Pages

Friday, March 31, 2017

సాయి సత్సంగంలో బాబా ధర్మబోధ

  ఓం శ్రీసాయికృష్ణ పరబ్రహ్మణే నమ:

 శ్లో" యదా తే మోహకలిలం బుద్ధిర్వతితరిష్యతి!
    తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతుస్య చ!! అ 2-52శ్లో


 భా:- ఎప్పుడు నీయొక్క మనస్సు అజ్ఞానమనెడు కల్మషమును దాటగలదో అప్పుడు వినదగిన అర్ధమునుండియు, విన్న అర్ధము నుండియు అనగా కర్మవిషయమునందు విరక్తిని పొందెదవు.






 సాధకుడు ప్రకృతికి పరమగు బ్రహ్మపదమును ఎందువలన పొందలేదో అది ఈ శ్లోకములో తెలుపబడినది. సాధకుని మనస్సు ఎంతవరకు ప్రాకృత విషయమనెడు మాలిన్యమును దాటలేదో, అనగా ప్రకృతికి పరమగు తురీయపదమును పొందలేదో ..అంతవరకు అతడు బద్ధుడే. ఎప్పుడు విషయవాసన నశించి నిర్విషయస్థితి గలుగునో అప్పుడే ఇదివరలో గురువులవలన లేక శాస్త్రముల వలన శ్రవణము చేసిన దాని యొక్క అర్ధము బోధపడును. అప్పుడు ఈ జ్ఞానస్థితికన్న అన్యముగా వినవలసినది మరియొకటి లేదని బోధ కలుగును. అనగా ప్రకృతి రహిత మగువరకు తత్వబోధము కలుగదు. 




 అనుభవపూర్వకంగా తెలుసుకున్న ఈ సత్యాన్ని.. నా అనుభవ వివరణ.....

 ఆగస్టు 2010 లో సాయిబాబావారి ఆశీర్వాదంతో సాయిప్రియ సత్సంగం మొదటి సత్సంగం సాయిప్రియ గృహమునందు ఏర్పాటు చేయుటకు మా, వారి.. కుటుంబాలు నిశ్చయించాము. అప్పుడు బాబాగారు సత్సంగమంటే ఎలా ఉండాలో తెలియజేసారు.  సాంప్రదాయ దుస్తులు ధరించాలి. సెల్ ఫోన్లు వాడరాదు. శభ్దము చేయరాదు. భక్తితో శ్రవణము చేయండి అని తెలిపారు. ఆరోజు సాయంత్రము 6 గ"లకు బాబాగారి సాయంసంధ్యా పూజతో, ఆరతులతో సత్సంగం మొదలయింది. భక్తులు ఒక 30 మందిదాకా వచ్చారు. ఓపెన్ హాలులో బాబాగారి చిత్ర పఠమును ఉంచి పూజ గావించి తదుపరి ముందు టపాలో నేను వ్రాసిన "కాణిపాక వరసిద్ధి వినాయకుని వృత్తాంతము"ను మా శ్రీవారు అందరికీ వివరించారు. అందరూ శ్రద్ధగా విన్నారు...బాబాగారి మహిమలను..లీలలను వారికి వివరిస్తున్నాము. ఇంతలో అందరూ చూస్తుండగా పవర్ పోయి ఆ ప్రదేశము చీకటిగా మారింది. ఇంతలో  బాబాగారి చిత్ర పటమునుండి పెద్ద వెలుగు.అందరూ విభ్రాంతితో చూస్తుండగా వెంటనే మరల పవర్ వచ్చింది. కాసేపు ఆ అద్భుతలీల గురించి భక్తులు పదే పదే చెప్పుకున్నారు. "ఒక పెద్ద వయసావిడ నేను అసలు సత్సంగానికి రాను అన్నాను.. మా అబ్బాయి రా పిన్నీ! అని తీసుకువచ్చాడు.. నా జన్మ తరించింది.. సాయిబాబాను ఇలా చూసే అవకాశం కలిగింది." అని ఆనందభాష్పాలతో చెప్పారు. సత్సంగములో ఒక అధ్యాయము బాబాగారి సచ్చరిత్రలో పఠించిన తదుపరి రెండవ సత్సంగమును మా గృహమునందు జరుపుటకు బాబా అనుమతిని తీసుకొని..బాబాగారికి అరిటాకులో పలహార నైవేద్యము గావించితిమి. మందిరము తలుపు తెరిచి చూసేసరికి   మందిరములో ఉన్న కాణిపాక వినాయకస్వామి మూర్తి అరిటాకులో ప్రత్యక్షం ...వారి చెంత బాదుషా.. బాదుషాలు ఆరతి సమయములో నైవేద్యము పెట్టాము. ఆ బాక్స్ లో బాదుషా... వినాయకస్వామి  వారి చేతి వద్ద.. ప్రసాదాల మీద సాయి విభూతి... భక్తులందరూ ఆ విషయమై ఆసక్తిగా చర్చించుకొనుచూ ఆ ప్రసాదాలను స్వీకరించి స్వామికి మోకరిల్లి ఆనందపారవశ్యముతో ఇళ్ళకు మరలారు. శ్రీవారు   కాణిపాక వినాయకస్వామి వృత్తాంతమును తెలియజేసారు కాబట్టి ఆ అద్భుత మహత్యం జరిగిందని మేము తలంచాము. 

 అలా ప్రతి సంర్భంలోనూ బాబాగారి మహత్యాలను అనుభవిస్తున్న నేను ఆ ఆనందపారవశ్యంలో అవగాహన లేక పరమార్ధాన్ని అందుకోలేకపోయాను. బాబాగారు ఏం చెబుతారా అని ఎదురు చూడడమే గాని చెప్పిన విషయాలలోని నిగూడార్ధాన్ని గ్రహించలేకపోయాను. 



ఆ వెలుగు మాకు జ్ఞానదీపమని.. మాలోని అజ్ఞానమనే చీకటిని పారద్రోలి జ్ఞానమనే వెలుగును సద్గురువు ప్రసాదించారనీ తెలుసుకోవడానికి నాకు దాదాపు  సం"లు పట్టింది. ఆ జ్ఞానదీపమనే నేత్రాలు ఇప్పుడిప్పుడే తెరిచాను. అందులకు బాబావారి దివ్య చరణములకు నా గౌరవ పూర్వకములైన ప్రణామములర్పిస్తున్నాను. "భగవంతుడు దివ్యత్వముగల  జ్ఞానస్వరూపుడు కావున జ్ఞానదృష్టితో చూడగలము."  బాబాగారి అనుగ్రహము వలన ఆ జ్ఞానదృష్టి  ప్రకాశమై  ఆ దివ్యత్వమును సందర్శించే భాగ్యమును కలుగజేసి ధన్యతను ప్రసాదించారు. 

 స్త్రీలలో భగవదంశము ఏడుపాళ్ళధికము గలదని శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఉపదేశించాడు. అన్నీ నేనే ఐ ఉన్నాను అని తెలిపాడు.  భగవంతుడుపదేశించిన 1. కీర్తి, 2. శ్రీ, 3. వాక్, 4.స్మృతి, 5. మేధ, 6. ధృతి, 7. క్షమ...ఈ ఏడు గుణములను స్త్రీలు సంరక్షించుకొనవలెను. మేధాశక్తి, పుణ్యబుద్ధి, ధర్మబుద్ధి స్త్రీలు కలిగి ఉన్నారని భగవంతుడే ఉపదేశించగా పురుషులెట్లు లేదని చెప్పుచున్నారో తెలియకున్నది.  స్త్రీలకు జ్ఞానము వికసించుటకు తగిన విద్యయు, యౌవనకాలమువరకు బ్రహ్మచర్యము, బ్రహ్మనిష్ఠయు కలిగి యుండినగదా..స్త్రీలకు జ్ఞానయోగము. అట్టి అవకాశము లేక బాల్య వివాహములతో సంసారభారముతో ఆమెను బంధించి స్త్రీకి జ్ఞానములేదని వ్యర్ధపు మాటలు చెప్పిన ప్రయోజనమేమి? ఈ కలి యుగములో  మన సాయికృష్ణుడు  ప్రత్యక్ష పరమాత్ముడై మన అందరి హృదయాలలో, అంతా నేనే ఐ ఉన్నాను. అని తెలిపారు. స్త్రీలను అమ్మా అని సంబోధించేవారు. స్త్రీ ఎంత గౌరవంగా నడుచుకోవాలో బోధించారు. నిష్కల్మషంగా అందరినీ ప్రేమతో దయతో ఆదరించమని ప్రబోధించారు. విష్ణు, లలితా సహస్రనామ పారాయణ చేయించారు..శ్రావణలక్ష్మిని నేనే అని తెలిపి శ్రావణమాసపు వరలక్ష్మి వ్రతమును చేయించారు. స్త్రీ సహనంతో, ఓర్పుతో జ్ఞానమును కలిగి ఉండాలని ఉపదేశించారు.మన జీవనయాత్రలో విద్య, శ్రేష్ఠుల సాంగత్యం అనివార్యం. ఇవే భవసాగరం నుండి తప్పించి - మోక్షమార్గం వైపు నడిపిస్తాయి. 



 సత్సంగం ద్వారా జ్ఞానము, వివేకము కలిగి నిర్లిప్తంగా, విషయ వాసనలకు చిక్కుకోకుండా, మోహాన్ని త్యజించి మనస్సును నిర్మలంగా నిశ్చలం చేసుకొని మనస్సును పరమాత్మయందు లగ్నం చేయమని మొదటి సత్సంగంద్వారా బాబాగారు మాకు ఉపదేశించారని అర్ధమైంది. 

 సత్సంగం ద్వారా సర్వదా మహాత్ముల ప్రబోధాలను విని ఆకళింపు చేసుకొని ఆచరించాలి. మాయామోహాలనుండి విముక్తులై సద్గురువులను దర్శించి, స్మరించి, వారిని సేవించి..వారి ఉపదేశాలను పాటించి సదా పరమాత్మతత్వంతో భాసిల్లాలి.  




   లోక కళ్యాణార్ధం కర్తవ్యపాలనతో భక్తి, ధర్మ,తత్వ ప్రచారం చేస్తూ ధార్మిక పరమైన విలువలతో కూడిన సందేశాలను సత్సంగం ద్వారా ప్రబోధించమని బాబాగారి ఆదేశం. ఆ ఆదేశాన్ని నిర్వర్తించడంలో ఒక రెండేళ్ళపాటు అంతరాయాలు కలిగినా..సత్సంగం మాత్రం నిరంతరం హృదయాంతరంగాలలో  ప్రతినిత్యం  మాలో జరుగుతుంది .  మరల సత్సంగాలతో జనుల ముందుకు బాబా అదేశపాలనతో, ఆశీస్సులతో  మేము రానున్నాము. "శుభమస్తు" అన్న బాబాగారి ఆశీర్వాదముతో శ్రీ హేవళంబి నామ సంవత్సరంలో ఆషాడమాసం నుండి మరల సత్సంగాలు జరుపుటకై  శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం నిర్ణయం. 

 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు 






No comments:

Post a Comment