ్చి పెంచారు కృత్తికలు. 
              
              అందుకే ఆ బాలుడు అనేకనామాలతో ప్రసిద్ధుడైనాడు. స్కందుడని,
సుబ్రహ్మణ్యుడని, షణ్ముఖుడని, రవణభవుడని, కార్తికేయుడని, కుమారస్వామి అని శాస్త్రాలు సన్నుతించాయి.వేదాలు ఈ బాలుని షణ్ముఖీనమైన సంవత్సరాగ్నిగా నుతించాయి. ఆరు ఋతువులు, ద్వాదశహస్తాలు, ఆరుముఖాలు ద్వాదశమాసాలు ... ఇవి సంవత్సరాగ్ని స్వరూపం. అందుకే స్వామిని షడాననుడని, షణ్ముఖుడని అంటారు. తమిళులు 'ఆర్ముగం' అని అంటారు.ఈ ఆరుముఖాలు స్వామిరూపంలో ఊర్ధ్వముఖం అధోముఖంగా కనిపించి పాణిద్వయం ఉత్తరాయణ దక్షిణాయనాలకు సంకేతాలు.  



ఈ ఆరుముఖాలను అరిషడ్వర్గ నాశకాలుగా సంకేతించింది మంత్రశాస్త్రం. కామ,క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు స్వామి శరణాగతి వల్ల పూర్తిగా నశిస్తాయని భక్తుల నమ్మకం. షడ్భావ విరహితం, నిత్యం, క్షయరహితం, శుద్ధం, క్షేత్రజ్ఞం, క్రియాశూన్యం, గగనాశ్రయం, స్వప్రకాశం, సృష్టికారణం, నిస్సంగం, పరిపూర్ణం, వ్యాపకం ఇవి స్వామి హస్తాల లక్షణం.

నిరంతరం సుబ్రహ్మణ్యస్వామిని "ఓం శరవణ భవాయై నమ:" అని భక్తులు స్తుతిస్తారు. "శరవణ" అంటే రెల్లుగడ్డి. రెల్లుగడ్డిలో పార్వతీ పరమేశ్వరుల అంశ అనే తేజస్సు బాలరూపం ధరించింది.. కనుక భక్తులందరూ "ఓం శరవణ భవాయై నమ:" స్తుతిస్తారు. పెరిగి కౌమారదశకు చేరుకున్న స్కందుడు పరమేశ్వర స్థానాన్ని చేరుకున్నాడు. మాతృత్వంలోని మమకారం ఆ బిడ్డకు పరిపూర్ణంగా అందించింది పార్వతి.  

అసుర సంహారానికి కాలం సమీపించింది. దేవతల కోరిక మేరకు ఆదిదంపతులు స్కందుడికి సర్వసైన్యాధ్యక్ష పదవిని ఇచ్చారు. దేవతలు సంతోషముతో ఆ బాలుడిని ముందుంచుకొని తారకుడి మీదకు యుద్ధానికి బయలుదేరారు. పార్వతీదేవి తన శక్తినంతటినీ నిక్షేపించి కుమారుడికి ఒక బల్లాన్ని ప్రసాదించింది. దేవాసుర సంగ్రామం భీకరంగా ఐదురోజులు జరిగింది. ఆరవరోజు షణ్ముఖుడు తారకుని వెంబడించి   సంహరించాడు. తారకుని తమ్ముడు శూరపద్ముడు ఒక మామిడిచెట్టుగా మారాడని ఆ చెట్టును స్వామి రెండుగా చీల్చగా శూరపద్ముడు మరణించాడని, ఆ వృక్షం రెండు భాగాలలో ఒక భాగం మయూరంగా, రెండవభాగం కుక్కుటంగా మారాయని, ఆ రెంటిని స్వామి స్వీకరించాడని అంటారు.

"శక్తి హంతం విరూపాక్షం శిఖివాహనం షడాననం
 దారుణం రిపురోగఘ్న భావయేత్ కుక్కుటధ్వజం" 

నెమలి వేగానికి, కోడి జ్ఞానానికి సంకేతం. అలా సర్వసైన్యాధ్యక్షుడై దేవకార్యాన్ని దిగ్విజయంగా విజయవంతం చేసాడు షణ్ముఖుడు. యుద్ధం నుంచి మరలివచ్చిన తర్వాత దేవేంద్రుడి కుమార్తె దేవసేనను, పెరుకుప్పంకు చెందిన నంబిరాజు కుమార్తె వల్లిని తల్లిదండ్రుల ఆశీర్వాదంతో పరిణయమాడాడు కుమారస్వామి. 'వేలా' అనే ఆయుధాన్ని ధరించడం వల్ల వేలాయుధపాణిగా పిలువబడుతున్నాడు. 

స్కందుడు అగ్నిస్వరూపుడు. అగ్నికార్యరూపమైన ఉపాసనకు అధిదేవత సుబ్రహ్మణ్యస్వామి. అలాగే జ్ఞానప్రదాతగా, సంతాన ప్రదాతగా, కరుణామూర్తిగా అందరూ అర్చిస్తారు. కుజునకు అధిష్ఠానదేవత సుబ్రహ్మణ్యేశ్వరుడనీ, ఆయనను కొలిస్తే తప్పక సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢవిశ్వాసం. 

భారతదేశంలో స్వామిని అర్చామూర్తిగా కొలిచి తరించే భక్తులు కొందరైతే సర్పరూపంగా ఆరాధించేవారు మరికొందరు. సర్పరూపంలో ఉండే కుండలినీ శక్తిని జాగృతం చేసి, ఊర్ధ్వముఖంగా ప్రయాణం జరిపించి, సహస్రార కమలాన్ని చేరుకుని అక్కడి అమృతబిందువులను ఆస్వాదించి, మోక్షస్వరూపాన్ని పొందాలనుకుంటాడు సాధకుడు. ఆ సాధకుని లక్ష్యం పునర్జన్మరాహిత్యం. అలా సాధనా సంకేతంగా సర్పరూపంగా ఈ పుణ్యభూమిలో  ఉపాసింపబడుతున్నాడు  సుబ్రహ్మణ్యేశ్వరుడు. 

 పుట్టలో పాలు పోయడం, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయదర్శనం చేయడం, ప్రదక్షిణలు చేయడం, కావడి కట్టడం..ఇవన్నీ ఆచారంగా వస్తున్నాయి. దేశవిదేశాలలో నెలకొని ఉన్న సుబ్రహ్మణ్యక్షేత్రాల్లో శివపార్వతుల గారాల తనయుడైన కుమారస్వామికి స్కందపంచమి, కుమారషష్టి మహోత్సవాలు ఆషాఢ మాసంలో నిర్వహిస్తారు.

మార్గశిరమాసంలో శుక్లపక్షం షష్టి రోజున అన్ని స్కంద దేవాలయాలలో వైభవోపేతమైన పూజలు జరుగుతాయి.  పుట్టలో పాలుపోసి ఆ పుట్టమన్ను ప్రసాదంగా తెచ్చి అందరిచేతా ధరింపజేస్తారు గృహిణులు. ప్రతి మాసంలో వచ్చే ఆరవతిధి, ముఖ్యంగా వారాలలో మంగళవారం స్వామికి అత్యంత ప్రీతిపాత్రంగా భావించబడతాయి.ఆర్తులు, శరణాగతులు, సంతానాభిలాషులు సమస్యలు ఉన్నవారందరూ స్వామిని అర్ధించి వచ్చేవారే. స్వామి సుప్రతిష్ఠుడైన ఆలయాలన్నీ "ఓం శరవణ భవాయై నమ:"అన్న శరణుఘోషతో అనునిత్యం మార్మోగుతాయి. 



తిరుత్తణి, పళని, స్వామిమలై తిరుచందూర్...ఇలా ఎన్నో అసంఖ్యాలయాలైన స్వామి సన్నిధానాలు భారతదేశంలో కనిపిస్తాయి. పళనిలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి సర్వాన్ని కైలాసార్పణం చేసి, జ్ఞానఫలం కోసం బయలుదేరి వెళ్ళాడు. అందుకు గుర్తుగా స్వామి చిన్న కౌపీనం ధరించి దర్శనం ఇస్తాడు. తిరుచందూర్ లో శూరపద్ముణ్ణి వధించాడు. తిరుత్తణిలో చెంచుల ఆడబిడ్డ వల్లిని పరిణయమాడాడని, స్వామిమలైలో తండ్రికే గురువై ప్రణవరహస్యం భోధించాడని అందుకే ఆయనను శివగురునాధుడని లేదా స్వామినాధుడని పిలుస్తారు.



ఆద్యంతం అత్యంత భక్తిభావ ప్రపూర్ణాలు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి స్థలపురాణాలు. ఇష్టకామితాలను లొసగడానికి, ఇహపరాలను ఇవ్వడానికి, నమ్మినవారిని కాపాడటానికి అన్నింటా తానై, అంతటా తానై కొలిచినవారి కొంగు బంగారమై తటిల్లతలా మెరిసే స్వామి మనందరి కామితార్ధాలు తీర్చుగాక!

 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు

  






No comments:

Post a Comment