మీ వైవాహిక జీవితం గురించి నీ స్పందన ఏమిటి? అని సరదాగా అడిగింది.. నా అంతరంగిక స్నేహితురాలు . తనకి నేను సమాధానం చాలా వివరంగా చెప్పాను. కానీ ఒకసారి నన్ను నేను తరచి చూసుకున్నాను. నా వైవాహిక జీవితంలో 29 ఏళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో ఒడి దుడుకులు...అయినా అన్నిటినీ సమానంగా తీసుకున్న మా కుటుంబ ఔన్నత్యం నాకు సంతోషాన్నిస్తుంది. ఒక క్రమశిక్షణ గల భర్త, ఆ క్రమ శిక్షణను పాలించిన మా పిల్లలు. అంతే ప్రేమతో అమ్మా,నాన్నలపై గౌరవం.. ఒక వయసు వరకు మా అదుపాజ్ఞలలో ఉన్నా వారి స్వతంత్ర నిర్ణాయాలకు ఎప్పుడూ మేము కూడా గౌరవమిచ్చాము. భార్య అంటే ఇలా ఉండాలి అని నన్ను చూసి బహుశా ఎవరూ అనుకోక పోవచ్చు..కానీ భర్త అంటే ఇలా ఉండాలి అని ప్రతి ఒక్కరూ మావారిని చూసి అనుకుంటారని నా అభిప్రాయము. అది నూటికి నూరుపాళ్ళూ నిజం. అంతటి ప్రేమతత్వాన్ని వారితో అనుభవించాం మా కుటుంబ సభ్యులం. కోపం లేదు అనుకుంటే పొరపాటే..కానీ ఆ కోపం వెనకాల ప్రేమ మరింత గోచరిస్తుంది.
ఒక్క కుటుంబ సభ్యుల మధ్యే కాక అందరితోటి చాలా కలివిడిగా ఎప్పటినుండో ఆత్మీయులు అన్నట్లు అందరితో ప్రేమగా ఉంటారు. అది కొంతమంది అలుసుగా తీసుకొని అవమానాలు చేసినా.. మాన అవమానాలను సమంగా తీసుకొని చిరునవ్వే సమాధానంగా శతృత్వం అనేది లేకుండా క్షమించే మనసున్నవారు శ్రీవారు.
పాప, బాబు, అల్లుడు ఇంచుమించు ఒకే వయసు వారు ..మా అల్లుడు మాకు మా అబ్బాయే. తనని అంతే చనువుతో చూస్తాము. చాలా నెమ్మదస్తుడు. అత్తమ్మా,మామయ్యా అంటూ ఆప్యాయంగా పలకరిస్తాడు. మృదుస్వభావి. ప్రేమతత్వంతో అందరినీ ఆదరిస్తాడు. అడిగిన వారికి కాదనకుండా సహాయం చేసే స్వభావం. ఇంటా,బయటా అందరి మన్ననలను పొందుతాడు. తల్లిదండ్రులంటే ప్రేమతో కూడిన గౌరవాభిమానం. చెల్లి అంటే ప్రాణం. ఆధ్యాత్మిక అవగాహన ఉంది, భక్తితత్వం ఉంది. అన్ని దేవాలయాలు భక్తితో దర్శించారు మా అల్లుడు, పాప, వారి కుటుంబం. బాబాగారి ఆశీస్సులు మా అల్లుడికి సదా ఉన్నాయి. స్నేహమయుడు నాఅల్లుడు..
మా పాపకి...అమ్మ అంటే ప్రేమ..తనే ఒక అమ్మై నన్ను చూసుకుంటుంది. తమ్ముడు అంటే ప్రాణం. నాన్న అంటే పంచప్రాణాలు. పెళ్ళి అయ్యాక ఇవన్నీ కలగలిపి అంటే అన్నీ తానే అయిన భర్త అంటే తనకి సర్వస్వం . తన భర్తే తన ధైర్యం.. అంటే బలం..బలహీనత అని చెపుతుంది. అందరినీ ప్రేమిస్తుంది అందరికీ ప్రాధాన్యతనిస్తుంది. అది అర్ధం చేసుకునే మనసులకు తన పరిణత తెలుస్తుంది. బంధు మిత్రులంటే చాలా ఇష్టం.. వారితో సమయం సరదాగా గడుపుతుంది. ఇక షాపింగ్ అంటే ఎనలేని ఇష్టం.. అన్నీ ఇష్టంగా కొంటుంది.. కానీ ధరణకి, ధారణకి ఏమీ నచ్చవు.. ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళాలంటే మళ్ళీ షాపింగ్...చిన్నప్పటి నుండీ ఇదే సాగుతోంది.ఆధ్యాత్మిక అవగాహన ఉంది. షిర్డీసాయి భక్తురాలు. మరియు బాబాగారి ఇష్టపుత్రిక. చాగంటివారి రామాయణ ప్రవచనాలు విని శ్రద్ధగా రామాయణం చదివి, నాకు కూడా కొన్ని వివరించింది. ఇతరులకు సహాయం చేయడం, వారి బాధను తనదిగా పాటించడం పరిపాటి. కష్టాల్లో ఉన్నవారందరూ తన బంధువులే అన్నట్లుగా వారిని దరిచేర్చుకొని వారిని ఓదారుస్తుంది. కాబట్టి స్నేహమయి, ప్రేమమయి..నా పుత్రిక.
మా బాబు.అందరినీ ప్రేమిస్తాడు. ఒకరి ప్రేమకై ఎదురుచూడడు. ఎవరినీ విమర్శనాత్మకంగా చూడడు. మీ నాన్నగారే మళ్ళీ పుడుతున్నారోయి అన్న మా శ్రీవారి మాటలను నిజం చేస్తూ.. మా నాన్నగారు నాకు మళ్ళీ కుమారుడుగా జన్మ తీసుకున్నారు. వాళ్ళ అక్కతో పోలిస్తే అల్లరి తక్కువే..చాలా నెమ్మదస్తుడు. అలా అని తనని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకోడు. అమ్మా,నాన్న అంటే ప్రేమతో కూడిన గౌరవం. అక్కా, బావా అంటే చాలా ఇష్టం. ఏ వ్యవహారమైనా వారిద్దరినీ సంప్రదించి చేస్తాడు. అక్కే తనకు స్పూర్తి. తనని తాను గౌరవించుకుంటూ అందరినీ గౌరవిస్తాడు. మనసులోని తన భావాలను తొందరగా బయటకు తెలియనీయడు. మా బాబు అంటూ ఉంటాడు. నన్ను ఎవరితో పోల్చవద్దు. నేను నేనే..ప్రత్యేకం ..అని 'మా అన్నయ్య కూడా తనని అలాగే అంటాడు. తనకి తనే ప్రత్యేకం. అని మా బాబుని చూసి ఆనందపడేవాడు.' ఎవ్వరినీ ఒక్క మాట అనడు. కోపం వచ్చినా ఎవరిముందు ప్రదర్శించడు. సమయస్పూర్తిగా వ్యవహరిస్తాడు. ఆంజనేయస్వామి భక్తుడు. సుందరకాండ, రామాయణ గ్రంధాలను పఠించాడు. బాబా అనుగ్రహం చవి చూసి వినమ్ర భక్తుడయ్యాడు. రామాయణ మహాకావ్యంలో ఏమైనా సందేహాలుంటే మేము మా బాబుని అడిగి తెలుసుకుంటాము. రాముడుని ఆదర్శంగా తీసుకుంటాడు నా పుత్రుడు.
ఇలా ఆనందంగా సాగిపోతున్న నా జీవితంలో చిన్న..చిన్న స్పర్ధలు మా మధ్య వచ్చినా అవి తామరాకు మీద నీటిబొట్టులాంటివే.. కాబట్టి నా జీవితంలో వైవాహిక జీవితం ఆనందమయ జీవితము. ఉత్సాహపూరిత ఆదర్శకుటుంబం మాది అని సగర్వంగా చెప్పుకోగలను.
సర్వం శ్రీ సాయినాధార్పితం..
No comments:
Post a Comment