Pages

Tuesday, May 2, 2017

సరళ చింతనం





పూజ, జపం, ధ్యానం, ఆరాధన, ఆత్మ నివేదనం... నవ విధ భక్తిలో ముఖ్యమైనవి.భగవంతుని  స్తుతించేవారు.. సామూహికంగా సహస్రనామాల్ని బిగ్గరగా ఒకేసారి అందరూ సమానస్థాయిలో ఆలాపన చేయవచ్చు. కానీ ఒంటరిగా పూజ,జప ధ్యానాదులు... తక్కువ స్థాయిలోపెదవుల కలయికతో చేయవచ్చు లేదా మానసిక జప ధ్యానాదులు ఉత్తమం. 

 శ్లో" ఆజ్యధారయా స్రోతసా సమం
    సరళ చింతనం విరళిత: పరం  (  రమణ మహర్షి )

అంతరాయం లేకుండా నేతిధారవలెనో, నదీప్రవాహంవలెనో చేసే ధ్యానం ఉత్తమం.  బయట నుంచి అంతరాయం కలిగినా సాధకుడు  నిశ్చలుడై తన జప ధ్యానాలని కొనసాగిస్తూనే ఉండాలి. ధ్యానానికి కూర్చున్న కొద్దిసేపటిలోనే మనస్సు ఏకాగ్రమవగలిగితే సాధనలో మొదటి మెట్టు ఎక్కినట్లే.అలా నిరంతరం సాగే చింతనాన్ని ఆజ్యధార వలె ఉన్నదనీ, నదీప్రవాహం వలె ఉన్నదనీ అంటారు. మనం దేవాలయానికి వెళ్ళి అక్కడ అలంకరింపబడిన స్వామిని కనులారా దర్శిస్తాము. కాసేపటిలో కళ్ళు మూసుకుంటాము. దేవాలయానికి వెళ్ళేది కళ్ళని మూసుకోవటానికా? కానే కాదు. కాని అలా మూసుకోకపోతే స్వామిని దర్శనం చేసుకున్న సంతృప్తి కలగదు మనకి. ఒకసారి కళ్ళుమూసుకొని స్వామిని అంతర్గతంగా మనం మరల చూసుకుంటున్నాము. అంటే ఏకాగ్రత కావటమే అంతిమ దశ. అదే మనకి ఆనందాన్నిస్తుంది. ఏ విధమైన ప్రయత్నము లేకుండా ఏకాగ్రమవటమే సరళ చింతనం.  




 భక్తిలో ఆఖరిదశ ఆత్మనివేదన అంటే "సంపూర్ణశరణాగతి" నొందట మనమాట. ఈ విధంగా ఆత్మార్పణం చేసుకున్నప్పుడు 'అహం ' పరిపూర్ణంగా 'అంతరాత్మ' కి సమర్పితమవుతుంది. అంతటి గాఢమైన భక్తిని అలవరుచుకుంటే "నేను ఆరాధించేవాడిని, ఆయన ఆరాధ్యుడు" అన్న భావాలు మాయమవుతాయి. తన మూలంలో అహం విలీనమైపోతుంది. అంతటి శరణాగతిని భావనాబలం వలన పొందాలి. భావనా బలం అంటే అంతరంగములో ఉన్న భావాలను మనం ఒక్కోసారి వ్యక్తపరచలేము. ఆత్మీయంగా మిత్రులకి లేఖ వ్రాసేటపుడు మనసులో భావాలను వ్యక్తపరచలేక ఎలా ఉన్నావు? నేను క్షేమం అంటూ నాలుగు వాక్యాలు రాసినా అందులో ఆర్తితో రాసిన ఆ అక్షరాల వెనుక ఉన్న  భావనా బలమును ఆ మిత్రుడు ఆనందంగా ఆస్వాదిస్తాడు. ఆ లేఖను ప్రేమగా పదిసార్లు చదువుకుంటాడు. ఆ విధంగానే భావబలంతో భక్తిని పెంపొందించుకుంటే జీవితగనం అంతా భగవదనుగ్రహం వల్లనే సాగుతోందని భక్తుడు గ్రహిస్తాడు. తాను కేవలం నిమిత్తమాత్రుడను అని గ్రహిస్తాడు. పరిపూర్ణశరణాగతితో జీవితంలో మంచి జరిగినా, చెడు జరిగినా నిర్వికారంగా ఉంటాడు. అంతా భగవంతుని లీల అని సంతోషముగా ఉంటాడు. "అహం" అంతమవుతుంది. కర్తృత్వభావాన్ని భక్తుడు విడనాడుతాడు. ఆత్మతో ఏకమవుతాడు. 


సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు












No comments:

Post a Comment